Monday, July 27, 2009

పరిమళాలు వెదజల్లే 'పారిజాతం' కథ.!

పూర్వం మరాఠా దేశాన్ని పరిపాలించే ఒక మహారాజు ఉండేవాడు. సంతానం లేని కారణంగా ఆ మహారాజు దంపతులు ఎంతో దిగులు చెందుతూండేవారు. ఆయన భార్యా సమేతంగా ఎన్నెన్నో పూజలు, వ్రతాలు, హోమాలు జరిపిస్తూ ఎన్నో సంవత్సరాలు వేచిచూసిన తరవాత ఒకానొక శుభసమయాన బంగారుబొమ్మ లాంటి కుమార్తె జన్మించింది. ఆ శిశువు జన్మించగానే ఆమె ముఖంలో కనిపించిన అద్వితీయమైన తేజస్సును చూసి రాజుగారి ఆస్థాన పండితులు ఆ పాపకు 'పారిజాతమణి ' అని నామకరణం చేశారు. తమకి లేకలేక కలిగిన పారిజాతమణిని మహారాజు దంపతులు పుట్టినప్పటి నుంచీ సకల సౌకర్యాలు కలిగిన ఒక పెద్ద మహలులో ఎండ కన్నెరగకుండా, ఎంతో అల్లారు ముద్దుగా పెంచారు. అసామాన్యమైన రూపలావణ్యాలతో మణి వలె ప్రకాశించే తమ గారాలపట్టిని చూస్తే ఏ దేవకన్యో తమ ఇంట పుట్టిపెరుగుతోందనిపించేది ఆ దంపతులకి. మరాఠా మహారాజు ఆస్థాన పండితులు, విద్వాంసులు అందరూ కూడా బాల్యం నుంచే పారిజాతమణికి విద్యాబుద్దులూ, సంగీత నాట్యాలు సమస్తం ఆ మహలుకెళ్ళి నేర్పించేవారు. ఆ విధంగా అన్ని విద్యలలోనూ ఆరితేరిన పారిజాతమణి యుక్తవయసు వచ్చేనాటికి తన సమాన సౌందర్యానికి ధీటుగా విద్యాబుద్దుల్లోనూ, గుణగణాల్లోనూ సాటి లేని మేటి అనిపించుకుంది. పారిజాతమణి అద్భుత సౌందర్యం గూర్చి, అనన్య ప్రతిభా పాటవాల గూర్చి చుట్టుపక్కల దేశాల్లోని రాజులందరూ ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. అంతటి అసమాన సౌందర్యవతి, గుణవతి అయిన పారిజాతమణి తమ దేశపు రాకుమారిగా పుట్టడం ముక్కోటి దేవతల అనుగ్రహమేనని ఆ దేశపు ప్రజలందరూ కూడా ఎంతో గర్వించేవారు.

ఆ విధంగా ఎండ కన్నెరుగకుండా అత్యంత సున్నితంగా, సుకుమారంగా పెరిగిన పారిజాతమణి పదహారో ఏట అడుగిడినాక ఒకానొక రోజున ప్రాతఃకాలాన్నే నిదురలేచి తన చెలికత్తెలెవరికీ తెలియకుండా, సఖులెవరి తోడూ లేకుండా ఒంటరిగా తను ఉండే ఆ మహలు వెనుకవైపునున్న ఉద్యానవనంలోకి నడిచింది. మహలులోంచి బయటకు రాగానే పారిజాతమణి కళ్ళబడిన మొట్టమొదటి దృశ్యం ఏమంటే.. నిశ్శబ్ద నిశీధిలో ముసురుకున్న చిమ్మచీకటి తెరలను తన ప్రభాత అరుణ కిరణాలతో చీల్చుకుంటూ, దేదీప్యమానంగా ప్రకాశిస్తూ, శ్వేతాశ్వాహనరూఢుడై తన బంగారు రధంపై పయనిస్తూ ఈ ప్రపంచానికి తన ఉషస్సుతో కొత్త అందాన్ని అద్దుతూ కనిపించిన సూర్యభగవానుడు.. తూర్పు దిక్కున ఉదయిస్తున్న భానుడిని చూసీ చూడగానే పారిజాతమణి తనువు, మనసు కూడా ఒక అవ్యక్తానుభూతికి లోనయింది. ఆ విధంగా తొలిచూపులోనే పారిజాతమణి సూర్యభగవానుణ్ణి వరించింది. ఆ రోజు మొదలు ప్రతీ రోజూ పారిజాతమణి తూర్పు నుండి పడమరకు సాగిపోయే సూర్యుడిని చూస్తూనే గడిపేది. సూర్యాస్తమయ సమయం ఆసన్నమయిందంటే చాలు, భాస్కరుని దివ్యముఖారవిందము కనుమరుగైపోతుందనీ, మరలా వేకువజాము వరకూ సూర్యదర్శన భాగ్యం ఉండదనీ ఆమె మనసు విలవిలలాడిపోయేది. అంతగా మనసా వాచా కర్మణా నిరంతరం సూర్యుణ్ణే స్మరిస్తూ ఆ భానుడి రూపాన్నే తన మనోఫలకంపై చిత్రించుకుంది పారిజాతమణి.

