ఉదయాన్నే నిద్ర లేచి అలవాటుగా కిటికీ ముందు నిల్చున్నాను. ఎదురుగా చిన్న కొండ, కొండ మీదున్న భవంతులూ, అప్పుడప్పుడే పరుచుకుంటున్న నీరెండ, వీటన్నిటికీ గొడుగు పడదామని కిందకి వంగినట్టున్న నీలాకాశం, అందులోంచి జారిపడుతున్నట్టు తెల్లతెల్లని దూది మబ్బులు, విమానాల రాకపోకల వల్ల ఏర్పడుతున్న పొగ ముగ్గులు, విశాలమైన మైదానం, దాని మీదంతా మెత్తగా పెరిగిన పచ్చిక, పద్ధతిగా వరుసలో నించున్న ఆపిల్ చెట్లు.. అన్నీ ఇప్పుడిప్పుడే నిద్ర మత్తు వదిలి ఒళ్ళు విరుచుకుంటున్నట్టున్నాయి.
పచ్చిక ఒడిలో కొన్ని నల్లటి పక్షులు గుంపుగా కలిసి ఆడుకుంటున్నాయి. దూరం నుంచి చూడ్డానికి కాకుల్లా
ఉన్నాయి కానీ కాస్త
చిన్నవిగా కనిపిస్తున్నాయి. కావు కావుమని అరుపులేమీ లేవు. వాటి ఆటలు చూస్తుంటే చిన్నప్పుడు పిల్లలందరం కలిసి
పంటలేసుకుని ఆడిన దొంగ-పోలీసు, నేల-బండ లాంటి ఆటలు గుర్తొచ్చాయి.
ఏమైనా పక్షుల పని బావుంటుంది కదా..
ఎంచక్కా అవి స్కూళ్ళకీ, కాలేజీలకీ, ఆఫీసులకీ వెళ్ళక్కర్లేదు. ఏ పూట
తిండి ఆ పూట సంపాదించుకుంటే చాలు. మిగతా సమయమంతా స్వేచ్ఛగా
ఎగురుతూ ఇలా ఆడుకుంటూ ఉండొచ్చు. మనలాగా ఎప్పుడో భవిష్యత్తులో తీరిగ్గా తిని
కూర్చోడానికి వీలుగా ఉండాలన్న భ్రమలో ఇప్పుడు గొడ్డుచాకిరీ చేస్తూ పొదుపూ మదుపూ, అప్పులూ సప్పులూ వగైరా లెక్కలు వేసుకుంటూ ఉరుకులు
పరుగుల్లో బతకక్కర్లేదు. అసలైనా ఇంత ఇరుకైన బతుకులు బతుకుతున్న మనుషులు అత్యంత ఉన్నతంగా పరిణతి
చెందిన జీవులు ఎలా అయ్యారో? బహుశా ఇంత ఇరుకైన
బుర్రలు మనవని గుర్తించగలిగినంత జ్ఞానం సంపాదించుకున్నందుకేమో! ;-)
ఆ ఆడుకుంటున్న పక్షులు, పువ్వుల మీద ఎగిరే సీతాకోకచిలుకలు అవన్నీ ఎంత హాయిగా ఈ క్షణం గురించి మాత్రమే ఆలోచిస్తూ జీవిస్తున్నాయి. మనం మాత్రం ఎందుకు ఎంతసేపూ రేపు రేపు అని అతిగా ఆరాటపడుతూ ఈ రోజునీ, ఈ క్షణంలో పొందాల్సిన అనుభూతినీ కోల్పోతుంటాం. జీవించి ఉండటంలో ఉన్న అద్భుతాన్ని ఆస్వాదించే అదృష్టాన్ని చేజార్చుకుంటాం. హుమ్మ్.. ఇలాంటి ఆలోచనలు ఎప్పటికైనా తెగేనా, ఈ పద్మవ్యూహంలోంచి మనం బయటపడేమా!
