పొద్దున్న గడియారం ఎనిమిది గంటలు కొట్టింది. ప్రశాంత్ పాపం ఉలిక్కిపడి నిద్దర లేచాడు. పొద్దున్నే పేపరు చూస్తుంటే, దాంతో పాటే వచ్చిన ఒక పాంప్లేటు మీద ప్రశాంత్ కన్ను పడింది. ఎక్కడో హిమాలయాల్లో 'స్వామీ త్రయానందా' అని అత్యంత పవర్ఫుల్ స్వామీజీ ఒకరున్నారట. ఆయన ఎవరి పేరు మీదైనా మూడు సార్లు జపం చేస్తే చాలు, వారికి సాక్షాత్తూ దేవుడే దిగి వచ్చి వరాలు ఇచ్చినట్టే లెక్కట. మూడువేల మూడువందల ముప్పైమూడు రూపాయలు డీడీ తీసి పంపిస్తే.. సరిగ్గా ముప్పై మూడు రోజుల తరవాత రోజున, మనసులో కోరుకున్న మూడు కోరికలు తీరతాయని రాసుంది ఆ పాంప్లేట్లో. ఇంతలో ఠంగుమని గడియారం తొమ్మిది కొట్టడంతో చేతిలో ఉన్న పేపరు విసిరేసి ఆఫీసుకెళ్లడానికి ఆఘమేఘాల మీద రెడీ అయ్యి వెళ్లి బస్టాపులో నుంచున్నాడు ప్రశాంత్.
ఇంతలో కుయ్ కుయ్ అని జేబులో ఉన్న సెల్లు ఫోన్ మోగింది. ఏంటా అని చూస్తే 'ఓం జావా మాతాయే నమః' అని తొమ్మిది సార్లు టైపు చేసిన ఎస్సెమ్మెస్ ఒకటి వచ్చింది ఎవరో స్నేహితుడి దగ్గర నుంచి. ఆ తొమ్మిదిసార్లు మంత్ర జపం తరవాత యీ ఎస్సెమ్మెస్ అందుకున్నవారు తొమ్మిది నిమిషాల్లో తొంభై తొమ్మిది మందికి పంపిస్తే ఉద్యోగం లేని సాఫ్ట్వేరు ఇంజనీర్లకు తొమ్మిది రోజుల్లో పేద్ద ఉద్యోగం వస్తుంది. ఆల్రెడీ ఉద్యోగం ఉన్నవాళ్ళకి తొమ్మిది వారాల్లో గొప్ప అప్ప్రైసలు, అలాగే ప్రమోషను గ్యారంటీ. యీ ఎస్సెమ్మెస్సు అందుకుని కూడా తొమ్మిది నిమిషాల్లో తొంభై తొమ్మిది మందికి పంపించకపోతే తొమ్మిది రోజుల్లో వాళ్లకి పింక్ స్లిప్ రావడం ఖాయం. యీ ఎస్సెమ్మెస్సుని డిలీట్ చేస్తే తొంభై రోజుల్లో వాళ్ళు నేర్చుకున్న జావా అంతా మర్చిపోవడం, తథ్యం..తథ్యం..! అని రాసుంది. అది చూసి ప్రశాంత్ కి చాలా భయమేసింది. వామ్మో రాక రాక ఉద్యోగం వచ్చింది. పైగా క్రెడిట్ కార్డు బిల్లులు బోలెడు కట్టాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు పింక స్లిప్పా..అసలే రెసెషను..ఎందుకొచ్చిన రిస్కూ అనుకుని వణికిపోయి వెంటనే ఆ ఎస్సెమ్మెస్సుని తన ఫోనులో ఉన్న కాంటాక్టులందరికీ పంపించేసాడు. '87 SMS sent' అని చెప్పింది సెల్లు ఫోను. మిగిలిన 13 ఎలాగా అని ఒక క్షణం ఆలోచిస్తుంటే, అక్కడే నిలుచున్న మరికొంతమంది యువకుల మీదికి దృష్టి వెళ్ళింది. 'ఏం బాస్.. జాబు లో ప్రొమోషన్ కోసం ట్రై చేస్తున్నావా.? నా దగ్గర ఒక కిటుకుంది.. చెప్పనా.? అని అడిగాడు. మరి కాసేపట్లో ఆ బస్టాపులో సెల్లులన్నీ కుయ్యో మొర్రో అని గగ్గోలు పెట్టాయి. హమ్మయ్య అని స్థిమితపడేలోపు తను ఎక్కాల్సిన బస్ మిస్సయిపోయిందని తెల్సిసింది ప్రశాంత్ కి. హా.. అని ఒక ఆర్తనాదం చేసి వేరే దారి లేక ఆటో ఎక్కాడు ప్రశాంత్. ఈ జావా మాత' ఎస్సెమ్మెస్సేమో గానీ బస్సు మిస్సయ్యి జేబుకి పాతిక రూపాయలు చిల్లు పడింది అని గొణుక్కుంటూ ఆఫీసుకెళ్ళాడు.
