Friday, August 28, 2009

జీవితమంటే..!?

-->
నేను: "అబ్బా.. సుత్తి జీవితం ఏంటో.. మహా చిరాగ్గా, విసుగ్గా, విరక్తిగా అనిపిస్తోంది."
తను: "జీవితం మంచిదే.. మనమే అనవసరంగా అన్నీ కల్పించుకుని మరీ జీవితాన్ని అలా విరక్తి కలిగేలా తయారుచేసుకుంటాం."
నేను: "అన్నీ వదిలేసి ఎక్కడికైనా దూరంగా పారిపోవాలనిపిస్తుంది."
తను: "నీ మనసులోని అనవసరమైన ఆలోచనలని దూరం చేసేవరకూ ఎంతెంత సుదూర తీరాలకు వెళ్ళినా నీకు ప్రశాంతత దొరకదు."
నేను: "నా చుట్టూ ఉన్నవాళ్ళ గురించి ఆలోచించడం అనవసరమా.!?"
తను: "అనవసరమే.. ఆలోచనల్లో పడి కొట్టుకుపోతూ నువ్వు జీవించడం మర్చిపోయే పరిస్థితిలో నువ్వు పడ్డప్పుడు"
నేను: "మరో వ్యక్తికి నేను ఏమనుకుంటున్నానో తెలియచెప్పాలనుకోవడం తప్పా.!?"
తను: "తెలియచేయాలనుకోవడం తప్పు కాదు. కానీ, వాళ్లు ఖచ్చితంగా నిన్ను అర్ధం చేసుకుని తీరాలని ఆశించడం తప్పే మరి.!"
నేను: "అయితే, నన్నువేరేవాళ్ళు అర్ధం చేసుకోవాలని నేను తాపత్రయపడటం అర్ధరహితమా.!?"
తను: "చూడు బంగారం.. ప్రపంచంలో ఎవరైనా ముందు తమ స్వాభిప్రాయాన్నే గౌరవించుకుంటారు, తమ భావానికే విలువ ఇచ్చుకుంటారు. దానికి అనుకూలంగా ఉంటేనే వేరేవాళ్ళు చెప్పినదానికి అంగీకరిస్తారు. లేకపోతే అభిప్రాయబేధం తప్పదు, అది ఎవరితోనైనా సరే.! దీన్నే మరో విధంగా చెప్పాలంటే.. ప్రతీ మనిషి మొదట తన కోసం తాను జీవిస్తాడు. తనకు సరి అనిపిస్తేనే గానీ, అప్పుడు మరో వ్యక్తి భావాల గురించి ఆలోచించడు. తననేవాడే లేకపోతే, అసలు ఇక మిగతా మనుషుల, విషయాల ప్రసక్తే లేదు కదా.!
కాబట్టి, ప్రతీ మనిషి తనదైన స్వంత ఆలోచననీ, భావాన్ని, అభిప్రాయాన్ని కలిగిఉండటం అత్యంత సహజం. అదే లేకపోతే, మనిషికీ, మన్నుకీ తేడా ఏముంది చెప్పు. మన ఆలోచనని ఎవరైనా అర్ధం చేసుకుంటారా లేదా అన్న దాన్ని ఆధారం చేసుకుని మనం ఆలోచన చేయకూడదు. నువ్వు నీలా ఆలోచించాలి, నీలా ఉండాలి. లేని పక్షంలో అసలు 'నువ్వు' అనే మనిషివి అదృశ్యమైపోయి మరెవరి ఆలోచనలకో ప్రతిబింబంగా మాత్రమే మిగిలిపోతావు. సృష్టిలో ప్రతీ జీవి ప్రత్యేకమే. ప్రత్యేకతని పోగొట్టుకోకుండా జీవించగలగడమే మన జీవితానికి నిర్దేశించబడిన అసలైన అర్థం పరమార్థం.

