Thursday, March 15, 2012

నా అన్వేషణ!


నిన్నా నేడూ పగలూ రాత్రీ అనుక్షణం నిర్విరామంగా వెతుకుతూనే ఉన్నాను..
యుగయుగాల నుంచీ సాగుతోందీ వెతుకులాట..
దేని కోసం వెతుకుతున్నాను?
ఎవరి కోసం వెతుకుతున్నాను?
ఎక్కడని వెతకాలి?
అసలెందుకు వెతకాలి?
ఏమో.. అన్నీ ప్రశ్నలే తప్ప జవాబుల్లేవు!
నేను ఎప్పుడైనా ఎక్కడైనా దేన్నైనా నా చేతుల్లోంచి జారవిడిచానా?
లేదనుకుంటాను..
అయినా నాదైనదేదో ఈ ప్రపంచంలో ఉందన్న భ్రాంతితో వెతుకుతూనే ఉన్నాను..
కాలాలు కదలిపోతున్నాయ్.. రోజులు తరిగిపోతున్నాయ్..
ఆశలు చెదిరిపోతున్నాయ్.. నమ్మకాలు చెరిగిపోతున్నాయ్..
ఆయువు కరిగిపోతోంది.. ప్రాణం ఇగిరిపోతోంది..
ఇంకా ఇంకా చీకటిని చీల్చుకుంటూ ఆకాశపు అంచుల దాకా.. సముద్రపు లోతుల దాకా..
ఆనవాలైనా తెలియని ఏదో వస్తువు కోసం వెర్రిగా వెతుకుతూనే ఉన్నాను..
ఊపిరి కొడగట్టే దాకా.. ప్రాణం కడగంటే దాకా..
నా అస్థిత్వం ఆవిరైపోయే క్షణం దాకా..
ఈ నా అన్వేషణకి అంతనేదే లేదేమో!

Thursday, March 08, 2012

బృందావనంలో ఫాల్గుణ పౌర్ణమి..

మంచుపూలతో, చలిగాలులతో వణికించిన శిశిరానికి నెమ్మదిగా వీడుకోలు పలుకుతూ.. కోయిల కూజితాలూ, తుమ్మెదల సరాగాలనీ మోసుకొచ్చే మధుమాసాన్ని సాదరంగా స్వాగతించడానికి సమాయత్తమవుతోంది ప్రకృతి కాంత. యమునా తీరాన బృందావనంలో కొలువుదీరిన రకరకాల వృక్షాలూ, మొక్కలూ లేలేతగా చిగుర్లు తొడుగుతూ, పూల మొగ్గలు అప్పుడప్పుడే వికసిస్తూ రాబోయే వసంత మాసపు శోభకి సూచికలై అలరారుతున్నాయి.

ఎన్నెన్నో అరుదైన ఫల, పుష్ప జాతులు విరివిగా ఉన్న బృందావనంలో ప్రత్యేకంగా ఒక కదంబవనం ఉంది. అక్కడంతా ఎటు చూసినా కదంబ వృక్షాలూ, మధ్య మధ్యలో కొన్ని పొగడ చెట్లూ ఉంటాయి. ఆ కదంబవనం రాధాకృష్ణులకి ఎంతో ప్రియమైన చోటు. ఓ సారి రాధ కోరిక మేరకు ఆ వనంలోని ఓ పెద్ద కడిమి చెట్టు కొమ్మకి ఉయ్యాల కట్టించి ఇచ్చాడు కృష్ణుడు. ఆ పక్కనే గలగలా పారుతున్న యమున మీద నుంచి వీచే చల్లటి గాలి తెమ్మెరల పలకరింపులతో ఎంతో ఆహ్లాదంగా ఉండే ఆ వనంలో చుట్టూరా చిక్కగా అలుముకున్న కదంబ పుష్ప పరిమళాలు ఆఘ్రాణిస్తూ ఆ ఉయ్యాలలో కృష్ణుడి భుజం మీద తల వాల్చి తను చెప్పే ఊసులు వినడం రాధకెంతో ఇష్టమైన అలవాటు. ఇప్పుడు కూడా ఆ ఉయ్యాలలో కూర్చుని మెల్లగా ఊగుతూ కృష్ణ నామ స్మరణలో ఉంది రాధ. మురళీ మోహనుడికై రాధ నిరీక్షణ నిత్యం ఉండేదే అయినా ఈనాటి ఎదురుచూపులకి మరింత ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు ఫాల్గుణ పౌర్ణమి పర్వదినం.

