Monday, June 27, 2011

కృష్ణా! నేను.. నీ రాధని!


కృష్ణా... ఓయ్.. కృష్ణా... నిన్నే పిలుస్తోంది.. ఇదిగో ఇక్కడ.. ఓసారి ఇటు చూడు.. నేను.. నీ రాధని పిలుస్తున్నా!
నువ్వెక్కడున్నా నా పిలుపు నిను చేరుతుందని నాకు తెలుసులే గానీ కాస్త నే చెప్పేది ఆలకించు. ఎన్నాళ్ళయింది కృష్ణా.. నువ్వు నా కళ్ళకి కనిపించి.. ఇన్నాళ్ళ నీ ఎడబాటుని తాళలేక నా తనువూ, మనసూ, ప్రాణం విలవిలలాడుతుంటే క్షణమొక యుగంలా భారంగా తోస్తోంది. అదేం చిత్రమో అంతు పట్టదు.. నీ రాక కోసం ఎన్నెన్ని అహోరాత్రాలు వేచి చూస్తున్నా ఇష్టమే తప్ప కష్టం తెలీడం లేదు.. నువ్వేం మాయ చేసావో కృష్ణా!

మరేమో.. నేను నీ మీద అలకబూని బోల్డు కోపం చూపిద్దాం అనుకుంటానా.. నువ్వేమో నేను కనీ కనిపించగానే ఒక్క చిన్న దొంగచూపుతో మంత్రం వేసేసి నా కోపమంతా ఆవిరి చేసేస్తావు. నీ చురుకైన కళ్ళని సన్నగా కదిలిస్తూ అల్లరిగా నవ్వుతావే.. ఒక్క మాయ నవ్వుకి నేను మంత్రముగ్ధనైపోయి నీ కన్నుల్లో విరిసే నవ్వుల వెలుగులు నా కళ్ళల్లో నింపుకుంటూ అలా శిలా ప్రతిమలా నిలుచుండిపోతాను కృష్ణా!

నువ్వు నాకు చేరువయ్యే కొద్దీ చుట్టూ వీస్తున్న గాలి సైతం ఊపిరి తీసుకోవడం ఆపేసినట్టు స్తంభించిపోతుంది.. వేగిరపాటుతో ఒక్క ఉదుటున నా గుండె వడి వేగం ఎగసి అదుపు తప్పి నా మనసునీ, వయసునీ పరుగులు తీయిస్తుంది.. నీ సాన్నిధ్యంలో నాకెందుకింత పరవశమో.. నీ ఊహల తాకిడికే ఎందుకిలా మంచుబొమ్మలా కరిగిపోతానో.. అలవి గాని మోహం అంతా నీ మాయే కదూ కృష్ణా!

నీ చేతుల్లో ముచ్చటగా ఒదిగిపోయి, వెచ్చని నీ ఊపిరిని గుండె నిండా నింపుకుంటూ, నీ పెదవులపై సుతారంగా నాట్యం చేస్తూ, మృదుమధురంగా పలికే మోహన మురళిది ఎంతటి ధన్యత్వమో కదా! నీకూ నాకూ మధ్యన వలపుల వంతెన వేసే మధుమోహన మురళీగానాన్ని ఆస్వాదించే అదృష్టం కలిగినందుకు నాదీ కొండంత భాగ్యమే కదూ కృష్ణా!

యమున ఒడ్డున మధురానగరి తీరాన పుచ్చపువ్వులా పరచుకున్న పసిడి వెన్నెల కిరణాల్లో పుత్తడి కాంతులతో మెరిసిపోతున్న మెత్తటి ఇసుకలో నీ ఒడిలో వాలిపోయి చుక్కల్ని లెక్కపెడుతూ.. మధ్య మధ్యన నీ అల్లరి మాయలో పడిపోయి నేను అదుపు తప్పుతూ.. అంతలోనే నా చుక్కల లెక్క కూడా తప్పిపోతూ.. మళ్ళీ మళ్ళీ చుక్కల లెక్కలు మొదలెడుతూ.. ఆహా.. అదెంతటి మధురానుభూతి కదూ కృష్ణా!