మరో మాట చెప్పనా బంగారం... మనం అతిగా ఆలోచించేంత పేద్ద విషయం కాదు జీవితం. మొత్తం ప్రపంచానికే మహనీయులైన వ్యక్తులు లోకం నుంచి నిష్క్రమిస్తే అందరం ఒక వారం లేదా మహా అంటే ఒక నెల బాధపడతాం. సొంత కుటుంబసభ్యులే పోయినా కూడా, వాళ్ళతో మనం పోలేము. కాసేపు బాధపడ్డాక మళ్ళీ బ్రతుకు పరుగులో పయనం సాగించాల్సిందే. అది జీవికైనా అనివార్యం. అంతెందుకు. మనమే పోయినా గానీ, ప్రపంచంలో ఏమీ మార్పు ఉండదు. జరిగేవన్నీ జరుగుతూనే ఉంటాయి. దీన్ని బట్టి ఇంత పెద్ద అనంత విశ్వంలో మనకున్న విలువెంత.?

అలాగే మరో మాట.. నీకు కేవలం ఒక్కరోజే ఆయుష్షు మిగిలిఉందని తెలిస్తే ఏం చేస్తావు.?సాధ్యమైనంత సంతోషంగా, నీకు నచ్చినట్లుగా ఉండాలనుకుంటావు కదా.! అదే ఎప్పుడు పోతామో తెలీనప్పుడు మాత్రం జీవితాన్ని ఆస్వాదించడం మానేసి ఇలా వ్యర్ధమైన ఆలోచనలతో విలువైన సమయాన్ని వృథా చేస్తాము. మన జీవితం శాశ్వతం కాదు..మనకున్న కొద్ది కాలాన్ని అందంగా, ఆనందంగా మార్చుకోవడం మన చేతుల్లో మాత్రమే ఉంది. మన జీవితం ఎలా ఉండాలన్నది కేవలం మనం మలచుకొనేదే.!

కాబట్టి, మన జీవితానికున్న విలువను గుర్తించి, అలాగే మనకి లేని అతి విలువని అతిశయంగా ఆపాదించుకుని బీరాలు పోతూ అతిగా ఆలోచించి జీవితాన్ని విసుగ్గా, విరక్తిగా మార్చుకోకుండా, అదే సమయంలో మన ప్రత్యేకతను మనం పోగొట్టుకోకుండా హాయిగా జీవితాన్ని ఆస్వాదించాలి. అదే.. ఇంత ఆలోచించగలిగే మెదడు, స్పందించగలిగే మనసు ఉన్న మనుషులుగా పుట్టినందుకు మనకు లభించిన అదృష్టం.

ఇప్పుడు చెప్పు.. జీవితాన్ని ఒకసారి నే చెప్పిన కోణంలో నుంచి చూసే ప్రయత్నం చేస్తావు కదూ..!!"

నేను: "జీవితాన్ని ఇంత అందంగా, ఆనందంగా చూపిస్తుంటే.. కాదని అనగలనా.!?"

Thursday, August 13, 2009

పేరులో నేముంది..!!

'పేరు'.. ప్రపంచంలో ప్రతీ జీవికీ ఏదో ఒక పేరు ఉంటుంది కదా.. గుర్తు తెలియడం కోసం, ఆనవాలు కోసం. ఆవు, పులి, చిలుక, కొంగ, కప్ప..ఇలా. కానీ, మనుషులకి మాత్రం ఒక్కొక్కరికి ఒక్కో పేరు. మరి మనం సంఘజీవులం, అత్యంత తెలివైన జంతువులం కదా.! సంఘజీవులంటే గుర్తొచ్చింది.. జంతువులు కూడా గుంపులుగా జీవిస్తాయి కదా.. మన డిస్నీ సినిమాల్లో చూపించినట్టుగా పిగ్లెట్, పూ బేర్, టిగ్గర్ లా అన్ని జంతువులు అలా పేర్లు పెట్టే పిలుచుకుంటాయేమో.. ఒక వేళ అదే నిజమైనా మనకి వాటి భాష రాదు కాబట్టి తెలిసే ఛాన్స్ లేదులెండి. దేశంలో, అంటే జర్మనీలో నేను గమనించింది ఏంటంటే, ఒక వందో, రెందొండలో (అటూ ఇటుగా) పేర్లుంటాయి వీళ్ళకి. వాటినే అందరూ పెట్టుకుంటూ ఉంటారు. ఉదాహరణకి అమ్మాయిలయితే క్రిస్టీనా, మెలనీ, కారిన్, క్లౌడియా, అంగీలా.. లాంటి కొన్ని పేర్లు, అదే అబ్బాయిలకైతే రాబర్ట్, యార్గ్, యుర్గెన్, యోసెఫ్ (జర్మన్లో J అని Y లాగా పలుకుతారు) వగైరా పేర్లుంటాయి. మనం ఒక యాభైమందిని కలిస్తే ఒకే పేరున్న వాళ్లు కనీసం ఇద్దరైనా ఉంటారు. మీరెన్ని ఊర్లు తిరిగినా మళ్లీ మళ్లీ ఈ పేర్లే వినిపిస్తుంటాయన్నమాట :)

