Friday, July 12, 2013

ఓ చిన్న కథ!​​చిన్నప్పుడు నాలుగైదు తరగతుల్లో తెలుగు వాచకంలో ఒక కథ ఉండేది. కథ పేరు పరివర్తన అని గుర్తు.

ఒక ఊర్లో సుశీల అనే కల్లా కపటం లేని సాధు స్వభావం కలిగిన అమ్మాయి ఉంటుంది. (నాకింకా బాగా గుర్తు కల్లా కపటం అనే పదం అదే మొదటిసారి వినడం :-) సుశీల భర్త అహంకారి, తోటివారిని మోసం చేసి డబ్బు సంపాదించే రకం. అందరితో పాటు సుశీలని కూడా కష్టపెడుతూ ఉండేవాడు. సుశీల వాళ్ళ ఊరి నడిబొడ్డులో ఉన్న ఒక మర్రిచెట్టుకి ఉన్నట్టుండి కొత్తగా మహిమ వచ్చిందని ఊరంతా కోడై కూస్తుంది. ఎవరైనా మర్రిచెట్టు కిందకి వెళ్ళగానే వారి వారి మనస్తత్వం వ్యక్తిత్వాన్ని బట్టి రూపం మారిపోతోందట. మళ్ళీ మర్రిచెట్టు కింద నుంచి దూరంగా వచ్చేస్తే ఎప్పట్లాగే వాళ్ళ నిజరూపం వచ్చేస్తుందట. ఊర్లో అందరూ ఆ వింత ఏదో చూద్దామని మర్రిచెట్టు చుట్టూ గుంపులు గుంపులుగా గుమికూడుతున్నారట. చాలామంది కుక్కల్లాగా, పిల్లుల్లాగా రకరకాలుగా మారిపోతుండటం చూసి జనాలు విరగబడి నవ్వుతుంటారు.
ఇదంతా చూసి సుశీల భర్తకి మర్రిచెట్టు కిందకి వెళ్ళి తానూ ఎలా మారతాడో చూసుకోవాలని కుతూహలం ఏర్పడుతుంది. కానీ ఊర్లో వాళ్ళందరి ముందు వెళ్ళడానికి ఇష్టపడక ఒక రోజు అర్ధరాత్రి పూట సుశీలని వెంటబెట్టుకుని మర్రిచెట్టు దగ్గరికి వెళతాడు. ఇద్దరూ కలిసి చెట్టు కిందకి చేరగానే సుశీల భర్త పెద్ద బ్రహ్మ రాక్షసుడిగా మారిపోతాడు. సుశీల మాత్రం ఏమీ మారకుండా తన నిజరూపంలోనే ఉంటుంది. భర్త బ్రహ్మరాక్షస రూపాన్ని చూసి భయపడి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆ తర్వాత సుశీల భర్త చెట్టు నీడ నుంచి బయటికి రాగానే మళ్ళీ మామూలు రూపంలోకి వచ్చేస్తాడు. తనలో ఇంత క్రూరత్వం ఉందనీ, సుశీల కల్లా కపటం లేని మనసు వల్లే తను రూపం మారలేదని అర్థం చేసుకున్నాక అతనిలో పశ్చాత్తాపం కలిగి పరివర్తన చెందుతాడు. ఇక నుంచి మంచి మనిషిలా మారి బతకాలని నిర్ణయించుకుంటాడు.
ఇదీ కథ!
నాకు అప్పుడప్పుడూ ఈ కథ గుర్తొస్తూ ఉంటుంది. సాంకేతిక విప్లవం తీసుకొచ్చిన పలు రకాల సౌకర్యాల మూలంగా ప్రపంచంలో నలుమూలల ఉన్నవారినందరినీ ఒక చోటకి చేరుస్తోంది ఇంటర్నెట్ లోకం. కానీ పై కథలో మర్రిచెట్టు కిందకి చేరగానే రూపాలు మారిపోయిన మనుషుల్లాగే ఇంటర్నెట్ నీడలో మనుషులు రూపాంతరం చెంది కనిపిస్తుంటారు. ఆ కనిపించే రూపాల వెనక దాగున్న నిజమైన వ్యక్తి ఎవరు ఏమిటో అంచనా వెయ్యగలగడం, అర్థం చేసుకోవడం దాదాపు అసాధ్యంగా మారిపోతోంది. ఈ మాయాలోకంలో ఎదురుపడే ఇందరి మధ్యలో ఒకరో ఇద్దరో సుశీల లాంటి వాళ్ళ పరిచయం, స్నేహం పొందగలిగితే అదృష్టవంతులమే కానీ ఆ సంభావ్యత ఎంతని ఎలా లెక్కగట్టడం? అది ఎప్పటికప్పుడు కొత్త ప్రశ్నే ఎందుకంటే మరి ఎప్పటికప్పుడు కొత్త కొత్త మనుషులు కొత్త కొత్త రూపాల్లో ఎదురుపడుతుంటారు కాబట్టి ఇదీ లెక్క అని తేల్చడం సాధ్యమయ్యే పని కాదు కదా! కానీ పై కథలోలా మర్రిచెట్టు కింద కనిపించే కొత్త ​రూపాలు సరదాగా ఉండి ​ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చేవైతే నష్టమేముందీ, అయినా ముసుగులు బయట మాత్రం ఉండవా అంటే ఉండొచ్చు. కానీ ఈ మయసభ లాంటి లోకంలో బోల్తా పడటం బయటి ప్రపంచంలో కన్నా మరింత సులువు కదా! :-)16 comments:

శిశిర said...