నీ భుజం మీదకి తల వాలుస్తూ, నీ అరచేతిలో నా చేతి వేళ్ళని ముడి వేస్తూ, మెలమెల్లగా నీ అడుగుల్లో అడుగులేస్తూ.. అలా అలా ఆకాశం అంచుల దాకా, మబ్బుల ముంగిటి దాకా విహారానికి వెళ్ళి, దోవలో నా చేతికందిన కొన్ని నక్షత్రాలని తెంపుకొని గుప్పిట నిండా తెచ్చుకుంటానా.. తారలన్నీ నువ్వు లేనప్పుడు నీ గురించిన చిలిపి తలపుల్ని నా ముందు వల్లిస్తూ నన్ను మరింత మురిపిస్తుంటాయి తెలుసా కృష్ణా!

ఒక్కో క్షణంలో నేను ముద్దు చేస్తుంటే గారాలు పోతూ నా కంటికి నువ్వొక బుజ్జాయిలా, చిన్నారి కృష్ణుడిలా కనిపిస్తావ్.. మరో క్షణంలో నీ చిలిపి మాటలతో, కొంటె చేష్టలతో నన్ను కొల్లగొట్టేస్తూ తుంటరిలా అనిపిస్తావ్.. ఇలాక్కాదని అసలు నిన్ను కదలనివ్వకుండా పట్టి బంధించుదామన్న తలంపు రాగానే.. కృష్ణుడు నీ ఒక్కదాని సొత్తే అనుకుంటున్నావా.. అని నువ్వు నవ్వుతున్నట్టు ఉంటుంది. అంతలోనే చల్లని నీ చిరునవ్వుతో నాలో ఉన్న భ్రమని చెరిపేస్తావు.. జగమంతా నీలోనే నిక్షిప్తమైనట్టు కనిపిస్తుంది.. ఇంతటి కృష్ణుడినా నేను నా రెండు చేతుల్లో బంధించాలనుకున్నాను.. అని నా అమాయకత్వానికి నాకే నవ్వొస్తుంది కృష్ణా!

ఎర్రని పారాణి అద్దిన పచ్చని నా పాదాల పైన కొలువు దీరి ఘల్లు ఘల్లుమని ముద్దుగా మోగుతూ ఉండాల్సిన నా కాలి మువ్వలు మూగబోయాయి కృష్ణా! కృష్ణుడే వచ్చి తమ హృదయవీణని మీటితేనే గానీ తమ ఎదలోంచి స్వరాలు పలకవు అంటున్నాయి..
నువ్వు తగిలీ తగలగానే గమ్మత్తైన సవ్వడి చేస్తూ గలగలా నవ్వే నా చేతి గాజులు గాజుబొమ్మల్లా కదలక మెదలక ఉండిపోయాయి కృష్ణా! కృష్ణుడే వచ్చి తమని సుతారంగా తాకితే తప్ప తమలో జీవం లేదంటున్నాయి..
ఎల్లప్పుడూ నా చెవి పక్కనే చేరి హాయిగా ఉయ్యాల జంపాల ఊగుతూ హిందోళం పాడుతూ నీ ఊసులు నా చెవిన వేస్తూ ముచ్చట గొలిపే నా చెంప సరాలు నీ ఉసురు సోకితేనే గానీ పెదవి విప్పమంటూ జంటగా మారాం చేస్తున్నాయి కృష్ణా!
కన్నులు నావే అయినా అవి నిత్యం నీ కలలతోనే పొద్దు పుచ్చుతూ నా మీద కినుక వహించి నా మాట వినడమే మానేసాయి కృష్ణా!

ఏమైనా నువ్వు పెద్ద దొంగవిరా కృష్ణా.. ఇదంతా నా అమాయకత్వం గానీ, నీకు తెలియనిదంటూ ఏదైనా ఉంటుందా అసలు.. నువ్వొక పెద్ద మాయలమారివి కృష్ణా.. ఎందుకలా సమ్మోహనంగా నవ్వుతావు.. నా మనసు చేజారిపోయేలా చేస్తావు.. నన్ను మెరిపించి మురిపించి మైమరిపించి మరులుగొల్పే మాయావివి కదూ కృష్ణా నువ్వు!