నిజానికి మన ఆంధ్ర దేశంలో కూడా ఇంతకుముందు ఇలాగే ఉండేదనుకుంటా పరిస్థితి. అంటే వంద శాతం ఇలాంటి పేర్లే కాకపోయినా, ఇంటికో ఇద్దరు శ్రీనివాసులు, ముగ్గురు వెంకటేశ్వర్లు.. అలాగన్నమాట. తాతతండ్రుల పేర్లు పెట్టడంలో కుటుంబసభ్యులందరూ చాలా పోటీ పడేవారు. ఒక టైములో అయితే ప్రతీ ఇంటికీ తక్కువలో తక్కువ ఒక నాగేశ్వరరావు, ఒక రామారావు అయినా ఉండేవారట. మరి అభిమానులా మజాకానా :) ఒకోసారి తల్లివైపు, తండ్రి వైపున్న అందరి పేర్లు కలిసి వచ్చేట్టు పెట్టేసరికి పేరు చాంతాడంత అయిపోయి చివరికి పేరు కాస్తా కుదించబడుతుంది. ఉదాహరణకి 'ప్రసాద్' అనే పేరున్న వాళ్ళెవారికైనా కేవలం 'ప్రసాద్' అని పేరుండటం సాధ్యమా చెప్పండి. మొత్తం పేరు IJKL ప్రసాద్ అనో లేకపోతే OPQRS ప్రసాద్ అనో ఖచ్చితంగా ఉండే తీరుతుంది కదా.. ప్రసాద్ పేరున్న వాళ్ళెవరూ దయచేసి నా మీదకి దండెత్తి రాకండి. మాటవరసకి చెప్తున్నానంతే ;) ఇంతకుముందు తరాలవాళ్ళు చాలావరకు మంచి పేర్లే పెట్టారు. అప్పట్లో పిల్లలు పుట్టగానే దేవుడి పేరు పెడదామా, తాత పేరు, బామ్మ పేరు కలిసోచ్చేలా పెడదాం అని అనుకుని తదనుగుణంగా పెట్టేవారు. అదే కాలంలో అయితే పేరు విషయంలో చాలామందికి ఉంటే ప్రయారిటీ ఏంటంటే.. ఇప్పటిదాకా ఎవరూ కనీ వినీ ఎరుగని సరికొత్త పేరు పెట్టాలని. పేరు విన్నవాళ్లందరూ కూడా థ్రిల్ అయిపోయి, 'wow.. what a unique name.!?' అనో, 'it sounds very peculiar' అనో, లేకపోతే 'అసలు పేరెలా పెట్టరండీ మీరు.. పుస్తకంలో చూసారు.?' అనో ప్రశంసల జల్లు కురిపించేట్టుగా మనం పేరు వెతుక్కోవాలన్నమాట.! అడిగినవాళ్లకి సమాధానంగా మనం గర్వంగా ఒక చిరునవ్వు నవ్వి 'అరబిక్ లో పేరుకి అర్ధం ఫలానా పువ్వనో, లేక గ్రీక్ భాషలో ఒక రాణి పేరనో, లేకపోతే సంస్కృతంలో ఏదో గొప్ప అర్ధం ఉందనో' చెప్పి మన అంతర్జాతీయ పరిజ్ఞానాన్ని నిరూపించుకోవాలన్న మాట.! నిజానికి ఇలా చేయడం తప్పు కాదనుకోండి. కాకపోతే "జస్ట, త్రష్య, చాస్య, పౌర్మ, క్రధ్య, ప్రమాష్, ప్రరణ్, కర్పణ్, క్రిమిక్.." ఇలాంటి పేర్లు చెప్పి అచ్చ సంస్కృతంలో ఫలానా గొప్ప అర్ధం ఉంది అని చెప్తే మీరు హాశ్చర్యపోతారా లేదా చెప్పండి.? ఎక్కడో విన్నట్టు గుర్తు.. చైనా దేశస్థులు పిల్లలు పుట్టగానే ఏదో పింగాణీ గిన్నె కింద పడేసి, శబ్దం వస్తే పేరు పెడతారని అందుకే, వాళ్ల పేర్లు అన్నీ ఒకలాగే ఉంటాయని.. ఇది నిజమో కాదో తెలీదు కానీ, లెక్కన వాళ్ళకి మనలాగా పేర్ల పుస్తకాలు, అంతర్జాతీయ భాషా పరిశోధన చేసే బాధ తప్పుతుంది కదండీ.! మధ్యనే ఎక్కడో మరో విషయం చదివాను. తమిళనాడులో పిల్లలకి సాంప్రదాయిక తమిళ పేర్లు పెట్టేవారికి ప్రభుత్వం ఏదో బహుమతులిస్తుందని. మధ్య సినిమా పేర్ల విషయంలో కూడా ఇలాంటిదేదో చేసినట్టున్నారు వాళ్లు. సినిమాపేరు తమిళ్ లోనే ఉంటే.. అంటే కిక్, రెడీ, కింగ్, జోష్..ఇలాంటి ఇంగ్లీషు పేర్లు కాకుండా, వాళ్ల భాషలోనే ఉంటే ఏదో పన్ను మినహాయింపు లాంటిది ఉందనుకుంటా.! ఎంతైనా భాష మీద ప్రేమ విషయంలో మాత్రం తమిళం వాళ్ళని మెచ్చుకోవాల్సిందే.. అప్పుడప్పుడూ వాళ్ల వాదనలు భరించడం కొంచెం కష్టమైనప్పటికీ ;)

