Friday, July 19, 2013

My San Francisco Diary - 1


కాలం ఒక మాయల మరాఠీ!
మనసుకి నచ్చే క్షణాల ఆగమనం కోసం నిరీక్షిస్తున్నప్పుడు ప్రతీ నిమిషం భారంగా కదులుతున్నా సరే ఆ ఎదురుచూపే అతి మధురంగా మారి మురిపిస్తుంది. ఆ అరుదైన క్షణాలని అందుకున్న మైమరపులో ఉండగానే ఒక్క ఉదుటున అలలా ఎగిసి వచ్చి నేటి ఆనందానుభూతులన్నీటినీ ​నిర్దాక్షిణ్యంగా లాక్కెళ్ళి నిన్నల్లో కలిపేస్తుంది. అందాకా అరచేతుల్లో ఒదిగి ఉన్న అపురూప క్షణాలన్నీ ​రెప్పపాటులో వేళ్ళసందుల్లోంచి ఇసుకలా మెత్తగా జారిపోయి గతం పరమైపోతాయి. అందమైనదని ఆరాధించిన అదే కాలాన్ని కర్కశమైనదని నిందించాలనిపించేలా తన రూపం మారుస్తుంది. కానీ ఈ కాలమానాలు, దశ దిశలు, సరిహద్దులు మనుషులకే గానీ మనసులకు నిర్దేశించగలవారెవ్వరు?
అప్పుడప్పుడూ జీవితపు ఒడ్డున కూర్చుని​ కనుచూపుమేరా పరుచుకున్న ఇసుక మేటల్లో ఎక్కడో ఏదో పొరల్లో నన్ను వదిలి వెళ్ళిన ఆనాటి మధుర క్షణాలు రంగురంగుల జ్ఞాపకాల గవ్వలుగా మారి దొరుకుతాయేమోనని వెతుకుతూ కూర్చోవాలనిపిస్తుంది. ఆ జ్ఞాపకాల వేలు పట్టుకుని గతంలోకి అడుగులేసి మళ్ళీ మళ్ళీ ​ఆ మధురానుభూతులని ​పునర్జీవించాలనిపిస్తుంది.
అలాంటి చిన్ని ప్రయత్నమే ఈ San Francisco Diary! నాకోసం నేను రాసుకుంటున్నా సరే నేను పంచే నా జ్ఞాపకాల పరిమళం మిమ్మల్ని కూడా అలరిస్తుందని నమ్ముతూ...
~~~~~~~~~~~~~~~

..  అసలు ఎప్పుడు ఎక్కడ మొదలైందీ స్నేహం, ఎలా ముడిపడిందీ బంధం​ అని వెనక్కి తిరిగి చూడాలనుంది ఒకసారి!
2010 మార్చిలో ఈనాడు 'వసుంధర' లో కౌముది కో-ఎడిటర్ అయిన శ్రీమతి కాంతి కిరణ్ గారి ఇంటర్వ్యూ వచ్చింది. అప్పటికే కౌముది పత్రిక చూస్తూ ఉండేదాన్ని గానీ అది ఎవరు నడుపుతున్నారు ఏంటీ అనే విషయాల గురించి అస్సలు అవగాహన లేదు. అప్పుడప్పుడూ బ్లాగులో నాలుగు వాక్యాలు రాసుకోడానికే ఏదో బోల్డు సమయం ఖర్చు పెడుతున్నట్టు తెగ ఇదయిపోతుంటే వీళ్ళు అసలెటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం మాతృభాష మీద, సాహిత్యం మీదున్న మమకారంతో ఇంత శ్రమ, సమయం వెచ్చించి పత్రిక నడుపుతున్నారంటే చాలా ఆశ్చర్యంగా, గొప్పగా అనిపించింది.