ప్రశాంత్ ఆ వేళ ఏదో ముఖ్యమైన టీమ్ మీటింగుకి వెళ్ళాల్సి ఉంది మరో పావు గంటలో. సరే, ఈలోపు మెయిల్స్ చెక్ చేసుకుందామనుకున్నాడు. మొత్తం నాలుగు మెయిల్స్ వచ్చాయి. మొదటి మెయిల్లో ఒక క్రాస్ ఫోటో ఉంది. ఈ క్రాస్ ని చూసాక కనీసం పదిమందికిన ఫార్వార్డ్ చేయాలని, మళ్ళీ ఆ క్రాస్ తిరిగి నీ దగ్గరికి ఎలాగైనా చేరితే ఆ ప్రభువు కృప ఎల్లప్పుడూ ఉంటుందని రాసుంది అందులో. మెయిల్ చూసి కూడా ఫార్వార్డ్ చేయకపోతే వెంటనే అష్టకష్టాలు రావచ్చని హెచ్చరిక ఉంది. ఆఫ్రికా దేశంలో అలా చేసిన ఎడిసన్ అనే అతనికి ఒక గంటలోపే ఉద్యోగం పోయిందని, ఒక రోజు లోపే యాక్సిడెంట్ అయిందని కూడా రాసుంది. హమ్మో.. ఎందుకొచ్చిన గోలలే నాకు అనుకుని చకచకా ఫార్వార్డ్ చేసేసాడు ప్రశాంత్ తన కాంటాక్ట్స్ అందరికీ.
ప్రశాంత్ కి వచ్చిన రెండో మెయిల్లో చిట్టి గణేష్ బొమ్మ ఉంది. ఇది మెయిల్లో తిరుగుతూ ఉండే లక్కీ గణేష్, ఇప్పుడు ఇది నీ దగ్గరికొచ్చిందంటే నీకు లక్కు వచ్చినట్టే. దీన్ని నువ్వు ఇద్దరికీ ఫార్వార్డ్ చేస్తే నువ్వు కోరుకున్నది రెండేళ్లలో తీరుతుంది. ఆరుగురికి ఫార్వార్డ్ చేస్తే నీ కోరిక ఏడాదిలో తీరుతుంది. పదిహేను మందికి ఫార్వార్డ్ చేస్తే ఆర్నెల్లలోపు, ముప్పై మందికి ఫార్వార్డ్ చేస్తే మూడు రోజుల్లోనూ తీరుతుంది అని రాసుంది. ఒకవేళ ఇది చూసి కూడా ఫార్వార్డ్ చేయలేదో, ఇక నీకు ఈ జన్మే కాదు వచ్చే పది జన్మల దాకా దురదృష్టం దెయ్యంలా వెంటాడుతుంది. దిష్టి కొట్టుకుని నీకున్నదంతా ఊడ్చుకుపోతుంది అని రాసుంది. అన్ని శాపనార్ధాలు చూసేసరికి ప్రశాంత్ కి కంగారొచ్చి వందకి పైనే ఉన్న తన కాంటాక్ట్స్ అందరికీ ఫార్వార్డ్ చేసేశాడు.