పేర్ల గురించి ఎప్పుడనుకున్నా నాకు మా తమ్ముడి గురించి రెండు విషయాలు తప్పక గుర్తొస్తుంటాయి. మొదటిది ఏంటంటే, వాడు చిన్నగా ఉన్నప్పుడు, అంటే రెండో తరగతో చదివే రోజుల్లో స్కూల్లోనో, బయటో పేరు చూసొస్తే ఇంటికొచ్చి నాకు కూడా పేరే పెట్టమని గొడవ చేసేవాడు. ఉదాహరణకి ఒకసారి మా స్కూల్లో 'సంజవరావు (సంజీవరావు)' అనే అబ్బాయిని చూసొచ్చి, తనకి కూడా అదే పేరు పెడతారా చస్తారా అని మా అమ్మ బుర్ర తినేసాడు. 'సంజవరావు' కంటే నీకున్న పేరే బాగుందిరా అని ఎంత చెప్పినా వినడే అసలు. చివరికి మా అమ్మ బాగా ఆలోచించి 'అలా కాదురా నాన్నా.. నీకా పేరు పెట్టడం కుదరదు. నీకు కేవలం '' అనే అక్షరంతో మొదలయ్యే పేరు మాత్రం పెట్టాలి. వేరేవి పెట్టకూడదు. అది రూలు అంతే' అని గాఠ్ఠిగా చెప్పేసింది. పాపం.. అమ్మ వీడి తెలివిని చాలా తక్కువగా అంచనా వేసిందని అప్పుడు తెలీలేదు. తరవాత కొన్ని రోజులకి మా వీధిలో ఒకళ్ళింటికి వాళ్ల మనవడు వచ్చాడు ఊరినుంచి. మా తమ్ముడు ఆడుకోడానికి వెళ్లి అబ్బాయి పేరు 'భాస్కర్' అని తెలియగానే ఆట వదిలేసి పరుగు పరుగున ఇంటికొచ్చేసాడు. సీన్ అర్ధమయ్యిందిగా మీకు.. అదేనండీ, వాడి పేరు అర్జంటుగా 'భాస్కర్' అని మారుస్తారా లేదా అని.. అమ్మని పీకి పాకం పెట్టేసాడు. నీ పేరే బాగుంది అంటే వినిపించుకోడాయే.. రోజు నుంచీ వాడి పేరుతో పిలిస్తే అసలు పలికేవాడు కాదు భాస్కర్ అంటేనే పలుకుతా అనేవాడు. మా టైం బాగుండి చుట్టాలబ్బాయి నాలుగురోజుల తరవాత వెళ్ళిపోవడం వల్ల 'భాస్కర్' కథ ఎలానో మర్చిపోయాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇప్పుడు నాకు భాస్కర్ అనే తమ్ముడు ఉండేవాడేమో ;) ఇంతకీ మా తమ్ముడి పేరు చెప్పనేలేదు కదూ..! మా నాన్నగారు దేశం మీద ప్రేమ కొద్దీ వాడికి 'భారత్' అని పేరు పెట్టారు. అందరూ 'భరత్ భరత్' అని పిలిచి చివరికి అది కాస్తా 'భరత్' అయిపోయిందని ఇప్పటికీ మా నాన్న బాధపడుతుంటారు పాపం :( మరో సంతేంటంటే, అప్పట్లో 'భరత్ అరుణ్ ' అనే ఒక క్రికెటర్ ఉండేవాడని నాన్న సరదాగా అప్పుడప్పుడూ వాడిని 'భరత్ అరుణ్' అనేవారట. అది విని నేను కూడా అలా పిలుద్దామని 'భరాతర్' అని పిలిచేదాన్న. మీ తమ్ముడి పేరేంటమ్మా అని ఎవరొచ్చి అడిగినా చక్కగా 'భరాతర్' అనే చెప్పేదాన్న. అందరూ మళ్లీ మళ్లీ అడిగి నవ్వేవారని అప్పట్లో అర్ధం కాలేదు మరి :( ముహూర్తంలో అలా పిలిచానో గానే, మొన్న మొన్నటిదాకా కూడా మా కజిన్స్ అందరూ వాడిని అలాగే పిలిచేవారు. విషయం ఇలా బ్లాగులో నిలబడి టాం టాం చేశానని తెలిస్తే తప్పకుండా గొడవకొచ్చేస్తాడు. అంతే కాదు, వచ్చి ఇప్పుడు నేను చెప్పబోయేది గుర్తు చేసి కక్ష కూడా తీర్చుకుంటాడు. అదేంటంటే.. అదే నేను చెప్పాలనుకున్న రెండో సంగతి.