నా స్నేహితురాలు సుజ్జీ తనకి ఫేస్ బుక్లో 'కౌముది' కాంతి కిరణ్ గారితో పరిచయం అయిందని, ఆవిడ చాలా చక్కగా మాట్లాడతారు, స్నేహశీలి అనీ, తను పంపిన కవిత కౌముదిలో ప్రచురణకి ఎంపికైందని చెప్పి నేను రాసిన కథని కూడా కౌముదికి పంపించి చూద్దామంది. నేను వద్దులే అన్నా సరే వినకుండా బలవంతం చేసి మరీ కథ పంపేలా చేసింది. కౌముది ఎడిటర్ కిరణ్ ప్రభ గారు కథ ఇంకా బాగా రాయడానికి ఉపయోగపడే కొన్ని సలహాలు, సూచనలతో జవాబిచ్చారు. కొత్తగా రాసేవారిని ప్రోత్సహించడం కౌముది లక్ష్యాల్లో ఒకటని అందుకే నా కథని ప్రచురిస్తామని, కథ రావడానికి కనీసం మూడు నెలలైనా పడుతుందని చెప్పారు. నేను చాలా సంతోషించి బదులుగా ధన్యవాదాలు ​తెలిపాను. ఆ కథ చివర్లో నా బ్లాగు లింక్ ప్రచురించమని చెప్పమంది సుజ్జీ. నేను మొహమాటపడిపోతుంటే ఏంపర్లేదు అందులో తప్పేముంది. పోనీ ఎడిటర్ గారికి చెప్పడానికి మొహమాటంగా అనిపిస్తే కాంతి గారికి మెయిల్ పెట్టు అని మళ్ళీ నన్ను గట్టిగా ముందుకి తోసి కాంతి గారితో మాట్లాడేలా చేసింది.

అప్పుడు నేను రాసిన ఈమెయిలుకి ఆవిడ సమాధానం ఇచ్చారు. వెంటనే కథ, కౌముది విషయం మర్చిపోయి ఎప్పటి నుంచో చాలా పరిచయం ఉన్నవాళ్ళలాగా చాలా విషయాలు మాట్లాడేసుకున్నాం. కొత్త పరిచయాలు, స్నేహాలు పెంచుకునే విషయంలో కాస్త నెమ్మదిగా ఆచి తూచి మాట్లాడే నేను ఆవిడతో చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ మాట్లాడేసాను. అప్పుడు మొదలైన మా పరిచయం ఈ మెయిల్స్ దాటి ఫోనులో కబుర్లు చెప్పుకునే దాకా రావడానికి కనీసం నెలరోజులు కూడా పట్టలేదు. 2010 ఆగస్టులో నేను ఇండియా వెళ్ళినప్పుడు వచ్చే వీలుంటే కాంతి గారు కలుస్తానన్నారు. కానీ అప్పుడు కుదరలేదు. తర్వాతకాలంతో పాటు మా స్నేహం పెరిగి పెద్దదైపోతూ మా పరిచయం వయసు కేవలం కొన్ని నెలలేనని మర్చిపోయాం. అసలు మేము కేవలం స్నేహితులే అన్న విషయం మర్చిపోయి ఒకే కుటుంబ సభ్యులమన్నట్టు దగ్గరైపోయాము. మా పిల్లల వయసున్న నువ్వు నాకు స్నేహితురాలు అవ్వడం భలే చిత్రం కదాని కాంతి గారు ఇప్పటికీ ఆశ్చర్యపడుతుంటారు. అదేంటో మరి మా ఇద్దరి మధ్యనా వయసు తేడా ఎప్పుడూ కనిపించదు. :-)
కాంతి గారు తరచూ అడుగుతూ ఉండేవారు సెలవులుంటే అమెరికాకి వచ్చి వెళ్ళమని. నాక్కూడా వెళ్ళాలని ఉన్నా నా రీసెర్చ్ గోలలో పడి సెలవులు ఉన్నా సరే వాటిని తీరిగ్గా ఉపయోగించుకునే వీలు చిక్కక చూద్దాం చూద్దాం అంటూ ఉండేదాన్ని. ఇలా అయితే ఎప్పటికీ కుదిరేలా లేదని చెప్పి నువ్వు ముందు వీసాకి అప్లైచేస్తే అది కాస్తా వస్తే తర్వాత వీలుని బట్టి ఎప్పుడో అప్పుడు