ఎన్నెన్నో అరుదైన ఫల, పుష్ప జాతులు విరివిగా ఉన్న బృందావనంలో ప్రత్యేకంగా ఒక కదంబవనం ఉంది. అక్కడంతా ఎటు చూసినా కదంబ వృక్షాలూ, మధ్య మధ్యలో కొన్ని పొగడ చెట్లూ ఉంటాయి. ఆ కదంబవనం రాధాకృష్ణులకి ఎంతో ప్రియమైన చోటు. ఓ సారి రాధ కోరిక మేరకు ఆ వనంలోని ఓ పెద్ద కడిమి చెట్టు కొమ్మకి ఉయ్యాల కట్టించి ఇచ్చాడు కృష్ణుడు. ఆ పక్కనే గలగలా పారుతున్న యమున మీద నుంచి వీచే చల్లటి గాలి తెమ్మెరల పలకరింపులతో ఎంతో ఆహ్లాదంగా ఉండే ఆ వనంలో చుట్టూరా చిక్కగా అలుముకున్న కదంబ పుష్ప పరిమళాలు ఆఘ్రాణిస్తూ ఆ ఉయ్యాలలో కృష్ణుడి భుజం మీద తల వాల్చి తను చెప్పే ఊసులు వినడం రాధకెంతో ఇష్టమైన అలవాటు. ఇప్పుడు కూడా ఆ ఉయ్యాలలో కూర్చుని మెల్లగా ఊగుతూ కృష్ణ నామ స్మరణలో ఉంది రాధ. మురళీ మోహనుడికై రాధ నిరీక్షణ నిత్యం ఉండేదే అయినా ఈనాటి ఎదురుచూపులకి మరింత ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు ఫాల్గుణ పౌర్ణమి పర్వదినం.
ఒక్క రాధే కాదు.. రేపల్లెలోని పడుచు పిల్లలందరూ ఏడాదంతా ఎంతో ఆత్రంగా, ఉత్సాహంగా ఎదురు చూసే పండుగ ఫల్గుణ పూర్ణిమ. వీరందరూ ఈ వసంతోత్సవ సంబరాల కోసం రంగు రంగుల ద్రావకాలు తయారు చేసుకోవడానికని ఏడాది పొడవునా రకరకాల మొక్కల నుంచి పువ్వులు సేకరించి పెట్టుకుంటారు. మాఘ పూర్ణిమ వెళ్ళిన నాటి నుంచే మొదలవుతుంది పండుగ హడావుడి. ఎవరెవరు ఎన్నెన్ని రకాల రంగుల ద్రావకాలు సిద్ధం చేసుకోవాలీ, రంగులు జల్లడానికి ఏ సమయంలో ఎవరెవరిని ఎలా దొరకబుచ్చుకోవాలీ.. ఇత్యాది వ్యూహ రచనలూ, ఇంకా పండుగ నాడు యువతీ యువకులందరూ కలిసి అభినయించే సంగీత, వాయిద్య, నాట్య ప్రదర్శనలకి సాధన చేయడం.. లాంటి రకరకాల పనుల్లో నిమగ్నమై ఉంటారు. ఇక గోపభామలైతే ఫాల్గుణ పౌర్ణమి వెన్నెల్లో బృందావనాన కృష్ణుడితో కలిసి ఆడే రంగుల కేళీ విలాసం గురించి కంటి నిండా కలలు కంటూ ఆ రోజెప్పుడు వస్తుందా అని తిథులు లెక్కపెట్టుకుంటూ ఉవ్విళ్ళూరుతుంటారు.
ఈ వసంతోత్సవ రంగుల కోసమని బోలెడు రంగురంగుల పూలరేకుల్ని సేకరించి పెట్టుకుంది రాధ. ఆకుపచ్చ రంగు కోసం గోరింటాకు, తురాయి ఆకులూ, గోధుమ గడ్డి పరకలూ.. ఎరుపు రంగు కోసం ఎర్రటి మందారాలూ, కాశీ రత్నాలూ, రక్త చందనమూ.. కాషాయపు వర్ణం కోసం మోదుగ పూలు, బూరుగ పువ్వులు, పారిజాతాలూ.. పసుపు రంగు కోసం బంతి పూలు, తంగేడు పూలు, మారేడు ఫలాలు, సువర్ణ గన్నేరు పూలూ.. ఊదా రంగు కోసం దేవకాంత పువ్వులు, వెంపల పూలు.. నీలి రంగు కోసం చంద్రకాంత పువ్వులు, నీలి గోరింట పూలూ.. ఇలా ఎంతో శ్రద్ధగా అన్నీ రంగుల పువ్వులు సేకరించి, వాటన్నీటిని నీడ పట్టున ఆరబెట్టి పొడి చేసి సిద్ధంగా ఉంచింది. పక్కనే ఉన్న యమున నుంచి కడవలతో నీళ్ళు నింపుకొచ్చి కడిమి మాను చాటుగా దాచింది. ఆ రంగు రంగుల పూరేకుల పొడులని గంధం, కస్తూరి, జవ్వాజి, కర్పూరం లాంటి సుగంధ ద్రవ్యాలతో రంగరించి కడవల్లోని నీళ్ళల్లో నానవేసింది. ఒక్కో కడవలో ఒక్కో రంగు ద్రావకం చొప్పున చాలా కడవలే నింపి పెట్టింది. రంగుల క్రీడకి సర్వమూ సిద్ధం.. ఒక్క కృష్ణుడు తప్ప! అదిగో ఆ కన్నయ్య కోసమే ఇప్పుడు ఎదురుచూస్తోంది రాధ.