ఇక మూడో మెయిల్ నిండా నక్షత్రాలు ఉన్నాయి. ఇక్కడ 786 నక్షత్రాలు ఉన్నాయి. ఇవి తారల రూపంలో ఉన్న ఆ అల్లా ఆశీస్సులు. నీకు ప్రేమున్నవారందరికీ ఈ తారలు పంపిస్తే నీకూ, వారికీ కూడా సంపూర్ణాయుష్షు లభిస్తుంది అని రాసుంది. సర్లే అనుకుని ఫార్వార్డ్ బటన్ నొక్కేశాడు ప్రశాంత్. నాలుగో మెయిల్లో ఐశ్వర్యా రాయి, కత్రినా కైఫు, కేట్ విన్స్లెట్టు, జెన్నిఫెర్ లోపెజ్జు..వగైరా భామల ఫోజులున్నాయి. ఈ మెయిలు మీకు తెలిసిన అబ్బాయిలందరికీ ఫార్వార్డ్ చేస్తే మీకు ఇంతందంగా ఉండే గర్ల్ ఫ్రెండ్ దొరకుతుంది. ఈ మెయిలు చూడగానే ఫార్వార్డ్ చేయలేదో... మీరు నిద్దరలో కూడా జడుసుకునేలాంటి పెళ్ళాం వస్తుంది అని రాసుంది. హమ్మ్..అన్నీటికంటే ఇది మరీ భయంకరమైన రిస్కు...అనుకుంటూ అది కూడా ఫార్వార్డ్ చేసేసాడుప్రశాంత్.
హమ్మయ్య... ఇంకేం రిస్కులు లేవు అని తీరిగ్గా రిలాక్స్ అవుతున్న ప్రశాంత్ కి గోడ మీద వెక్కిరిస్తున్నట్టున్న గడియారం కనిపించింది. అందులో అంకెలు, ముళ్ళు బదులు డ్రాకులా మేకప్పు వేసుకున్న వాళ్ళ బాస్ మొహం కనిపించింది. "ఓ మై గాడ్....నేను వెరీ వెరీ ఇంపార్టెంటు మీటింగ్ మిస్సయ్యానురా దేవుడోయ్" అంటూ ఒక వెర్రి కేక పెట్టాడు.ఆ తరవాత కాసేపటికి బాస్ నుంచి పిలుపొచ్చింది ప్రశాంత్ కి. బాస్ క్యాబిన్లోకి వెళ్ళిన ప్రశాంత్ ఒక గంట తరవాత మొహం వేళ్ళాడేసుకుని బయటికొచ్చాడు.
శిరోభారం వదుల్చుకుందుకు కాఫీ తాగుతూ కూర్చుంటే ప్రశాంత్ కి ఇలా అనిపించింది. పొద్దున్న పేపర్లో ఏదో పామ్ప్లేట్ చూసి సిల్లీ ప్రకటన...పూర్ పీపుల్ అనుకున్నాను. మరి ఎస్సెమ్మెస్సులు , మెయిళ్ళు ఫార్వార్డ్ చేసి నేను చేసింది మాత్రం ఏముంది. కాస్త సోఫిస్టికేటెడ్ మూఢనమ్మకం.. అంతేగా!! కాకపోతే ఎలాగూ ఫ్రీ ఎస్సెమ్మెస్సు, ఫ్రీ మెయిలే కదా.. ఫార్వార్డ్ చేసేస్తే ఏ రిస్కూ ఉండదనుకున్నానా..? హుమ్మ్..అసలా మాత్రమైనా ఆలోచించానా.? ఒక్క నిమిషం ఆలోచించినా ఇదెంత పిచ్చి పనో నాకే అర్ధమయ్యేది. ఈ ఫార్వార్డ్ వ్యథ నుంచి తప్పించుకునేది ఎలాగా.. అని ఆలోచిస్తుంటే ప్రశాంత్ కొక అద్భుతమైన ఐడియా తట్టింది. మరుక్షణమే దాన్ని అమలుపరిచేసి ఫార్వార్డ్ మెయిళ్ల నుంచి విముక్తి పొందాడు.