ఒక్క రాధే కాదు.. రేపల్లెలోని పడుచు పిల్లలందరూ ఏడాదంతా ఎంతో ఆత్రంగా, ఉత్సాహంగా ఎదురు చూసే పండుగ ఫల్గుణ పూర్ణిమ. వీరందరూ ఈ వసంతోత్సవ సంబరాల కోసం రంగు రంగుల ద్రావకాలు తయారు చేసుకోవడానికని ఏడాది పొడవునా రకరకాల మొక్కల నుంచి పువ్వులు సేకరించి పెట్టుకుంటారు. మాఘ పూర్ణిమ వెళ్ళిన నాటి నుంచే మొదలవుతుంది పండుగ హడావుడి. ఎవరెవరు ఎన్నెన్ని రకాల రంగుల ద్రావకాలు సిద్ధం చేసుకోవాలీ, రంగులు జల్లడానికి ఏ సమయంలో ఎవరెవరిని ఎలా దొరకబుచ్చుకోవాలీ.. ఇత్యాది వ్యూహ రచనలూ, ఇంకా పండుగ నాడు యువతీ యువకులందరూ కలిసి అభినయించే సంగీత, వాయిద్య, నాట్య ప్రదర్శనలకి సాధన చేయడం.. లాంటి రకరకాల పనుల్లో నిమగ్నమై ఉంటారు. ఇక గోపభామలైతే ఫాల్గుణ పౌర్ణమి వెన్నెల్లో బృందావనాన కృష్ణుడితో కలిసి ఆడే రంగుల కేళీ విలాసం గురించి కంటి నిండా కలలు కంటూ ఆ రోజెప్పుడు వస్తుందా అని తిథులు లెక్కపెట్టుకుంటూ ఉవ్విళ్ళూరుతుంటారు.


వసంతోత్సవ రంగుల కోసమని బోలెడు రంగురంగుల పూలరేకుల్ని సేకరించి పెట్టుకుంది రాధ. ఆకుపచ్చ రంగు కోసం గోరింటాకు, తురాయి ఆకులూ, గోధుమ గడ్డి పరకలూ.. ఎరుపు రంగు కోసం ఎర్రటి మందారాలూ, కాశీ రత్నాలూ, రక్త చందనమూ.. కాషాయపు వర్ణం కోసం మోదుగ పూలు, బూరుగ పువ్వులు, పారిజాతాలూ.. పసుపు రంగు కోసం బంతి పూలు, తంగేడు పూలు, మారేడు ఫలాలు, సువర్ణ గన్నేరు పూలూ.. ఊదా రంగు కోసం దేవకాంత పువ్వులు, వెంపల పూలు.. నీలి రంగు కోసం చంద్రకాంత పువ్వులు, నీలి గోరింట పూలూ.. ఇలా ఎంతో శ్రద్ధగా అన్నీ రంగుల పువ్వులు సేకరించి, వాటన్నీటిని నీడ పట్టున ఆరబెట్టి పొడి చేసి సిద్ధంగా ఉంచింది. పక్కనే ఉన్న యమున నుంచి కడవలతో నీళ్ళు నింపుకొచ్చి కడిమి మాను చాటుగా దాచింది. ఆ రంగు రంగుల పూరేకుల పొడులని గంధం, కస్తూరి, జవ్వాజి, కర్పూరం లాంటి సుగంధ ద్రవ్యాలతో రంగరించి కడవల్లోని నీళ్ళల్లో నానవేసింది. ఒక్కో కడవలో ఒక్కో రంగు ద్రావకం చొప్పున చాలా కడవలే నింపి పెట్టింది. రంగుల క్రీడకి సర్వమూ సిద్ధం.. ఒక్క కృష్ణుడు తప్ప! అదిగో ఆ కన్నయ్య కోసమే ఇప్పుడు ఎదురుచూస్తోంది రాధ.

