Tuesday, February 23, 2010

గోదావరి ఒడ్డున..




గోదావరి ఒడ్డున సాయంసంధ్యాసమయంలో నించున్నాను.

పడమటన బంగారుబంతిలా మెరుస్తున్న సూరీడు మెలమెల్లగా గౌతమి ఒడిలో మమేకమైపోతున్నట్టుంది.


చల్లని గాలి తెమ్మెరల గిలిగింతలకి నీటి అలలు వయ్యారంగా కదులుతున్నాయి.
వాటిపైన పడి మెరుస్తున్న సూర్యకిరణాలను చూస్తుంటే నక్షత్రాలు దిగొచ్చి గోదావరి అలలపైన తేలియాడుతున్నాయా అన్నట్టుంది.


దూరంగా కనిపిస్తున్న చిన్న చిన్న చెక్క పడవలు క్రమంగా నా కంటికి చేరువౌతున్నాయి.
నీలాకాశంలో గూడు చేరే తొందరలో ఉన్న పక్షులు అలుపనుకోకుండా తమ పయనాన్ని సాగిస్తున్నాయి.
దూరంగా వంతెనపైన పరుగులు తీస్తున్న వాహనాలు చీమల బారుల్ని తలపిస్తున్నాయి.


తూర్పున శ్రీరామచంద్రుడి ఆలయ గాలిగోపురం ఠీవీగా నిలబడి చూస్తోంది.
రామాలయానికి దారితీస్తున్న మెట్లు మిమ్మల్ని స్వామి చరణాల వద్దకు చేరుస్తాను రమ్మని పిలుస్తున్నట్టుగా ఉంది.


Thursday, February 11, 2010

'ఫార్వార్డ్ మెయిల్' అను ఒక చిన్న కథ (వ్యథ)..!!

పొద్దున్న గడియారం ఎనిమిది గంటలు కొట్టింది. ప్రశాంత్ పాపం ఉలిక్కిపడి నిద్దర లేచాడు. పొద్దున్నే పేపరు చూస్తుంటే, దాంతో పాటే వచ్చిన ఒక పాంప్లేటు మీద ప్రశాంత్ కన్ను పడింది. ఎక్కడో హిమాలయాల్లో 'స్వామీ త్రయానందా' అని అత్యంత పవర్ఫుల్ స్వామీజీ ఒకరున్నారట. ఆయన ఎవరి పేరు మీదైనా మూడు సార్లు జపం చేస్తే చాలు, వారికి సాక్షాత్తూ దేవుడే దిగి వచ్చి వరాలు ఇచ్చినట్టే లెక్కట. మూడువేల మూడువందల ముప్పైమూడు రూపాయలు డీడీ తీసి పంపిస్తే.. సరిగ్గా ముప్పై మూడు రోజుల తరవాత రోజున, మనసులో కోరుకున్న మూడు కోరికలు తీరతాయని రాసుంది పాంప్లేట్లో. ఇంతలో ఠంగుమని గడియారం తొమ్మిది కొట్టడంతో చేతిలో ఉన్న పేపరు విసిరేసి ఆఫీసుకెళ్లడానికి ఆఘమేఘాల మీద రెడీ అయ్యి వెళ్లి బస్టాపులో నుంచున్నాడు ప్రశాంత్.

