Wednesday, July 31, 2013

My San Francisco Diary - 5



15.06.2013
శనివారం
రోజు ఉదయాన్నే ఆరున్నర కల్లా ఇంట్లోంచి బయలుదేరితే దాదాపు రెండొందల మైళ్ళ దూరంలో ఉన్న Lake Tahoe కి పది గంటల లోపే చేరుకోవచ్చని కిరణ్ ప్రభ గారు ప్లాన్ చేసారు. మేము ఉదయాన్నే వేడివేడిగా పెసరట్లు తిని తీరిగ్గా తయారయ్యేసరికి ఏడు గంటలైపోయింది. ఇంట్లోంచి బయలుదేరేసరికి ఏడు దాటింది. కార్లో కిరణ్ ప్రభ ​గారి​ పక్కన నా ప్లేస్ అయితే కాంతి గారేమో వెనక సీట్లో నా వెనుక కాకుండా నేను కనిపించేలా వేరే వైపు కూర్చునేవారు. కారెక్కగానే "ఇప్పుడు వెనక నేనొక్కదాన్నే కదా.. ఇంకో నాలుగు రోజులాగితే మా పెద్దమ్మాయి వచ్చేస్తుంది. ఎంచక్కా నా పక్కన కూర్చుని బోల్డు కబుర్లు చెప్తుంది" అని ఖాళీగా ఉన్న పక్క సీటుని చూస్తూ నిషిని గుర్తు చేశారు. నిషి వచ్చేదాకా రోజూ చాలా సందర్భాల్లో ఇలా తన గురించి ఏదోకటి అనుకుంటూ ఉండేవాళ్ళం. కార్లో మంచినీళ్ళ బాటిల్స్ పెట్టుకున్నాం కానీ నిన్న ఇండియన్ స్టోర్స్ లో కొనుక్కొచ్చిన స్నాక్స్ పెట్టుకోడం మర్చిపోయామని కొంచెం దూరం వెళ్ళాక గుర్తొచ్చి అయ్యో అనుకున్నాం. ముందురోజు Safeway కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమన్నా కొనుక్కుంటావా రేపు డ్రైవ్ లో తినడానికి అని కాంతి గారంటే అప్పుడే నాకు మైక్రోవేవ్ పాప్ కార్న్ కనిపించాయి. ఇంకేమన్నా కొనుక్కో అంటే "ఓ గది నిండా పాప్ కార్న్ నింపి, తాగడానికి మంచి నీళ్ళిచ్చి నన్ను అందులో పడేస్తే హాయిగా బతికేస్తాను కాంతి గారూ.. ఇంకేం అక్కర్లేదు" అని చెప్తే చాలాసేపు నవ్వారు. పొద్దున్నే ఆ పాప్ కార్న్ మాత్రం ఫ్రై చేసి కార్లో పెట్టుకున్నాం గానీ వేరే స్నాక్స్ సంగతే మర్చిపోయాం. సరే కావాలంటే మధ్యలో ఏమన్నా కొనుక్కుందాంలే అనుకున్నాం కానీ అప్పుడే పెసరట్లు బొజ్జ నిండా నింపెయ్యడం వల్ల ఎవ్వరికీ తిండి మీద ఆసక్తి కలగలేదు. "మూడు గంటల పైనే డ్రైవ్ కదా.. నీకు పర్లేదా తల్లీ.. ఏం ఇబ్బంది లేదు కదా.." అని కాంతి గారు కొంచెం కంగారుగా అడిగారు. "అన్ని గంటలు ఫ్లైట్ జర్నీ చేసి నిద్ర లేకపోవడం వల్ల కాస్త తేడా చేసింది కానీ ఇప్పుడు అమెరికా టైంకి సెట్ అయిపోయాను కదా.. ఇంకేం సమస్య ఉండదులెండి" అని ధైర్యం చెప్పాను.