ఈ వేళ ఉదయం నుంచే రేపల్లె వీధులన్నీ గోప యువతీ యువకులతో కోలాహలంగా ఉన్నాయి. పడుచు పిల్లల అల్లరి సరాగాలతో రంగుల్లో తడిసి ముద్దైపోతోంది ఊరంతా. రాధ మాత్రం తన చెలులందరి కళ్ళు గప్పి ఉదయాన్నే తను సిద్ధం చేసి పెట్టుకున్న రంగులన్నీ తీసుకుని బృందావనానికి వచ్చి కృష్ణుని రాకకై తామెప్పుడూ కలుసుకునే కడిమి చెట్టు దగ్గర ఎదురు చూస్తోంది. తనొచ్చి రెండు ఘడియలు దాటిపోయాయి గానీ ఇంతవరకూ మాధవుని జాడే లేదు. "ఈ నల్ల పిల్లాడెప్పుడూ ఇంతే.. జీవితమంతా నిరీక్షణలోనే గడిపేలా చేస్తాడు.. అయినా ఈ వేళ ఫల్గుణ పూర్ణిమ అని మరచి ఉంటాడా... అలా ఎలా మర్చిపోతాడూ.. ఊరంతా పెద్ద పెట్టున సంబరాలు జరుగుతుంటేనూ! లేకపోతే తన కోసం నేనొకదాన్ని ఎదురు చూస్తుంటానన్న సంగతి మరచి ఏ గోపికా సమూహంతోనో చేరి హోలీ కేళీ విలాసాల్లో మునిగిపోలేదు కదా!" అన్న ఊహతో రాధ మోము చిన్నబోయింది. అంతలోనే "అసలైనా నా కన్నయ్య ఎంత అమాయకుడు.. ఈ గోపికలే నెరజాణలు.. నా కోసం బయలుదేరి వస్తోన్న నా కృష్ణుడిని దోవ మధ్యలో అటకాయించి బంధించలేదు కదా.. ఊహూ.. అయినా నా పిచ్చి గానీ ఈ మాయగాడిని మాయ చెయ్యగలవారెవ్వరులే.." అని నవ్వుకుంది.

ఇంతలో వెనక నుంచి ఎవరో రెండు చేతులతో చప్పున రాధ కళ్ళు మూసారు. కాస్తైనా బెదిరిపోకుండా "కన్నా.. నువ్వే కదూ!" అంటూ పున్నాగలు విరబూసినట్టు నిండుగా నవ్వింది రాధ. అంతలోనే కోపం నటిస్తూ "వసంతోత్సవం నాడు కూడా ఇంత ఆలస్యంగానా రావడం.. ఏ గోపభామలతో రాసలీలలాడి వస్తున్నారు స్వామీ?" అంది కినుకగా. "హన్నా.. ఎంత మాట.. నా రాధని తప్ప మరే ఇంతినైనా కన్నెత్తి చూసేనా ఈ కృష్ణుడు.. నా అమాయకత్వం నీకు తెలియనిదా రాధా.." అన్నాడు కృష్ణుడు కొంటెగా నవ్వుతూ. "అవునవును.. తెలియకేం.. ఎన్నేళ్ళ నుంచీ చూడట్లేదూ కృష్ణలీలలు.." అంటూ ఉడుక్కుంది రాధ.

కృష్ణుడు వేణువు అందుకున్నాడు. నీలమోహనుని వెచ్చని ఊపిరి తాగిన మురళి గమ్మత్తుగా మోగుతోంది. మృదు మధురంగా సాగుతోన్న ఆ మోహన మురళీ రవం వింటూ మైమరచిపోయిన రాధ అరమోడ్పు కన్నులతో చూస్తూ నిలిచిపోయింది. చప్పున వేణుగానం ఆగిపోయింది. రాధ తెప్పరిల్లి చుట్టూ చూసేంతలో తన ప్రియసఖులైన గోపికలందరూ చుట్టూ చేరి ఒక్కుమ్మడిగా రాధాకృష్ణులపై రంగులు చల్లసాగారు. అలా మొదలైన వాళ్ళ వసంతోత్సవ సయ్యాటలు రోజంతా విందులూ, వినోదాలూ, సంగీత, నాట్యాలతో సందడి సందడిగా సాగిపోయాయి. బృందావనంలో అంబరాన్నంటిన ఈ వసంతోత్సవపు సంబరాలని వీక్షించిన సూర్యుడు సాయం సంధ్యా సమయానికి అలసిపోయి సెలవు తీసుకుంటూ పున్నమి చంద్రుడికి స్వాగతం పలికాడు. గోపికలకీ, రాధాకృష్ణులకి మాత్రం ఉదయం నుంచీ ఆడి పాడిన అలసటే లేకపోగా అప్పుడే యమున ఒడిలోంచి ఆకాశంలో పై పైకి తేలి వస్తోన్న పున్నమి జాబిల్లిని చూస్తే మరింత ఉత్సాహం కలిగింది.