ఈ వేళ ఉదయం నుంచే రేపల్లె వీధులన్నీ గోప యువతీ యువకులతో కోలాహలంగా ఉన్నాయి. పడుచు పిల్లల అల్లరి సరాగాలతో రంగుల్లో తడిసి ముద్దైపోతోంది ఊరంతా. రాధ మాత్రం తన చెలులందరి కళ్ళు గప్పి ఉదయాన్నే తను సిద్ధం చేసి పెట్టుకున్న రంగులన్నీ తీసుకుని బృందావనానికి వచ్చి కృష్ణుని రాకకై తామెప్పుడూ కలుసుకునే కడిమి చెట్టు దగ్గర ఎదురు చూస్తోంది. తనొచ్చి రెండు ఘడియలు దాటిపోయాయి గానీ ఇంతవరకూ మాధవుని జాడే లేదు. "ఈ నల్ల పిల్లాడెప్పుడూ ఇంతే.. జీవితమంతా నిరీక్షణలోనే గడిపేలా చేస్తాడు.. అయినా ఈ వేళ ఫల్గుణ పూర్ణిమ అని మరచి ఉంటాడా... అలా ఎలా మర్చిపోతాడూ.. ఊరంతా పెద్ద పెట్టున సంబరాలు జరుగుతుంటేనూ! లేకపోతే తన కోసం నేనొకదాన్ని ఎదురు చూస్తుంటానన్న సంగతి మరచి ఏ గోపికా సమూహంతోనో చేరి హోలీ కేళీ విలాసాల్లో మునిగిపోలేదు కదా!" అన్న ఊహతో రాధ మోము చిన్నబోయింది. అంతలోనే "అసలైనా నా కన్నయ్య ఎంత అమాయకుడు.. ఈ గోపికలే నెరజాణలు.. నా కోసం బయలుదేరి వస్తోన్న నా కృష్ణుడిని దోవ మధ్యలో అటకాయించి బంధించలేదు కదా.. ఊహూ.. అయినా నా పిచ్చి గానీ ఈ మాయగాడిని మాయ చెయ్యగలవారెవ్వరులే.." అని నవ్వుకుంది.
ఇంతలో వెనక నుంచి ఎవరో రెండు చేతులతో చప్పున రాధ కళ్ళు మూసారు. కాస్తైనా బెదిరిపోకుండా "కన్నా.. నువ్వే కదూ!" అంటూ పున్నాగలు విరబూసినట్టు నిండుగా నవ్వింది రాధ. అంతలోనే కోపం నటిస్తూ "వసంతోత్సవం నాడు కూడా ఇంత ఆలస్యంగానా రావడం.. ఏ గోపభామలతో రాసలీలలాడి వస్తున్నారు స్వామీ?" అంది కినుకగా. "హన్నా.. ఎంత మాట.. నా రాధని తప్ప మరే ఇంతినైనా కన్నెత్తి చూసేనా ఈ కృష్ణుడు.. నా అమాయకత్వం నీకు తెలియనిదా రాధా.." అన్నాడు కృష్ణుడు కొంటెగా నవ్వుతూ. "అవునవును.. తెలియకేం.. ఎన్నేళ్ళ నుంచీ చూడట్లేదూ కృష్ణలీలలు.." అంటూ ఉడుక్కుంది రాధ.
కృష్ణుడు వేణువు అందుకున్నాడు. నీలమోహనుని వెచ్చని ఊపిరి తాగిన మురళి గమ్మత్తుగా మోగుతోంది. మృదు మధురంగా సాగుతోన్న ఆ మోహన మురళీ రవం వింటూ మైమరచిపోయిన రాధ అరమోడ్పు కన్నులతో చూస్తూ నిలిచిపోయింది. చప్పున వేణుగానం ఆగిపోయింది. రాధ తెప్పరిల్లి చుట్టూ చూసేంతలో తన ప్రియసఖులైన గోపికలందరూ చుట్టూ చేరి ఒక్కుమ్మడిగా రాధాకృష్ణులపై రంగులు చల్లసాగారు. అలా మొదలైన వాళ్ళ వసంతోత్సవ సయ్యాటలు రోజంతా విందులూ, వినోదాలూ, సంగీత, నాట్యాలతో సందడి సందడిగా సాగిపోయాయి. బృందావనంలో అంబరాన్నంటిన ఈ వసంతోత్సవపు సంబరాలని వీక్షించిన సూర్యుడు సాయం సంధ్యా సమయానికి అలసిపోయి సెలవు తీసుకుంటూ పున్నమి చంద్రుడికి స్వాగతం పలికాడు. గోపికలకీ, రాధాకృష్ణులకి మాత్రం ఉదయం నుంచీ ఆడి పాడిన అలసటే లేకపోగా అప్పుడే యమున ఒడిలోంచి ఆకాశంలో పై పైకి తేలి వస్తోన్న పున్నమి జాబిల్లిని చూస్తే మరింత ఉత్సాహం కలిగింది.