నా గుండెల్లో ఉవ్వెత్తున ఎగిసిపడే స్వరాల్లో దాగున్న మాధుర్యానివి నువ్వే కృష్ణా! నువ్వెక్కడో ఉన్నావన్నది కేవలం నా భ్రమ.. నువ్వెప్పుడూ నాతోనే నాలోనే ఉన్నావనిపిస్తావు.. నీ సమక్షంలో నాకు నువ్వు తప్ప ఇంక వేరే ప్రపంచమే లేదనిపిస్తుంది.. జగమంతా నీలోనే దాగుందనిపిస్తుంది.. నీలో లేనిది ప్రపంచంలో ఇంకేం ఉందనిపిస్తుంది.. నీ సాంగత్యంలో కాలం ఆగిపోతుంది.. నేను నిలువెల్లా నీలో కరిగిపోయి కలిసిపోతాను కృష్ణా!

ఎందుకని కృష్ణా.. ఇదంతా కేవలం మాయని తెలిసినా భ్రాంతిని చేధించలేనంత పరవశం... అసలిదంతా ప్రేమో, ఆరాధనో, మోహమో, మైకమో, మత్తో, విరహమో, వివశత్వమో, ఏదో తెలియని మైమరపంతా.. అచ్చంగా నీ మాయే కదా కృష్ణా!

కృష్ణా.. జగమంతా నీ సాక్షాత్కారం కోసం నిరంతరం తపస్సు చేస్తూ ఉంటుంది కదూ! నేనూ నీ ప్రేమలో కరిగిపోవాలనీ, నీలో కలిసిపోవాలని.. నీ సమక్షంలో గడిపే ఒక్క ఘడియ కోసం ఎన్ని యుగాలైనా నిరీక్షిస్తాను.. నా కోసం వస్తావు కదూ.. ఒక్క ఘడియనీ నా కోసం ఇస్తావు కదూ కృష్ణా!

Sunday, June 19, 2011

ఎందుకిలా..!?


నీ గురించే ఆలోచిస్తూ..
నీ ఊహల్లో ఊరేగుతూ..
నీ తలపుల్లో తప్పిపోతూ..
నీ కోసమే ఎదురు చూస్తూ..
నీ ఊసులతో మురిసిపోతూ..
నీ మాటల్లో మైమరచిపోతూ..
నీ కలలతో నిదరోతూ..
నీ జ్ఞాపకాలతో మేలుకొంటూ..
నీ అల్లరిని విసుక్కుంటూ..
నీ కోసం ఆరాటపడుతూ..
నీ ప్రేమకి ఉప్పొంగిపోతూ..
నీ మాయని తిట్టుకుంటూ..
నీపై కోపం నటిస్తూ..
నీ మీద అలిగేస్తూ..
నీ ముందు బింకం నటిస్తూ..
నీ దగ్గర గారాలు పోతూ..
నీ చేత బతిమాలించుకుంటూ..
నీ నుంచి పారిపోవాలని ఓడిపోతూ..
నీ వల్లే అంతా అని నిందిస్తూ..
మళ్ళీ మళ్ళీ పడుతూ లేస్తూ..
నా మీద నేనే గెలుస్తూ ఓడిపోతూ..
అలసిపోతూ.. సొలసిపోతూ..
ఎందుకిలా నేనంతా నువ్వే అయిపోతూ.. నన్ను నాకు దూరం చేస్తున్నావ్!?


Image source

Thursday, June 16, 2011

వేచి ఉన్నా!


