Monday, June 27, 2011

కృష్ణా! నేను.. నీ రాధని!


కృష్ణా... ఓయ్.. కృష్ణా... నిన్నే పిలుస్తోంది.. ఇదిగో ఇక్కడ.. ఓసారి ఇటు చూడు.. నేను.. నీ రాధని పిలుస్తున్నా!
నువ్వెక్కడున్నా నా పిలుపు నిను చేరుతుందని నాకు తెలుసులే గానీ కాస్త నే చెప్పేది ఆలకించు. ఎన్నాళ్ళయింది కృష్ణా.. నువ్వు నా కళ్ళకి కనిపించి.. ఇన్నాళ్ళ నీ ఎడబాటుని తాళలేక నా తనువూ, మనసూ, ప్రాణం విలవిలలాడుతుంటే క్షణమొక యుగంలా భారంగా తోస్తోంది. అదేం చిత్రమో అంతు పట్టదు.. నీ రాక కోసం ఎన్నెన్ని అహోరాత్రాలు వేచి చూస్తున్నా ఇష్టమే తప్ప కష్టం తెలీడం లేదు.. నువ్వేం మాయ చేసావో కృష్ణా!

మరేమో.. నేను నీ మీద అలకబూని బోల్డు కోపం చూపిద్దాం అనుకుంటానా.. నువ్వేమో నేను కనీ కనిపించగానే ఒక్క చిన్న దొంగచూపుతో మంత్రం వేసేసి నా కోపమంతా ఆవిరి చేసేస్తావు. నీ చురుకైన కళ్ళని సన్నగా కదిలిస్తూ అల్లరిగా నవ్వుతావే.. ఒక్క మాయ నవ్వుకి నేను మంత్రముగ్ధనైపోయి నీ కన్నుల్లో విరిసే నవ్వుల వెలుగులు నా కళ్ళల్లో నింపుకుంటూ అలా శిలా ప్రతిమలా నిలుచుండిపోతాను కృష్ణా!

నువ్వు నాకు చేరువయ్యే కొద్దీ చుట్టూ వీస్తున్న గాలి సైతం ఊపిరి తీసుకోవడం ఆపేసినట్టు స్తంభించిపోతుంది.. వేగిరపాటుతో ఒక్క ఉదుటున నా గుండె వడి వేగం ఎగసి అదుపు తప్పి నా మనసునీ, వయసునీ పరుగులు తీయిస్తుంది.. నీ సాన్నిధ్యంలో నాకెందుకింత పరవశమో.. నీ ఊహల తాకిడికే ఎందుకిలా మంచుబొమ్మలా కరిగిపోతానో.. అలవి గాని మోహం అంతా నీ మాయే కదూ కృష్ణా!

నీ చేతుల్లో ముచ్చటగా ఒదిగిపోయి, వెచ్చని నీ ఊపిరిని గుండె నిండా నింపుకుంటూ, నీ పెదవులపై సుతారంగా నాట్యం చేస్తూ, మృదుమధురంగా పలికే మోహన మురళిది ఎంతటి ధన్యత్వమో కదా! నీకూ నాకూ మధ్యన వలపుల వంతెన వేసే మధుమోహన మురళీగానాన్ని ఆస్వాదించే అదృష్టం కలిగినందుకు నాదీ కొండంత భాగ్యమే కదూ కృష్ణా!

యమున ఒడ్డున మధురానగరి తీరాన పుచ్చపువ్వులా పరచుకున్న పసిడి వెన్నెల కిరణాల్లో పుత్తడి కాంతులతో మెరిసిపోతున్న మెత్తటి ఇసుకలో నీ ఒడిలో వాలిపోయి చుక్కల్ని లెక్కపెడుతూ.. మధ్య మధ్యన నీ అల్లరి మాయలో పడిపోయి నేను అదుపు తప్పుతూ.. అంతలోనే నా చుక్కల లెక్క కూడా తప్పిపోతూ.. మళ్ళీ మళ్ళీ చుక్కల లెక్కలు మొదలెడుతూ.. ఆహా.. అదెంతటి మధురానుభూతి కదూ కృష్ణా!

నీ భుజం మీదకి తల వాలుస్తూ, నీ అరచేతిలో నా చేతి వేళ్ళని ముడి వేస్తూ, మెలమెల్లగా నీ అడుగుల్లో అడుగులేస్తూ.. అలా అలా ఆకాశం అంచుల దాకా, మబ్బుల ముంగిటి దాకా విహారానికి వెళ్ళి, దోవలో నా చేతికందిన కొన్ని నక్షత్రాలని తెంపుకొని గుప్పిట నిండా తెచ్చుకుంటానా.. తారలన్నీ నువ్వు లేనప్పుడు నీ గురించిన చిలిపి తలపుల్ని నా ముందు వల్లిస్తూ నన్ను మరింత మురిపిస్తుంటాయి తెలుసా కృష్ణా!