అసలు మా కిటికీలోంచి తొంగి చూసే ఆకాశం ఎంత బాగుంటుందనీ.. అదీ పొద్దుపొద్దున్నే ప్రశాంతంగాచలచల్లటి గాలిలో తేలిగ్గా తేలిపోతున్న నీలి పరదాలా ఆకాశం, నీలాకాశం మీద వెన్నముద్దల్లా తేలే తెల్లటి మబ్బులు.. ఊ.. మహా ముద్దొచ్చేస్తుంటాయి. ఎదురుగా కనిపిస్తున్న నల్లటి తారు రోడ్డు మీద ఝూమ్మని రామబాణాల్లా దూసుకుపోతున్న కార్లూ, సైకిళ్ళూ.. అందరూ ఆత్రంగా పరుగులు తీస్తున్నారు ఎవర్ని కలిసే తొందరలోనో మరి! ఆ ఎర్ర కారులో అమ్మాయి ఆఫీసుకి వెళ్ళే హడావుడిలో ఉండొచ్చా, సైకిలు మీద వెళుతోన్న ముసలి తాత ఇంత ఉదయాన్నే ఎక్కడికో పరుగులు!
అసలు మా కిటికీలోంచి తొంగి చూసే ఆకాశం ఎంత బాగుంటుందనీ.. అదీ పొద్దుపొద్దున్నే ప్రశాంతంగాచలచల్లటి గాలిలో తేలిగ్గా తేలిపోతున్న నీలి పరదాలా ఆకాశం, నీలాకాశం మీద వెన్నముద్దల్లా తేలే తెల్లటి మబ్బులు.. ఊ.. మహా ముద్దొచ్చేస్తుంటాయి. ఎదురుగా కనిపిస్తున్న నల్లటి తారు రోడ్డు మీద ఝూమ్మని రామబాణాల్లా దూసుకుపోతున్న కార్లూ, సైకిళ్ళూ.. అందరూ ఆత్రంగా పరుగులు తీస్తున్నారు ఎవర్ని కలిసే తొందరలోనో మరి! ఆ ఎర్ర కారులో అమ్మాయి ఆఫీసుకి వెళ్ళే హడావుడిలో ఉండొచ్చా, సైకిలు మీద వెళుతోన్న ముసలి తాత ఇంత ఉదయాన్నే ఎక్కడికో పరుగులు!
మది నిండా రాముడిని నింపుకుని ఎంతో ఆర్తిగా రాముడిని పిలుస్తున్న రామదాసు కీర్తనలు మధ్య మధ్యలో నా దృష్టిని మరలుస్తున్నాయి.
"అంతా రామమయం.. ఈ జగమంతా రామమయం.."
ఈ పాట చెవిన పడగానే ఓ
క్షణం మా ఇంట్లో ఉన్నట్టు అనిపించింది. ఫ్రిజ్ మీద ఉండే అమ్మ ఫోన్ మోగుతోంది వెళ్ళి
చూడాలేమో అన్నంత భ్రమ కలిగింది.
"జగదానందకారకా.." అంటేనేమో.. నాన్న ఫోను
మోగినట్టన్నమాట. బాబోయ్ ఆ ఫోనుకి మాత్రం నోరు మూత పడితే ఒట్టు, అస్తమానూ అరించింది అరిచినట్టే
ఉంటుంది.
హ్మ్.. నా పిచ్చి కానీ ఊర్లు, దేశాలు, ఖండాలు, సముద్రాలు దాటేసి ఇంత దూరం వినిపిస్తుందా ఫోను!
మళ్ళీ రాముడి పాదాల వైపు పరుగు తీస్తోంది మనసు..
చరణములే నమ్మితి.. నీ దివ్య చరణములే నమ్మితీ..
ఎంతకెంతకు మందలింతునయ్యయ్యో.. పంతగించేవు స్వామీ పట్టాభిరామా..
రామా నీ దయ నాపై రాదుగా..