ఊ.. నిజమే.

Kranthi Kumar Malineni said...

nee mask katha baagundamma Madhuraaaa :) edo alantisusilalu,sushiludulu oka naluguru parichayamaina chaalu kada ee net lokamlo tirugaadinanduku. naakaite chaala mande dorikaaru ilanTi vallu ;-)

..nagarjuna.. said...

ఆ చెట్టు ఎక్కడ ఉంటుందో చెప్తారా,ఎందుకైనా మంచిది, అటేపు వెళ్ళకుండా ఉంటాను. దహా.

ప్రేరణ... said...

అంతా అంతర్జాల మహిమ.

బులుసు సుబ్రహ్మణ్యం said...

కల్లా కపటం అంటే ఏమిటండీ?

నన్ను ఆ మర్రిచెట్టు కింద నుంచోపెట్టినా నా వెధవ ముఖం వేలాడేసుకొని నేనే ఉంటానని హామీ ఇస్తున్నాను......దహా.

అనంతం కృష్ణ చైతన్య said...

you are absolutely right........

HarshaBharatiya said...

true

surya prakash apkari said...

ఓ చిన్న కథను మధురవాణి గుర్తుతెచ్చుకొని లిఖించి ముసుగు ముఖపత్రవీరులలో,టపాకారులలో కల్లాకపటంలేని సుశీలలు దొరుకుతారేమోనని కళ్ళలో వత్తులు వేసుకొని వెతుకుతున్నారు!ఏ పుట్టలో ఏ పాముందో ఏ పొట్టలో ఏ పోయముందో చెప్పలేము!ఏమో గుర్రం ఎగరావచ్చు,సుశీల దొరకావచ్చు!ఓ పాతకధకు సరికొత్తగా సమకాలీన అంశంతో జోడించి సమన్వయం చేశారు!పాతకధకు కొత్త సందేశం ప్రతిభతో మేళవించారు!భేష్!!

చందు తులసి said...

అవును వాణి గారూ...
నాకూ ఆ కథ గుర్తుంది. మీ పోస్టు చదివాక
ఆ పాఠమే కాదు.

నాగార్జున గారు ఆ చెట్టు ఎక్కడ అని అడిగారు కదా.
ఆ పాఠంలో ప్రాగ్జోతిష్య పురం అని చెప్పినట్లు గుర్తు.

ఆ నాలుగో తరగతి తెలుగు పుస్తకంలో ఇంకా కొన్ని పాఠాలు గుర్తొచ్చాయి.

ఆ పుస్తకంలో మొదటి పాఠంలో ఓ పిల్లవాడు తమ ఊరిని వివరిస్తూ ఉంటాడు. ఆ ఊళ్లో వేణుగోపాలస్వామి గుడి కూడా ఉంటుంది.

రెండో పాఠం మూడు చెప్పల కథ. సుమతి, కాలమతి,మందమతి అని చేపల పేర్లు.

ఆ పుస్తకంలోనే నాకు బాగా గుర్తుండే పాఠం ఏమిటంటే..
దాహమని ఏరుతో అంటే నాకు నీళ్లించిందని
ఆకలని ఆవుతో అంటే పాలు ఇచ్చిందని
ఓ గేయం ఉండేది గుర్తుందా...చాలా బాగుంటుంది ఆ గేయం.

అలాగే జరద్గవం అని ఓ గద్ద కథ కూడా ఉన్నట్లు గుర్తు.
మొత్తానికి మీ పోస్టు వల్ల నా నాలుగో తరగతి పాఠాలు గుర్తొచ్చాయి. అలాగే స్వేచ్ఛ పేరుతో ఓ చిలుక-పంజరం కథ కూడా ఉన్నట్లుంది.

మధురవాణి said...