ఇంకప్పుడు మొదలయ్యాయి మా కబుర్లు.. ఎక్కడెక్కడి నుంచో మొదలుపెట్టి అంతూ పొంతూ లేనట్టు ఎటో ఎటో వెళ్ళిపోయాం. కాసేపటికి కాంతి గారు ఊ కొడుతూనే నిద్రలోకి జారిపోయారు. "నువ్వు కూడా కాసేపు పడుకో తల్లీ.." అని కిరణ్ ప్రభ గారంటే "పర్లేదులెండి.. మీకు బోర్ కొడుతుంది కదా.." అని మేమిద్దరం మాట్లాడుకుంటూ కూర్చున్నాం. Lake Tahoe కి వెళ్ళే దారిలో ముందు చాలా దూరం వరకూ మొన్న చెప్పిన Ranches లాంటి కొండలే ఉన్నాయి. ఆ కొండల మీద చాలా విండ్ మిల్స్ ఉండి అవన్నీ గాలికి తిరుగుతూ చాలా అందంగా ఉందా దృశ్యం చూడడానికి. సగం దూరం పైన వెళ్ళాక రోడ్డుకి ఇరుపక్కలా ముదురాకుపచ్చ పైన్ చెట్లు దట్టంగా పెరిగిన కొండలు కనిపించడం మొదలయ్యాయి. అక్కడక్కడా ఆ కొండల మధ్యన సన్నగా పారే వాగులు కూడా ఉన్నాయి. రోడ్డంతా కొండల అంచుల మీద వెయ్యడం వల్ల దారిలో ఎటు పక్కకి చూసినా ఎత్తు పల్లాలతో కొండలు లోయలు, నిండైన పచ్చదనంతో మనసుకి ఆహ్లాదాన్ని కలిగించేలా ఉన్నాయా పరిసరాలు. కాంతి గారు "ఈ కొండల అందానికి సరితూగే పాటలు పెట్టండి. వినుకుంటూ వెళదాం" అని అడిగారు. ఘంటసాల పాత పాటలు కొన్ని కేవలం వాయిద్యాల మీద వాయించిన (ఇన్స్ట్రుమెంటేషన్) సంగీతం పెట్టారు కిరణ్ ప్రభ గారు. 'కొండగాలి తిరిగింది, రేపంటి రూపం కంటి, గోరొంక గూటికే చేరావే చిలకా, నన్ను వదలి నీవు పోలేవులే, నా పాట నీ నోట పలకాల సిలకా..' ఇలాంటివే బోల్డు పాటలు వినిపించారు. అందమైన ప్రకృతి, వీనుల విందైన సంగీతం రెండూ కలిసి మూడు గంటలు అసలెలా గడిచాయన్న శ్రమ తెలీకుండా చేశాయి.

Lake Tahoe అనేది చాలా పెద్ద మంచినీటి సరస్సు. సముద్ర మట్టానికి చాలా ఎత్తులో మంచు కొండల మధ్యన ఏర్పడే ఇలాంటి సరస్సులని 'ఆల్పైన్ లేక్స్' అంటారు. మామూలు సరస్సుల కన్నా ఈ ఆల్పైన్ లేక్స్ లో నీళ్ళు మరింత స్వచ్ఛంగా ఉంటాయి. ఉత్తర అమెరికాలో ఉన్న అతి పెద్ద సరస్సుల్లో ఈ లేక్ టాహో కూడా ఒకటి అవ్వడం వల్ల ఇది చాలా ప్రముఖమైన పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువుంటాయి గానీ చలికాలంలో ఇక్కడ చాలా తక్కువ ఉష్ణోగ్రతలు ఉండి కొండలు మొత్తం మంచుతో కప్పబడిపోతాయి. అందుకని ఈ ఊర్లో బోలెడన్ని స్కీయింగ్ రిసార్ట్స్ ఉన్నాయి. అవన్నీ చూసాక ఎండాకాలంలో కన్నా చలికాలంలోనే చాలామంది స్కీయింగ్ కోసం అక్కడికి వెళుతూ ఉంటారేమో అనిపించింది. లేక్ టాహో కాలిఫోర్నియా, నెవాడా రాష్ట్రాల సరిహద్దులో ఉంది. రోడ్డు మీద ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సిగ్నల్ కి అటు వైపు కాలిఫోర్నియా, ఇటువైపు నెవాడా అని రాసిన బోర్డులు చూసి భలే అనిపించింది.