అలా పారిజాతమణికి ఎన్నో దినాలు భానుని నిరీక్షణలో గడిచాయి. కొంతకాలానికి తనని అత్యంత భక్తి శ్రద్ధలతో, నిష్టగా, క్రమం తప్పక ధ్యానిస్తున్న అపురూప సౌందర్య రాశి అయిన పారిజాతమణి పట్ల సూర్యుడు కూడా ఆకర్షితుడైనాడు. ఆనక వారిరువురి మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరిసి సూర్యపారిజాతాలిరువురూ ప్రణయ సాగరంలో ఓలలాడసాగారు. వారిరువురి ప్రణయానుబంధం కొద్దికాలమైనా సాగకముందే వీరి ప్రేమవార్త స్వర్గలోకం వరకూ పాకింది. దేవతాపురుషుడైన సూర్యుడు కేవలం ఒక మానవ కన్య అయిన పారిజాతమణి ప్రేమలో మునిగితేలడం దేవతల రాజైన దేవేంద్రుడికి కోపహేతువైనది. తక్షణమే భాస్కరుని తన కొలువుకి పిలిపించమని దేవలోక భటులను ఆదేశించాడు. దేవతలందరి సమక్షంలో సూర్యుణ్ణి న్యాయవిచారణ చేసి తను చేసే పని తగదనీ, ఇకపై పారిజాతమణి ప్రేమను వదులుకోకపోతే తన దైవత్వం పోగలదనీ హెచ్చరించారు. ఆనాటి తరువాత సూర్యుడు పారిజాతమణి వైపు మరి కన్నెత్తి చూడలేదు. సూర్యుని రాక కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్న పారిజాతమణికి నిరాశే ఎదురయింది. తాను ప్రాణప్రదంగా ప్రేమించిన సూర్యుని నిరాదరణను, నిర్లక్ష్యాన్ని భరించలేని ఆమె మరుక్షణంలోనే సూర్యుని ఎదుటనే అగ్నికి ఆహుతై ప్రాణత్యాగం చేసింది.

పారిజాతమణి ఆహుతైపోయిన తరవాత మిగిలిన ఆమె చితాభస్మంలో నుంచి ఒక మొక్క పుట్టింది. ఆ మొక్కే పెరిగి 'పారిజాత' వృక్షమయింది. పారిజాతమణి అతివగా ఉన్నప్పటి ఆమె అద్వితీయ సౌందర్యమంతా గుభాళించే పరిమళంగా మారి ఆ చెట్టు పువ్వుల్లో ఒదిగిపోయింది. పారిజాత సుమాలు తనని, తన ప్రేమని నిర్లక్ష్యం చేసిన సూర్యకిరణాల్ని తాళలేవు. అందుకే సూర్యాస్తమయం అయ్యాక మాత్రమే పుష్పించే ఈ చెట్టు తొలివేకువనే సూర్యోదయం అయ్యీ అవకముందే సువాసనలు వెదజల్లే తన పువ్వులన్నీటినీ అశ్రువుల్లాగా రాల్చేస్తుంది. పగలంతా మౌనంగా శోకదేవతలా కనిపించే పారిజాత వృక్షాన్ని శోకవృక్షం (sad tree) అని కూడా పిలుస్తారు. పారిజాతంలోని నిష్కల్మషమైన ప్రేమనీ, సున్నితమైన మనసునీ, సుకుమార రూపాన్ని చూసి ముగ్ధుడైన శ్రీ మహావిష్ణువు ఏ పుష్పాలకీ లేని సమున్నతమైన గౌరవాన్ని పారిజాతానికి ప్రసాదించాడు. కేవలం పారిజాత పుష్పాలను మాత్రమే నేలరాలిన సుమాలను సైతం స్వామి అలంకరణకి వినియోగించవచ్చు. అంతే కాదు.. శ్రీ మహా విష్ణువుకి ప్రత్యేకంగా చేసే ధనుర్మాస పూజలు పారిజాతం లేకుండా జరగవంటే అతిశయోక్తి కాదు. అలాగే పారిజాతం తనని ప్రార్ధించినవారి పాలిట కల్పవృక్షమై ఇష్టకామ్యాదిసిద్ధులూ నెరవేర్చడమే కాకుండా తనలో ఉన్న ఔషధగుణాలతో మానవ జాతికి ఆయురారోగ్యాలనీ ప్రసాదించగలదు. ఆ విధంగా అప్పటి నుంచీ ఇప్పటి వరకూ కూడా పారిజాతం ప్రతీ ఉదయం సూర్యుని పట్ల తనకున్న ప్రేమను అశ్రుధారల్లా పుష్పరూపంలో వర్షించి దైవం పాదాలను అభిషేకిస్తోంది.


