Thursday, June 16, 2011

వేచి ఉన్నా!


నువ్వెళ్ళిన మరుక్షణం నుంచే నీ మీద బెంగతో మళ్ళీ నిన్ను చూసే మధుర క్షణాల కోసం వేచి ఉన్నా!
ఇహనో ఇప్పుడో నువ్వు రెక్కలు కట్టుకు వచ్చి నా ముందు వాలిపోతావన్న ఊహల్లోనే కాలం కరిగిపోతోంది..
మన పడగ్గది కిటికీ పక్కనున్న మరుమల్లె పందిరి పచ్చగా మారాకు వేసి చిరుమొగ్గ తొడుగుతోంది..
మన పక్కింటి చిన్నారి అమ్ములు అత్తాత్తా అని పిలుస్తూ బుడి బుడి నడకల్లోంచి పరుగందుకుంటోంది..
మనింటి చూరులో గూడు కట్టుకున్న గువ్వపిట్టల జంట ముచ్చటగా మూడు బుల్లి కూనల్ని పెట్టింది..
నే సాకుతున్న రామచిలుక తియ్యటి దోర జామపళ్ళు తినమరిగి కొంటె కోణంగిలా అల్లరి చేస్తోంది..
నే అంటు పెట్టిన సన్నజాజి తీగ అంతెత్తున ఎదిగి మన పందిరినంతా పెనవేసుకుపోయి పరిమళిస్తోంది..
ముంగిట్లో పెట్టిన ఇరవయ్యొక్క చుక్కల ముగ్గు రంగుల్లో మెరిసిపోతూ నీకు స్వాగతాలు పలుకుతోంది..
మన వాకిట్లో గుమ్మానికో పక్కన విరగబూసిన రాధామనోహరాల తీగ మురిపెంగా ఎదురు చూస్తోంది..
మరో పక్కన నీ ఊసులతో బరువెక్కిన మనసుతో నేను కనురెప్పైనా వేయకుండా నీ రాకకై నిరీక్షిస్తున్నా..

అప్పుడప్పుడే సాయంసంధ్యలో సూరీడు నిష్క్రమిస్తున్న వేళ ఆకాశంలో చిత్రవర్ణసమ్మేళనం వేడుకలా ఉంది..
నేను మల్లెమొగ్గలు చెంగున కోసుకొచ్చి మనింటి ఎదురు గడపలో కూర్చుని నీ ఊహలతో కలగలిపి మాలల్లుతున్నాను..
నీ తలపుల్లో పడి కొట్టుకుపోతూ తెలీకుండానే అలా కాస్త కన్నంటుకుంది.. ఎంత సమయం గడిచిందో తెలీలేదు..
నీ వెచ్చని ఊపిరి గిలిగింతగా నా చెక్కిలిని తాకిన స్పర్శకి దిగ్గున లేచి చూస్తే నా కళ్ళెదురుగా నవ్వుతున్న నువ్వు..
నీ కళ్ళలో ముచ్చటగా ఒదిగిపోయిన నా ప్రతిబింబం నవ్వుల వెలుగులు చిందిస్తూ అపురూపంగా కనిపిస్తోంది..
అంతలోనే నీ కొంటె చూపుల్లోంచి తొంగి చూస్తున్న చిలిపి ఊసుల ధాటికి నిలువలేక నా కనురెప్పలు వాలిపోయాయి..
నీ చేతుల్లో నేను, నా చేతుల్లో సగం అల్లిన మల్లెచెండు, ఒడి నిండుగా విచ్చుకుని గారాలు పోతున్న అరవిరిసిన మల్లెలు..
సొంపుగా మెరుస్తున్న చుక్కల అద్దకంతో నేసిన నల్లటి చీకటి పరదాలు కప్పుతూ వెన్నెల దీపం వెలిగించిన రాతిరి అచ్చంగా మన కోసమే అందమైన ఏకాంతాన్ని ఆవిష్కరిస్తోంది!


Image source

24 comments:

Arun Kumar said...

చాలా బాగా రాశారు మధురగారు,

ఏ లైన్స్ బాగున్నై

"
ఇహనో ఇప్పుడో నువ్వు రెక్కలు కట్టుకు వచ్చి నా ముందు వాలిపోతావన్న ఊహల్లోనే కాలం కరిగిపోతోంది.."

"నీ వెచ్చని ఊపిరి గిలిగింతగా నా చెక్కిలిని తాకిన స్పర్శకి దిగ్గున లేచి చూస్తే నా కళ్ళెదురుగా నవ్వుతున్న నువ్వు..
నీ కళ్ళలో ముచ్చటగా ఒదిగిపోయిన నా ప్రతిబింబం నవ్వుల వెలుగులు చిందిస్తూ అపురూపంగా కనిపిస్తోంది.."