అబ్బా.. ఎంత ఆర్తిగా పిలుస్తున్నాడు రామదాసు.. ఆ పిలుపులు వింటూ కూడా వెంటనే ప్రత్యక్షమవకుండా అనుగ్రహించకుండా రాముడు అంత కఠినంగా ఎలా ఉండగాలిగాడో! ఎంతగానో ఆరాధిస్తేనో, ఎంతగానో నిరీక్షిస్తేనో తప్ప రామదర్శనం విలువ, అందులోని దివ్యానుభూతి పూర్తిగా అనుభవంలోకి రాదనేమో! ఊ.. అదీ నిజమేనేమోలే.. కోరిన వెంటనే చేతికందిన వాటి విలువని మనం సరిగ్గా లేక్కకట్టలేమేమో ఒకోసారి. ఎదురుచూపుల తర్వాత అపురూపంగా దొరికిన ఆనందానుభూతి అమరమే కదూ!
నందివర్ధనాల మధ్యలో పూసిన ఎర్రమందారంలా మధ్యలో లవకుశ సినిమాలో పాట వస్తోంది.
హ్మ్.. నా పిచ్చి కానీ ఊర్లు, దేశాలు, ఖండాలు, సముద్రాలు దాటేసి ఇంత దూరం వినిపిస్తుందా ఫోను!
మళ్ళీ రాముడి పాదాల వైపు పరుగు తీస్తోంది మనసు..
చరణములే నమ్మితి.. నీ దివ్య చరణములే నమ్మితీ..
ఎంతకెంతకు మందలింతునయ్యయ్యో.. పంతగించేవు స్వామీ పట్టాభిరామా..
రామా నీ దయ నాపై రాదుగా..
అబ్బా.. ఎంత ఆర్తిగా పిలుస్తున్నాడు రామదాసు.. ఆ పిలుపులు వింటూ కూడా వెంటనే ప్రత్యక్షమవకుండా అనుగ్రహించకుండా రాముడు అంత కఠినంగా ఎలా ఉండగాలిగాడో! ఎంతగానో ఆరాధిస్తేనో, ఎంతగానో నిరీక్షిస్తేనో తప్ప రామదర్శనం విలువ, అందులోని దివ్యానుభూతి పూర్తిగా అనుభవంలోకి రాదనేమో! ఊ.. అదీ నిజమేనేమోలే.. కోరిన వెంటనే చేతికందిన వాటి విలువని మనం సరిగ్గా లేక్కకట్టలేమేమో ఒకోసారి. ఎదురుచూపుల తర్వాత అపురూపంగా దొరికిన ఆనందానుభూతి అమరమే కదూ!
నందివర్ధనాల మధ్యలో పూసిన ఎర్రమందారంలా మధ్యలో లవకుశ సినిమాలో పాట వస్తోంది.
మందస్మిత సుందర వదనారవింద రామా..
ఇందీవర శ్యామలాంగ వందితసుత్రామా..
మందార మరందోపమ మధుర మధుర నామా..
ఇందీవర శ్యామలాంగ వందితసుత్రామా..
మందార మరందోపమ మధుర మధుర నామా..
మా ఊరి రాముడు ఎలా ఉన్నాడో.. ఆయనకేంలే.. గోదారొడ్డున సీతాలక్ష్మణ సమేతంగా రాజసంగా
కొలువుదీరి అందర్నీ చల్లగా చూస్తూ ఉండుంటాడు. రామాలయం మెట్లు, ఉదయాన్నే దొరికే వేడి వేడి చక్కర
పొంగలి ప్రసాదం గుర్తొస్తున్నాయి.
ఆకాశంలో బాగా కింద నుంచి రయ్యిమని దూసుకెళ్ళిన విమానం మళ్ళీ నన్ను మా కిటికీ దగ్గరికి లాక్కొచ్చి పడేసింది. ప్రతిరోజూ ఆకాశంలో ఎన్ని వేల విమానాలు ఎగురుతూ ఉంటాయో.. వాటిల్లో ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఎవరిని చూడాలన్న ఆత్రంలో ఇంత ఆఘమేఘాల మీద సముద్రాలు దాటుకుని ఎగిరి వెళుతున్నారో కదా! ఎప్పుడు చూసినా మబ్బుల్లో ఝూమ్మని దూసుకెళ్ళే విమానాలూ, వాటి వెనకనే పెద్ద తోకలా తెల్లటి పొగ, అదిగో ఆ రెండు విమానాలు ఇద్దరికీ పరుగు పందెం పెట్టినట్టు పక్క పక్కనే పోటాపోటీగా ఎలా పరిగెడుతున్నాయో.. వాటి వెనకాలే తోకలు కూడా ఎవరి తోక ఎక్కువ పొడవో పోల్చిచూసుకుని పందెం వేసుకుంటున్నట్టు.. భలే నవ్వొచ్చింది. నేనిప్పటికీ ఇదే మొదటిసారి అన్నట్టు ఆకాశంలో ఎగిరే విమానాలని అంతే అబ్బురంగా చూస్తుంటాను. అంత మైమరపన్నమాట విమానాలని చూడటం.