** పారిజాత వృక్షం గురించి ఎప్పటినుంచో ఒక కథ ప్రచారంలో ఉంది. సూర్యుణ్ణి వరించిన ఒక రాకుమారి ఆత్మాహుతి చేసుకోగా వచ్చిన భస్మంలో నుంచి ఈ చెట్టు పుట్టిందని. దాన్ని ఆధారంగా చేసుకుని, నా ఊహను కాస్త జోడించి ఒక కథలాగా వ్రాసే ప్రయత్నం చేసాను. మీ అభిప్రాయాలు తెలియచేయవలసిందిగా మనవి.


** పారిజాతాన్ని గురించిన విషయాలు నాతో చర్చించి, ఈ కథని ఇలా వ్రాయాలనే ఆలోచనకి కారణభూతులయిన మురళి గారికి ధన్యవాదాలు తెలుపుతూ.. తన 'నెమలికన్ను' తో మనందరికీ పారిజాత పరిమళం లాంటి చక్కటి, చిక్కటి అనుభూతిని అందిస్తున్న మురళి గారికి ఒక చిన్న బహుమతిగా ఈ కథని అందిస్తున్నాను.

-- మధురవాణి

Friday, July 24, 2009

నిదరే కల ఐనది.. కలయే నిజమైనది.. బతుకే జత ఐనది.. జతయే అతనన్నది..!!

చాలా చాలా రోజుల తరవాత ఇవాళ నేనొక పాట గురించి రాస్తున్నా నా బ్లాగులో. అసలు పాటల గురించి చెప్పమని నన్నెవరైనా అడగాలే గానీ, ఇహ తరవాత నే చెప్పేది వినలేక 'ఎందుకు కదిలిచ్చాంరా బాబూ' అనుకోవాల్సివచ్చేలాగా చెప్పుకుంటూ పోతూనే ఉంటాను. ఎందుకంటే పాటలంటే నాకంత ప్రేమ మరి.! నన్ను మురిపించి మైమరిపించే పాటలు ఒకటా రెండా..బోలెడున్నాయి మరి.. అంచేత చెప్పుకుంటూ వెళ్తే చాంతాడంతో.. చైనా వాల్ అంతో అవుతుంది పాటల లిస్టు. అసలు మీకో సంగతి తెల్సా.? బ్లాగు మొదలుపెట్టినప్పటి నా ఆలోచన నాకిష్టమైన పాటల గురించిన అనుభూతులు పంచుకుందామనే.. ఒకవేళ నాలా స్పందించే వాళ్ళుంటే.. అది మరింత సంతోషం కదా..! అలా అనుకుని మొదలెట్టాక మొదట్లో చాలా పాటల గురించి రాశాను. తరవాత నా బుర్రలో పురుగు తిరిగినప్పుడల్లాఏదో ఒకటి రాస్తూ, మీ బుర్రలు తింటూ.. క్రమంగా నా బ్లాగు కాస్తా ఒక కలగూరగంపలా తయారయింది :) సరే.. ఇక సుత్తి ఆపి అసలు సంగతి.. అదే పాట గురించి చెప్పమ్మా.. అనుకుంటున్నారా.? వస్తున్నా.. అక్కడికే వస్తున్నా.. వచ్చేశా :)