ఇంతలో కుయ్ కుయ్ అని జేబులో ఉన్న సెల్లు ఫోన్ మోగింది. ఏంటా అని చూస్తే 'ఓం జావా మాతాయే నమః' అని తొమ్మిది సార్లు టైపు చేసిన ఎస్సెమ్మెస్ ఒకటి వచ్చింది ఎవరో స్నేహితుడి దగ్గర నుంచి. తొమ్మిదిసార్లు మంత్ర జపం తరవాత యీ ఎస్సెమ్మెస్ అందుకున్నవారు తొమ్మిది నిమిషాల్లో తొంభై తొమ్మిది మందికి పంపిస్తే ఉద్యోగం లేని సాఫ్ట్వేరు ఇంజనీర్లకు తొమ్మిది రోజుల్లో పేద్ద ఉద్యోగం వస్తుంది. ఆల్రెడీ ఉద్యోగం ఉన్నవాళ్ళకి తొమ్మిది వారాల్లో గొప్ప అప్ప్రైసలు, అలాగే ప్రమోషను గ్యారంటీ. యీ ఎస్సెమ్మెస్సు అందుకుని కూడా తొమ్మిది నిమిషాల్లో తొంభై తొమ్మిది మందికి పంపించకపోతే తొమ్మిది రోజుల్లో వాళ్లకి పింక్ స్లిప్ రావడం ఖాయం. యీ ఎస్సెమ్మెస్సుని డిలీట్ చేస్తే తొంభై రోజుల్లో వాళ్ళు నేర్చుకున్న జావా అంతా మర్చిపోవడం, తథ్యం..తథ్యం..! అని రాసుంది. అది చూసి ప్రశాంత్ కి చాలా భయమేసింది. వామ్మో రాక రాక ఉద్యోగం వచ్చింది. పైగా క్రెడిట్ కార్డు బిల్లులు బోలెడు కట్టాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు పింక స్లిప్పా..అసలే రెసెషను..ఎందుకొచ్చిన రిస్కూ అనుకుని వణికిపోయి వెంటనే ఎస్సెమ్మెస్సుని తన ఫోనులో ఉన్న కాంటాక్టులందరికీ పంపించేసాడు. '87 SMS sent' అని చెప్పింది సెల్లు ఫోను. మిగిలిన 13 ఎలాగా అని ఒక క్షణం ఆలోచిస్తుంటే, అక్కడే నిలుచున్న మరికొంతమంది యువకుల మీదికి దృష్టి వెళ్ళింది. 'ఏం బాస్.. జాబు లో ప్రొమోషన్ కోసం ట్రై చేస్తున్నావా.? నా దగ్గర ఒక కిటుకుంది.. చెప్పనా.? అని అడిగాడు. మరి కాసేపట్లో బస్టాపులో సెల్లులన్నీ కుయ్యో మొర్రో అని గగ్గోలు పెట్టాయి. హమ్మయ్య అని స్థిమితపడేలోపు తను ఎక్కాల్సిన బస్ మిస్సయిపోయిందని తెల్సిసింది ప్రశాంత్ కి. హా.. అని ఒక ఆర్తనాదం చేసి వేరే దారి లేక ఆటో ఎక్కాడు ప్రశాంత్. ఈ జావా మాత' ఎస్సెమ్మెస్సేమో గానీ బస్సు మిస్సయ్యి జేబుకి పాతిక రూపాయలు చిల్లు పడింది అని గొణుక్కుంటూ ఆఫీసుకెళ్ళాడు.

ప్రశాంత్ ఆ వేళ ఏదో ముఖ్యమైన టీమ్ మీటింగుకి వెళ్ళాల్సి ఉంది మరో పావు గంటలో. సరే, ఈలోపు మెయిల్స్ చెక్ చేసుకుందామనుకున్నాడు. మొత్తం నాలుగు మెయిల్స్ వచ్చాయి. మొదటి మెయిల్లో ఒక క్రాస్ ఫోటో ఉంది. ఈ క్రాస్ ని చూసాక కనీసం పదిమందికిన ఫార్వార్డ్ చేయాలని, మళ్ళీ ఆ క్రాస్ తిరిగి నీ దగ్గరికి ఎలాగైనా చేరితే ఆ ప్రభువు కృప ఎల్లప్పుడూ ఉంటుందని రాసుంది అందులో. మెయిల్ చూసి కూడా ఫార్వార్డ్ చేయకపోతే వెంటనే అష్టకష్టాలు రావచ్చని హెచ్చరిక ఉంది. ఆఫ్రికా దేశంలో అలా చేసిన ఎడిసన్ అనే అతనికి ఒక గంటలోపే ఉద్యోగం పోయిందని, ఒక రోజు లోపే యాక్సిడెంట్ అయిందని కూడా రాసుంది. హమ్మో.. ఎందుకొచ్చిన గోలలే నాకు అనుకుని చకచకా ఫార్వార్డ్ చేసేసాడు ప్రశాంత్ తన కాంటాక్ట్స్ అందరికీ.