శిశిర said...

Beautiful

ఇందు said...

వావ్! చాలాబాగుంది మధురా! ముఖ్యంగా కొన్ని పదాల వాడుక బాగుంది.....చిత్రవర్ణసమ్మేళనం,కన్నంటుకుంది...ఇలా..

కాని నాకు బాగా నచ్చినవి లాస్ట్ రెండు లైన్లు! ఎంతబాగున్నయో!

మందాకిని said...

తెలుగమ్మాయి!! ఎంత బాగుందీ బొమ్మ, అమ్మాయి రెండూను.
పొగడపూల పొదరిల్లో...................గుబులు గుబులుగా ఉంది. ఎన్ని కబురులంపేనో ఎన్ని కమ్మలంపేనో.....పాట గుర్తొచ్చింది. :)

pallavi said...

wowwww... so beautiful.. ye lines bagunnaayo cheppalenandi.. antha andamaina eduruchoopu!!!.. lov d painting!!

శ్రీలలిత said...

నిను కలసిన మధురిమలో మనసే మందిరమాయె...
విభుడవై... నా ప్రణయ విభుడవై నన్నేలగ చలమేలరా...?

రాజ్ కుమార్ said...

భలేరాసారండీ.. చాలా బాగుందీ..

బులుసు సుబ్రహ్మణ్యం said...

మీరు రాసినది బాగుంది. పెయింటింగ్ లో అమ్మాయి బాగుంది. ఏది ఎక్కువ బాగుందా అని ఆలోచిస్తున్నాను.

లత said...

చాలా చాలా బావుంది

bujjidi said...

aa photo choodatame saripoyindi .. kridna unna padaala midaki vellane ledu kallu ..
beautiful :)

Anand said...

simply superb ! madhuravaani gaaru.

హరే కృష్ణ said...

చివరి లైన్స్ చాలా బావున్నాయ్ టైటిల్ తర్వాత :)

>>మీరు రాసినది బాగుంది. పెయింటింగ్ లో అమ్మాయి బాగుంది. ఏది ఎక్కువ బాగుందా అని ఆలోచిస్తున్నాను
గురూజీ.. నిత్య మీద ఒట్టేసి చెప్పండి ఏది బావుందో ?

Jaabili said...

Adhbutam Madhura.. Akkadiki tisukellipoyyaru kada.

వేణూ శ్రీకాంత్ said...

Short and sweet :-)
చాలా బాగుంది మధురా.. బాగా రాశారు..

Avineni Bhaskar / అవినేని భాస్కర్ said...

అద్భుతం! వేచియుండటంలో యెంత మధురత్వముందో అనిపించింది? అప్పుడేగా ఇలాంటి కవితలు విరిసేది?
:-)

కృష్ణప్రియ said...

మధురవాణి గారు,

మీరు రాసే ఇలాంటి టపాలు చూసినప్పుడు నాకు ఒక్కోసారి అనిపిస్తుంది.. ఎంత అందం గా,సింపుల్ గా రాయచ్చా? అని. చాలా చక్కగా రాసారు.

గిరీష్ said...

Beautiful..

కొత్తావకాయ said...

తెలుగుదనం విరబూసినంత అందంగా ఉంది. అభినందనలు.

shanti said...

Just as once imagination is stirs by the girl's smile,the
same possibilities always possible with u r blogging skills...

sriharsha said...

Nice one..

Anonymous said...

Excellent...you are a wonderful writer.....asalu I donno what to say!

మనసు పలికే said...

మాటల్లేవ్ మధురా.. అంత బాగా ఎక్స్ప్రెస్ చేసావు ప్రేమ గురించి.. అద్భుతం అంతే..:))) ఇది బాగుంది అది బాగుంది అని చెప్పాలంటే టపా అంతా కాపీ పేస్ట్ చెయ్యాల్సి వస్తుంది..

kiran said...

chal chala bagundi madhura.. :)

మధురవాణి said...

@ అరుణ్, శిశిర, ఇందూ, మందాకినీ, పల్లవి, శ్రీలలిత, రాజ్, బులుసు గారూ, లత, ఆనంద్, హరే కృష్ణ, వేణూ, భాస్కర్, కృష్ణప్రియ, గిరీష్, కొత్తావకాయ, శాంతి, శ్రీహర్ష, అనానిమస్, అప్పూ, కిరణ్..
నేను రాసింది మీ అందరికీ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. స్పందించిన మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు! :)