ఈనాటి ఫాల్గుణ పౌర్ణమి రాతిరిలో యమునా తీరాన అందమైన బృందావనంలో నిండు పున్నమి వెన్నెల పోతలో రాధామాధవుల రంగుల కేళీ విలాసం కన్నులారా చూడవలసిందే తప్ప మాటల్లో వర్ణించ తరం కాదు. కృష్ణ రాసలీల గురించి ఇన్నినాళ్ళూ కలలు కన్న గోపికలందరి స్వప్నం వారి కళ్ళెదుటే సాక్షాత్కారించింది.

బృందావనంలోని అణువణువూ కృష్ణరసాన్ని నింపుకుని దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. రాధ చెంతన నిలిచినా కృష్ణుడే.. గోపభామలందరితోనూ ఆడి పాడుతున్నదీ కృష్ణుడే.. అన్నిటా అంతటా కృష్ణుడే.. సర్వం కృష్ణమయం.. నయనానందకరం.. జగదానందకారకం!

సర్వం.. కృష్ణార్పణం!

Friday, March 02, 2012

చిన్న కిట్టి

"నా ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళింట్లో బుజ్జీ అనో చిట్టీ అనో ముద్దుపేర్లు ఉంటాయి ఎంచక్కా.. మీరు మాత్రం నాకలాంటి ముద్దుపేర్లు ఏం పెట్టలేదు.." అంటూ అప్పుడప్పుడూ గుర్తొచ్చినప్పుడల్లా నేను మా అమ్మతో పోట్లాడుతూ ఉంటాను. "అలా ఏదన్నా ముద్దు పేరు పెడితే ఇంకదే అలవాటు అయిపోయి అసలు పేరుని పూర్తిగా వదిలేస్తామేమో, అదీ గాక చక్కటి పేరు ఎంచి పెట్టుకుంది ఎందుకూ.. పిలుచుకోడానిక్కాదూ.. అందుకే చిన్నప్పటినుంచీ అసలు పేరుతోనే పిలిచాం నిన్ను.." అంటుంది మా అమ్మ. "అయినా సరే, నేనొప్పుకోను.. అసలలా ప్రత్యేకంగా ఒక ముద్దు పేరుంటే ఎంత బాగుంటుంది చెప్పు .. మీరు నాకు చాలా అన్యాయం చేశారు అంత గొప్ప ఫీలింగ్ ని పోగొట్టి.. హు హూ హూ.." అని ఓ తెగ వేధించేస్తుంటే ఒకసారి మా అమ్మ నాకొక కొత్త విషయం చెప్పింది . అదేంటంటే, చిన్నప్పుడు నాకొక ముద్దు పేరు ఉండేదంట. అదే 'చిన్న కిట్టి'. ఆ కథేంటో చెప్తానిప్పుడు.. బుద్ధిగా ఊ కొట్టేయ్యండి మరి..

మా తమ్ముడు నాకంటే రెండేళ్ళు చిన్న. వాడు మెల్లిగా అడుగులేసే సమయానికి నన్ను పట్టుకోడం కష్టమైపోయేదంట అమ్మావాళ్ళకి. ఊరికే కాళ్ళకి అడ్డం పడుతూ ఉంటే అప్పుడప్పుడూ నన్నూ, మా తమ్ముడినీ కాసేపు పక్కనే ఉన్న మా పెదనాన్న వాళ్ళ దగ్గర వదిలేదంట అమ్మ. అదీగాక ఒక్క నిమిషం చూడకుండా వదిలినా నేను వెళ్ళి మట్టి తినేదాన్నంట. ఎప్పుడూ నేను తినడమే కాక మా తమ్ముడు వద్దని ఊసేసినా సరే "బావుంటుందిరా.. తినూ తినూ.." అని వాడికి బలవంతంగా నోట్లో పెట్టి మరీ తినిపించేదాన్నంట. అందుకని చెప్పి కాపలాగా మా పెదనాన్న వాళ్ళ దగ్గర కూర్చేబెట్టేది అన్నమాట మమ్మల్ని. అయితే అప్పటికి వాళ్ళ అమ్మాయి అంటే మా అక్క, ఇంకా వేరే పెదన్నాన్నల పిల్లలు చాలామంది హైస్కూలుకి వెళ్ళే వయసు పిల్లలు. ఆ పల్లెటూర్లో గవర్నమెంటు బళ్ళో చదూకునేవారు. అప్పట్లో వీళ్ళెవ్వరూ అంత శ్రద్ధగా చదూకోట్లేదని చెప్పి అదే బళ్ళో పనిచేసే మాస్టారింట్లో ఈ పిల్లలందరికీ ట్యూషన్లు పెట్టి చదివించేవారు. రోజూ పుస్తకాలు చేతిలో పట్టుకుని స్కూలుకి వెళ్ళి వచ్చే వాళ్ళని చూసి నాక్కూడా వెళ్ళాలనిపించి మా ఇంట్లో పుస్తకాల కోసం వెతుక్కున్నానంట. అప్పట్లో మా నాన్నకి జాతీయ యువజన కాంగ్రెస్ లో క్రియాశీలక సభ్యత్వం ఉండేది. పార్టీ విషయాల్లో చాలా చురుగ్గా ఉంటూ యూత్ కాంగ్రెస్ వర్క్ షాప్స్ లో పాల్గొనడంలాంటివేవో చేసేవారుట. అందుకని పాతవీ, కొత్తవీ కలిపి మా ఇంట్లో కాంగ్రెస్ డైరీలు బోలెడు ఉండేవి. ఇప్పటికీ కొన్ని ఉన్నాయి మా ఇంట్లో. ఇప్పుడు మా అమ్మ వాటిల్లో పాలవాడి లెక్కలు, ఇస్త్రీ బట్టల లెక్కలు రాస్తుందనుకోండి.. అది వేరే విషయం. :) ఏ మాటకామాటే, డెబ్భై, ఎనభైల్లోని ఆ పాత డైరీలు కొన్ని భలే బాగుండేవి.. కాంగ్రెస్ నాయకుల ఫోటోలు, కాంగ్రెస్ జెండా ఎలా రూపాంతరం చెందింది.. అవన్నీ బొమ్మలుంటాయి ఆ డైరీల్లో మధ్య మధ్య పేజీల్లో.. చిన్నప్పుడు భలే ఇష్టంగా ఉండేది అవన్నీ చూడటం.

