Tuesday, April 07, 2015

కాస్త ఆలోచిస్తే...

​అవునూ.. నాకో సందేహం!
అసలు ఈ బ్లాగులూ, ఫేస్ బుక్లూ, గూగుల్ ప్లస్లూ, ట్విట్టర్లూ, ఇంకా బోలెడన్ని రకరకాల సోషల్ నెట్వర్కింగ్/ సామాజిక అనుసంధాన వేదికలు ఎందుకోసం?
ప్రతీ మనిషి తన ఆలోచనలు, అభిప్రాయాలు, భావాలతో మొదలుపెట్టి కాదేదీ అనర్హం అన్నరీతిన తమ తమ వ్యక్తిగత ఆసక్తులని బట్టి తన ఇష్టం వచ్చినవన్నీ మిగతా ప్రపంచంచం ముందు ప్రదర్శించుకోవడానికేగా!
'ఇష్టం వచ్చినట్టు' అంటే "నేను ఇవ్వాళ ఆమ్లెట్ వేసుకు తిన్నాను, మా పదేళ్ళ అమ్మాయికి దోసెలు వెయ్యడం వచ్చింది, మా పెళ్ళిరోజు సందర్భంగా మా ఆయన పువ్వులు కొనిచ్చాడు, నేను వేసిన మల్లె తీగ మొగ్గ వేసింది, ఫలానా సినిమా చూసి నేను తరించాను, ఫలానా పాట భలే నచ్చింది, రాత్రి కలలో రామ్ గోపాల్ వర్మ దెయ్యం కథతో వచ్చాడు" ఈ రకంగా ఏదంటే అది ప్రదర్శించుకోవచ్చా?
ఓ.. భేషుగ్గా ప్రదర్శించుకోవచ్చు. ఎందుకంటే ఏ ఈనాడు పేపర్లోనో, స్వాతి పత్రికలోనో ఏదైనా అచ్చుకివ్వాలంటే దానికి కొన్ని పద్ధతులు, పరిమితులు లాంటివి ఉంటాయి గానీ ఎవరి సొంత బ్లాగుల్లో, ఫేస్ బుక్కుల్లో రాసుకోడానికి ఏ రూల్సూ లేవు. కేవలం ఆ కారణంగానే ఇవన్నీ ఇంత ప్రాచుర్యంలోకి వచ్చి ప్రతీ ఒక్కరికీ వారి వారి నిజ జీవితాల్లో ఎంత బిజీగా ఎలా ఉన్నా ఈ వర్చువల్ ప్రపంచాలు కల్పిస్తున్న వెసులుబాటుతో ఎవరికీ వారు నా చుట్టూ మంచిదో పిచ్చిదో నాసొంత ఘోష వినే నలుగురో నలభై మందో మనుషులు ఉన్నారు అన్న సంతృప్తిని ఉచితంగా ప్రసాదించేస్తున్నాయి.
'నాకో కంప్యూటర్, కీబోర్డ్ ఉంది. నా చేతికొచ్చినవన్నీ రాసి జనాల మోనిటర్ల మీద పారేస్తాను' అని ప్రతీ ఒక్క గోవిందయ్య, పార్వతమ్మా విజృంభిస్తుంటే ఆ సోది అంతా మేము భరించాలా? మేము ఏదో మా స్థాయికి తగినట్టు గొప్ప గొప్ప ప్రజ్ఞావంతులు, విజ్ఞానవంతులు అయిన వారి వివేక వచనాలు తప్ప ఇలాంటి చెత్తని క్షణమైనా సహించలేము - అనేవాళ్ళ పరిస్థితి ఏంటి పాపం? వాళ్ళీ మూర్ఖుల అజ్ఞాన లోకంలో పడి బాధలు పడవలసిందేనా?
అయ్యయ్యో.. అంతటి పెనుభారం మోయవలసిన అగత్యం గానీ, ఇలాంటి మూర్ఖుల వల్ల ప్రపంచానికి ఎంత నష్టం వాటిల్లుతోంది అని సమాజోద్ధరణ చేసే ప్రయాస కానీ వారెవరూ పడక్కర్లేదు పాపం!
ఎందుకంటే, ప్రతి ఒక్కరి కంప్యూటరుకి రిమోట్ వారి చేతుల్లోనే ఉంటుంది కాబట్టి. ఫేస్ బుక్, ప్లస్ లాంటి వాటిలోనైతే హాయిగా ఆ సదరు అజ్ఞానులని పీకి పక్కన పెట్టేసే సౌకర్యాన్ని వినియోగించుకుని, ఏ బ్లాగో మరొకటో అయితే సింపుల్ గా బ్రౌజర్ మూలనున్న ఇంటూ మార్కుని నొక్కి ఇలాంటి పనికిరాని సోది అనబడే పెను ప్రమాదం నుంచి మనల్ని, మన విలువైన కాలాన్ని కాపాడుకోవచ్చు. ఈ పని చేయడానికి సర్వకాల సర్వావస్థలలో మనకి అధికారం, సౌలభ్యం రెండూ ఉన్నాయి, ఉంటాయి.
ఏ సామాజిక వేదికల్లోనయితేనేమి అసలు మొత్తం ఎన్ని రకాల సమాచారం ఉంటుంది?
రాసేది ఎవరైనా, ఏ టాపిక్ గురించైనా, చదివేవాడి కోణం నుంచి మాత్రం రెండే రకాలు. 1. నాకు నచ్చింది 2. నాకు నచ్చనిది.
నచ్చింది చదివి ఆనందిస్తాం, ఇంకా ఎక్కువ నచ్చితే రీషేర్ లాంటివి చేస్తాం, చర్చలు అవీ పెట్టి మళ్ళీ మళ్ళీ పొగుడుతాం, తరిస్తాం. అలాగే నచ్చనిది అయితే మన పని ఇంకా సులువు. ఒకే ఒక్క మౌస్ క్లిక్కుతో తీసి పక్కన పారేస్తాం.
అంతే! కేవలం ఈ రెండే ఛాయిస్లు మనకి.
రాసింది ఎవరైనా ఆ విషయానికి ఉన్న విలువని బట్టి అది నాలుగు రోజుల పాటో, నలభై రోజుల పాటో జనాల కళ్ళ ముందు తిరుగుతుంటుందా లేక ఇంటర్నెట్లో మూల పడిపోయిన ఎన్నో కోట్ల పేజీల సరసన చేరుతుందా అనేది ఆధారపడి ఉంటుంది. ఎవరు అవునన్నా కాదన్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అభిమానించినా ద్వేషించినా కాలం తన పని తను చేసుకుపోయినట్టు రాతలదీ అదే పరిస్థితి!
కాబట్టి, ఈ ఇంటర్నెట్ యుగంలో ప్రతీ ఒక్కరూ చేతికొచ్చిందంతా రాసేస్తే ఎలా ఎలా ఎలా అని సామజ శ్రేయస్సు కోరే మహానుభావులందరూ గుండెలూ గొంతులూ చించుకుని శోష తెచ్చుకోనక్కర్లేదు. హాయిగా ఏ కాఫీనో తాగుతూ వారికి నచ్చిన రాతలు మాత్రమే చదువుకుని సుఖపడొచ్చు.