ఊర్లోకి వెళ్ళగానే మరిన్ని వివరాలు తెలుస్తాయి కదాని ముందు అక్కడున్న టూరిస్ట్ కేంద్రానికి వెళ్ళాం. వాళ్ళు చాలా చక్కగా అన్నీ వివరించి పెద్ద మ్యాప్ చేతిలో పెట్టారు. మొత్తం సరస్సు చుట్టూ కొండల మధ్య నుంచి వేసిన ఘాట్ రోడ్డులో డ్రైవ్ చేసుకుంటూ అక్కడక్కడా మధ్యలో ఉన్న విస్టా పాయింట్స్, బీచుల దగ్గర ఆగుతూ అన్నీ చూసుకుంటూ సాయంత్రం కల్లా మళ్ళీ ఇక్కడికి వచ్చెయ్యొచ్చు అని చెప్పారు టూరిస్ట్ ఆఫీసులో వాళ్ళు. అక్కడ Gondola ride అని కేబుల్ కార్ సర్వీస్ ఒకటి ఉంది. అది ఎక్కితే ఒక పెద్ద కొండ అంచు దాకా తీసుకెళతాడు. అక్కడి నుంచీ మొత్తం లేక్ వ్యూ చూడగలగడంతో పాటు పైన ఇంకేవో రిక్రియేషనల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయని చెప్పారు. Gondola ride సాయంత్రం ఐదింటి దాకానో ఏమో ఉంటుందని చెప్పారు కాబట్టి ముందు అది చూద్దాం అనుకున్నాం. కాంతి గారు ఎప్పుడో చిన్నప్పుడు 'అన్నదమ్ముల సవాల్' సినిమాలో ఏదో పాటలో కృష్ణ, జయచిత్ర ఇలాంటి కేబుల్ కార్లో తిరిగే పాట ఒకటి చూసినప్పటి నుంచీ అలాంటిది ఎక్కాలని ముచ్చట పడుతున్నారట. కానీ ఎందుకనో ఇప్పటిదాకా అది కుదరలేదు. అదీ కాకుండా అంత ఎత్తు అనేసరికి కొంచెం భయమన్నమాట తనకి. ఈ మాట వినగానే నేను అర్జెంటుగా మనం ముందు ఆ రైడ్ కి వెళ్ళాల్సిందేనన్నాను. మ్యాప్ ప్రకారం అక్కడే ఉందని చూపిస్తున్నా వాళ్ళు పెద్ద బోర్డు పెట్టకపోవడంతో మేము చాలాసేపు అక్కడక్కడే తిరుగుతూ Gondola ride point వెతికి పట్టుకునేసరికి చాలాసేపే పట్టింది.