రావచ్చని ఇన్విటేషన్ లెటర్ పంపిస్తానన్నారు. జూన్ 2012 లో లెటర్ పంపిస్తే నేను కొత్త పాస్పోర్ట్ తెచ్చుకోవాల్సిన పని కాస్తా చూసుకుని తీరిగ్గా వీసాకి అప్లై చేసేసరికి జూలై వచ్చింది. సెప్టెంబర్ లోపు అయితే వచ్చే వీలుంటుంది కానీ ఈ లోపు కుదరకపోతే మళ్ళీ వచ్చే ఏడాది దాకా నేను సెలవలు తీసుకోలేనని చెప్పాను. మొత్తానికి మాకిక్కడ ఎండాకాలం సెలవుల సీజన్ అవ్వడం వల్లనో ఏమో గానీ అమెరికన్ ఎంబసీ చాలా బిజీగా ఉండి నాకు వీసా అపాయింట్మెంట్ ఆగస్టుకి గానీ దొరకలేదు. తర్వాత తతంగం అంతా పూర్తయ్యి వీసా నా చేతికి వచ్చేసరికి అక్టోబర్ వచ్చేసింది. అది కూడా మళ్ళీ అక్టోబర్ దాకా ఒక్క ఏడాదికే వీసా వచ్చింది. సరేలే 2013 లో చూద్దాం అనుకుంటూ ఉండగానే మా తమ్ముడి పెళ్ళికుదిరి రెండు నెలలు ఇండియాలో సెలవులు తీసుకోవాల్సి వచ్చింది. ఈసారికి అమెరికా ప్రయాణం పెట్టుకోలేను కదా అనుకుని ఇక ఇప్పట్లో కుదరదేమో అనుకుని నీరసపడిపోయాం.

ఇంతలో కాంతి గారు అనుకోకుండా 2013 జనవరిలో ఇండియా ప్రయాణం పెట్టుకున్నారు. నేను తనని కలవాలన్న ఉద్దేశ్యంతో పది రోజులు నా ప్రయాణాన్ని ముందుకి జరిపి ఎలాగైతేనేం అటు అమెరికాలోనూ, ఇటు జర్మనీలోనూ కాకుండా అస్సలు ఊహించని విధంగా ఇండియాలో మొదటిసారి కలిసాం. జనవరి 8 న నేను వెళ్తే 9 న ఆవిడ అమెరికా తిరిగు ప్రయాణం కాబట్టి మాకు ఒక్క రోజే సమయం దొరికింది. ఆ ఒక్క రోజులోనే మా అభిమాన రచయిత్రి బలభద్రపాత్రుని రమణి గారిని, పద్మజ గారిని కలవాలనుకున్నాం. నాకు ఎప్పటినుంచో రమణి గారి కథలు, నవలలు, సినిమాలు, కౌముదిలో కాలం దాటని కబుర్లు చదివిన అభిమానం ఉన్నప్పటికీ నేరుగా ఆవిడతో పరిచయం ఏర్పడింది మాత్రం కాంతి గారి ద్వారానే. రమణి గారు అమెరికా వచ్చినప్పుడు ఒకసారి ఫోన్లో మాట్లాడాను కానీ పద్మజ గారితో ఎప్పుడూ మాట్లాడలేదు. పద్మజ గారు రాసిన 'సోక్రటీసు భార్య' కథ చదివాక చాలా నచ్చేసారు. ఇప్పుడు ఆవిడ కౌముదిలో రాస్తున్న 'సంసారంలోసరిగమలు' కూడా చాలా బాగుంటున్నాయి. మొత్తానికి కాంతి గారి మాటల్లో ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు కాబట్టి ఆ రోజు హైదరాబాదులో అందరం కలుద్దాం అనుకున్నాం. సరదాగా బయట లంచ్ చేసి మిథునం సినిమాకి వెళదామని రమణి గారు అప్పటికే టికెట్స్ బుక్ చేసుంచారు. పద్మజ గారు ఆ రోజు ఉదయమే బెంగళూరు నుంచి రావడం వల్ల తనకి రావడం కుదరలేదు. ​ఆ రోజు పొద్దున్నే నేను విమానం దిగడం వల్ల ప్రయాణంలో అలసట మూలాన హెల్త్ అప్సెట్ అయి నా వల్ల ప్లాన్ అంతా మారిపోయింది. నాకు చాలా గిల్టీగా అనిపించినా సరే ఏం