Thursday, October 01, 2009

పూబంతులు చెప్పిన ఊసులు..!!

అదేంటో.. పూదోటలోకి వెళితే నాకు వేరే ప్రపంచం ఉందన్న సంగతే గుర్తుకురాదు. ఎటువైపు చూసినా నిష్కల్మషంగా, అందంగా నవ్వుతున్న పూబంతులే.. ఎంతటి సుకుమార సౌందర్యం.. సుగంధ కుసుమాల మధ్యన తిరుగుతుంటే మనసుకెంత ఉల్లాసంగా ఉంటుందో చెప్పలేను. పువ్వుల్లో పువ్వుగా పుట్టుంటే బావుండేది కదా అనిపిస్తుంది. ఇంతలో ప్రతీ పువ్వుపువ్వునీ పలకరిస్తూ, అల్లరిగా ఊసులాడుతూ, నవ్వుతూ, తుళ్ళుతూ తిరిగే సీతాకోకచిలుకల్ని, తుమ్మెదల్ని చూస్తే.. పోనీ కనీసం సీతాకోకచిలుకగానైనా పుట్టకపోతిని అనిపిస్తుంది. సరే.. వచ్చే జన్మలో ఎలా పుట్టాలో నిర్ణయించుకునే అవకాశం వస్తేనో మరి..!? మరి అప్పుడు పువ్వుగా పుడదామా అని చుట్టూ ఉన్న నా ప్రియనేస్తాలన్నీటినీ చూస్తానా... ఒక పువ్వుని మించిన అందం, ఆనందం మరోదాంట్లో కనిపిస్తుంటాయి. చివరికి ఎటూ తేల్చుకోలేక ఉసూరంటూ బిక్క మొహం వేసిన నా అవస్థ చూసి నా నేస్తాలు ఫక్కున నవ్వేస్తాయి. నేనలా కాస్త ఉడుక్కుంటానో లేదో.. అంతలోనే ఎక్కడినుంచో ఒక పిల్ల గాలి తెమ్మెర వచ్చి చటుక్కున గిలిగింతలు పెట్టేస్తుంది. ఇహ నా ప్రియనేస్తాలతో పాటు నేనూ నవ్వక తప్పదు. పూబాలలతో సయ్యాట నాకు మధ్యనే కొత్తగా అలవాటైన సరికొత్త దినచర్య.

రోజు ఉదయం లేచిన దగ్గర నుంచీ నా ప్రియనేస్తాలు పదే పదే తలపుల్లోకి వచ్చేస్తున్నాయి. నిన్న ఉదయం అప్పుడే అరవిరిసిన కుసుమాలన్నీటినీ ఓమారు పలకరించి వచ్చాను. ఉన్నట్టుండి నిన్న సాయంత్రం ఒకటే వాన, పైన ఈదురుగాలులు కూడానూ..వెంటనే నా నేస్తాలు గుర్తుకొచ్చేసాయి. అత్యంత సున్నితమూ,సుకుమారమూ అయిన పుష్పాలు భీభత్సాన్ని తట్టుకోలేక ఎలా విలవిలలాడిపోతున్నాయో కదా అని నా మనసు మనసులో లేదు. రాత్రంతా ఎడతెరిపి లేకుండా జోరున వర్షం కురుస్తూనే ఉంది. సూర్యోదయ వేళకి గానీ తగ్గుముఖం పట్టలేదు. ఉదయాన్నే వర్షం అలా ఆగిందో లేదో, నేనిలా బయలుదేరాను నా ప్రియనేస్తాల కోసం. ఏం చూడాల్సి వస్తుందో అని ఎంతో కంగారుగా వెళ్ళానా.. కానీ, నే వెళ్ళేసరికి నాకో సుమనోహర దృశ్యం ఎదురయింది. ఎంతో ఆనందంగా నవ్వుతున్న అరవిరిసిన పుష్పాలూ, విరిసీవిరియని మొగ్గలూ, ఇంకా ఆకుపచ్చగా మెరిసిపోతున్న నునులేత చివుళ్ళూ.. వాటన్నిటి పైనా వయ్యారంగా కొలువుదీరిన నీటి ముత్యాలు. ఒక్క క్షణం కళ్ళార్పకుండా ప్రకృతి సౌందర్యం చూస్తూనే అలా శిలాప్రతిమలా నిలబడిపోయాను.