దూరంగా ఆకాశంలో ఎగిరే విమానాన్ని సరదాగా ఫోటో తీద్దామని గబగబా వెళ్ళి కెమెరా తెచ్చానా.. అల్లంత దూరాన ఉన్న విమానంకేసి ఉసూరుమంటూ చూస్తూ ఇంకొంచెం జూమ్ ఉంటే బావుండేది నా కెమెరాలో అనుకుంటూ ఉంటే.. ఈ లోపు వెనక నుంచి మా ఇంటబ్బాయ్ వచ్చి పోనీ నీకు పెద్ద లెన్స్ కెమెరా తెచ్చివ్వనా అనడిగాడు. తనంతే.. ఎప్పుడు దేని గురించి మాట్లాడినా చూసినా ప్రతీదీ తెచ్చివ్వనా అంటూ ఉంటాడు. నిజంగా ప్రతీదీ తేగలగడం, తెచ్చివ్వడం, ఇవ్వకపోవడం సాధ్యాసాధ్యాల సంగతి పక్కనపెట్టేస్తే ఆ మాట అనడమే బావుంటుంది కదా! నేనూ అలవాటుగా ఎప్పట్లాగే నవ్వేసి ఉహూ.. నాకొద్దన్నాను.
కిటికీ తలుపులు పూర్తిగా తెరవగానే దురుసుగా చుట్టేసే చలిగాలికి సన్నగా వణుకుతూ పెద్ద కప్పు నిండా పొగలు కక్కుతున్న మింట్ టీ కప్పుని రెండు అరచేతుల మధ్యలో పెట్టుకుని కిటికీ మీద మోచేతుల ఆసరాగా వాలిపోయి అలా బయటికి చూస్తూ పొద్దున్నే గ్రీన్ టీ కాదు మింట్ టీ తాగితే ఇంకా బావుంటుందని చెప్పిన నేస్తాన్ని తల్చుకుంటూ ఊ.. నిజమే బాగుంది కదా అనిపించింది. బద్ధకం కొద్దీ రోజూ ఉదయాన్నే తొందరగా లేవకపోవడం వల్ల ఇంతందమైన అనుభూతులు కోల్పోతామన్నమాట! మరేం చేద్దాం.. నిద్రమత్తులో ఇలాంటివేమీ గుర్తు రావు. అసలీ జీవితంలో అత్యంత మధురక్షణాలంటే ఉదయాన్నే మెలకువొచ్చినా కూడా నిద్ర లేచే పని లేదని గుర్తొచ్చి దుప్పటిని ఇంకాస్త దగ్గరికి లాక్కుని వెచ్చగా మునగదీసుకుని మళ్ళీ నిద్రలోకి జారిపోవడమేనని అనిపిస్తుంది నాకు!
చలికాలమంతా ఎక్కడుంటాయో తెలీదు కానీ ప్రతీ ఏడాది వేసవికాలం వచ్చేసరికి కిటికీ ఎదురుగా
కనిపించే చిన్న కొండ మీద ఉన్న ఆపిల్ తోటలో చెంగు చెంగుమని ఎగురుతూ కుందేళ్ళు
కనిపిస్తాయి. ఎవరైనా పెంచుతూ రోజూ ఉదయం కాగానే బయటికి వదిలిపెడతారేమో అనుకుందామంటే వాటి
గంతులు చూస్తుంటే అవసలు ఎవరి చేతికి చిక్కుతాయా అనిపిస్తుంది. వెలుతురున్నంతసేపూ ఆపిల్ తోటలో ఏదోక మూల గెంతుతూనే ఉంటాయి. బాగా ఆటలు ఆడీ ఆడీ
అలసిపోతాయేమో ఒకోసారి గడ్డిలో
బజ్జుని హాయిగా నిద్రపోతుంటాయి. గడ్డి బాగా పెరిగినప్పుడు ఇంత దూరం నుంచీ సరిగా
ఆనవాలు పట్టలేం.