నువ్వెళ్ళిన మరుక్షణం నుంచే నీ మీద బెంగతో మళ్ళీ నిన్ను చూసే మధుర క్షణాల కోసం వేచి ఉన్నా!
ఇహనో ఇప్పుడో నువ్వు రెక్కలు కట్టుకు వచ్చి నా ముందు వాలిపోతావన్న ఊహల్లోనే కాలం కరిగిపోతోంది..
మన పడగ్గది కిటికీ పక్కనున్న మరుమల్లె పందిరి పచ్చగా మారాకు వేసి చిరుమొగ్గ తొడుగుతోంది..
మన పక్కింటి చిన్నారి అమ్ములు అత్తాత్తా అని పిలుస్తూ బుడి బుడి నడకల్లోంచి పరుగందుకుంటోంది..
మనింటి చూరులో గూడు కట్టుకున్న గువ్వపిట్టల జంట ముచ్చటగా మూడు బుల్లి కూనల్ని పెట్టింది..
నే సాకుతున్న రామచిలుక తియ్యటి దోర జామపళ్ళు తినమరిగి కొంటె కోణంగిలా అల్లరి చేస్తోంది..
నే అంటు పెట్టిన సన్నజాజి తీగ అంతెత్తున ఎదిగి మన పందిరినంతా పెనవేసుకుపోయి పరిమళిస్తోంది..
ముంగిట్లో పెట్టిన ఇరవయ్యొక్క చుక్కల ముగ్గు రంగుల్లో మెరిసిపోతూ నీకు స్వాగతాలు పలుకుతోంది..
మన వాకిట్లో గుమ్మానికో పక్కన విరగబూసిన రాధామనోహరాల తీగ మురిపెంగా ఎదురు చూస్తోంది..
మరో పక్కన నీ ఊసులతో బరువెక్కిన మనసుతో నేను కనురెప్పైనా వేయకుండా నీ రాకకై నిరీక్షిస్తున్నా..

అప్పుడప్పుడే సాయంసంధ్యలో సూరీడు నిష్క్రమిస్తున్న వేళ ఆకాశంలో చిత్రవర్ణసమ్మేళనం వేడుకలా ఉంది..
నేను మల్లెమొగ్గలు చెంగున కోసుకొచ్చి మనింటి ఎదురు గడపలో కూర్చుని నీ ఊహలతో కలగలిపి మాలల్లుతున్నాను..
నీ తలపుల్లో పడి కొట్టుకుపోతూ తెలీకుండానే అలా కాస్త కన్నంటుకుంది.. ఎంత సమయం గడిచిందో తెలీలేదు..
నీ వెచ్చని ఊపిరి గిలిగింతగా నా చెక్కిలిని తాకిన స్పర్శకి దిగ్గున లేచి చూస్తే నా కళ్ళెదురుగా నవ్వుతున్న నువ్వు..
నీ కళ్ళలో ముచ్చటగా ఒదిగిపోయిన నా ప్రతిబింబం నవ్వుల వెలుగులు చిందిస్తూ అపురూపంగా కనిపిస్తోంది..
అంతలోనే నీ కొంటె చూపుల్లోంచి తొంగి చూస్తున్న చిలిపి ఊసుల ధాటికి నిలువలేక నా కనురెప్పలు వాలిపోయాయి..
నీ చేతుల్లో నేను, నా చేతుల్లో సగం అల్లిన మల్లెచెండు, ఒడి నిండుగా విచ్చుకుని గారాలు పోతున్న అరవిరిసిన మల్లెలు..
సొంపుగా మెరుస్తున్న చుక్కల అద్దకంతో నేసిన నల్లటి చీకటి పరదాలు కప్పుతూ వెన్నెల దీపం వెలిగించిన రాతిరి అచ్చంగా మన కోసమే అందమైన ఏకాంతాన్ని ఆవిష్కరిస్తోంది!


Image source

Monday, June 06, 2011

మనసా.. మాటాడమ్మా!

ప్రేమ, ప్రేమ బోల్డంత ప్రేమ.. ఇంక అంతకు మించి ఈ అమ్మాయి మనసులో ఎంత వెతికినా వేరే ఇంకేదీ కనిపించదేమో అన్నంత ప్రేమ! చాలా అబ్బురంగా అనిపిస్తుంది నాకైతే! నిజంగా 'నేను' అన్న స్పృహ పూర్తిగా కోల్పోయి మొత్తంగా నీలో కరిగిపోయేంత ప్రేమ ఎంత అందమైన భావనో కదా! అసలు నిజంగా అంత నిష్కల్మషంగా, అంత గొప్పగా ప్రేమించగలిగితే ఆ భావం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పడానికొస్తుందంటారా? ఏమైనా ఒక్కోసారి మన ఉనికిని పూర్తిగా మర్చిపోయి ఇంకొకరిలో మనం ఒదిగిపోవడం బాగుంటుంది.. ఈ పాటలో లాగా!