ఇప్పటిదాకా నే మాట్లాడినదంతా అందరికీ తెలిసిన సంగతే కదా.. కొత్తగా ఏవిటీ నా ఘోష? అని మీకు సందేహం రావచ్చు.
పైన అనుకున్న దాని ప్రకారం "నచ్చింది చదువు, నచ్చినవాళ్ళని అనుసరించు, నచ్చనిది చెత్తబుట్టలో తోసెయ్, నచ్చనివారిని దూరంగా విసిరేయ్" అని టూకీగా ఒక్కమాటలో తేల్చేయొచ్చు. అయితే ఇంత సులువుగా అయిపోతే మనుషుల్లోని వెరైటీకి, క్రియేటివిటీకీ ఆనవాల్లేకుండా అయిపోదూ!
-- నాకు ఫలానా సుబ్బమ్మ రాసే పధ్ధతి, సొల్లు కబుర్లు నచ్చలేదు. కానీ నేను సుబ్బమ్మ రాతల్ని పట్టించుకోడం మానేసి నా విలువైన సమయాన్ని కాపాడుకోకుండా సుబ్బమ్మ ఏదో ఒక సోది పోస్టు వేసిన ప్రతీసారి కాసేపు ఆవేశం తెచ్చుకుని ఇలాంటి సుబ్బమ్మల న్యూసెన్స్ వల్ల ఎంత చిరాకో నాలాంటి నలుగురినో, నలభై మందినో ముందేసుకుని నా కడుపుమంట చల్లారేదాకా ఆడిపోసుకుంటాను.
-- క్రమక్రమంగా నాకు తెలీకుండానే సుబ్బమ్మ ఏదో ఒక సోది రాస్తే తద్వారా నా కడుపు చించుకుంటే కలిగే ఎంటర్టైన్మెంటుకి అలవాటు పడిపోయి నేను రోజురోజుకీ సుబ్బమ్మ అభిమానుల కన్నా సుబ్బమ్మ సోదిని ఎక్కువగా ఫాలో అయిపోతూ ఉంటాను.
-- ఏ మాటకామాటే నేను గుర్తించకపోయినా పాపం సుబ్బమ్మ తన సోదితో తన అభిమానులకే కాక నాలాంటి వ్యతిరేకులకి సైతం బోలెడు వినోదం అందిస్తోంది.
-- అయినా సరే, ఒక ప్రతిభాపాటవాలున్న విజ్ఞానమూర్తిగా, సూపర్ హైపర్ ఇంటలెక్చువల్ గా ఇలాంటి సుబ్బమ్మల దురాగతాల వల్ల సమాజానికి జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఊరుకోలేను కాబట్టి నాలాంటి మరికొందరు మేధావులని కూడగట్టుకుని ఇలాంటి సుబ్బమ్మలని ఏ ఫేస్ బుక్ కూడలిలోనో పబ్లిగ్గా చీల్చి చెండాడేసి నేను సైతం ఈ ఇంటర్నెట్టు లోకానికి విజ్ఞాన సమిధనొక్కటి ధారబోస్తాను. ఈ మహాయజ్ఞంలో ఎదురయే కష్టనష్టాలు, విమర్శలకి తలవొగ్గకుండా నిశ్చయంగా ముందుకుపోతాను.