చెయ్యలేకపోయాను. రమణి గారికి కాల్ చేసి చెప్తే ఆవిడే బోల్డు శ్రమపడి ఎక్కడో ఉన్న రామానాయుడు స్టూడియోస్ నుంచి ఊరికి పూర్తిగా ఇంకో మూలాన ఉన్న కాంతి గారింటికి వచ్చారు. ఆ రోజు లంచ్ మూడింటికి చెయ్యాల్సి వచ్చింది నా పుణ్యమా అని. ఏంటమ్మాయ్ రాగానే అడ్డం పడిపోయావు అనుకుంటూ వస్తూ వస్తూ పెద్ద సంచీ నిండా ఫ్రూట్స్ పట్టుకొచ్చారు. రమణి గారితో ఫోన్లో అయినా, ఎదురుగా అయినా మాట్లాడుతుంటే మనకి అస్సలు టైం తెలీకపోగా నవ్వీ నవ్వీ బుగ్గలు నొప్పెట్టేస్తాయి. ఆ రోజు మేము కలిసున్నది ఒక్క పూటే అయినా బోల్డు కబుర్లు, నవ్వులతో సాయంత్రానికి నేను సరైపోయాను. :-)

తర్వాత మళ్ళీ ఎవరి గూటికి వాళ్ళం చేరుకొని యథావిధిగా పనుల్లో పడిపోయాం. ఇండియాలో కలిసినప్పుడు మనకి ఎక్కువ టైమే దొరకలేదు కదా.. ఆ వీసా ఎక్స్పైర్ అయ్యేలోపు నువ్వు అమెరికా వచ్చెయ్. నాలుగు రోజులుండి వెళుదువు గానీ అంటూ కాంతి గారు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూనే ఉన్నారు. నేను ఇంక ఈ సంవత్సరం కుదరదేమోలే అనుకుంటూ ఉండగానే 2013 మే నెల వచ్చేసింది. ఒక రోజు మా ఇంటబ్బాయ్ తను కాన్ఫరెన్స్ కోసం ఒక పది రోజులు సిడ్నీ వెళ్తానని చెప్పాడు. నేను దిగులుగా మొహం పెట్టేసరికి నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు నీకొక్కదానికి బోర్ కదా.. పోనీ నీ అమెరికా ప్రయాణం ఇప్పుడు పెట్టుకోరాదూ అన్నాడు. ఆ మాట విని నా మొహంలో వచ్చి చేరిన వెలుగుకి చిచ్చుబుడ్లు, మతాబులు కూడా సాటి రావు. నిజంగా వెళ్ళనా అని ఇంకా అనుమానంగా అడుగుతుంటే తనేమో పోనీ సిడ్నీ వెళ్దాం పద.. సిడ్నీనా, శాన్ఫ్రాన్సిస్కోనా, చెప్పు నీ ఇష్టం.. అన్నాడు. అప్పుడు చూడాలి నా మొహం అసలు. ఏం బదులు చెప్పకుండా దీనంగా చూసాను తనకేసి. ఇంక చాల్లే ఆ ఎక్స్ప్రెషన్ మార్చు. నాకు తెలుసులే నీకు మీ ఫ్రెండ్స్ దగ్గరికే వెళ్ళాలని ఉంది కదా.. అన్నాడు. అంటే మరి నా వీసా కూడా వేస్ట్ అయిపోతుంది కదా, ఇప్పుడు వెళ్ళకపోతే మళ్ళీ ఎప్పటికి కుదురుతుందో కదా అన్నాను మెల్లగా. సరే అమెరికానే వెళుదువు గానిలే, మనం మళ్ళీ ఇంకెప్పుడైనా సిడ్నీ వెళదాంలే అని చెప్పాడు. నేను హిహ్హిహీ అని ఎగిరి గంతులేస్తుంటే ఈ గంతులన్నీ అమెరికాలో వెయ్యొచ్చులే గానీ ముందు టికెట్స్ సంగతి చూడు అన్నాడు. అమెరికాలో గంతులు ఎలానూ ఉంటాయిలే కానీ ఇవి జర్మనీ గంతుల్లే అన్నాను. అప్పుడససలు పట్టలేనంత సంబరం.. ఉక్కిరిబిక్కిరి అయిపోయేంత సంతోషం.. నన్ను చూసి మా ఇంటబ్బాయ్ నవ్వుతూ పండగ చేస్కో అన్నాడు. నిజంగానే తను అన్నట్టు ఆ క్షణం నుంచి పండగ మొదలైంది...