పెళ్లిని గురించి భర్తనిగురించి అమాయకత్వం స్వచ్చత నిండిన ఓ అమ్మాయి అంతరంగం ఈ పాట. భర్తే లోకం, ఇద్దరూ ఒకటైన క్షణం నుంచి తన చుట్టూనే నా ప్రపంచం, తనతోనే నా కష్టం, సుఖం, సంతోషం,ఆనందం.. అన్నీ అని మనసా వాచా నమ్మి ప్రేమించే భార్య మనసుని అక్షరాల్లో చూపిస్తే ఈ పాటలాగే ఉంటుంది..

భర్తని అంత అమాయకంగా, స్వచ్చంగా ప్రేమించే అమ్మాయిని "నువ్వంటే నాకు ఇష్టముంది.. ప్రేముంది.. కానీ, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బోల్డు డబ్బు కలిసొస్తుంది" అంటూ విడాకులడిగే భర్తని ఎలా దారికి తీసుకొస్తుందన్నదే ఈ సినిమా కథ! రమ్యకృష్ణ గ్లామర్ వెనక దాగున్న నటిని మనకి పరిచయం చేసిన అతి కొద్ది సినిమాల్లో ఈ సినిమా ఒకటి. ఈ పాట SV కృష్ణారెడ్డి దర్శకత్వంలో 1997 లో శ్రీకాంత్, రమ్యకృష్ణ నటించిన 'ఆహ్వానం' సినిమాలోది. సంగీతం కృష్ణారెడ్డి గారే కాగా, సాహిత్యం అందించింది సిరివెన్నెల గారు.

ఫలానా సందర్భంలో ఒక వ్యక్తి అమ్మాయైనా, అబ్బాయైనా ఎలా ఆలోచిస్తారు, వాళ్ళ మనసులో భావాలెలా ఉంటాయని సిరివెన్నెల గారు భలే రాస్తారు. నాకనిపిస్తుంది.. ఆయన ఏదో జన్మలో బోల్డు పుణ్యం చేసుకుని ఉండటం వల్ల ఎవరి మనసులో ఏముంటుందో పరకాయ ప్రవేశం చేసినట్టుగా అంత ఖచ్చితంగా తెల్సుకోగలరేమో.. అలాగే మళ్లీ వాటిని ఇంతందంగా అక్షరాల్లో అద్దడం.. ఆహా.. ఇలాంటి సాహిత్యం వినగలగడం మన అదృష్టం అనుకోవాలి.. :)

ఈ పాట ఎప్పుడు విన్నా ఒకసారి విని ఆపెయ్యడం నా వల్ల కాదు. కనీసం వరసగా ఒక పదో, పాతికో సార్లు వింటే గానీ ఈ పాట ఫీల్ లో నుంచి బయటికి రాలేను. :) అబ్బ.. చిత్ర ఎంతందంగా పాడతారు! తన మనసులోంచి వచ్చిన మాటల్లాగా.. ఆవిడ తియ్యటి గొంతులోని స్వచ్ఛతేనేమో ఈ పాటలోని భావానికి ప్రాణం పోసింది. ఈ పాటలో బాగున్న వాక్యాన్ని రాయాలంటే.. పాట మొత్తం మళ్ళీ తిరగరాయాలి.. కావాలంటే మీరే చూడండి.. :)

ఈ పాటని ఇక్కడ వినొచ్చు.. మీక్కావాలంటే ఇక్కడ చూడండి.

మనసా.. నా మనసా.. మాటాడమ్మా!
ఎగసే భావాలతో పలికే ఈ సమయంలో.. ఇంత మౌనమా!
మనసా నా మనసా మాటాడమ్మా!

