Friday, June 14, 2013

కలవేనా!




మనసు తీరంలో తుంటరి చేపపిల్లల్లా ఎగిరెగిరి పడుతున్న తలపుల్లోంచి జారి తలగడ మీదకి చేరావు..
గాలి చప్పుళ్ళకి ఊయలూగుతున్న మేపిల్ ఆకుల గుసగుసలతో కలిసి చెవిలో చేరి నువ్వేదో చెబుతుంటే ఊ కొడుతున్నాను..
కిటికీ సందుల్లోంచి దొంగతనంగా చొరబడుతున్న వెన్నెల తుంపరలు నీ చేతి స్పర్శలో కలిసి గారాబంగా జోకొడుతుంటే సోలిపోతున్నాను..
కనులారా నీ మోము చూడాలని ఎంతగా అనుకున్నా నిదురలో జోగుతున్న కనురెప్పల తలుపులు తెరుచుకోనంటున్నాయి..
రజాయి వెచ్చదనంలో మరింతగా కూరుకుపోతూ నీకోసం సాచిన చేతిని ఖాళీ వెక్కిరించేసరికి కలవరపడి కలలోంచి జారి నిజంలోకొచ్చిపడ్డాను..
తెలి మంచు రాతిరి కౌగిలో తొలి సంధ్య పొద్దు గిలిగింతో తేల్చుకోలేని అయోమయంలో నీ జాడ లేని గదంతా ఘనీభవించిన ఏకాంతం వింతగా తోచింది..
కలలో విచ్చుకున్న కలువ నవ్వు వియోగపు వెలుతురు సోకి పెదవంచు నుంచి ఒలికి నిశబ్దంగా నేలజారింది!