"వినా వెంకటేశం ననాతో ననాతః సదా వెంకటేశం స్మరామి స్మరామి.. హరే వెంకటేశం ప్రసీద ప్రసీద.. ప్రియం వెంకటేశం ప్రయచ్చః ప్రయచ్చః" అంటూ ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి కోకిల గాత్రం చెవినబడగానే కళ్లు నులుముకుంటూ నిద్ర లేచాను. పది నిమిషాల్లో వేడి వేడి హార్లిక్స్ కప్పుతో ఇంటి ముఖద్వారం ముందున్న మెట్ల మీద కూర్చున్నాను. సూర్యుడు అప్పుడే హడావిడిగా తన విధినిర్వహణకు పరుగుతీస్తున్నట్లున్నాడు. ప్రతి రోజూలాగానే ఇంటి ముందున్న పూల మొక్కల్ని, వీధిలో అటూ ఇటూ వెళ్ళే జనాల్నీ గమనిస్తూ కూర్చున్నాను. ఇదే వీధిలో ఉండే పదేళ్ళ శరత్ రోజులాగానే ఆదరాబాదరాగా నిలుచునే సైకిల్ తొక్కుతూ, బెల్లు మోగిస్తూ వెళుతున్నాడు. శరత్ కనిపించాడంటే ఖచ్చితంగా సమయం ఆరు గంటల ఐదు నిమిషాలన్న మాటే.! ఎందుకంటే ఐదో తరగతి చదివే శరత్ సరిగ్గా ఆ సమయానికి తన మాథ్స్ ట్యూషన్ ముగించుకుని ఇంటికి వస్తాడు. ఆరింటికి ట్యూషన్ అయిపోయిందంటే వాడు ఏ నాలుగున్నరకి లేచి తయారయ్యి ట్యూషన్ కి వెళ్తాడో పాపం.! ఏం చేస్తాడు తప్పదు మరి.. భవిష్యత్తులో ఐఐటీ సీటు తెచ్చుకోవాలంటే ఇప్పటినించే ఈ శిక్ష(ణ) తప్పనిసరాయే.! మా ఇంటిముందున్న పారిజాతం చెట్టునుంచి రాలిన పూలన్నీ చెట్టు కింద రాత్రే పరిచి ఉంచిన చిన్న చాప మీద పరుచుకుని విలాసంగా నవ్వుతున్నాయి. ప్రతి రోజూ మా ఇంట్లో దేవుళ్ళకీ మేలుకొలుపు పాడేది ఈ పారిజాతపు పరిమళాలే.! ఇంతలో నా కాళ్ళ దగ్గర వార్తాపత్రిక వచ్చి పడింది. మా పేపరబ్బాయి రవి గేటు ముందాగి బెల్లు కొట్టడం, పేపర్ మెట్ల మీదకి విసరడం, వెళ్ళిపోవడం అంతా కూడా ఒక్క క్షణంలోనే జరిగిపోతుంది. ఇంత మెరుపు వేగంతో పేపర్ విసరడంలో ఒలింపిక్స్ లాంటి పతకాలేవైనా ఉంటే అవన్నీ మన దేశానికే వస్తాయని నాకనిపిస్తూ ఉంటుంది :) ఎప్పుడో కానీ పూయని మా పెరట్లోని ఎర్రముద్దమందారం చెట్టు కొత్తగా ఒక మొగ్గ తొడిగింది. అయితే ఇంకో వారం రోజుల్లో నా దోసిలిలో ఒదిగిపోయేంత పెద్ద ముద్దమందారం నన్ను మురిపిస్తుందన్నమాట.! మా పెరట్లోనే మరో వైపునున్నరాణీ కలర్ గులాబీ మొక్కను చూడగానే రెండ్రోజుల క్రితం విరిసిన రెండు గులాబీ బాలలు ముట్టుకుంటే రాలిపోతామన్నట్టుగా, ఇక సెలవు నేస్తం అని వీడ్కోలు పలుకుతున్నట్టుగా నావైపు బేలగా చూస్తున్నాయి. ఓసారి వాటివైపు చూసి చిన్న నిట్టూర్పు విడిచేలోగానే 'మేమొస్తున్నాంగా నీకోసం' అన్నట్టు విచ్చుకోవడానికి సిద్దంగా ఉన్న మరో రెండు గులాబీ మొగ్గలు నవ్వుతూ కనిపించాయి. ఇంతలో ఇంటి గేటు తీసుకుని పాలబ్బాయి శ్రీను