మొత్తానికి టికెట్లు కొనుక్కుని మేము ముగ్గురం ఒక కేబుల్ కార్లో ఎక్కి కూర్చున్నాం. మొత్తం రైడ్ ని రెండు భాగాలుగా చేసారు. పైకి వెళ్ళేప్పుడు మధ్యలో ఒక విస్టా పాయింట్ ఉన్న చోట దిగి అక్కడ మనకి నచ్చినంతసేపు ఉండి చుట్టూ చూసాక మళ్ళీ అక్కడి నుంచి ఇంకా పైనున్న కొండల మీదకి వెళ్ళొచ్చు. అక్కడ ఇంకేవో రైడ్స్, స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి. అక్కడి నుంచి మళ్ళీ నేరుగా కిందకి వచ్చెయ్యొచ్చు. అలా మెల్లగా కేబుల్ కార్లో పైకి వెళ్తుంటే కిందున్న మనుషులు, ఇళ్ళు, కార్లు, రోడ్లు అన్నీ క్రమంగా చిన్నవైపోతూ, ఇంకా పైకెళ్ళే కొద్దీ కొండల నిండా ఎటువైపు చూసినా సన్నగా పొడవుగా తలెత్తి ఆకాశంలోకి చూస్తూ నిటారుగా నించున్న పైన్ చెట్లు, కిందకి చూస్తేనేమో ఎండలో మెరిసిపోతూ చిక్కటి నీలం రంగులో ప్రశాంతంగా కనిపిస్తున్న సరస్సు, దాని చుట్టూరా పెద్ద పెద్ద కొండలు, ఇంకా అక్కడక్కడా కొన్ని ఎత్తైన పర్వత శిఖరాల అంచున తెల్లగా మెరుస్తున్న మంచు... అవన్నీ చూస్తుంటే వేరే ఏదో లోకంలోకి ప్రయాణిస్తున్నట్టు అనిపించింది. ఓ పక్కన అంతెత్తు నుంచి కిందకి చూడటానికి కొద్దిగా భయపడుతూనే, ఆ కనిపించే అందమైన దృశ్యానికి ముగ్ధురాలైపోతూ.. అప్పుడు కాంతి గారి కేరింతలు చూస్తే నాకు స్కూలు పిల్లని పిక్నిక్ కి తీసుకెళ్ళినట్టు అనిపించింది. :-) తర్వాత కొండ మీదున్న విస్టా పాయింట్ దగ్గర దిగి చుట్టూ తిరిగి చూసాం. అంతెత్తు నుంచీ ప్రపంచాన్ని చూడటం చాలా బాగుందని కాంతి గారు సంబరపడిపోతుంటే "మా యూరోప్లో ఎక్కువ అన్నీ ఇలాంటి మంచు కొండలు, సరస్సులే ఉంటాయి. నాకు ఈ ప్రదేశం చూస్తుంటే మా దేశంలోనే ఉన్నట్టుంది. మీరు గానీ మా ఊరొస్తే ఇలాంటివి బోల్డు చూపిస్తాను" అని చెప్పాను కాంతి గారితో. "ఊ ఊ.. వస్తాంలే ఎప్పటికో.. కదండీ.." అన్నారు తను కిరణ్ ప్రభ గారి వైపు చూస్తూ. ఆయన వెంటనే వరమిచ్చేస్తున్నట్టు "అలాగే, తప్పకుండా వెళదాం" అన్నారు.
ఆ విస్టా పాయింట్ దాటి అక్కడి నుంచి ఇంకా ఎత్తు మీదున్న ఇంకో కొండ పైకి వెళ్ళేసరికి అసలు కిందున్న ప్రపంచమే కనిపించకుండా పోయింది. అక్కడంతా అడవిలా ఉంటే ఆ చెట్ల మధ్యలో పిల్లలకి, పెద్దలకి రకరకాల రిక్రియేషనల్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఆ కొండ మీద రెండు దిక్కుల్లో రెండు బోర్డులు పెట్టారు. ఒకవైపు వెళితే కాలిఫోర్నియా, ఇంకో పక్కంతా నెవాడా అని రాసుంది. కాసేపు అక్కడుండి మేము నేరుగా కిందకి వచ్చేసాం. కిందకి దిగేప్పుడు చుట్టూ దట్టంగా ఉన్న అడవిలో చెట్లని చూస్తూ నేను కొన్ని మొక్కల పాఠాలు చెప్తుంటే చాలా శ్రద్ధగా ఊ కొడుతూ విన్నారు కాంతి గారు, కిరణ్ ప్రభ గారు ఇద్దరూ. Gondola ride అయిపోయి మేము కిందకి వచ్చేసరికి మధ్యాహ్నం