మధ్య (అంటే చాలా రోజుఅల క్రితం అని).. తమిళ్ హీరో సూర్య తండ్రి - కొడుకు పాత్రల్లో నటించిన 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' అనే సినిమా ఒకటి వచ్చింది. మీరు చూసారా.? చాలా మందికి సినిమా పెద్దగా నచ్చలేదు (నాకు తెలిసిన వాళ్ళకి). నాకు మాత్రం తెగ నచ్చేసింది సినిమా. వరుసగా రెండ్రోజుల్లో రెండు సార్లు చూసాను :) కాకపోతే, నేను ఇంట్లో డీవీడీ చూసాను కానీ, అదే సినిమా హాల్లో అయితే కొంత బోర్ కొట్టే అవకాశం ఉంది.. సినిమా నిడివి దాదాపు మూడుగంటలు అవడం చేత. స్థూలంగా సినిమా కథ చెప్పాలంటే.. తండ్రి చనిపోయిన వేళ ఒక కొడుకు తండ్రి తననెలా అడుగడుగునా తోడుగా ఉండి నడిపించాడు అనేది తనకు తాను గుర్తుకు తెచ్చుకుంటూ కథంతా మనకి చెప్తున్నట్టుగా ఉంటుంది. సినిమా తీయాలనుకునే సమయంలో వాళ్ల నాన్నగారు చనిపోవడం వల్ల దర్శకుడు బాగా కలత చెందారట. తరవాత 'నాన్నతో ఒక కొడుకుకున్న అనుబంధం' అనే అంశాన్నే తీసుకుని సినిమాని తీసారు దర్శకుడు గౌతం వాసుదేవ్ మీనన్. ఈయన గతంలో సూర్య హీరోగా వచ్చిన 'కాక్కా కాక్కా' (తెలుగులో వెంకీ 'ఘర్షణ గా వచ్చింది), మాధవన్ 'చెలి', కమలహాసన్ నటించిన 'రాఘవన్ అనే సినిమాలకి దర్శకత్వం వహించారు. ఇవన్నీ తమిళ సినిమాలే అయినా కూడా తెలుగు అనువాదాలు కూడా విజయవంతమయ్యాయి. సినిమాలన్నీ కూడా సంగీతపరంగా బాగా ఆకట్టుకున్నాయి. సంగీతదర్శకుడు హారిస్ జయరాజ్, గౌతం మీనన్ కలయికలో వచ్చిన పాటలన్నీ కూడా చాలావరకు బావుండేవే. కానీ, సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా సమయంలో వారిరువురికీ ఏవో అభిప్రాయబేధాలు రావడం వల్ల సమీప భవిష్యత్తులో మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి పని చేసే అవకాశం లేదట.

సరే.. మళ్ళీ సినిమా విషయానికొస్తే కథానాయకుడు తొలిచూపులోనే ఒక అమ్మాయిని ప్రేమించి చాలా కష్టపడి అమ్మాయి ప్రేమని పొందుతాడు. దురదృష్టవశాత్తూ అమ్మాయి చనిపోవడం.. మన కథానాయకుడు విపరీతమైన డిప్రెషన్లోకి వెళ్ళడం జరుగుతుంది. హీరో ఇంటిపక్కనే ఉండే హీరో చెల్లెలి ప్రాణ స్నేహితురాలు స్కూల్ రోజుల్నించే హీరోని ప్రేమిస్తూ ఉంటుంది. అమ్మాయి మీద తనకున్న ఇష్టాన్ని హీరో తనకుతాను తెలుసుకుని అమ్మాయిని స్వీకరించే సమయంలో ఒక పాట వస్తుంది. ప్రస్తుతానికి నేను నేను చెప్పేది పాట గురించే. 'నిదరే కల ఐనది. కలయే నిజమైనది' అనే పల్లవితో సాగుతుంది పాట. ఇకపోతే పాట పాడిన అమ్మాయి పేరు సుధా రఘునాథన్. గాయని పేరు ఇదివరకు నేనెక్కడా వినలేదు. ఇదే మొదటిపాటేమో తెలీదు మరి. అమ్మాయి తెలుగు అమ్మాయి కాకపోయినా పాట భావాన్నంతా గొంతులో నింపి ఎంత మధురంగా పలికించిందో ఒకసారి వింటే గానీ అర్ధం కాదు. పాట సంగీతం కంటే కూడా, గాత్రం మీదనే ఎక్కువ ఆధారపడి ఉంది. పాటలో అంతర్లీనంగా, మృదువుగా సాగిపోతుంటుంది సంగీతం. సినిమాలో కథానాయిక ఎన్నో ఏళ్లుగా హీరోపై ప్రేమని పెంచుకుని, అతని సంతోషాల్నీ, వేదనల్నీ అన్నిటినీ ప్రేమిస్తూ..అతని ప్రేమ కోసం మౌనంగా సాగించిన సుధీర్ఘ నిరీక్షణ అనంతరం..అతని ప్రేమని పొందిన పరవశంలో తన్మయత్వంతో పాడే పాట ఇది. చిత్రీకరణ కూడా చాలా బావుంటుంది. సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరు అద్భుతంగా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. నిజంగా జరిగేది చూస్తున్నామేమో అన్న అనుభూతి కలుగుతుంది మనకు. గొప్పతనం అంతా ఖచ్చితంగా దర్శకుడికే చెందుతుంది.