వచ్చాడు. తనొస్తే సమయం ఆరున్నర అయిందన్న మాటే.! సమయపాలన విషయంలో శ్రీనుని ఎవరైనా సరే మెచ్చుకుని తీరాల్సిందే.! ఎప్పుడైనా గడియారం తప్పు చూపిస్తుందేమో గానీ, తను మాత్రం ఆలస్యంగా రాడు. రోజూ పొద్దున్నే ఓ పదిళ్ళల్లో పాలు పోసి వాళ్ల అమ్మానాన్నలకు సాయం చేసే శ్రీను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బాధ్యతాయుతంగా ప్రవర్తించే ఈనాటి యువతకి శ్రీను ఒక మంచి ఉదాహరణ. తను వెళ్ళిపోగానే మళ్ళీ పెరట్లోకి వెళ్లి ధవళ కాంతులు విరజిమ్మే నందివర్ధనాలపై నిలిచిన మంచు బిందువులను భానుడి కిరణాలతో పాటుగా నేను కూడా కాసేపు పలకరించి వచ్చాను. ఇంకా.. రాత్రి నుండీ సువాసనలు వెదజల్లి అలసి సొలసి ఉన్న అరవిరిసిన మల్లెలతో కూడా కాసేపు ఊసులాడాను. ఇంతలో వీధిలోనుంచి ఆకుకూరలంటూ రాజయ్య కేక వినిపించింది. రాజయ్య ఊరు ఇక్కడికి దగ్గర్లోనే ఉన్న 'నగరం' అనే పల్లె. ప్రతీరోజూ వాళ్ళ ఊరి నుంచీ ఐదారు రకాల తాజా ఆకుకూరలు తీసుకొచ్చి తన కావడిలో పెట్టుకుని తిరుగుతూ ఈ ఊర్లో అమ్ముతాడు. మా వీధి వైపు మాత్రం రెండ్రోజులకోసారే వస్తాడు. వాళ్ళ ఊరినుంచి ఐదింటికల్లా బస్సు పట్టుకుని ఇక్కడికొచ్చి వీధుల్లో తిరుగుతూ ఆకుకూరలు అమ్ముతూ ఉంటాడు. తన దగ్గరున్న ఆకు కూరలన్నీ ఎనిమిదిన్నర తొమ్మిది కల్లా అయిపోగానే తన పల్లెకి తిరిగెళ్ళాక మళ్ళీ సున్నం ఫ్యాక్టరీలో పనికి వెళ్తాడట. ఏమాటకామాటే, తన దగ్గర ఆకుకూరలు మాత్రం నవనవలాడుతూ ఎంత తాజాగా ఉంటాయో.! ఇహ నేనేమో ఇవాళ్టికి వంట కోసం ఒక రెండు కట్టలు తోటకూర, రోటి పచ్చడి కోసం చుక్క కూర, పచ్చిమిరప, ఇంకా.. ఒక కట్ట కొత్తిమీర, మూడు పసిమి నిమ్మకాయలు తీసుకుని ఇంట్లోకొచ్చి చూద్దును కదా.. టైము అప్పుడే ఏడు గంటలైపోయింది. హమ్మో..ఫలహారానికి వేళవుతున్నది.. ఇక ఈ ఉదయపు కబుర్లు చాలించి రోజువారీ పనుల్లోకి పరుగులు తీస్తున్నానహో..! ఇహ మీరూ వెళ్లి రండి మరి :)
Thursday, July 23, 2009
ఓ ఉదయం వేళ..!
Subscribe to:
Post Comments (Atom)
18 comments:
అప్పుడే అయిపోయాయా కబుర్లు అనిపించిందండి చివరికి వచ్చేసరికి.. రవి, శ్రీను, రాజయ్య వీళ్ళందరిలో కామన్ గా ఉన్నదేమిటీ అంటే రేపు బాగుంటుందన్న నమ్మకం, రేపటి కోసం ఈరోజు కష్టపడే తత్త్వం.. అన్నట్టు మీ పూల గుసగుసలు కూడా బాగున్నాయండి..
very nice...
:) బాగున్నాయి కబుర్లు. కాస్త పేరాగ్రాఫులుగా విడదీస్తే ఇంకా బాగుండేదేమో అనిపించినా, మళ్లీ ఆలోచిస్తే, ఇలాటి కబుర్లు గుక్క తిప్పుకోకుండా చెబుతారు కదా. సరే. పనకి వెళ్లి, మళ్లీ వచ్చి ఇంకా కబుర్లు చెప్పండి.