ఇంకాసిన్ని పండగ కబుర్లు మళ్ళీ వచ్చి చెప్తాను. :-)

11 comments:

పద్మవల్లి said...

మధూ, డైరీ కబుర్లు బాగున్నాయి. కౌముది మొదటి సంచిక నుంచీ చదువుతున్నా, దాని వెనుక ఉన్న కాంతి గురించి నాకు కూడా నువ్వు చెప్పిన ఇంటర్వ్యూ వల్లనే తెలిసింది. అప్పటి నుంచీ ఆవిడంటే ఎంత వర్షిప్ పెరిగిపోయిందో మాటల్లో చెప్పలేను. అవకాశం దొరికినపుడల్లా ఆవిడ గురించి అందరికీ డప్పు వాయిస్తుంటాను. :-)

ఇక ఆవిడ స్నేహశీలత, ఆప్యాయత గురించి నువ్వు చెప్పిన ప్రతీ అక్షరం తోనూ ఏకీభవిస్తాను. ఎన్నో ఏళ్ళ నుంచీ తెలిసినట్టు నోరారా పిలుస్తూ, ఆప్యాయంగా మాట్లాడే ఆవిడని చూస్తే బలే ముచ్చటేస్తుంది.

"కాలం ఓ మాయల మరాఠీ" .... :-)

పద్మవల్లి said...

@@ దాని వెనుక ఉన్న కాంతి గురించి

అబ్బా...అది కాంతి గారి గురించి అని ఉండాలి. రాసేటప్పుడు ఏదో మెస్ అయ్యి "గారి" ఎగిరిపోయింది. :-(

Kranthi M said...

హ్మ్మ్. బాగుందమ్మా నీ డైరీ సగమే చూసిన సినిమా లాగా. ఆ మిగతాది కూడా త్వరగా రాయి.:)

Sudha said...

అప్పుడే అయిపోయిందా అనిపించింది మధురా, తరువాయి భాగం కోసం వెయిటింగ్...చాలా బావుంది. కాంతి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే..కాని నువ్వు రాసింది చదువుతుంటే స్వీయానుభూతి పొందాను. థాంక్స్ ఫర్ షేరింగ్...

Balabhadrapatruni Ramani said...

Madhura ni diarylo o para ienanduku anandamga undi. Sneham ichhe kick inkedi ivvadu!

నిషిగంధ said...

ఎలా పరిచయమౌతామో.. ఎంతలా దగ్గరైపోతామో.. ఇలా ఒక్కసారి వెనక్కి తిరిగిచూసుకుంటే భలే ఆశ్చర్యమేస్తుంది!
కాంతి గారితో అప్పుడప్పుడే పరిచయం అయిన రోజులు.. ఇంకా పూర్తిగా సన్నిహితం కూడా కాలేదు.. అంతలో తన ఇండియా ప్రయాణం.. 'నేను విజయవాడ వెళ్ళొచ్చు.. కుదిరితే మీ అమ్మగారిని కలుస్తాను ' అని చెప్పడమే కాదు, అప్పటి ఎంతో బిజీ పనులలో కూడా అన్నమాట ప్రకారం వెళ్ళి అమ్మని చూసొచ్చారు! It really meant to me a LOT!!