రెండు గంటలు దాటింది. అప్పటికి మాకు ఆకలి బాగా తెలిసొచ్చింది. దగ్గరలో subway ఉంటే వెళ్ళాం. కాంతి గారికేమో ఆ ఆకులు, అలములు అంటే అస్సలు పడదు. తను ఎప్పుడూ తినే మిని పిజ్జా వాడి దగ్గర లేదన్నాడు. ఇక చేసేదేం లేక నేనూ, కిరణ్ ప్రభ గారు చెరొక వెజ్జీ డిలైట్ తో లంచ్ తినేశాం. ఆ రోజు అసలెంత ఆకలంటే ఎప్పుడూ సగం సాండ్ విచ్ తినడానికి దిక్కులు చూసే నేను పెద్ద సబ్ మొత్తం  తినేసాను. తర్వాత దగ్గరలో పిజ్జా షాప్ ఉందేమో అని వెతుక్కుంటూ నేనూ, కాంతి గారు నడుస్తుంటే ఈ లోపు కిరణ్ ప్రభ గారు కారు తీసుకొస్తానన్నారు. ఇంతలో మాకు 'బ్లూ డాగ్ పిజ్జా' అని ఒకటి కనిపించింది. ఆ షాప్ అద్దం మీద ఒక కుక్కపిల్ల పిజ్జా తింటున్న బొమ్మ ఉంది. అది చూసి మా ఇద్దరికీ నిజంగా సందేహం వచ్చింది అది మనుషుల కోసం పిజ్జానా, పప్పీల కోసం పిజ్జానా అని. ఇంతలో లోపల చాలామంది మనుషులు పిజ్జా తింటూ కనిపించారు. హమ్మయ్యా పర్లేదు అనుకుని ఇద్దరం లోపలకెళ్ళి పిజ్జా ఆర్డర్ చేసాం. ఇంతలో కిరణ్ ప్రభ గారొచ్చేశారు. కాసేపు డాగ్ పిజ్జా అని పేరు పెట్టిన వాళ్ళ క్రియేటివిటీ గురించి బాగా చర్చించుకుని నవ్వుకుంటూ పిజ్జా తినేసి అక్కడ నుంచి బయటపడ్డాం. ఏమాటకామాటే, అక్కడ పిజ్జా మాత్రం రుచిగా ఉంది. ;-)

రోజు ఎండ మండిపోతూ ఉండటం, నేనూ, కాంతి గారు అనుకోకుండా నల్ల బట్టలు వేసుకోవడం, తిరిగేదంతా బయట ఎండలోనే అవడం వల్ల తొందరగానే అలసిపోయినట్టు అనిపించింది. లంచ్ తిన్నాక మరీ బద్ధకంగా అనిపించింది.మేమిద్దరం ఎన్ని ఆపసోపాలు పడ్డా కానీ మా డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గారు మాత్రం ఎప్పుడైనా సరే మొత్తం షెడ్యూల్ ప్రకారం అన్నీ విజయవంతంగా పూర్తి చేసేవరకూ విశ్రమించరు. కనీసం కాస్తైనా అలసట, విసుగు, బద్ధకం లాంటివి క్షణంసేపైనా ఎప్పుడూ చూపించరు. మా ఇద్దర్నీ బోల్డు మోటివేట్ చేసేస్తుంటారు అది బాగుంటుంది, ఈ కొంచెం సేపే కదా పదండి పర్లేదు అనుకుంటూ.. :-) సరే మొత్తానికి మళ్ళీ లేక్ చుట్టూ ఘాట్ రోడ్లో వెళ్ళాల్సిన డ్రైవ్ మొదలుపెట్టాం. ఆ ఊర్లో కొన్ని కాసినోలు కనిపించాయి. దగ్గరలో ఉన్న 'Reno' అనే ఊర్లో ఇంకా చాలా ఉంటాయని కిరణ్ ప్రభ గారు చెప్పారు. అక్కడికి కూడా ఒకరోజు వెళ్దామనుకున్నాం గానీ మాకు టైం సరిపోలేదు. లేక్ మ్యాప్ చూసుకుంటూ ఆ కొండల్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే అక్కడక్కడా కొన్ని బీచులు కనిపించాయి. సరస్సు ఒడ్డున చిన్న చిన్న గులకరాళ్ళతో ఉన్న ఒక బీచ్లో కాసేపు కూర్చుని ఆ ఎర్రటి ఎండలో నేనూ కాంతి గారు గులక రాళ్ళతో అచ్చనగిల్లలు ఆడుకున్నాం. మెత్తటి ఇసుక ఉన్న కొన్ని బీచుల్లో జనాలు క్రిక్కిరిసిపోయి ఉన్నారు. పిల్లలు, పెద్దలూ, ఈతలు, పడవలు, గాల్లో ఎగిరే ప్యారాషూట్లతో