​@ శిశిర..
:-)

@ Kranthi Kumar Malineni,
థాంక్స్ క్రాంతీ.. మనకి అలా మంచి నేస్తాలు దొరికారంటే మనం లక్కీ అని అర్థం అన్నమాట! ;-)

@ నాగార్జున,
అబ్బా ఎంతసేపు నవ్వానో మీ కామెంట్ చూసి.. గుడ్ వన్! :D

@ ప్రేరణ,
అంతేనండీ అంతే.. :)

@ బులుసు గారూ..
కల్లాకపటం అంటేనా.. అయ్యో అంత పరుషమైన పదాల అర్థం మీకు తెలిసే అవకాశం లేదులెండి. మర్చిపోండి ఆ మాటల్ని.. :D
హహ్హహ్హా.. మీరు అలాగే ఉండటం వెనక గొప్పతనం మీది కాదండి.. అది ప్రభావతి గారి సాంగత్య మహిమ! ;-)​

మధురవాణి said...

@ అనంతం కృష్ణ చైతన్య, HarshaBharatiya..
:-)

@ surya prakash apkari,
హహ్హహ్హా.. ​భలే చెప్పారండీ.. మీ స్పందనకి ధన్యవాదాలు.

@ చందు తులసి,

మీరు సూపరండీ తులసి గారూ.. మీకు కథలో ఊరి పేరు కూడా భలే గుర్తుందే! :)

మూడు చేపల కథ మాకు కూడా ఉండేది కానీ అదింకా చిన్నప్పుడండీ​.. బహుశా ఏ రెండో తరగతిలోనో అనుకుంటా..
ఇంకా ​వేణుగోపాలస్వామి గుడి ఉన్న ఊరు, ఆ గేయం, చిలుక పంజరం కథ.. ఇవన్నీ నాకసలు చదివిన గుర్తు లేదు మరి. మనిద్దరివి వేరే వేరే పుస్తకాలేమో మరి!

జరద్గవం అనే గద్ద కథ పంచతంత్రం కథండీ. అది పది తరగతి వాచకం గద్యభాగంలో ​'​కొత్తగా వచ్చిన వారిని నమ్మరాదు' అనే పేరుతో ఉండేది. అందులో పిల్లి పేరు దీర్ఘకర్ణుడు. :)

బోల్డు జ్ఞాపకాలు పంచుకున్నారు. ధన్యవాదాలండీ..

KumarN said...

Good one Madhura :)

Human mind itself is a theater to start with. On top of it, we collectively have added a new 'Stage' for all of us to perform and 'play' for each other :)

( btw, కథ చెప్పేవాళ్ళు కథలో భాగమని సాధారణంగా మర్చిపోతూంటాం :) )

మధురవాణి said...

​@ ​KumarN,
​థాంక్సండీ.. మీరు 'స్టేజ్' గురించి చెప్పింది బావుంది. So true! :)

నా కళ్ళకి అందరూ రకరకాల రంగుల్లో కనిపించినట్టే నేను కూడా ఎదుటివాళ్ళ కళ్ళకి వేరే వేరే రంగుల్లో కనిపిస్తానన్న సంగతి నాకెప్పుడూ గుర్తుంటుందిలెండి.. :)

Anonymous said...

మీరు బ్లాగ్ వేదికలో మీ బ్లాగును అనుసంధానం చేసినందుకు కృతజ్ఞతలు అందిస్తున్నాము.బ్లాగర్లకు మా విన్నపం ఏమనంటే ఈ బ్లాగ్ వేదికను ప్రచారం చేయటంలోనే మీ బ్లాగుల ప్రచారం కూడా ఇమిడి ఉంది.ఈ బ్లాగ్ వేదికను విస్తృతమైన ప్రచారం కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము.దానిలో భాగంగా ఈ బ్లాగ్ వేదిక LOGO ను మీ బ్లాగుల ద్వారా బ్లాగ్ వీక్షకులకు తెలియచేయుటకు సహకరించవలసినదిగా బ్లాగర్లకు విజ్ఞప్తి చేస్తున్నాము.బ్లాగ్ వేదిక LOGO లేని బ్లాగులకు బ్లాగ్ వేదికలో చోటు లేదు.గమనించగలరు.దయచేసి మీకు నచ్చిన LOGO ను అతికించుకోగలరు.
క్రింది లింక్ ను చూడండి. http://blogsvedika.blogspot.in/p/blog-page.html

చిన్ని ఆశ said...

నిజమేనండీ, ఆలోచిస్తే జీవితమే ఒక నాటక రంగం లాంటిది. మనసు రకరకాల ముసుగులు కప్పుకుని ప్రతి నిమిషమూ నటన చేస్తూనే ఉంటుంది కడ దాకా..

మధురవాణి said...

​@ Ahmed Chowdary,
ధన్యవాదాలండీ.. బ్లాగ్ వేదిక లోగోని నా బ్లాగులో పెట్టాను.

@ చిన్ని ఆశ,
మీరు చెప్పింది నిజమేనండీ.. కానీ మనకి ఇప్పటికున్నవి కాకుండా ఇంకా కొత్త ముసుగులు కూడా తయారు చేసుకున్నాం అని చెప్పడం నా ఉద్దేశ్యం. :-)