చెవులపిల్లులు పూర్తిగా కనిపించకుండా
వాటి చెవులు మాత్రం అటూ ఇటూ తిరుగుతూ కనిపిస్తుంటాయి.
ఆ పరిగెత్తే బన్నీల ఫోటోలు
తీద్దామని ప్రయత్నిస్తే అబ్బో ఓ పట్టాన దొరికితేనా.. నేను కిటికీలో కెమెరా పట్టుకు నిల్చోగానే కొండ కింద కంచె వైపుకి పరిగెత్తి మాయమైపోతాయి. ఈ
కుందేళ్ళు నాకెలాగూ దొరకవులే అని కెమెరా పక్కన పడేసి ఊరికే నించున్నప్పుడు మాత్రం కనిపిస్తాయి. ఎప్పుడు చూసినా ఆ ఆపిల్ చెట్ల మధ్యన
దాగుడు మూతలు ఆడుతున్నట్టు తెగ పరుగులు తీస్తుంటాయి. మా ఇంటబ్బాయేమో అలా ఎంతసేపైనా ఓపిగ్గా ఉంటేనే నీకు చిక్కుతాయి
మరి.. Frozen planet చూస్తూ ఆహా ఓహో అని సంబరపడిపోడం కాదు. వాళ్ళు ఎంత
కష్టపడితే ఆ పెంగ్విన్స్, వేల్స్ దొరికాయో చూసావు కదా..
నువ్వేమో ఒక్క కుందేలుని కూడా పట్టుకోలేకపోతున్నావు. ఇష్టం ఇష్టం అంటే సరిపోదు ఓపిక కూడా ఉండాలి అన్నాడు.
చూసారా.. అంతే మరి శత్రువులు ఎక్కడో
ఉండరు. ఎప్పుడూ మన పక్కనే ఉండి ఇలా అవకాశం దొరికినప్పుడల్లా పోట్లు పొడుస్తుంటారు. ఆ మాటకి నాకు రోషం
వచ్చేసి నానా తిప్పలు పడి ఆ బుజ్జి బన్నీలని బతిమాలుకుని ఎలాగో ఫోటో తియ్యగలిగాను.
వేసవి కాలమొస్తే చాలు రోజూ కాసేపు వాటి పరుగులు చూడటం నాకు చాలా ఇష్టమైన వ్యాపకం.
ఇంకా కిటికీలోంచి కొద్దిగా కనిపించే ఒక చెట్టు కొమ్మ మీద ఎప్పుడూ ఒక కాకి వచ్చి వాలుతుంది.
ఎప్పుడూ అదే కొమ్మ మీద ఆ ఒక్క కాకే కనిపిస్తుంది. కాసేపు సేద
తీరుతున్నట్టు కూర్చుని మళ్ళీ ఎగిరిపోతుంది. ఇంట్లో ఉన్నంతసేపూ అప్పుడప్పుడు
దాన్ని గమనిస్తూ ఉండటం అలవాటైపోయింది. ఈ కుందేళ్ళు, కాకి నా వేసంగి
నేస్తాలన్నమాట!
ఓ.. ఇలా చెప్తూ కూర్చుంటే ఉదయం కాస్తా మధ్యాహ్నం అయిపోయేట్టుందిగా.. సరే మరి
ఇప్పటికి స్వస్తి.