బీచులన్నీ సందడి సందడిగా ఉన్నాయి. మేము చూసిన రకరకాల వ్యూ పాయింట్స్ లో Emerald Bay వ్యూ చాలా నచ్చేసింది నాకు. అక్కడ నించుని చూస్తే మూడు పక్కలా పైన్ చెట్లతో నిండిన కొండలు ఉంటే నాలుగో పక్కంతా ముదురు నీలం రంగులో ఏవో మణిమాణిక్యాలు పరిచినట్టు మిలమిలా మెరిసిపోతున్న సరస్సు, మధ్యలో పచ్చటి చెట్లతో ఉన్న ఒక చిన్న ద్వీపంతో చాలా అందంగా ఉందా ప్రదేశం. అలా అలా సరస్సు చుట్టూ ప్రదక్షిణం చేసి మళ్ళీ మొదలైన చోటుకి వచ్చేసరికి సాయంకాలం ఏడు గంటలు అయిపోయింది.

Lake Tahoe నుంచి కాస్త తొందరగా వస్తే సాయంకాలం తెలిసిన వాళ్ళింట్లో సత్యనారాయణ వ్రతానికి వెళదాం అనుకున్నాం కానీ మాకు అక్కడే ఏడు దాటిపోవడం వల్ల సాధ్యపడలేదు. పైగా మేము ఇంటికెళ్ళి మళ్ళీ సిలికాన్ వ్యాలీ వైపు వెళ్ళాలంటే ఎంతలేదన్నా నలభై నిముషాలైనా పడుతుందని చివరి నిముషంలో అది కాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. రోజంతా ఎండ బాగా ఉండటం వల్ల కూడా సాయంత్రానికి బాగా అలసిపోయాం. వెనక్కి బయలుదేరిన కాసేపటికే కాంతి గారు నిద్రపోయారు. నేనూ, కిరణ్ ప్రభ గారు పాటలు విందామనుకున్నాం. సిరివెన్నెల గారి 'విరించినై విరచించించితిని, ఈ గాలీ ఈ నేలా..', ఇళయరాజా గారి 'ఆకాశం ఏనాటిదో.. ' లాంటి పాటలు వరుసగా వినిపిస్తుంటే ఆ పాటల గురించిన చర్చలు మొదలై కాసేపటికి పాటలు ఆపేసి పూర్తిగా కబుర్లలోనే మునిగిపోయాం. కిరణ్ ప్రభ గారు కవిగా, కౌముది పత్రికా సంపాదకులు గానే కాకుండా రేడియో ప్రయోక్తగా అందరికీ సుపరిచితులే. తెలుగు సినిమా చరిత్రలో ఆణిముత్యాలని చెప్పబడే సినిమాల గురించి, తెలుగు సినీపరిశ్రమలో చెరగని ముద్రలు వేసిన గొప్ప సినీజీవుల గురించి చాలా పరిశోధించి రేడియో ప్రోగ్రాముల్లో ఆసక్తికరంగా శ్రోతలకి వినిపిస్తుంటారు. విరిజల్లు, టోరి రేడియోల్లో ఆయన రేడియో షోలు వస్తుంటాయి. ఇప్పుడు వాటన్నీటిని అందరికీ అందుబాటులో ఉంచేందుకు వీలుగా youtube లో పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఆ రోజు మూడు గంటల డ్రైవ్ లో సిరివెన్నెల గారి గురించి మొదలెట్టి తర్వాత వరసగా ఇళయరాజా, కాంచనమాల, రచయిత 'శారద'.. ఇలా ఒకరి తర్వాత ఒకరి జీవిత గాథలన్నీ చెప్పుకుంటూ కూర్చున్నాం. ఆయనలా చెప్తూ ఉంటే నేను అలా బుద్ధిగా గడ్డం కింద చేతులు పెట్టుక్కూర్చుని ఊ కొడుతూ మధ్య మధ్యలో వాళ్ళ విజయాలకి పొంగిపోతూ, కష్టాలు, కన్నీళ్ళకి కదిలిపోతూ.. అలా అలా మూడు గంటలు ఎలా గడిచాయో తెలీకుండా డబ్లిన్ కి వచ్చేశాం. కాంతి గారు నిద్ర లేచి ఇంతసేపూ ఏం చేశారని అడిగితే తెనాలి వెళ్ళి కాంచనమాలని, చెన్నై వెళ్ళి ఇళయరాజాని చూసొచ్చామని చెప్తే "అవన్నీ నేనెప్పుడో వెళ్ళి వచ్చానుగా, అయితే నేనేం మిస్సవ్వలేదన్నమాట.." అని నవ్వారు.