నేను ఎనిమిదో తొమ్మిదో చదివే రోజుల్లో ఒక వేసవి సాయంత్రం హాయిగా నవారు మంచాలేస్కుని ఇంటి వెనక పెరట్లో కూర్చుని, ప్రతీ చిన్న పదానికీ కామెడి చేస్తూ నేనూ, తమ్ముడూ బాగా నవ్వుకుంటున్నాం. అప్పుడు మా అమ్మమ్మ కోసం వాళ్ల భక్తి సంఘం నాయకురాలు, వాళ్ల పిన్ని అయిన ఒక బామ్మ గారు వచ్చారు. పాపం, వాళ్ల కబుర్లకి అంతరాయం కలుగుతుందని అమ్మమ్మ మా ఇద్దరినీ అరిచింది కాసేపు నోర్మూసుకుని కూర్చోమని. ఇహ చేసేదేమీ లేక మేము కూడా వాళ్ల మాటలు వినక తప్పింది కాదు. వచ్చిన బామ్మ గారి మాటల్లో ఒక వాక్యం మా ఇద్దరినీ బాగా ఆకర్షించింది. ఆవిడ ఏమన్నదంటే.. 'అదే అమ్మాయ్.. మా నచ్చత్రమ్మోళ్ళ పెనివిటి తమ్ముడికిచ్చింది, మన ఎంకాయమ్మ చెల్లెల్నే గదూ..' అనుకుంటూ ఏవేవో చెప్పుకున్నారు. ఆవిడ వెళ్ళిపోగానే మా అమ్మమ్మని అడిగాము మేమిద్దరం 'నచ్చత్రమ్మ' ఎవరని? అదేం పేరూ అయినా.. 'నచ్చత్రమ్మా' అనుకుంటూ.. దానికి అమ్మమ్మ 'ఆవిడ వాళ్ల చెల్లెలులే..అయినా నవ్వడం ఏంటి అసలు.. పెద్దాచిన్నా లేకుండా.. అంత నవ్వొచ్చే విషయమేంటి అసలు అక్కడ.. ఆవిడ వెళ్లి వేరేవాళ్ళ దగ్గర చెప్పదూ.. ఫలానా వాళ్ల మనవడు, మనవరాలు అస్సలు బుద్ధిమంతులు కాదు అని.. మీకసలు మాత్రం భయం, భక్తీ లేకుండా పోతున్నాయి' అని చిన్నపాటి ప్రైవేటు చెప్పేసింది. అసలు 'నచ్చత్రమ్మ' అంటే ఏంటి.? ముందు అర్ధం చెప్తారా.. లేదా.? అని మేము ఎదురాడాం. ఇంతలో అమ్మ కూడా వచ్చింది. 'అబ్బ ఏం పిల్లలో ఏమో నాయనా.. ఒకటే గోల.. మీరు ఇంటికొచ్చారని రెండు వీధులవతల దాకా తెలిసిపోతుంది తెలుసా.? అందరూ అడుగుతూ ఉంటారు' అని విసుక్కుంది. సరే.. గోల ఆపుదాం కదా అని 'నచ్చత్రమ్మ' అంటే 'నక్షత్రం' అని లేరా.. వాళ్ళేదో అలా పలుకుతున్నారు గానీ' అని చెప్పింది. ఇహ చూస్కోండీ..