చెవిలో మంగళవాద్యం మ్రోగేటి వేళలో.. విన్నా నీ అనురాగపు తేనె పాటని...
మెడలో మంగళసూత్రం చిందించు కాంతిలో.. చూశా నీతో సాగే పూల బాటని...
నీతో ఏడడుగులేసి నడిచిన ఆ నిమిషం.. నాతో తెలిపిందొకటే తిరుగులేని సత్యం..
నేను అన్న మాటకింక అర్ధం నీవంటూ..!

మనసా.. నా మనసా.. మాటాడమ్మా!

తల్లి తండ్రి నేస్తం ఏ బంధమైనా.. అన్నీ నీ రూపంలో ఎదుట నిలిచెగా!
తనువు మనసు ప్రాణం నీవైన రోజున.. నాదని వేరే ఏది మిగిలి లేదుగా!
ఎగసే కెరటాల కడలి కలుపుకున్న వెనక.. ఇదిగో ఇది నది అంటూ చూపగలరా ఇంకా!
నీవు లేని లోకమింక నాకు ఉండదంటూ..!

మనసా.. నా మనసా.. మాటాడమ్మా!
ఎగసే భావాలతో పలికే ఈ సమయంలో.. ఇంత మౌనమా!
మనసా.. నా మనసా..

Friday, June 03, 2011

ఒక పోస్టు చెయ్యని ఉత్తరం..


నువ్వు గుర్తొస్తావు.. నువ్వు చాలా గుర్తొస్తావు.. నువ్వు బోల్డు గుర్తొస్తావు.. మళ్ళీ మళ్ళీ నువ్వే గుర్తొస్తావు.. అసలు నువ్వెంతలా గుర్తొస్తావో తెలుసా నీకు!?

ఎక్కడో ఓ చెత్త కాగితం మీద ఒక ఊరి పేరు కనిపిస్తుంది.. అదే.. అక్కడెక్కడో భూగోళానికి ఇంకో వైపునున్న ఆ ఊరు.. అదే నువ్వున్న ఆ ఊరు గుర్తొస్తుంది.. అసలు ఇప్పటి దాకా కనీసం పేరైనా పరిచయం లేని ఆ ఊరంటే ఉన్నట్టుండి గంపెడంత ప్రేమ పొంగుకొచ్చేస్తుంది.. ఆ ఊరి పేరు వింటే చాలు మైమరచిపోతాను.. ఏదో నీ పేరే విన్నంత ఆనందం, నిన్నే చూస్తున్నంత పరవశంలో పడిపోతాను.. యథాలాపంగా ఎక్కడో చోట మీ ఊరి పేరు విన్నప్పుడల్లా గుండె ఝల్లుమంటుంది. ఊపిరాడనట్టు, గుండెల్లో ఏదో పట్టేసినట్టు అయిపోతుంది. ఎవరో అపరిచితులు గబుక్కున మీ ఊరి పేరు చెప్తే వాళ్ళంటే అప్పటికప్పుడు బోల్డు ఇష్టం వచ్చేస్తుంది. వీళ్ళు నాకు బాగా కావలసినవాళ్ళన్న పిచ్చి అభిమానం ముంచుకొచ్చేస్తుంది. అంటే.. నువ్వుండే ఊర్లో వాళ్ళు కూడా ఉంటున్నారనీ, నువ్వు తిరిగే చోట వాళ్ళూ తిరిగారని, నీ కళ్ళతో చూసిన దృశ్యాలని వాళ్ళూ చూసారనీ, అంతటి గొప్పవాళ్ళని నేనూ ఇప్పుడు నా కళ్ళారా చూస్తున్నా అని నా సంబరమన్నమాట! అదే చిన్నప్పుడు స్కూల్లో చెప్పేవారు కదా a=b=c అయితే a=c అని.. అలాగన్నమాట! మరీ సిల్లీగా అనిపిస్తోంది కదూ.. నాక్కూడా అంతే అనిపిస్తోంది. కానీ, అదంతే! ఒకోసారి కొన్ని నిజాలు సిల్లీగానే అనిపిస్తాయి.

