Saturday, October 25, 2008

సుమతీ పద్యం 12

ఈ రోజు నేను చెప్పబోయే సుమతీ పద్యం తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే మననారం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం కాబట్టి. మళ్ళీ ఇన్నేళ్ళకి ఆ పద్యాన్ని గుర్తు తెచ్చుకోవడం ఒకరకంగా స్కూల్ రోజుల్ని కూడా గుర్తు చేస్తుంది నాకయితే. మీకు కూడా తప్పకుండా లాగే అనిపిస్తుందని నా నమ్మకం. ఇదే ఆ పద్యం.

ఉపకారికి నుపకారము

విపరీతముగాదు సేయ వివరింపంగా

నపకారికి నుపకారము

నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ!

తాత్పర్యం: మేలు చేసిన వానికి మేలు చేయుట గొప్ప కాదు. హాని చేసిన వానికి అంతకుముందు వాడు చేసినదోషాలను లెక్కచేయక ఉపకారం చేసేవాడే నేర్పరి.

చూసారుగా..పైన పద్యాన్ని..మీకేమనిపిస్తుంది? అదంతా నిజమే కానీ, ఈ రోజుల్లో అంత మహాత్ములెవరుంటారు? ఒకవేళ అలా చేద్దామనుకున్నా అలాంటి మనుషులు ఈ ప్రపంచంలో బతకలేరు. ఇప్పటి పరిస్థితులు అలాంటివి మరి. ఏం చేస్తాం?? అని ఒక నిట్టూర్పు విడుస్తున్నారా? మీ మనసులో ఏమనుకుంటున్నారో సరిగ్గా చెప్పానా? :)


నాకయితే ఎవరికీ ఉపకారం చేయకపోయినా ఫరవాలేదు కానీ, అపకారం మాత్రం చేయకుండా ఉండగలిగితే చాలు అనిపిస్తుంది.


మనం ప్రపంచంలో జరిగే చాలా సంఘటలని చూసినప్పుడల్లా మనసుకి చాలా బాధగా అనిపిస్తుంది. అలాగే ఈ ప్రపంచం అసలెటుపోతోంది? ఏమిటీ విపరీత సంఘటనలు..అనిపిస్తుంది. ఉదాహరణకి ఎవరి మీదో కోపంతో ఎవరో బాంబులు పెట్టి, దానికి అభం శుభం తెలియని సామాన్య ప్రజలు పార్కుల్లోనూ, హోటళ్ళలోనూ , రోడ్ల మీద ఇలాంటి మామూలు ప్రదేశాల్లో బలి అయిపోతుంటే చాలా బాధేస్తుంది. కానీ, ఏమి చెయ్యాలో అర్ధం కాదు. మతాల పేరు మీద, దేవుడి పేరు మీద, రాజకీయ పార్టీల పేరు మీద, చివరికి సినిమా హీరోల మీద అభిమానం తో కూడా గొడవలు చేసే స్థాయికి ఎదిగాం మనం. వీటన్నిటికీ పురికొల్పబడే ముందు, ఒక మనిషిగా ఒక్క నిమిషం ఆలోచించగలిగినా ఈ అనర్ధాలన్నింటిలో చాలా వరకు జరగవు కదా..!


అసలు ఈ ప్రకృతి సృష్టిలో ఎన్నో అపాయాలు ప్రాణుల చుట్టూ ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. ఎప్పుడేమి జరుగుతుందో ఎవరం చెప్పలేము. అలాంటప్పుడు బ్రతికినన్ని రోజులు సంతోషంగా గడుపుతూ, ఎదుటి వారిని బాధపెట్టకుండా బ్రతకచ్చుగా... ఈ సృష్టిలో ఏదో అతీంద్రియ శక్తి అన్నీ జీవరాసుల్నీ నడిపిస్తూ ఉంటుంది. ఆ శక్తినే మనం దైవం అంటాం. దేవుడనే వాడు మనం ఏ రూపంలో ఉన్నాడనుకుంటే ఆ రూపంలో మనకి కనిపిస్తాడు. ఏ మతం ఏ సూక్తులు చెప్పినా చివరికి నదులన్నీ సముద్రంలో కలిసినట్టుగా, మతాలన్నీ సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికీ, లోక కళ్యాణానికీ ఉద్దేశించబడినవే కదా..!