నా రాక గమనించిన నా నేస్తాలన్నీ సాదరంగా స్వాగతం పలికాయి. వెంటనే తెచ్చిపెట్టుకున్న చిరుకోపంతో నేనన్నాను 'మీ గురించి నేనెంత బెంగపడ్డానో తెలుసా.. గాలివాన మిమ్మల్ని ఎంత ముంచెత్తి ఉంటుందో, ఎంత విలవిలలాడిపోయి ఉంటారోనని ఎంత కంగారు పడుతూ వచ్చానో తెలుసా..!?' అన్నాను. దానికి బదులుగా నా నేస్తాలన్నాయి 'పెద్ద గాలివాన వచ్చినమాట నిజమే గానీ, మేము విలవిలలాడిపోలేదు. ఎందుకంటే వర్షం మా ప్రియనేస్తం కదూ..మమ్మల్ని ప్రేమలోనే ముంచెత్తి వెళ్ళింది'. 'ఎట్టెట్టా..' అని అబ్బురంగా చూస్తున్న నా వంక మురిపెంగా చూస్తూ మళ్ళీ చెప్పసాగాయి. 'అవును.. వర్షం మా జీవనాధారం, మా చిరకాల నేస్తం కూడా.. తానెప్పుడు వచ్చినా తన మధురమైన స్నేహపుజల్లులో మమ్మల్ని తడిపేస్తుంది. మాతో ఊసులాడుతుంది, ఆడుతుంది, పాడుతుంది. మా ఆత్మీయ స్నేహానికి గుర్తుగా ఇదిగో.. నీటి ముత్యాలను మధురమైన జ్ఞాపకాలుగా మాతో వదిలి వెళ్ళిపోతుంది. నీక్కూడా మరో చక్కని నేస్తం కావాలనుకుంటే కిటికీలోనుంచి చూసి భయపడకుండా ఈసారి దగ్గరగా వెళ్లి వర్షంతో ఊసులాడి చూడు. వర్షం ఎంత మురిపించి మైమరపిస్తుందో తెలుస్తుంది. నే చెప్పినట్టు చేస్తావు కదూ.!?'

నేను సరేనని సంతోషంగా చెప్పి మరోసారి పూబంతులందరినీ పరికించి చూద్దును కదా.. ఇందాక వయ్యారంగా అలంకరించుకున్న నీటి ముత్యాల జాడే కనిపించలేదు. 'అయ్యయ్యో.. మీ మధురమైన జ్ఞాపకాలని జారవిడిచారే.. ఎందుకలా.?' అని అడిగాన్నేను. సుమకుసుమాలన్నీ నవ్వుతూ మళ్ళీ చెప్పసాగాయి. 'ఒకసారి తల పైకెత్తి నీలాకాశంలో ఠీవీగా ప్రకాశిస్తున్న సూర్యుడిని చూడు. వర్షం లాగానే సూర్యుడు కూడా మాకు మరో జీవనాధారం, ప్రియమిత్రుడు కూడానూ.. ప్రతీ ఉదయం తన కిరణాలతో ముద్దాడుతూ మాకు మేల్కొలుపు పాడతాడు. తన కిరణాలతోనే మాలో జీవం నింపుతాడు. అందుకే మా తీయని స్నేహానికి గుర్తుగా మా వద్దనున్న నీటి ముత్యాలు తనకిచ్చేసాము. మధురమైన జ్ఞాపకాలని చేజార్చుకోలేదు మిత్రమా.. మరింత పదిలంగా మరో నేస్తం దగ్గరకు చేర్చాము. అర్ధమయింది కదూ.!?'. 'ప్రకృతి ఎంత స్వార్ధరహితం.. ప్రకృతితో స్నేహంలో ఎంత నిష్కల్మషత్వం.. ఎప్పుడూ తీసుకోవడమే గానీ ఇవ్వడంలోని ఆనందం తెలియని మనుషులు ప్రకృతిని చూసి నేర్చుకోవలసింది ఎంతైనా ఉందని బాగా అర్ధమయింది క్షణం' అనుకున్నాన్నేను.

'మీ ప్రియనేస్తాలందరి గురించీ చెప్తున్నారు సరే.. మరి నేనో.?' గారంగా అడిగాన్నేను. పూబంతులన్నీ ఒకేసారి గట్టిగా నవ్వేసి ముక్త కంఠంతో చెప్పాయి. 'రోజూ ముద్దుముద్దుగా మాతో ఊసులాడి మమ్మల్ని ఆనందింపచేసే నువ్వు మా నెచ్చెలివి.. ప్రియసఖివి' అంటూ. ప్రేమకి పొంగిపోతూ.. ఆహా ఏమి నా మహద్భాగ్యం.. అనుకుంటూ రోజుకి మన సరదా కబుర్లకి సెలవంటూ నా ప్రియనేస్తాలకి వీడ్కోలు చెప్పి ఇంటికి బయలుదేరాను నేను.