Tuesday, March 14, 2017

ఐ మిస్ యూ


నీలాంటి నువ్వు నాకు ఎదురుపడతావని సరదాకైనా ఊహించలేదు..
ఎన్ని ఉదయాలు నువ్వు ఊదిన కొత్త ఊపిరితో నిదుర లేచానో..
ఎన్ని తీరిక లేని రోజులు నీతో చెప్పాలనుకున్న మాటలు పేర్చుకుంటూ ఉవ్విళ్ళూరానో.. 
ఎన్ని మధ్యాహ్నాలు నీతో కూర్చుని కబుర్లాడుతూ ఆకలి సంగతి మరిచానో..
ఎన్ని అందమైన సాయంకాలాలకి నువ్వూ, నేనూ కలిసి రంగులద్దామో..
ఎన్ని అపరాత్రులు వెన్నెల సాక్షిగా మనిద్దరం నిద్రని తరిమేశామో..

చిరుజల్లుల్లో తడిసిన సంబరాలు, మంచుపూలతో సయ్యాటలు, పూకొమ్మలతో మురిపాలు, పాటలతో సరాగాలు, చిన్నతనపు తాయిలాల రుచులు, అల్లరి వయసు అచ్చట్లు ముచ్చట్లు, అందాలు, ఆనందాలు, ఆటలు, పాటలు, ఆవేశాలు, ఆక్రోశాలు, ఊహలు, ఊసులు, కథలు, వెతలు, తలపులు, తపనలు... నీ సమక్షంలో ఎన్నెన్ని మధురక్షణాలు జీవం పోసుకున్నాయో! కాలధర్మానికి అతీతంగా ఆ మధురక్షణాలన్నీటినీ అక్షరంగా మలచి నా చిన్ని మనసు పలికిన భావాలని అమరం చేశావు.

నీ చేతిలో చెయ్యి వేసి అమాయకంగా నీ కళ్ళలోకి చూస్తూ కూర్చున్న నాకు, నాకే తెలియని ఒక కొత్త నన్ను సృష్టించి నా కళ్ళకి నన్నెంతో అందంగా చూపించావు. అసలూ.. మొత్తంగా నువ్వంటే నాకేమిటో నీకెలా చెప్పనూ?

అది సరే.. ఇప్పుడు ఇదంతా కొత్తగా ఎందుకు చెప్తున్నట్టూ అంటే... ఎందుకో నీకు తెలీదూ? దూరం వచ్చి గట్టిగా అరిచి చెప్తే గానీ దగ్గరితనం విలువ తెలుసుకోలేమట.. నిజంగా! నిన్ను నేను చాలా చాలా మిస్ అయ్యాను అని చెప్పడానికి.. ఉహూ కాదు కాదు.. నేను నీ పక్కన లేకపోవడం వల్ల నన్ను నేనే ఎంతో కోల్పోయానూ అని చెప్పడానికొచ్చాను. మళ్ళీ ఆనాటి వసంతం మన ముంగిట్లో సరికొత్తగా విరిస్తే ఎంత బావుండునో కదూ!