ఇంతకీ ప్రశాంత్ ఏమి చేసాడంటే..తన కాంటాక్ట్స్ లో అందరికీ ఒక ఫార్వార్డ్ మెయిల్ పెట్టి అందులో ఇలా రాశాడు. "ఈ ఫార్వార్డ్ మెయిల్ అందుకున్న వారెవరైనా, ఎప్పుడైనా, ఏ కారణం చేతనయినా 'ప్రశాంత్' అనే పేరున్న వ్యక్తులకి ఫార్వార్డ్ మెయిళ్ళు పంపినట్లయితే మీకు ఆయా ఫార్వార్డ్ మెయిళ్ల వల్ల వచ్చే అదృష్టం దక్కకపోగా, మీకు జీవితంలో ప్రశాంతత అనేదే లేకుండా పోతుంది."
18 comments:
అసలు ఈ ఫార్వర్డ్ మెయిల్స్ రానివాళ్ళే ఉండరేమో?.మనిషి నమ్మకాలతో ఆడుకుంటారు.మొత్తానికి ప్రశాంత్ తన సాఫ్ట్ వేర్ తెలివి ఉపయోగించి బాగానే తప్పించుకున్నాడు.
తెలివైనవాడు...హ్హ..హ్హ..హ్హా..
అప్పట్లో మైక్రోసాఫ్ట్ ఇంటర్నేట్ ఎక్స్ ప్లోరర్ గురించి కూడా ఒక మెయిల్ వచ్చింది. దానిలో అయితే మనం ఎంత మందికి ఫార్వర్డ్ చేస్తే అంత సంఖ్యలో కొన్ని డాలర్లు మనకు పంపిస్తాడని...ఆ మెయిల్ లో అయితే బ్యాంకు స్టేట్ మెంట్లు కూడా ప్రింట్ తీసి స్వయానా మైక్రోసాఫ్త్ వాడే పంపినట్టు ఉండేవి...ఆ తర్వాత హెచ్ పీ వాడు మెయిల్ ఫార్వర్డ్ చేస్తే లాప్ టాప్ ఇస్తారని...
నిజంగా ఇలాంటి ఫార్వార్డ్ మెయిల్స్ చూస్తే చిర్రెత్తుకొస్తుంది నాకు...అలాంటి మెయిల్స్ లో కుప్పలు కుప్పలుగా అందుకున్న వారి మెయిల్ అయిడీలు ఉంటాయి..అవి చూసినప్పుడలా ఇంత మంది వెర్రి బాగులోల్లు ఉన్నారా అని ఆశ్చర్యం వేస్తుంది నాకు...
అవునండో !!! నేను వీటి మీద పోస్ట్ రాద్దాం అనుకున్నాను ... మొన్న ఒక రోజు ఇలాంటివి తొమ్మిది మెయిల్స్ వచ్చాయి ఒకే రోజు .... ఇంకా పిచ్చ కోపం వచ్చింది ... చివరికి మా బాస్ కూడా ఇలాంటి మెయిల్ ఒకటి పంపాడు .... చెత్తనా ........ నేను ఇలాంటివి నమ్మను కాబట్టి సరిపోయింది ..... బావుంది మీ పోస్ట్ :):):)
:)
cartoons are funny
మధుర గారూ!
:):) మీ పోస్ట్ బావుంది :):)
మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు
అవునండీ.....ఫార్వాడ్ మెయిల్స్ తలనొప్పిగా అనిపిస్తాయి, నేనూ నమ్మను వీటిని.
భలే చెప్పారండి. నా సెల్ మెస్సేజెస్, మైల్స్ నేను ఫార్వర్డ్ చేయను కాని డిలీట్ చేయకుండా ఉంచుతున్నాను.ఎంతైనా భయమే కదండి బాబు. గుళ్ళదగ్గిర పాంప్లేట్స్ కూడా పంచుతారు. నేను ఈ మధ్య వాటిని తీసుకోకుండా తప్పించుకోటం నేర్చుకున్నాను.