ఒక్కో క్షణంలో నేను ముద్దు చేస్తుంటే గారాలు పోతూ నా కంటికి నువ్వొక బుజ్జాయిలా, చిన్నారి కృష్ణుడిలా కనిపిస్తావ్.. మరో క్షణంలో నీ చిలిపి మాటలతో, కొంటె చేష్టలతో నన్ను కొల్లగొట్టేస్తూ తుంటరిలా అనిపిస్తావ్.. ఇలాక్కాదని అసలు నిన్ను కదలనివ్వకుండా పట్టి బంధించుదామన్న తలంపు రాగానే.. కృష్ణుడు నీ ఒక్కదాని సొత్తే అనుకుంటున్నావా.. అని నువ్వు నవ్వుతున్నట్టు ఉంటుంది. అంతలోనే చల్లని నీ చిరునవ్వుతో నాలో ఉన్న భ్రమని చెరిపేస్తావు.. జగమంతా నీలోనే నిక్షిప్తమైనట్టు కనిపిస్తుంది.. ఇంతటి కృష్ణుడినా నేను నా రెండు చేతుల్లో బంధించాలనుకున్నాను.. అని నా అమాయకత్వానికి నాకే నవ్వొస్తుంది కృష్ణా!

ఎర్రని పారాణి అద్దిన పచ్చని నా పాదాల పైన కొలువు దీరి ఘల్లు ఘల్లుమని ముద్దుగా మోగుతూ ఉండాల్సిన నా కాలి మువ్వలు మూగబోయాయి కృష్ణా! కృష్ణుడే వచ్చి తమ హృదయవీణని మీటితేనే గానీ తమ ఎదలోంచి స్వరాలు పలకవు అంటున్నాయి..
నువ్వు తగిలీ తగలగానే గమ్మత్తైన సవ్వడి చేస్తూ గలగలా నవ్వే నా చేతి గాజులు గాజుబొమ్మల్లా కదలక మెదలక ఉండిపోయాయి కృష్ణా! కృష్ణుడే వచ్చి తమని సుతారంగా తాకితే తప్ప తమలో జీవం లేదంటున్నాయి..
ఎల్లప్పుడూ నా చెవి పక్కనే చేరి హాయిగా ఉయ్యాల జంపాల ఊగుతూ హిందోళం పాడుతూ నీ ఊసులు నా చెవిన వేస్తూ ముచ్చట గొలిపే నా చెంప సరాలు నీ ఉసురు సోకితేనే గానీ పెదవి విప్పమంటూ జంటగా మారాం చేస్తున్నాయి కృష్ణా!
కన్నులు నావే అయినా అవి నిత్యం నీ కలలతోనే పొద్దు పుచ్చుతూ నా మీద కినుక వహించి నా మాట వినడమే మానేసాయి కృష్ణా!

ఏమైనా నువ్వు పెద్ద దొంగవిరా కృష్ణా.. ఇదంతా నా అమాయకత్వం గానీ, నీకు తెలియనిదంటూ ఏదైనా ఉంటుందా అసలు.. నువ్వొక పెద్ద మాయలమారివి కృష్ణా.. ఎందుకలా సమ్మోహనంగా నవ్వుతావు.. నా మనసు చేజారిపోయేలా చేస్తావు.. నన్ను మెరిపించి మురిపించి మైమరిపించి మరులుగొల్పే మాయావివి కదూ కృష్ణా నువ్వు!

నా గుండెల్లో ఉవ్వెత్తున ఎగిసిపడే స్వరాల్లో దాగున్న మాధుర్యానివి నువ్వే కృష్ణా! నువ్వెక్కడో ఉన్నావన్నది కేవలం నా భ్రమ.. నువ్వెప్పుడూ నాతోనే నాలోనే ఉన్నావనిపిస్తావు.. నీ సమక్షంలో నాకు నువ్వు తప్ప ఇంక వేరే ప్రపంచమే లేదనిపిస్తుంది.. జగమంతా నీలోనే దాగుందనిపిస్తుంది.. నీలో లేనిది ప్రపంచంలో ఇంకేం ఉందనిపిస్తుంది.. నీ సాంగత్యంలో కాలం ఆగిపోతుంది.. నేను నిలువెల్లా నీలో కరిగిపోయి కలిసిపోతాను కృష్ణా!