ప్రశాంత్ కి వచ్చిన రెండో మెయిల్లో చిట్టి గణేష్ బొమ్మ ఉంది. ఇది మెయిల్లో తిరుగుతూ ఉండే లక్కీ గణేష్, ఇప్పుడు ఇది నీ దగ్గరికొచ్చిందంటే నీకు లక్కు వచ్చినట్టే. దీన్ని నువ్వు ఇద్దరికీ ఫార్వార్డ్ చేస్తే నువ్వు కోరుకున్నది రెండేళ్లలో తీరుతుంది. ఆరుగురికి ఫార్వార్డ్ చేస్తే నీ కోరిక ఏడాదిలో తీరుతుంది. పదిహేను మందికి ఫార్వార్డ్ చేస్తే ఆర్నెల్లలోపు, ముప్పై మందికి ఫార్వార్డ్ చేస్తే మూడు రోజుల్లోనూ తీరుతుంది అని రాసుంది. ఒకవేళ ఇది చూసి కూడా ఫార్వార్డ్ చేయలేదో, ఇక నీకు ఈ జన్మే కాదు వచ్చే పది జన్మల దాకా దురదృష్టం దెయ్యంలా వెంటాడుతుంది. దిష్టి కొట్టుకుని నీకున్నదంతా ఊడ్చుకుపోతుంది అని రాసుంది. అన్ని శాపనార్ధాలు చూసేసరికి ప్రశాంత్ కి కంగారొచ్చి వందకి పైనే ఉన్న తన కాంటాక్ట్స్ అందరికీ ఫార్వార్డ్ చేసేశాడు.

ఇక మూడో మెయిల్ నిండా నక్షత్రాలు ఉన్నాయి. ఇక్కడ 786 నక్షత్రాలు ఉన్నాయి. ఇవి తారల రూపంలో ఉన్న ఆ అల్లా ఆశీస్సులు. నీకు ప్రేమున్నవారందరికీ ఈ తారలు పంపిస్తే నీకూ, వారికీ కూడా సంపూర్ణాయుష్షు లభిస్తుంది అని రాసుంది. సర్లే అనుకుని ఫార్వార్డ్ బటన్ నొక్కేశాడు ప్రశాంత్. నాలుగో మెయిల్లో ఐశ్వర్యా రాయి, కత్రినా కైఫు, కేట్ విన్స్లెట్టు, జెన్నిఫెర్ లోపెజ్జు..వగైరా భామల ఫోజులున్నాయి. ఈ మెయిలు మీకు తెలిసిన అబ్బాయిలందరికీ ఫార్వార్డ్ చేస్తే మీకు ఇంతందంగా ఉండే గర్ల్ ఫ్రెండ్ దొరకుతుంది. ఈ మెయిలు చూడగానే ఫార్వార్డ్ చేయలేదో... మీరు నిద్దరలో కూడా జడుసుకునేలాంటి పెళ్ళాం వస్తుంది అని రాసుంది. హమ్మ్..అన్నీటికంటే ఇది మరీ భయంకరమైన రిస్కు...అనుకుంటూ అది కూడా ఫార్వార్డ్ చేసేసాడుప్రశాంత్.

హమ్మయ్య... ఇంకేం రిస్కులు లేవు అని తీరిగ్గా రిలాక్స్ అవుతున్న ప్రశాంత్ కి గోడ మీద వెక్కిరిస్తున్నట్టున్న గడియారం కనిపించింది. అందులో అంకెలు, ముళ్ళు బదులు డ్రాకులా మేకప్పు వేసుకున్న వాళ్ళ బాస్ మొహం కనిపించింది. "ఓ మై గాడ్....నేను వెరీ వెరీ ఇంపార్టెంటు మీటింగ్ మిస్సయ్యానురా దేవుడోయ్" అంటూ ఒక వెర్రి కేక పెట్టాడు.ఆ తరవాత కాసేపటికి బాస్ నుంచి పిలుపొచ్చింది ప్రశాంత్ కి. బాస్ క్యాబిన్లోకి వెళ్ళిన ప్రశాంత్ ఒక గంట తరవాత మొహం వేళ్ళాడేసుకుని బయటికొచ్చాడు.