రోజు ట్రిప్ ముగించుకుని ఇంటికొచ్చి పడేసరికి రాత్రి పదిన్నర అయింది. వచ్చాక కాంతి గారు ఉదయమే వంట చేసి సిద్ధంగా ఉంచిన కూరలతో భోజనం చేసేసాం. అంత అలసిపోయినా మళ్ళీ మాకు ఫేస్ బుక్లో ఫోటోలు పెట్టే బృహత్కార్యం ఒకటి ఉంది కదా! "అబ్బా రేపు పెడదాంలెద్దురూ.." అంటే కాంతి గారు ఎలానూ ఒప్పుకోరు. "నిషి పొద్దున్నే లేచి చూసుకుని ఫోటోలు లేకపోతే డిసప్పాయింట్ అవుతుంది కదా.. మన స్నేహితులందరూ కూడా ఎదురు చూస్తుంటారు మనం ఇవాళ ఏం చేసామో తెలుసుకోడానికి.. కొంచెం ఓపిక చేస్కో తల్లీ.." అని గారంగా అడుగుతారు. దీనితో పాటు ప్రతీరోజూ జరిగే విషయం ఇంకొకటి ఉంది. ఇంటికొచ్చి కార్లోంచి దిగుతూ ఉండగానే కిరణ్ ప్రభ గారు "ఈ రోజెలా గడిచింది తల్లీ.. నీకు నచ్చిందా? హ్యాపీనా.." అని అడుగుతారు. ప్రతీ రోజూ రెండుసార్లు అడుగుతారు ఆ రోజు సంతృప్తికరంగా గడిచిందా లేదా, ఇంకేమన్నా మిస్సయ్యామా అని. "మీరు పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి అన్నీ టైం ప్రకారం పేపర్ మీద పెట్టినవి పెట్టినట్టు ఇంప్లిమెంట్ చేస్తారైతే అసలీ ప్రశ్న అడగాల్సిన అవసరమే లేదండీ.. ఇవాళ బ్రహ్మాండంగా గడిచింది" అని సమాధానం చెప్తాను నేను. ప్రశ్న, జవాబు రెండూ అవే ఉంటాయని మా ఇద్దరికీ తెలిసినా సరే రోజూ తప్పకుండా మా ఇద్దరి మధ్యనా ఈ ప్రశ్నోత్తరాల సమయం ఉంటుందన్నమాట. కాంతి గారేమో మా ఇద్దర్నీ చూసి ముసి ముసి నవ్వులు నవ్వుతుంటారు. :-)
రోజంతా ఎండలో తిరిగి తిరిగి అలసిపోయి నిద్ర కమ్ముకొచ్చేస్తోంది. అంత నిద్ర మత్తులో కూడా రేపెలా గడవబోతోందోనన్న ఆలోచన రేపుతున్న ఉత్సాహానికి, ఉద్వేగానికి ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఒకటే తొందరపడిపోతోంది మనసు. ఎందుకంటే.. రేపటి రోజు నేను జీవితాంతం గొప్ప ఆనందంగా తలచుకోబోయే ఓ మధుర జ్ఞాపకాన్ని నా కోసం మోసుకొస్తోంది మరి! :-)