(రాత్రి పుస్తకాల అర కదిలిస్తే అందులోంచి మడత పెట్టిన కాగితం ఒకటి జారిపడింది. 7.7.2011 తేదీ వేసి కిటికీలో ఉదయం అని కొన్ని వాక్యాలు రాసున్నాయి. తేదీలు మారినా మళ్ళీ అదే వేసవి ఉదయాలు వచ్చేసాయి. ఎంత చిత్రం
కదా.. మన ఇష్టాయిష్టాలతో ఎదురుచూపులతో ప్రమేయం లేకుండా కాలం
రంగులు మారుస్తూ పోతుంది. నా చేతిలో కెమెరా కూడా
మారిపోయింది. :-))
9 comments:
ఫోటోలు బాగున్నాయండి .కుందేళ్ళని ఎలాగో పట్టేశారు.నేనూ మా ఇంట్లో తిరిగే ఉడుతలను తీయడానికి చాలా సేపు వేచి చూస్తా.
మదురవాణిగారి ప్రకృతి పరిశీలన,భావుకత మంచిటపాను ఒక మంచిపాటలా వినిపించాయి!పరిసరాలను మెరిపించాయి!
ప్రకృతితో మమేకమయిపోడం నీకు వెన్నతో పెట్టిన విద్యేమో మధురా
మమ్మల్ని కూడా జర్మనీ తీసికెళ్ళిపోయారు మధురవాణి గారూ !కాణీ ఖర్చు లేకుండా . చక్కగా వర్ణించారు ఉషోదయాన్ని .మీఇంటబ్బాయ్ పుణ్యమా అని చక్కని జర్మనీ కుందేళ్ళను చూసాము .బావుందండీ .
కొద్ది సేపు మమ్మల్ని మీ కిటికీ దగ్గరకి తీసుకుపోయారు :))
@ Unknown,
థాంక్యూ.. ఎలానో చాలా కష్టపడితే కెమెరాకి చిక్కాయి లెండి కుందేళ్ళు. మీరు తీసిన ఉడుతల ఫోటోలు బాగా వచ్చాయండీ.. :)
@ surya prakash apkari,
మీ అభిమానానికి ధన్యవాదాలండీ..
@ శ్రీనివాస్ పప్పు,
విద్య సంగతేమో గానీ అదృష్టం అని మాత్రం అంటాను బుల్లెబ్బాయ్ గారూ.. :)
@ nagarani yerra,
అయితే నాతో మా ఊరొచ్చేసారన్నమాట.. :)
అవునండీ.. తన మాటల వల్లే కష్టపడి కుందేళ్ళని ఫోటో తీశాను. ధన్యవాదాలు.
@ Lasya Ramakrishna,
మీక్కూడా మా కిటికీ ముందు నించోడంనచ్చిందని తలుస్తానండీ మరి.. ధన్యవాదాలు. :)
నాకు కుడా కిటికీ చాలా ఇస్టమండీ, కిటికీ ని ఇంత కంటే ఎవరూ చూపించలేరు,
ఇలాగే వర్షం పడేతపుడు కిటికీ నుంచి కనిపించే అందాలను దయ వుంచి ఒక్కసారి వర్ణించరూ...
చూడండి, నా పై కామెంట్ లో కనీసం ఎలా చెప్పాలో భాష కుడా రాదు, మీ పోస్ట్ లు చదివితే మీ అంత అందంగా చెప్పాలనపిస్తుంది, ఆ ధ్యాస లో నా భాష మరచిపోతా...
@ ఏలియన్,
మీరు ఓపిగ్గా నా పాత పోస్టులన్నీ వెతుక్కుని చదవడమే కాకుండా కామెంట్స్ రాసి మీ అభిప్రాయాలని తెలుపుతున్నందుకు చాలా సంతోషమండీ. ఒకటి రెండు బుల్లి టైపోలు తప్ప మీరు చక్కగానే చెప్పారు.. :-))
ఎప్పుడో ఒకసారి వర్షం - కిటికీ గురించి కూడా ఏదో రాసి సగంలో వదిలేసిన గుర్తు. ఎక్కడో డ్రాఫ్ట్స్ లో ఉంటుంది. మళ్ళీ ఏ వర్షానికో అది బయటికొస్తుందిలెండి.
మీ అభిమానానికి ధన్యవాదాలు. :-)
Post a Comment