ఈ మహాయజ్ఞంలో నాకు గానీ, నాతో పాటు ఒక్కో సమిధ యజ్ఞగుండంలోకి విసిరే నాలాటి వాళ్ళకి గానీ అస్సలు రాని ఆలోచనలు ఏంటంటే,
"పొద్దున్నే లేచి ఇడ్లీ చేసాను, మధ్యాహ్నం పుస్తకం చదివాను, సాయంత్రం సినిమా చూసాను, మా అమ్మాయి రెండు జడలేసుకుంది" వగైరా వగైరా సోదంతా అందరికీ చెప్పడమే సుబ్బమ్మ చేసిన నేరం, ఘోరం అయితే మరి ఒక్కసారో, ఐదో సార్లో, పది సార్లో, 'అప్పటివో, ఇప్పటివో ఫోటోలు షేర్ చెయ్యనివారం, మా అమ్మాయి దోసె వేసిందవో, మా అబ్బాయి బొమ్మ గీసాడనో పిల్లల కబుర్లు ఒకింత గర్వంగా చెప్పుకోనివారం, మా ఆయనో ఆవిడో ఫలానా సందర్భంలో ఇలా స్పందించారని మురిపెంగానో, కినుకగానో మాటల్లో దొర్లనియ్యని వారం, ఉల్లిపాయ పచ్చడో, ఉగాది పచ్చడో స్వయంగా చేసామని ఫోటోలు ప్రదర్శించనివారం, వాకింగుకో, జాగింగుకో, హైకింగుకో పోయినప్పుడు తీసిన ఫోటోలు చూపించనివారం...........

ఇదంతా కాదు కానీ మన గుండె మీద చెయ్యి వేసుకుని ఒకసారి మనలోకి మనం చూసి నిష్పక్షపాతంగా ఆలోచించుకుని, "నాకు ఏ రెండో మనిషి గుర్తింపు కానీ, ఎవరితోనూ నా విషయాలో, ఆలోచనలో పంచుకోవాలన్న కోరిక గానీ, చిన్నదో పెద్దదో నాకున్న టాలెంట్ ఏదో నలుగురిలో ప్రదర్శించుకోవాలన్నతపన కానీ అస్సలు అణువంత మాత్రమైనా లేదు. అయినాకానీ జస్ట్ ఊరికే ఎందుకో ఏమిటో ఉత్తినే ఈ సోషల్ నెట్వర్కింగ్లో తిరుగుతూ ఉంటాను. __ అని కనీసం మనల్ని మనమైనా నమ్మించుకోగలమా?