మధురవాణి గారు! కథ బాగుంది.
నాకొక నిజం కూడా తెలిసిందోచ్.. ఏంటంటరా... మీరు రచయిత్రి అని. మీనుంచి మంచి కథల రావాలని ఆసిస్తున్నాను.
నేను ఇటువంటి మెయిల్స్ ని ఇప్పటివరకూ పంపించలేదు. నేను వాళ్లని ఎలా తిడుతున్నానో.. నేను పంపించిన వాళ్లు నన్ను అలాగే తిడతారని ఇప్పటివరకూ ఆ పని చేయలేదు.
@ స్రవంతి,
అవునండీ.. మనుషుల నమ్మకాలతో ఆడుకుంటారు. అది చాలా చిరాకు తెప్పించే విషయం.
@ శిశిర,
:)
@ శేఖర్ గారు,
అవునండీ.. నేనూ చూసాను ఇలాంటివి. కనీసం, ఇవొక రకం..ఇష్టముంటే చేస్తారు..లేకపోతే లేదు. మరీ బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు ఉండేవి చూస్తే నాకు భలే చిర్రెత్తుకొస్తుంది.
@ ఫణి గారూ,
అసలు ఇలాంటివి రాని వాళ్ళు ఎవరూ ఉండరేమో.. మొత్తానికి ఇది చాలా చిరాకు పెట్టే విషయం. మీ బాస్ కూడా ఫార్వార్డ్ చేసాడంటే..ఏమనుకోవాలో తెలీట్లేదు ;-)
@ విజయ మోహన్ గారూ..
:)
@ సుజ్జీ,
అంటే.. పోస్ట్ బాలేదా.? హీ హీ... ;-)
@ రాంగోపాల్ గారూ,
ధన్యవాదాలు :)
@ పద్మార్పిత గారూ,
నాకూ అంతేనండీ.. అల చిరాకోచ్చే ఈ పోస్ట్ రాసాను ;)
@ జయ గారూ,
చాలా మందికి భయమేనండీ బాబూ ఇలాంటివి చూస్తే.. అలా జనాల్ని బ్లాక్ మెయిల్ చేయడం తప్పే కదండీ మరి.. హుమ్.. ఎవరు మొదలు పెడతారో ఇలాంటివన్నీ :(
@ సవ్వడి,
'రచయిత్రి' అనేది మరీ పెద్ద పదమండీ నాకు :) మీరు ఆశించినట్టుగా మంచి పోస్టులు, కథలు రాయడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు :)
నేను చక్కగా 'స్పాం' అని మార్క్ చేసేస్తానండీ.. బాగుంది మీ చిట్టి కథ..
ఈమెయిల్ లో నాకు నచ్చని ఒకే ఒక పదం ఫార్వర్డ్ మెయిల్. (ఠాగూర్ స్టైల్‌లో)
మంచి టాపిక్ మీద రాసారు. :)
-Murali
http://ursfriendlyinn.blogspot.com/2010/04/blog-post.html
@:))
అవునండి. ఈ మైల్స్ వల్ల అనవసరంగా నెట్ వర్క్ లో చాలా సమస్యలు వస్తున్నాయి. నేను నా స్నేహితులకి ఇలాంటి మైల్స్ ఫార్వర్డ్ చెయ్యద్దని ఎంత మొత్తుకున్న వాల్లు వినడం లేదు. వాళ్ళు చెప్పే ఒకే కారణం 'ఫ్రీ' కదా, పంపడం లొ నష్టం ఎముంది?' అని. చివరికి MCA చదివిన నా స్నేహితులు కూడా ఇలా చేస్తుంటే వాళ్ళని ఏమనాలో అర్దం కావడం లేదు. వాళ్ళ చేత ఈ కధ ఒక్కసారి చదివించి చూడాలి.
@ ఈశ్వర్ గారూ,
నాకూ మీలాగే ఆ ఫార్వార్డ్ మెయిల్స్ తో చిర్రెత్తుకొచ్చి.. ఈ పోస్ట్ రాశాను అప్పట్లో.. :)
Post a Comment