ఎందుకని కృష్ణా.. ఇదంతా కేవలం మాయని తెలిసినా భ్రాంతిని చేధించలేనంత పరవశం... అసలిదంతా ప్రేమో, ఆరాధనో, మోహమో, మైకమో, మత్తో, విరహమో, వివశత్వమో, ఏదో తెలియని మైమరపంతా.. అచ్చంగా నీ మాయే కదా కృష్ణా!

కృష్ణా.. జగమంతా నీ సాక్షాత్కారం కోసం నిరంతరం తపస్సు చేస్తూ ఉంటుంది కదూ! నేనూ నీ ప్రేమలో కరిగిపోవాలనీ, నీలో కలిసిపోవాలని.. నీ సమక్షంలో గడిపే ఒక్క ఘడియ కోసం ఎన్ని యుగాలైనా నిరీక్షిస్తాను.. నా కోసం వస్తావు కదూ.. ఒక్క ఘడియనీ నా కోసం ఇస్తావు కదూ కృష్ణా!

31 comments:

మంచు said...

* MARVELOUS *

ఇంతకన్నా చెప్పడానికి నాకు తెల్సిన పదాలు సరిపోవడం లేదు. ఆ కృష్ణుడి అదృష్టం అనుకోవాలి అంతే... :-)))

మంచు said...

ఇప్పటికి రెండు సార్లు చదివా :-)

గిరీష్ said...

Awesome!
ఇంతకంటే ఎక్కువ ఇంకెక్కడ ఉండదు..
picture భళేగుంది.

రవికిరణ్ పంచాగ్నుల said...

చిత్రం, వ్యాఖ్య రెండూ సరిగ్గా కుదిరాయి.

భొమ్మని చూస్తూ టపా వ్రాసారా? టపా వ్రాసిన తర్వాత బొమ్మని పెట్టారా?

ఏది ఏమైనా.. simply superb

శివరంజని said...

నాకు చాలా చాలా ఇష్టమైన కృష్ణుడి గురించి ఇష్టమైన చాలా చాలా మధుర ఎంత బాగా రాసింది నాకు soooooooooooooooooooooper...............

Prasad Gutti said...

Hi Madhura,

nee post chadivanu. chala chaala chaala bagundi. entha bagundi ante - Mira Bai kuda intha premaga Krishnunni aaradhinchi undademo anipinchindi. antha mugdha manoharam ga entho chakkani haava bhaavalatho ee lekha raasavu.

Hats off to you.

okavela kaavyala poti undi, nenu aa poti ki judge ga velte .. nenu maathram deeniki 200/100 vesesta ... haha antha nachindi naaku.

--
Prasad :)

Unknown said...

రాధ మీలో పరకాయ ప్రవేశం చేసిందా అనిపించింది. కృష్ణుడి పై రాధకున్న ప్రేమని మాటల్లో ఆ కృష్ణుడి మనసు మురళిని నేరుగా చేరేలా రాశారు. మది పులకించింది.
Simply Superb!

ఇందు said...

మధురా ఏం చెప్పాలో తెలీట్లేదు...నాకు ఎంతగా నచ్చేసిందో! కృష్ణుడు ఎన్నిసార్లు ఇది చదువుకుని మురిసిపోయి ఉంటాడో అంత బాగుంది!! రాధ తన మనసులోకి దూరేసి ఇలా టపాలాగా తన సంగతులన్ని చెప్పేసిన నిన్ను చూసి ఆస్చర్యపడుతుందేమో! నాకు కృష్ణుడంటే చాలాచాలా ఇష్టం! నా కృష్ణుడి గురించి ఇంత అందంగా రాసిన నీకు....బోలెడు ధన్యవాదాలు!!

Rao S Lakkaraju said...

సన్న జాజులు తెచ్చి
సంపెంగ పువ్వెట్టి

కృష్ణా! హారమల్లె చేసి
వేచివున్నాను

అంత బాగుంది మీ టపా.

జైభారత్ said...

అమ్మో అమ్మో అమ్మో...మరీ ఇలా రాసేస్తే ఎలాగండి అసలు...రచనా యుద్దరంగంలో..మీ కత్తికి ఎదురు ఎవరు ఉండకూడదనేనా లేక కృష్ణుడు ఇంకెవరి వంక చూడ కూడదనా?

రాజ్ కుమార్ said...

ఎక్సెలెంట్ పోస్ట్ అండీ...ఆ బొమ్మకీ, మీ పోస్ట్ కీ అలా కుదిరిపోయిందీ అంతే...సూపరు..

SHANKAR.S said...

"మదుర" లో ప్రతి రాధ "వాణీ" ఇదేనేమో! చక్కగా ఉంది

నేస్తం said...