ఇంతకీ అసలు కథలోకొస్తే, నేను చేతుల నిండా మోయగలిగినన్ని డైరీలు పట్టుకుని మా అక్కతో పాటు స్కూలుకి వెళతానని వెంటపడేదాన్నంట. సర్లే.. మరీ అంత ఉత్సాహపడుతోంది కదా.. అందుకని అక్కతో పాటు ట్యూషన్ కి పంపిద్దాం. అక్కడ అక్షరాలు నేర్పమని చెప్దాం. అలాగైనా కాసేపు ఇల్లు ప్రశాంతంగా ఉంటుందని తలచి ఒక రోజు నన్ను ఎత్తుకుని వెళ్ళి ఆ ట్యూషన్ మాస్టారికి అప్పజెప్పి వచ్చారంట. ఆయన నన్ను చూడగానే మహా ముచ్చటపడిపోయి అలాగే రోజూ పంపించండి అని చెప్పారంట. మా అక్క పేరు కృష్ణలీల. అందరూ తనని కృష్ణా.. అని పిలుస్తారు. తోటి పిల్లలేమో కిట్టీ అని పిలిచేవారంట. తనతో పాటు వచ్చాను కదా మరి.. అందుకనేమో మరి.. ఆయన నన్ను ముద్దుగా 'చిన్నకిట్టీ' అని పిలిచేవారట. రోజూ ఉదయం వెళ్ళిన దగ్గరి నుంచీ మళ్ళీ వచ్చేసేదాకా ఎంచక్కా నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని నాతో ఆడుకునేవారంట ఆయన. అంత వివరంగా నాకేం గుర్తు లేదు గానీ.. ఆ పెంకుటింటి మధ్య గదిలో కిటికీలోంచి సన్నగా వెలుతురూ పడటం, ఆయనేమో గోడకానుకుని బాసింపట్టు వేసుక్కూర్చుని నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం లీలగా గుర్తుంది నాకు. చిన్న గిన్నెలో బియ్యం, శనగపప్పు కలిపి వండిన తీపి అన్నంలోంచి శనగప్పులు ఏరి తినిపించడం జ్ఞాపకం ఉంది. ఇంకా, వాళ్ళింటి వెనకాలున్న స్థలంలో బొగ్గులతో పని చేసే బాయిలర్ ఒకటి ఉండేది. అందులోంచి పొగలు వస్తూ ఉండేవి. ఆయన ఒళ్ళో కూర్చోడం, ఆ శనగపప్పులు తినిపించడం, బాయిలర్లోంచి పొగలు రావడం... ఇవి తప్పించి ఎవ్వరి మొహాలు గానీ, పేర్లు గానీ నాకింకేం గుర్తు లేవు.