సుబ్బమ్మ అయినా వెంకమ్మ అయినా గోవిందయ్య అయినా ఏతావాతా మనందరకీ మనం ఊహించుకునేంత గొప్ప గొప్ప స్థాయీబేధాలేమీ లేవేమో ఒకసారి మనం గమనించుకుంటే బాగుంటుంది. అందరు మనుషుల్లోనూ బలాబలాలు, బలహీనతలు, చిన్నవో పెద్దవో లోపాలు ఉండకుండా పరిపూర్ణ మనుషులు ఎవరూ ఉండకపోవచ్చు. కానీ మనని వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టనంత వరకూ మంచిదో పిచ్చిదో సోదిదో ఎవరికీ తోచిన పని వాళ్ళు చేసుకోవడం అనేది వారి ప్రాథమిక హక్కు. ఆయా పనుల్నో, రాతల్నో నచ్చితే పట్టించుకోవడం, నచ్చకపోతే నిర్మొహమాటంగా విస్మరించి మన పని మనం చూసుకోడం నిజమైన విజ్ఞానం, గొప్పతనం అనిపించుకుంటుంది. అంతేగానీ ఎవరో పది నిమిషాలు వెచ్చించి సోది రాసారని మనకి అనిపిస్తే మనం ఇరవై నిమిషాలు వెచ్చించి ఫలానా వారి సోదిని గురించి ఏకిపారేయడం వారి కన్నా మనల్ని ఒక మెట్టు దిగజారుస్తుందే తప్ప ఏ విధంగానూ ఉన్నతులని చేయదని గుర్తుంచుకోవాలి.
అయినా నిజంగా చూస్తూ ఊరుకోలేని సామాజిక చైతన్యం ఉన్నవాళ్ళు ఎవరైనా సమాజానికి తీవ్ర నష్టం కలిగించేవో, తప్పుదారి పట్టించేవో అయిన రాతలో, చేతలో చేసేవారిని దుమ్ము దులిపే కార్యక్రమాలు పెట్టుకుంటే బాగుంటుంది కానీ ఎవరికీ నష్టం లేని సోది కబుర్లో పిచ్చి కబుర్లో చెప్తున్నారని వారిని వీధిలో నిలబెట్టి నవ్వులపాలు చేసి ఇక వారు చుట్టుపక్కలెక్కడా కనపడకుండా పారదోలే పనులు వారి వారి స్థాయికి తగని పనులేమో ఆలోచిస్తే బాగుంటుంది. లేదూ ఊరికే కాలక్షేపం కోసం మాత్రమే ఇలాంటివి చేస్తున్నాం అనుకుంటే మన కన్నా సోది కబుర్ల సుబ్బమ్మలే వెయ్యి రెట్లు నయం కదూ.. మంచిదో పిచ్చిదో ఎవరి జోలికి రాకుండా వారి పనేదో వాళ్ళు చేసుకుపోతున్నారు.
ఎవరినైనా అపహాస్యం చెయ్యడం, నొప్పించడం చాలా తేలిక. మరొకరితో కలిసి మనమూ ఒక రాయి విసరడం సరదాగానే ఉంటుంది. కానీ రాళ్ళు విసిరే ఉద్దేశ్యంతో చూసేవారుంటే మనలోనూ లోపాలు కనిపించకపోవు, ఏదో ఒక రోజున మనమూ రాళ్ళ దెబ్బలు తినకపోము. అయినా ఏదో పిట్టకథలో చెప్పినట్టు ఎవరి మీదైనా రాయి విసిరే ముందు మనం ఎంతటి మహాత్ములం అన్న ప్రశ్న ఒక్కసారి వేసుకోలేమా?
అలాగే ఎవరు ఎవరి మీద రాళ్ళు విసిరే పని పెట్టుకున్నారో ముందూ వెనుకా కాస్త గమనించుకోకుండా అమాయకంగానో అజ్ఞానంగానో తెలిసీ తెలియక మనమూ 'అంతే అంతే' అని వంతపాడే పొరపాటు జరక్కుండా చూసుకోడం కూడా మన బాధ్యతే!

*** ఏదో కళ్ళముందుదాకా ఏదో ఒక విషయాలు వచ్చినప్పుడు చూస్తూ ఊరుకోలేక జనాంతికంగా నాకనిపించిన నాలుగు ముక్కలు నా బ్లాగులో రాసాను. పరవాలేదు చదవొచ్చు అనిపించినా వారు నాలుగు నిమిషాలు వెచ్చించండి, పనికిరాని సోది అనిపించినవారు వెంటనే ఈ పేజీ మూసేసి మీ విలువైన కాలాన్ని దక్కించుకోండి. :-)
Thanks everyone!