మధు పూర్వ జన్మలో నువ్వు రాధవి కాదు కదా?:)అచ్చంగా రాధ మాట్లాడినట్లే ఉంది
చాలాబాగా రాసావ్

ఏకాంతపు దిలీప్ said...

నేను నీ ప్రత్యక్షంలో లేనప్పుడు
నేలేనని నువ్వు చేసే అల్లరి ఆనోటా ఈనోటా పడి
అందరి చూపుల్లో నా పట్ల అనుమానంగా నన్ను చేరుతుంది
అందరికన్నా నిన్ను ఎక్కువగా చూస్తున్నానేమొ అని నన్ను వివక్షకి గురి చేస్తున్నారు
ఏమని చెప్పను?
వారి అనుమానాన్ని ఎంత మాత్రమూ ఖండించలేనే?
ఖండించాలనే ప్రయత్నంలో నేను ఎంతటి బలహీనుడను!
నీ ప్రేమ బంధనంలో ఈ కృష్ణుడు ఎంత వరకు నీకు దూరం కాగలడు?
నా చిరునవ్వు మాత్రానికే, నా కనుచూపు భాగ్యానికే వారంతా తన్మయత్వంలో నన్ను వెలివేస్తుంటే!
నువ్వు కాదా?
నన్ను చేరదీసి నీ పాలనలో ముగ్ధుడని చేసి బంధించింది..
నీ ప్రేమ కాదా?
నా చిరునవ్వుని, నా ప్రత్యక్షాన్ని తేలిక చేసింది...
నీ పట్ల నా ఆరాధనకి ఆద్యంతం తెలియకుండా చేస్తుంది..

నా ఉనికి ఎటు విస్తరించినా, నీ ప్రేమలోనే కదా నేను సేద తీరేది?

రాధా! నేను నీకు మాత్రమే దాసుడనని లోకం గుర్తించ జాలదే!

ఆ.సౌమ్య said...

మధురా....చాలా బావుంది....ప్రేమ అంతా ఒలకబోసావు.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் said...

చదువుతుంటే మదిని అదెడో వేరే ప్రపంచానికి తీసుకెళ్ళిపోయింది మీ టపా. ఇంత హృదయంగా ఎలా రాయగలుగుతున్నారో. నవయుగ మీరాలా కనబడుతున్నారు!

కొత్తావకాయ said...

:)

kiran said...

మధుర - ఇదేమన్న న్యాయమా...?మీరేమో ఇలా రాసేస్తే..ఇక కృష్ణుడు మాకేం పలుకుతాడు...???
అసలు sooooperb !!..

మాలా కుమార్ said...

చాలా బాగా రాశావు . బొమ్మ కూడా బాగుంది .

అనుదీప్ said...

ఓహొ... మీరు ఇలా రాస్తే ఎలా? నేను ఒప్పుకోను... తీవ్రంగా ఖండిస్తున్నాం.. మీతో పాటు వచ్చేస్తే ఎలా? ఇంత ప్రేమగా పిలిస్తె రాకుందా ఉంటాడా? అందులొను ఇంత పెధ్ధ టప రాసాక....

వేణూశ్రీకాంత్ said...

పదహారో సారి చదువుకున్నాను మధురా.. ఇప్పటికీ ఎలా స్పందించాలో తెలియడం లేదు.. ఏమని పొగిడినా తక్కువే అనిపిస్తుంది... ఇప్పుడుకూడా కేవలం నేనూ చదివానని నీకు తెలియడానికి హాజరు వేయించుకోడానికే ఏదో ఈ కామెంట్ రాస్తున్నాను తప్పితే ఆ తన్మయత్వంలో ఏం చెప్పాలో అర్ధంకావడం లేదు

మురళి said...

రాధకు నీవేర ప్రాణం.. ఈ రాధకు నీవేర ప్రాణం..
రాదా హృదయం మాధవ నిలయం.. ప్రేమకి నీరాజనం...
మధురవాణి గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు..

Anonymous said...

అత్యద్బుతం మధురక్కా.... Harsha Vardhan M

మధురవాణి said...