అలా అలా కొన్నాళ్ళు గడిచేసరికి ఆ మాస్టారు ఈ చిన్నకిట్టీ మీద ప్రాణాలు పెట్టేసుకుని క్షణం అన్నా చేతుల్లోంచి దించకుండా సొంత కూతురు కన్నా ఎక్కువ ముద్దు చేస్తూ ఉండేవారట. ఆ మాస్టారి వాళ్ళింట్లో, ఆయనా, వాళ్ళావిడా, ఒక చిన్న పాప (వాళ్ళ సొంత పాప కాదు) ఉండేవారంట. మనింట్లో ఒక పిల్ల ఉండగా వేరే బయటి పిల్లని ఇంత ముద్దు చెయ్యడం ఏంటి అని వాళ్ళావిడకి కుళ్ళూ, కోపం వచ్చి ఇద్దరూ పెద్ద పెద్ద పోట్లాటలు పెట్టుకునేదాకా వచ్చిందంట వ్యవహారం. అలా అలా మొత్తానికి మా ఇంట్లోవాళ్ళకి విషయం తెలిసి.. "అయ్యయ్యో.. మన పిల్ల మూలంగా వాళ్ళింట్లో గొడవలు ఏంటీ.." అని బాధపడి నన్ను వాళ్ళింటికి పంపించడం మానేశారంట. దాంతో పాపం ఆ మాస్టారికి దాదాపు కళ్ళనీళ్ళు పెట్టుకున్నంత పనయ్యిందంట. చిన్నకిట్టీని పంపించండి అని చాలా బతిమాలారంట గానీ వీళ్ళు పంపలేదు. ఈ లోపు ఒక రోజు మా చిన్నమావయ్య (అమ్మ వాళ్ళ తమ్ముడు) వచ్చినప్పుడు ఇద్దరు పిల్లలతో మా అమ్మ బాగా ఇబ్బంది పడుతోందని చూసీ, ఎలాగూ ఈ ఊర్లో మంచి బడి కూడా లేదు కదాని చెప్పి నన్ను అమ్మమ్మ వాళ్ళ ఊరికి తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంకెవ్వరూ నన్ను చిన్నకిట్టీ అని పిలిచినవారు లేరు. ఆ పిలుపుని అందరూ మర్చిపోయారు.

కొన్నాళ్ళకి ఆ మాష్టారు దంపతులు కూడా ట్రాన్స్ఫర్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోయారు. అమ్మావాళ్ళు కూడా ఆ ఊరు నుంచి వచ్చేశారు. మళ్ళీ తొమ్మిదేళ్ళ తర్వాత ఒకరోజు ఎక్కడో బజార్లో ఆ మాష్టారు అమ్మనీ, నాన్ననీ గుర్తు పట్టి పలకరించి చిన్నకిట్టీ ఇప్పుడెలా ఉందని అడిగారు. వాళ్ళ పాప ఎలా ఉంది, ఏం చేస్తోందని అమ్మ కుశల ప్రశ్నలు అడిగింది. అప్పటికి ఇంకొన్ని రోజుల్లో నాకు ఓణీలు వేసే వేడుక చెయ్యాలని నిర్ణయించి ఉండటం చేత ఆ విషయం వాళ్ళకి చెప్పి, అడ్రసు ఇచ్చి మరీ మరీ రమ్మని చెప్పారు. మాష్టారూ, వాళ్ళావిడా ఇద్దరూ అప్పుడు మా ఇంటికొచ్చారు. అమ్మ నాకు పరిచయం చేసింది.. చిన్నప్పుడు నిన్ను చిన్నకిట్టీ అని పిలిచేవారని చెప్పానే.. ఆయనే ఈయన అని. ఆ దంపతులిద్దరూ ఎంతో ప్రేమగా నా కోసం ఒక కానుక తెచ్చిచ్చి సంతోషంగా అక్షింతలు వేసి ఆశీర్వదించారు. "చిన్న కిట్టీ ఇంత పెద్దదయిపోయిందా.." అన్నప్పుడు ఆయన కళ్ళల్లో బోల్డు ఆశ్చర్యంతో కూడిన ఆనందం కనిపించింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళు మళ్ళీ వేరే ఊరు వెళ్ళిపోయినట్టున్నారు. మరోసారి కలవనే లేదు. కానీ, ఇప్పటికీ నాకు గుర్తొచ్చినట్టు ఆయనకి కూడా చిన్నకిట్టీ అప్పుడప్పుడూ గుర్తొస్తూనే ఉంటుందేమో కదూ!