శిరోభారం వదుల్చుకుందుకు కాఫీ తాగుతూ కూర్చుంటే ప్రశాంత్ కి ఇలా అనిపించింది. పొద్దున్న పేపర్లో ఏదో పామ్ప్లేట్ చూసి సిల్లీ ప్రకటన...పూర్ పీపుల్ అనుకున్నాను. మరి ఎస్సెమ్మెస్సులు , మెయిళ్ళు ఫార్వార్డ్ చేసి నేను చేసింది మాత్రం ఏముంది. కాస్త సోఫిస్టికేటెడ్ మూఢనమ్మకం.. అంతేగా!! కాకపోతే ఎలాగూ ఫ్రీ ఎస్సెమ్మెస్సు, ఫ్రీ మెయిలే కదా.. ఫార్వార్డ్ చేసేస్తే ఏ రిస్కూ ఉండదనుకున్నానా..? హుమ్మ్..అసలా మాత్రమైనా ఆలోచించానా.? ఒక్క నిమిషం ఆలోచించినా ఇదెంత పిచ్చి పనో నాకే అర్ధమయ్యేది. ఈ ఫార్వార్డ్ వ్యథ నుంచి తప్పించుకునేది ఎలాగా.. అని ఆలోచిస్తుంటే ప్రశాంత్ కొక అద్భుతమైన ఐడియా తట్టింది. మరుక్షణమే దాన్ని అమలుపరిచేసి ఫార్వార్డ్ మెయిళ్ల నుంచి విముక్తి పొందాడు.

ఇంతకీ ప్రశాంత్ ఏమి చేసాడంటే..తన కాంటాక్ట్స్ లో అందరికీ ఒక ఫార్వార్డ్ మెయిల్ పెట్టి అందులో ఇలా రాశాడు. "ఈ ఫార్వార్డ్ మెయిల్ అందుకున్న వారెవరైనా, ఎప్పుడైనా, ఏ కారణం చేతనయినా 'ప్రశాంత్' అనే పేరున్న వ్యక్తులకి ఫార్వార్డ్ మెయిళ్ళు పంపినట్లయితే మీకు ఆయా ఫార్వార్డ్ మెయిళ్ల వల్ల వచ్చే అదృష్టం దక్కకపోగా, మీకు జీవితంలో ప్రశాంతత అనేదే లేకుండా పోతుంది."

Thursday, February 04, 2010

అచ్చం మన ప్రేమలాగే!



ఆకాశం నుంచి జాలువారి నను తాకీ తాకగానే మాయమవుతున్న సన్నటి వాన తుంపర్లు
నీ మోముపై క్షణంలో మెరిసి మాయమయ్యే దొంగ నవ్వుని గుర్తుకి తెస్తున్నాయి.

నేల మీద మెలమెల్లగా అదృశ్యమవుతున్న మంచు మేట
నీపైనున్న నిన్నటి నా అలకని కూడా కరిగిస్తున్నట్టుంది.

ఇంతలోనే చప్పున మబ్బుల చాటునుంచొచ్చి నను ముద్దాడిన సూర్యకిరణాలు
నీ నులివెచ్చని స్పర్శని జ్ఞప్తికి తెచ్చాయి.

అంతలోనే యీ సూర్యకాంతి, స్వాతి చినుకులు రెండూ మమేకమై
అంబరాన అందమైన హరివిల్లుని చిత్రించాయి.. అచ్చం మన ప్రేమలాగే..!!


Tuesday, February 02, 2010

"మనుషులెలా వచ్చారు..?" అను ఒక చిట్టి కథ

అనగా అనగా అనగా.. ఒక అందమైన బొమ్మరిల్లు లాంటి చిన్న ఇల్లు. ఇంట్లో ఒక ముచ్చటైన కుటుంబం. అమ్మా, నాన్నా, వాళ్ళకో ముద్దుల చిన్నారి. చిన్నారి పేరు బుజ్జి. బుజ్జి వయసు ఆరేళ్ళు.

ఒక రోజు బుజ్జి తన బొమ్మల పుస్తకంలో చెట్లు, పువ్వులు, పక్షులు, లాంటివన్నీ చూస్తూ ఆడుకుంటోంది. బుజ్జీ వాళ్ళ నాన్నేమో అక్కడే ఒక పక్కన ఒళ్ళో లాప్ టాప్ పెట్టుకుని బిజీగా తన ఆఫీసు పని చేసుకుంటున్నాడు.