సినిమాలో అన్నీ పాటలు బాగానే ఉన్నా, అన్నీటికంటే పాట నాకు చాలా చాలా నచ్చింది. డబ్బింగ్ పాటలయినా కూడా వేటూరి గారు చాలా కష్టపడి ఒక మంచి రూపు తీసుకొచ్చారు పాటలకు అనిపిస్తుంది మనకి. నిజానికి స్నేహితుడొకరు మొదట పాట బావుందని చెప్తే..నేను విని 'హమ్మో.. డబ్బింగ్ పాట అని బాగా తెలిసిపోతుంది. నాకు ఎక్కడం కష్టం' అన్నాను. కానీ, సినిమా చూసిన తరువాత పాటలన్నీ తెగ నచ్చేసాయి నాకు. వరుసగా కొన్నిరోజులవరకూ అవే అవే విన్నాను. మీరూ ప్రయత్నించి చూడండి. అన్నట్టూ.. సినిమా గురించి మరో మాట..జై చిరంజీవ, అశోక్ తదితర చిత్రాల్లో నటించిన బాలీవుడ్ తెలుగమ్మాయి సమీరా రెడ్డి సినిమాలో ఒక హీరోయిన్. మిగతా సినిమాలు చూసి సినిమా చూస్తే.. అసలు అమ్మాయేనా అనే సందేహం వచ్చినా ఆశ్చర్యం లేదు. అంత చక్కగా ఉంటుంది అమ్మాయి సినిమాలో. వీలైతే సినిమా చూడండి. పాటలు మాత్రం తప్పకుండా విని చూడండి. సాహిత్యం క్రింద ఇస్తున్నాను చూడండి.

నిదరే కల ఐనది.. కలయే నిజమైనది..
బతుకే జత ఐనది.. జతయే అతనన్నది..
మనసేమో ఆగదు.. క్షణమైన తోచదు..
మొదలాయే.. కథే ఇలాఆఆఆఆ..

నిదరే కల ఐనది.. కలయే నిజమైనది..
బతుకే జత ఐనది.. జతయే అతనన్నది..
మనసేమో ఆగదు.. క్షణమైన తోచదు..
మొదలాయే.. కథే ఇలాఆఆఆఆ..

వయసంతా వసంత గాలి.. మనసనుకో.. మమతనుకో..
ఎదురైనది ఎడారి దారి.. చిగురులతో.. చిలకలతో..
యమునకొకే సంగమమే.. కడలి నది కలవదులే..
హృదయమిలా అంకితమై.. నిలిచినది.. తనకొరకే..
పడిన ముడి.. పడుచోడి.. ఎద లో చిరు మువ్వల సవ్వడి..

నిదరే కల ఐనది.. కలయే నిజమైనది..
బతుకే జత ఐనది.. జతయే అతనన్నది..
మనసేమో ఆగదు.. క్షణమైన తోచదు..
మొదలాయే.. కథే ఇలాఆఆఆఆ..

అభిమానం అనేది మౌనం.. పెదవులపై పలకదులే..
అనురాగం అనేసరాగం.. స్వరములకే దొరకదులే..
నిన్ను కలిసిన క్షణమే.. చిగురించే మధు మురళి..
నిను తగిలిన తనువే.. పులకరించే ఎద రగిలి..
యెదుట పడి కుదుటపడే.. మమకారపు నివాళి లే ఇది..

నిదరే కల ఐనది.. కలయే నిజమైనది..
బతుకే జత ఐనది.. జతయే అతనన్నది..
మనసేమో ఆగదు.. క్షణమైన తోచదు..
మొదలాయే.. కథే ఇలాఆఆఆఆ..