ఆపకుండా ఒక అరగంటైనా నవ్వుతూనే ఉన్నాం మేమిద్దరం.. అంత మంచి పదాన్ని ఇంత ఘోరంగా మార్చేసారా అనుకుంటూ.. అప్పుడే, మా తమ్ముడు ఒక విప్లవాత్మకమైన నిర్ణయం కూడా తీసేస్కున్నాడు. అదేంటంటే, భవిష్యత్తులో మా అమ్మాయికి 'నక్షత్రమ్మ' అని పేరు పెట్టాలని. ఒకవేళ కాస్త మోడ్రన్ గా ఉండాలని అనుకుంటే 'నక్షత్ర' అని పెట్టుకోవాలంట. రోజు మా ఇంటిల్లిపాదీ మాములుగా నవ్వలేదు మేము. విధంగా ఆలూ లేదూ, చూలు లేదూ, అల్లుడి పేరు సోమలింగం అన్నట్టుగా, రోజే మా అమ్మాయికి నామకరణం జరిపేసాడు మా తమ్ముడు. ఇప్పటికీ విషయం గుర్తు చేసుకుని నవ్వుతూనే ఉంటాం మేమందరం. నిజంగా భవిష్యత్తులో అమ్మాయి పుడితే, నేను పేరు పెట్టుకున్నా, వాడు మాత్రం 'నక్షత్ర' అనే పిలుస్తాడనడంలో నాకే సందేహమూ లేదు. అందుకని నేను కూడా వాడి కూతురు కోసం ఒక విచిత్రమైన పేరు వెతుకుదామనుకుంటున్నా.. వీలైతే మీరూ చెయ్యి (అదేనండీ.. ఓ పేరు) వేయండి ;) అంతే కాదండోయ్.. అత్యుత్తమ పేరు సూచించినవారికి 'విచిత్రనామ పితామహ' అనే బిరుదు కూడా ఇవ్వబడుతుంది. ఇక మీదే ఆలస్యం.!

ముగించేద్దాం అనుకుంటూ ఉండగా మరో విషయం జ్ఞాపకానికి వచ్చింది. నాకొక చిచ్చర పిడుగు లాంటి మరదలు ఉంది. దానికి నాలుగైదేళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ నాయనమ్మ పేరు మోటుగా ఉందని 'శిరీష' అనీ, వాళ్ళ పెద్దమ్మ పేరు 'అనూహ్య' (టీవీ ప్రభావమనుకుంటా ;) అనీ మార్చేసింది. ఎవరడిగినా అదే చెప్పడం కాకుండా వాళ్ళ నాయనమ్మకి కూడా వార్నింగ్ ఇచ్చేసింది ఇకనుంచీ తన పేరు 'శిరీష' అనే చెప్పాలని ;) అదే వయసులో ఉన్నప్పుడు ఒకసారి మా నాన్న వాళ్ళ అక్క పేరు సామ్రాజ్యం అని ఏదో చెప్తుంటే..'అదేం పేరు.. సముద్రం అని పెట్టలేకపోయారా.?' అనేప్పటికి మా అందరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినంత పనయ్యింది. అదేమరి జనరేషన్ గ్యాప్ అంటే ;)