నీ పేరు.. అబ్బబ్బా నీకసలు ఎందుకా పేరు పెట్టారు? ఈ ప్రపంచంలో ఎప్పుడు ఏ మూలకెళ్ళినా ఎవరో ఒకరు నీ పేరుతో వినిపిస్తూ కనిపిస్తూనే ఉంటారు.. ఒకోసారి ఒళ్ళు మండిపోతుంది.. అబ్బబ్బా ఈ పేరుతో అసలు మనుషులే ఉండకపోతే బాగుండు, అసలీ పేరు పెట్టుకోడానికి వీల్లేదని ఏదన్నా చట్టం తెస్తే బాగుండు.. ఇలాంటి క్షుద్రపూరితమైన ఆలోచనలు వస్తాయి. ఆ పేరుని వింటున్నప్పుడూ, పలుకుతున్నప్పుడంతా ఓ పక్క మనసుని మెలితిప్పే ఏదో చెప్పలేని బాధ, మరో పక్క నీ పేరుని అన్నిసార్లు పలికే అదృష్టం దొరుకుతున్నందుకు అదో మురిపెం.. పిలిచేది నిన్ను కాకపోయినా, ఎంచక్కా నీ పేరునలా హాయిగా గొంతెత్తి పిలుస్తుంటే.. ఆహా.. అదో గొప్ప ఆనందంలే! నీకు చెప్పినా అర్థం కాదులే.. హుమ్మ్.. ఇది ఖచ్చితంగా పిచ్చి లక్షణమే అనిపిస్తోంది కదూ!

ఒకోసారి నేను ఏదోక పనిలో ఊపిరి సలపనంతగా మునిగిపోయి నీ ఊసే అసలు గుర్తుకు రాని సందర్భాల్లో.. అబ్బా ఎంత హాయిగా ఉంది ఈ కాసేపు అనిపిస్తుంది. అంతలోనే ఇంతసేపూ నిన్ను మర్చిపోయానని అనుకోగానే చాలా బెంగగా అనిపిస్తుంది.. ఏడుపొచ్చేస్తుంది.. అదే పనిగా కంటికి కనిపించిన ప్రతీదానిలో నిన్నే తలచుకోవడం చాలా దిగులుగా, బాధగా ఉంటుంది. కానీ, అదేంటో, ఆ బాధే చాలా అందంగా, ఆనందంగా అనిపిస్తుంది. ఈ బాధని ప్రేమించడవేంటో నా మొహం.. అని నాకు నాకే తెగ నవ్వొస్తుంది కూడా!
ఎందుకలా!?
హుమ్మ్.. కేవలం ఒక్క మనిషి మీదున్న ప్రేమ ఇలా ఇన్నిటి మీద ప్రేమని పుట్టిస్తుందని నాకిప్పటి దాకా తెలీనే తెలీదు. ఆలోచిస్తుంటే ఇంకోటి కూడా అనిపిస్తుంది.. ఒకవేళ నేను నిజంగా నీతోనే ఉన్నాననుకో.. అప్పుడు ఇలా నువ్వున్న ఊరు, నీ పేరూ, నువ్వు మాట్లాడిన ప్రతీ అక్షరం అక్షరమూ, నీతో గడిపిన చిన్ని చిన్ని క్షణాలు.. ఇవన్నీ ఇన్ని వేల సార్లు మళ్ళీ మళ్ళీ తలచుకునేదాన్నంటావా? కాదేమో కదా! నువ్వే నాతో ఉన్నప్పుడు ఇంక నీ జ్ఞాపకాలతో నాకేం పని అనుకునేదాన్నేమో! అబ్బ.. నాకెంత స్వార్థం కదూ!