బొమ్మల పుస్తకం చూస్తున్న బుజ్జికి ఒక పెద్ద ధర్మసందేహం వచ్చింది. వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికెళ్ళి "నాన్నా నాన్నా.. మరి మనం చూసే యీ రకరకాల పువ్వులు, చెట్లు, పారెట్స్, ఇంకా మన టామీ.. ఇవన్నీ ఎలా వచ్చాయి, ఎక్కడ నుంచి వచ్చాయి.?" అని అడిగింది.


అప్పుడు బుజ్జి వాళ్ళ నాన్న బుజ్జిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని "అరే బుజ్జీ.. దేవుడు ఒక పెద్ద ప్రపంచం తయారు చేసి, అందులో యీ చెట్లు, జంతువులు, పక్షులు.. వీటన్నీటిని సృష్టించాడు." అని చెప్పాడు.

దానికి బుజ్జి "అది ఓకే..మరి మనుషులం ఎలా వచ్చాం.?" అని మళ్ళీ అడిగింది వాళ్ళ నాన్నని. "దేవుడు మొట్టమొదట ఆడమ్, ఈవ్ అనే ఇద్దరు మనుషుల్ని తయారు చేసాడు. తరవాత వాళ్లకి పిల్లలు పుడతారు కదా.. అలా అలా అలా.. చాలా రోజులయ్యేసరికి ఇంతమంది మనుష్యులు అయిపోయామన్న మాట.!" అని చెప్పాడు బుజ్జి వాళ్ళ నాన్న. అప్పటికి బుజ్జి సందేహం తీరినట్టే అనిపించింది.



ఒక రెండ్రోజులు పోయాక, సాయంత్రం పూట బుజ్జి వాళ్ళమ్మ వంటింట్లో మ్యాగీ నూడుల్స్ చేస్తోంది బుజ్జి కోసం. బుజ్జికెందుకో రెండ్రోజుల క్రితం తనూ, నాన్న మాట్లాడుకున్న విషయం గుర్తొచ్చింది. బుజ్జి వాళ్ళమ్మని కూడా అదే ప్రశ్న అడిగింది "అమ్మా.. మనమందరం మనుషులం ఎక్కడ నుంచి వచ్చాం.?" అని.

దానికి సమాధానంగా బుజ్జి వాళ్ళమ్మ చాలా ఏళ్ళ క్రితం యీ భూమ్మీద చాలా కోతులుండేవి బుజ్జీ.. కోతుల నుంచే క్రమక్రమంగా మనుషులందరూ వచ్చారు" అని చెప్పింది. అప్పుడు బుజ్జి "ఓహో అలాగా" అనయితే అంది గానీ ఒకే ప్రశ్నకి నాన్న ఒక సమాధానం, అమ్మ మరొక సమాధానం చెప్పారేంబ్బా.. అని ఆశ్చర్యపోయింది.

వేళ రాత్రి భోజనాల దగ్గర బుజ్జీ, వాళ్ళ అమ్మా, నాన్నా అందరూ కలిసి కూర్చున్నప్పుడు బుజ్జి అడిగింది "నాన్నా.. మనుషులెక్కడి నుంచి వచ్చారు అంటే.. నువ్వేమో దేవుడు సృష్టించాడు అని చెప్పావు. అమ్మనడిగితే మనుషులు కోతుల నుంచి వచ్చారు అని చెప్పింది. ఇంతకీ ఇందులో ఏది కరెక్టు? నాకు కన్ఫ్యూజింగా ఉంది" అని.

బుజ్జీ వాళ్ళమ్మ కూడా ఆసక్తిగా చూస్తోంది బుజ్జీ వాళ్ళనాన్న ఏమని చెప్తాడా సమాధానం అని. అప్పుడు బుజ్జీ వాళ్ళ నాన్న ఒక చిన్న నవ్వు నవ్వి ఇలా చెప్పాడు. "మ్మ్.. ఇందులో కన్ఫ్యూజన్ ఏమీ లేదురా బుజ్జీ.. చాలా సింపుల్.. నువ్వడిగిన ప్రశ్నకి నేనేమో నా వైపు కుటుంబం గురించి చెప్పాను. అమ్మేమో తన వైపు కుటుంబం గురించి చెప్పింది. అంతే.!!

ఇంక కథ అయిపోయింది. ఇప్పుడు మీరు నవ్వాలన్న మాట.! హీ హీ హీ...gelakgulingsengihnampakgigi