ఎదురుచూస్తూంటా.
mee mornings intha andanga untaayaa, i am jealous
పేరులోనే కాదు పదాలలోను మధురత్వం కనబడిందండి, చాలా బాగా రాశారు, మీరు చెప్పే విధానంలోనే మీ మనసులోని భావాలు కనబడుతున్నాయి. ఇంకా ఇలాంటివి ఎన్నో రాయాలని ఆశించే మీ అభిమాని.
నార్త్ అమెరికాకి వచ్చాక ఇలాంటి అనుభూతులన్నీ కోల్పోతున్నాం. ఇండియాకి సెలవుల్లో వచ్చినప్పుడు ఇలాంటివన్నీ ఆస్వాదిస్తూవుంటాను.
abba super andi,yenta ani adagakandi.
no words....ganta prakruti ni yenta andam gaa enjoy chesaaro ..madhuravani gaaru..keeping blogging .
చాలా బాగా వర్ణించరు. నాలుగు నెలల క్రితం వరకు బెంగుళురులొ మా స్వంత ఇంత్లొ వున్నప్పుడు నెను ఇలాగె కాఫీ కప్పు పత్తుకొని, ప్రక్రుతి అస్వాదిస్తూ తిరుగాడుతూ ఉండెదాన్ని.
ఆ మంచి రోజులు గుర్తుకొస్తున్నయి
:) nice..
అయ్యో ! అపుడే ఏడయిందా ? చిన్నపుడు మా పెరటి తోట గుర్తొచ్చింది. నా చెల్లెలు అప్పటికి బుడ్డిది. తెల్లరి లేచి, ఆ తోటలోనే ఏ చెట్ట్లతోనో మాటలాడుకుంటూ (నిజంగానే!) కూర్చునేది. కోపం వస్తే, కత్తి (కర్ర) ఫైటింగ్ కూడా. దాని కోపానికి పెద్ద పెద్ద తోట కూర, గోంగూర వృక్షాలు (అవి అల్లానే విరగ కాసేవి) బలయిపోయేవి. మీరు తొందరగా పని ముగించేసుకుని వచ్చి ఇంకొన్ని కబుర్లు చెప్తే బావుణ్ణనిపిస్తూంది.
మధురా ఎవరు మీకు సరి ఇంత సులువుగా వూసులు చెప్పను. ఎపుడో గడిచిన కొన్ని ఉదయాల్లోని ఒకటో రెండో జ్ఞాపకాలు కళ్ళు విప్పి కిసుక్కున నవ్వాయి. ఈ రేయిక ఆ నవ్వుల్లోనే కమ్మని నిదుర పోతాను.
భలే చక్కగా అభివర్ణించారు.అసలు ఉదయాన్నే వేడి వేడిగా ఒక కప్ టీ తాగుతూ ప్రకృతిని ఆస్వదిస్తూ ఉంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది....అది కుడా చలికాలం అయితే ఇంకా బాగుంటుంది.....
@ మురళి గారూ,
నేను చెప్పిన కబుర్లకంటే మీరు వాళ్ళందరిలో గమనించిన విషయాన్ని చెప్పిన తీరు ఇంకా బాగుంది :)
@ మేధ గారూ,
ధన్యవాదాలండీ. నా బ్లాగుకి స్వాగతం :)
@ మాలతి గారూ,
కబుర్లు మీకు నచ్చడం సంతోషంగా ఉంది. నాక్కూడా మొదట అలానే పేరాలుగా విడదీయాలనిపించింది. కానీ, అలా చేసి చూస్తే నచ్చలేదు. అందుకే మళ్ళీ అంతా ఒక్కటిగా పెట్టాను. మీరన్నట్టు.. గుక్కతిప్పుకోకుండా చెప్పే కబుర్లు ఇలానే బావుంటాయేమో.! నిజంగా ఎదురుచూసేంతగా బావున్నాయంటారా :)
@ రాణి గారూ,
ప్రస్తుతానికి మీరు బాధ పడక్కర్లేదండీ.! ఇక్కడ నేను చెప్పినవన్నీ ఎప్పటివో జ్ఞాపకాలు. ప్రస్తుతానికి సంబంధించివి కాదు.