ఇంకా నీ గురించిన తలపుల ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉన్నప్పుడు నాకింకో సందేహం కూడా వస్తూ ఉంటుంది. నాలో నీ మీద ఇంత ప్రేమ ఉన్నప్పుడు నువ్వు ఎదురుగా ఉన్నప్పుడు నేనెందుకు నిన్ను బాధ పెట్టానసలు? అంటే, ఇప్పుడు నిన్ను దూరం చేసుకున్నాక గానీ ఇంత ప్రేమ నాలో దాగుందని నేను గుర్తించగలిగానా? లేకపోతే నిన్ను కోల్పోయాక గానీ నీ విలువ అమాంతంగా పెరిగిపోయి నీ జ్ఞాపకాలన్నీ ఇంత అపురూపం అయ్యుంటాయా? ఏమో.. నా దగ్గర ఇలాంటి జవాబులు లేని ప్రశ్నలు గంపల కొద్దీ ఉన్నాయి. ఏమైనా, ప్రశ్నించడం చాలా సులువనుకుంటా.. సమాధానాలు వెతుక్కోడం, సమాధానాలు ఇవేనని సకాలంలో గుర్తించి సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోగలగడంలో ఉంది అసలు చిక్కంతా.. ఏవిటో, పరీక్షలయిపోయాక సెలవుల్లో సమాధానాలు రాసినట్టుంది కదూ నా తెలివి!

ఒకోసారి నీ మీద చాలా కోపమొస్తుంది.. నేను మూర్ఖంగా ప్రవర్తించినప్పుడు నువ్వెందుకు ఊరుకున్నావసలు.. అప్పుడే చెవి మెలిపెట్టి బుద్ధి చెప్పాల్సిందేమో.. అప్పుడైతే నేను నీకు దూరం అయ్యేదాన్ని కాదు కదా! నాకు వినిపిస్తుందిలే నువ్వేం అంటున్నావో.. నాలాంటి పెంకి మొహాలకి చెవి మెలెయ్యడం అంత సులువు కాదనేగా! పెద్ద గొప్పేలే.. ఆ విషయం మాక్కూడా తెలుసు.. అయినా సరే, నువ్వే ఏదోకటి చేసుండాల్సింది.. అంతే.. ఇంకో మాటే లేదు!
అసలు నువ్వంటే నాకు చాలా బోల్డు కోపం.. అసలీ ప్రపంచంలో నీ మీద కంటే కోపం నాకు ఇంక దేని మీదా లేదు.. రాదు.. ఎందుకు నిన్ను వదిలించుకోలేకపోతున్నాను నేను? నాకెందుకింత బాధ నీ వల్ల అని.. కానీ, అంతలోనే నీ మీద కోపమంతా నా మీదకి మళ్ళుతుంది. అసలిదంతా నా వల్లే.. నేనే నిన్ను వెళ్ళగొట్టేసాను. అయినా వేటూరి గారన్నట్టు కొన్ని దూరమైనా, దగ్గరైనా ఆనందమే.. నీలాగా! అసలు నువ్వు నాకు లేకపోతే.. అమ్మ బాబోయ్.. నేనస్సలు ఊహించలేను.. అసలు నువ్వే లేకపోతే నా చేతిలో ఉన్న సమయమంతా ఏమి చెయ్యాలో తెలీక మహా ఇబ్బంది పడిపోయేదాన్నేమో కదా! ఏం ఆలోచించాలి, దేనికి సంతోషపడాలి, దేనికి సంబరపడాలి, బాధ ఎందుకొస్తుంది, ప్రేమంటే ఏంటీ, పిచ్చంటే ఏంటీ.. ఇవన్నీ నాకు తెలిసేవి కాదుగా మరి!

ఏవిటో.. అంతా అయోమయంగా, అస్పష్టంగా, చిందరవందరగా, గందరగోళంగా ఏదేదో చెప్పేసాను కదూ! ఏమో.. నాకలాగే చెప్పాలనిపించింది మరి.. చెప్పేశాను.. అంతే! ఇలాంటప్పుడే నాకు నేనే అర్థం కావట్లేదేమోననిపిస్తుంది.. అంతలోనే ప్రేమో, పిచ్చో.. ఇది ఏదైనా కానీ.. నాకు మాత్రం ఇదే బాగుందనిపిస్తుంది.. మరి నీకు!?