అమ్మకి ఇప్పటికీ కాంతిగారు అని చెప్తే తెలీదు.. 'తెల్లగా చిన్నపిల్లలా ఉండే కిరణ్ గారే కదా!' అంటుంది.. ఎందుకో మా ఇద్దరి పేర్ల బట్టి అనుకుంటాను, అమ్మకి అలానే గుర్తు :))

ఇహ రమణి గారి విషయంలో నువ్వు చెప్పింది వంద శాతం కరెక్ట్! తను మాట్లాడుతున్నంత సేపూ అసలు తొణకరు, బెణకరు.. గొంతు పైకీ కిందకీ వెళ్ళదు.. మనం మాత్రం మొత్తం కదిలిపోతూ నవ్వేస్తుంటాం :)))

పద్మజ గారితో పరిచయం ఇప్పుడిప్పుడే వేళ్ళూనుతోంది.. తన సోక్రటీస్ భార్యకి నేను పెద్ద ఫాన్‌ని..

హమ్మ్.. ఏంటో మొదటి పార్ట్‌తోనే ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోయావ్‌గా!!
పర్లేదు, కొంచెం నెమ్మదిగానే రాయి.. తొందరగా రాస్తే మళ్ళీ డైరీ పూర్తయిపోతుంది. :-)


రాధిక(నాని ) said...

చాలా బాగుంది

మధురవాణి said...

​@ పద్మవల్లి,
వావ్.. పద్మ గారూ.. ఈ సిరీస్ కి ఫస్ట్ కామెంట్ మీదే.. థాంక్యూ సో మచ్!
కాంతి గారి గురించి అందరికీ అలానే అనిపిస్తుందేమో కదా.. :-)

@ Kranthi Kumar Malineni,
థాంక్స్ క్రాంతీ.. మరి డైరీలో ఒక్కో పేజీ అలానే ఉంటుంది కదా.. ;-)
వీలు చూసుకుని రాస్తాను.

@ Sudha,
కదా.. నేనింకా చాలా సింపుల్ గా రాయాలని ప్రయత్నిస్తేనే ఇలా వచ్చింది సుధ గారూ.. మనందరి స్నేహం దాదాపు ఒకలానే మొదలైందనుకుంటా కదా.. వీలు చూసుకుని ట్రిప్ కబుర్లు రాస్తాను. Thanks for the comment. :-)

మధురవాణి said...

​@ Balabhadrapatruni Ramani,
రమణీ గారూ.. మీకు ఆనందం కలిగించినందుకు నన్ను నేనే మెచ్చుకుంటున్నాను. ;-)
భలే సింపుల్ గా చెప్పేసారండీ ఒక్క ముక్కలో.. నిజమే స్నేహం ఇచ్చే థ్రిల్ ఇంకేదీ ఇవ్వలేదేమో! అంత బిజీలో కూడా నా బ్లాగు దాకా వచ్చి పలకరించినందుకు బోల్డు బోల్డు థాంక్స్ మీకు.. :-)

@ నిషిగంధ,
భలే ఉందిగా నీ జ్ఞాపకం! కిరణ్ ముగ్గురికీ చాలా విషయాల్లో పోలికలు ఉన్నాయిలేమ్మా! ;-)
మొత్తానికి రాయి రాయి అని నన్ను గట్టిగా ముందుకి తోసేసి మీరందరూ వెనక నించుని చూస్తున్నారుగా.. :D ఇంకా చెప్పాల్సినవి బోల్డు కబుర్లున్నాయి కదా అందుకని కాస్త త్వరగా రాయడం తప్పదేమో! :-)

@ రాధిక (నాని),
ధన్యవాదాలండీ.. :-)

Unknown said...

మీ అమెరికా Diary ఆలశ్యంగా తెరిచాం, ఏమనుకోకండే ;)
జర్మనీ మీ మాటల్లో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కో మధురమైన మీ మాటల్లో చూపిస్తారనమాట, భలే!
Have a wonderful time in US!

మధురవాణి said...

​@ చిన్ని ఆశ,
ఆలస్యమేం లేదులెండి. నా కబుర్లన్నీ ఇక్కడే ఉంటాయి కదా ​.. మీకు వీలున్నప్పుడే వచ్చి చూడొచ్చు. నా ట్రిప్ ఎప్పుడో అయిపోయిందండీ. ధన్యవాదాలు. :-)