@ హను గారూ,
మీ అభిమానం, మంచి మనసు మీ మాటల్లోనే కనిపిస్తున్నాయండీ.!
మీకు అంతగా నచ్చడం చాలా సంతోషంగా ఉంది.
ధన్యవాదాలు.
@ శరత్ గారూ,
అప్పుడప్పుడూ ఆస్వాదిస్తేనే అలాంటి చక్కటి అనుభూతులు ఎప్పటికీ గుర్తుంటాయండీ ;)
@ సుభద్ర గారూ,
మీకు నా కబుర్లు అంతగా నచ్చడం నాకు కూడా సంతోషంగా ఉంది.
ధన్యవాదాలు.
@ వెన్నెల గారూ,
అవునండీ.! అలాంటి మంచి రోజుల్ని గుర్తు తెచ్చుకుంటూ ఈ రోజుని గడపడంలో కూడా ఎంతో ఆనందం ఉంటుంది కదూ.!
@ అమ్మాయి గారండీ..
ధన్యవాదాలు ;)
@ సుజాత గారూ,
నా బ్లాగుకి స్వాగతం.!
అవునండీ అప్పుడే ఏడయిపోయింది. అందుకే కబుర్లకి కళ్ళెం వెయ్యాల్సొచ్చింది. మీ బుడ్డి చెల్లెలు అల్లరిని నేను ఊహించుకుని మరీ దర్శించానండీ.! నిజమే తెల్ల గోంగూర చెట్లు వృక్షాల మాదిరిగానే పెరుగుతాయి.
మళ్ళీ సమయం దొరికినప్పుడు తప్పక కబుర్లు చెప్పడానికి వస్తానని మాటిస్తున్నాను :)
@ ఉష గారూ,
నా కబుర్లు మీ మోముపై నవ్వులు పూయించినందుకు ఆనందంగా ఉంది :)
@ హను గారూ,
వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలు. చలికాలంలో కూడా ప్రకృతిని ఆస్వాదించడం బావుంటుంది కానీ..అప్పుడప్పుడూ పొద్దునే ముసుగుతన్ని పడుకోవాలని బద్దకంగా కూడా అనిపిస్తూ ఉంటుంది కదండీ ;)
ఓహ్ !దోసిలిలో ఒదిగిపోయేంత పెద్ద ముద్దమందారం...అది నాకే .....గులాబీలు మీరే తీసుకోండి ....ఎందుకంటే మొన్నే మా కుండీలో గుత్తుగులాబీ మొక్క నాటాను. అన్నట్టు మీరు గడియారం చూసుకోనక్కర్లేదల్లె ఉందే !ఇంకో మాట ఈసారి హార్లిక్స్ కి బదులు ఘుమ ఘుమ లాడే కాఫీ ట్రై చేసి చూడండి . ఉదయం మరింత మధురం !
చాలా బాగా వర్ణించారు...మా మినా(పనమ్మయి) గురించి రాసినది కుడా ఆసక్తి ఉంటె చదవండి.
http://trishnaventa.blogspot.com/2009/06/blog-post_24.html
@ పరిమళం గారూ,
గులాబీలు నాకే అన్నందుకు సంతోషం :) ముద్ద మందారం ముచ్చటగా మీరే తీసేసుకోండీ :)
మనకి ఇష్టం ఉన్న లేకపోయినా సమయం చూసుకోవాల్సి వస్తుంది కదండీ ఒకోసారి :(
కాఫీ నాకూ ఇష్టమే కానీ.. ఎప్పుడో గానీ తాగనండీ. ఈ పోస్టు చూసి ఇంకా ఎవరూ కాఫీ గురించి చెప్పట్లేదేమిటా అనుకుంటున్నాను. మీరు చెప్పేశారు ;)
@ తృష్ణ గారూ,
స్వాగతం నా బ్లాగుకి :)
మీనా గురించి మీరు చెప్పింది విన్నాక (అదే చదివాక) నాకూ బోలెడంత సంతోషమేసింది. ఇలాంటి అమ్మాయిలు ఈ కాలంలో ఉండటం ఖచ్చితంగా అపురూపమే..ఇది ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఆ అమ్మాయి వ్యక్తిత్వం గురించి తెలిశాక తను తప్పకుండా జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుందన్న నమ్మకం కలుగుతోంది. మీ మీనాకి మా అందరి శుభాకాంక్షలు అందజేయండి.
Post a Comment