ఈనాటి ఫాల్గుణ పౌర్ణమి రాతిరిలో యమునా తీరాన అందమైన బృందావనంలో నిండు పున్నమి వెన్నెల పోతలో రాధామాధవుల రంగుల కేళీ విలాసం కన్నులారా చూడవలసిందే తప్ప మాటల్లో వర్ణించ తరం కాదు. కృష్ణ రాసలీల గురించి ఇన్నినాళ్ళూ కలలు కన్న గోపికలందరి స్వప్నం వారి కళ్ళెదుటే సాక్షాత్కారించింది.
బృందావనంలోని అణువణువూ కృష్ణరసాన్ని నింపుకుని దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. రాధ చెంతన నిలిచినా కృష్ణుడే.. గోపభామలందరితోనూ ఆడి పాడుతున్నదీ కృష్ణుడే.. అన్నిటా అంతటా కృష్ణుడే.. సర్వం కృష్ణమయం.. నయనానందకరం.. జగదానందకారకం!
సర్వం.. కృష్ణార్పణం!
17 comments:
మరోసారి బృందావనం దర్శనమయింది. కృష్ణలీలలు, బృందగానాలు, వసంతోత్సవాలు, వనవిహారాలు..వెన్నెల వేళలో మరోసారి చదవాలి. మధురంగా వ్రాశారు...
ఆహా ఏమి భాగ్యము అలనాటి బృందావనాన్ని కనులముందు సాక్షాత్కరింప చేశారు.
ఎంత అద్భుతంగా చెప్పారు మధుర గారూ!
ధన్యవాదములు మధురవాణి గారు.
Simply superb
యెమి రంగుల కెళి....అన్ని రంగులు భావాలుగా మార్చి
హ్రుదయానికి అద్దావు మధుర....
బృందావనంలో ఫాల్గుణ పౌర్ణమిని మాటల్లో కళ్ళకెలా చూపించగలిగారో అర్థం కాకుండా ఉంది, మీ రచనా శైలిలోని గొప్పదనమే అది. చదువుతుంటే బృందావనంలో విహరిస్తున్నట్టుగానే ఉంటుంది. ప్రతి పువ్వూ, రంగూ వర్ణిస్తూ కాసేపు బృందావనంలో విహరింపజేశారు.
అద్భుతం !!!
అద్భుతం మధుర గారూ!
@ జ్యోతిర్మయి, చిలమకూరు విజయమోహన్, రసజ్ఞ, ఉపాధ్యాయుల శ్రీరామచంద్రమూర్తి, కష్టేఫలే, శశికళ, చిన్ని ఆశ, లోకనాథ్..
నా ఈ చిన్న ప్రయత్నం మీ అందరికీ నచ్చినందుకు బోల్డు సంతోషంగా ఉంది. స్పందించిన మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. :)
మధురము రాధాకృష్ణుల
కథ , బృందావన విహార కథనము మధురమ్ ,
మధురము రంగుల హోళీ ,
మధువు లొలుకు ‘ మధురవాణి ‘ మాటలు మధురమ్
బ్లాగు: సుజన-సృజన
చాలా బాగా రాసారు మధుర గారు..:-)
@ A Homemaker's Utopia,
ధన్యవాదాలండీ! :)
@ వెంకట రాజారావు . లక్కాకుల,
భలే చెప్పారండీ.. చాలా సంతోషమనిపించింది మీ స్పందన. మీ ప్రశంసకి బోల్డు ధన్యవాదాలు.
అందరినీ రసమయ జగత్తులో ఓలలాడించేసారు..
ధన్యవాదాలు చెప్పనా.. అభినందనలు చెప్పనా..
ఊహు..కాదు..రెండూనూ...
అద్భుతంగా అందంగావుంది.
@ శ్రీలలిత,
అందంగా స్పందించినందుకు నేనే మీకు ధన్యవాదాలు చెప్తానండీ.. :)
@ నాగార్జున,
కృష్ణరసంలో ఉన్న అందమే అది. ధన్యవాదాలు. :)
hare rama hare rama rama rama hare hare, hare krishna hare krishna krishna krishna hare.
Post a Comment