నా ఇల్లు, నా కుటుంబం, నా వాళ్లు అనుకుని నీవాళ్ళ సుఖం కోసం పాటుపడాలి. అంతే కానీ, ఏ స్వాభిమానం మితిమీరి మా ఊరు, మా రాష్ట్రం, మా భాష అనే అభిమానం కాస్తా వేరే వారి మీద ద్వేషానికి దారితీసేంత స్థాయికి వెళ్ళకూడదు కదా..!


మొత్తానికి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎన్నో జరుగుతున్నా, ఇంకా చాలా మంది మనుషుల్లో మానవత్వం ఉందని నేను నమ్ముతున్నాను. అదొక్కటే కాకుండా ఎందరో మహానుభావులు తమకి ఏ రకంగా సంబంధంలేని శరణార్ధులను ఆదుకుంటున్నారు. వారికోసమే తమ తమ జీవితాలని వెచ్చిస్తున్నారు. అలాంటి మహానుభావులందరూ మనకి తెలిసుండకపోవచ్చు. కానీ, చాలా మంది ఉన్నారు. వాళ్ల అందరి పుణ్యం వల్లే మనలాంటి మామూలు మనుషులకి ఇంకా అన్నం దొరుకుతుందని నాకనిపిస్తూ ఉంటుంది.


ఏది ఏమైనా మన వల్ల ఎవరికీ అపకారం కలగకుండా ప్రయత్నిద్దాం... ఏమంటారు మరి??


ప్రేమతో...

మధుర వాణి

2 comments:

S said...

అసలు నాకిక్కడ "నేర్పరి" తనం ఏమిటో అర్థం కాదు. దీనిలో "నేర్పరి" అన్న పదం ఏ అర్థం తో వాడారో మరి.

అయినా, అపకారికి ఉపకారం చేస్తాం. తర్వాత కూడా సదరు అపకారి గారు అలాగే ఏడిస్తే దాని వల్ల ఎవరికి నష్టం? అపకారి గారు ఎలాగో బనే ఉంటారు (పాపీ చిరాయూ!). నీతి సూత్రాలు వల్లించే వాళ్ళు కూడా బానే ఉంటారు (సన్యాసి సుఖీ, సంసారి దుఖీ! అఫ్కోర్సు, చెప్పేవాళ్ళంతా సన్యాసులు కానక్కర్లేదు. కొంతమంది సన్నాసులుండొచ్చు. కొంతమంది పాపం మామూలు జనాలు కూడా ఉండొచ్చు)...మొత్తానికి దెబ్బతినేది సదరు ఉపకారే!

మధురవాణి said...

@ S,
నాకేమనిపిస్తుందంటే.. ఈ శతకం రాసే రోజుల్లో అందరూ మన కోసం మనం బ్రతకడం కాదు ఇతరుల కోసం బ్రతకాలి. మనం ఎన్ని బాధలు పడినా సరే ఇతరులకి సంతోషాన్ని ఇవ్వాలి, ఇంకొకరి కోసం మనం త్యాగం చెయ్యడం గొప్పతనం అన్నట్టు ఉండేది లోకరీతి. కానీ, ఇది ఇప్పుడు మారిపోయింది కదా! నా కోసం నేను బతుకుతాను, నాకు నచ్చింది నేను చేస్తాను, ఎదుటి వారికి అది నచ్చుతుందా లేదా అనేది నా సమస్య కాదు అనుకుంటున్నాం..
ఇది చాలా పెద్ద మార్పు కదా! కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా ఉండటం నేర్పరితనం కాకపోగా మూర్ఖత్వం అవుతుందేమో! :P