@ మంచు,
THANKS! ఆ అదృష్టం అంతా కృష్ణుడిది కాదండీ.. రాధది! :)

@ గిరీష్,
చాలా పెద్ద ప్రశంసే ఇచ్చారు. ధన్యవాదాలండీ! :)

@ రవి కిరణ్,
ధన్యవాదాలండీ! నేను ముందు రాసుకున్నదాని కోసం సరిపడే బొమ్మ కోసం చాలా వెతికానండీ! ఇదే ఎక్కువ నచ్చింది వేరే అన్నీటి కన్నా! ఈ బొమ్మలో ఉన్న రాధలోనే నేను చెప్పాలనుకున్న భావం కనిపించింది.. :)

@ శ్రియా,
ఓహ్.. నీకంత నచ్చేసిందా.. మరి కృష్ణుడి మాయ అంటే అంతే కదా! థాంక్యూ బుజ్జీ! :)

krishnakumari said...

okarikai vechi undatamloni prathi skhanam malasulo kalige bhavanni intha andanga padapuspalatho allina maalanu krishnudi medalo marintha andanga undi

మధురవాణి said...

@ Prasad Gutti,
హహ్హహ్హా.. మీరు మరీ చాలా పొగిడేస్తున్నారండీ.. నేను రాసింది మీకంతగా నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.. వందకి రెండొందల మార్కులు వేసినందుకు బోల్డు ధన్యవాదాలండీ! :)

@ చిన్ని ఆశ,
మీ వ్యాఖ్య చూసి నా మది పులకించింది సుమండీ.. బోల్డు ధన్యవాదాలు.. :)

@ ఇందు,
థాంక్యూ! చాలా చాలా సంతోషమేసింది ఇందూ నీ కామెంట్ చూసి.. నిజంగా కృష్ణుడు ఇది చూసి మురిసిపోతాడంటావా? నేనే రాధానని నమ్మేస్తాడంటావా? హహహ్హా.. అంతా బావుంది గానీ, నీ కృష్ణుడు అనడం అన్యాయం కదూ! ;)

@ Rao S Lakkaraju,
అబ్బ.. ఎంతందంగా చెప్పారండీ.. రాధ ఎదురుచూపుని! ధన్యవాదాలు.. :)

మధురవాణి said...

@ loknath kovuru,
హహ్హహా.. అదేం లేదండీ.. ఏమైనా, కృష్ణుడిని మనం మాయ చెయ్యగలమా చెప్పండి. కృష్ణుడే మనల్ని మాయ చేసేస్తాడు కదా! :)

@ రాజ్ కుమార్,
థాంక్యూ సో మచ్.. :)

@ శంకర్ గారూ,
హహ్హహ్హా.. భలే చెప్పారే! థాంక్యూ థాంక్యూ.. :)

@ నేస్తం,
పోయిన జన్మలోనే కాదు.. ఈ జన్మలో కూడా రాధనే! మీకేమన్నా సందేహమా? హీహీహీ.. థాంక్యూ! ;) :D

మధురవాణి said...

@ ఏకాంతపు దిలీప్,
అఆహా.. భలే వినిపించారండీ కృష్ణవాణి ని.. ఎంతైనా కవిత్వం, భావుకత్వం మీ సొత్తు కదా! చాలా బాగా రాసారు. థాంక్యూ! :)

@ సౌమ్యా,
హిహ్హిహ్హీ.. ఒలకబోసేసానా? :P థాంక్యూ! :)

@ అవినేని భాస్కర్,
అమ్మయ్యో.. మరీ చాలా పెద్ద ప్రశంసే ఇచ్చేసారు.. కృష్ణుడిని తల్చుకుంటే చాలు.. ఆ అనుభూతి అలా అక్షరాల్లోకి వచ్చేస్తుందండీ.. మీకంతగా నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యావాదాలు! :)

@ కొత్తావకాయ,
:)

@ మాలా కుమార్,
ధన్యవాదాలండీ! :)

మధురవాణి said...

@ కిరణ్,
హహ్హహా.. కిరణ్.. పోనీ, నువ్వూ పిలిచేయ్ కృష్ణుడిని.. పలికేస్తాడు.. థాంక్యూ సో మచ్ .. :))

@ అనుదీప్,
రానివ్వండి.. మరి కృష్ణుడు కదలి రావాలనే కదండీ రాధ ఇంత కష్టపడి రాసింది.. ;)

@ వేణూ శ్రీకాంత్,
మీ వ్యాఖ్య చూసి చాలా చాలా సంబరంగా అనిపించింది వేణూ! నేను కూడా బోల్డు సార్లు చూసుకున్నా మీ వ్యాఖ్యని. నా అక్షరాల్లోని అనుభూతిని మీరు చూడగలగడం చాలా ఆనందంగా అనిపించింది. థాంక్యూ సో మచ్! :)

@ మురళీ,
ధన్యవాదాలండీ.. పాటకీ, శుభాకాంక్షలకీ కూడా! :)

@ హర్షా,
థాంక్యూ సో మచ్! :)

SJ said...

nice ...

మధురవాణి said...

@ సాయి,
ధన్యవాదాలండీ!