Thursday, July 25, 2013

My San Francisco Diary - 312.06.2013
బుధవారం

ఎప్పట్లాగే తెల్లారి పొద్దున్న ప్రయాణం ఉందనేసరికి ముందు రోజు రాత్రి నాకు రకరకాల ఆలోచనలతో సరిగ్గా నిద్ర పట్టలేదు. ​ఉదయం 9:50 కి నా ఫ్లైట్ టైం అయినా సరే ముందు రోజు రాత్రి ఆన్లైన్ చెకిన్ చేసేసాను కదాని ఎయిర్పోర్టుకి కాస్త ఆలస్యంగానే బయలుదేరాము. లగేజ్ చెకిన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసరికి దాదాపు ఎనిమిదిన్నర కావొస్తోంది. అక్కడ కౌంటర్లో ఉన్న అమ్మాయి బోర్డింగ్ పాస్ ఇచ్చే ముందు చిన్నపాటి ఇంటర్వ్యూ చేసింది. నువ్వెప్పుడు జర్మనీ వచ్చావు, ఎన్నేళ్ళ నుంచి ఉన్నావు, ఏం ఉద్యోగం చేస్తావు, ఏయే ఊర్లలో ఉన్నావు, అమెరికాలో ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు వగైరా ప్రశ్నలన్నీ ఒక పావుగంట సేపు అడిగి నేను చెప్పిన సమాధానాలన్నీ ఒక పేపర్ మీద రాసుకుంది. అమెరికాలో అడుగు పెట్టక ముందే ఇక్కడి నుంచే స్పెషల్ ట్రీట్మెంట్ మొదలవుతుందని ముందే సౌమ్య చెప్పి ఉండటం వల్ల నేనేం కంగారు పడలేదు. లగేజ్ చెకిన్ అయిపోయి, సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయి లోపలికి వెళ్ళేదాకా నన్ను జాగ్రత్తగా చూసుకుని ఇంకప్పుడు టాటా చెప్పేసి మా ఇంటబ్బాయ్ వెళ్ళిపోయాడు. బోర్డింగ్ గేట్ దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికే బోర్డింగ్ మొదలైపోయి పెద్ద క్యూ ఉంది. మళ్ళీ అక్కడ కూడా ఓ నాలుగైదు ప్రశ్నలడిగి ఫ్లైట్లోకి పంపిస్తున్నారు. ఫ్లైట్లోకి వెళ్ళి కూర్చున్నాక అంతా బానే అయింది, నేను ఎగరడానికి రెక్కలు సిద్ధం అని చెప్పాల్సిన వాళ్ళందరికీ ఫోన్లో నుంచి మెయిల్స్ పెట్టేసి ఫోన్ స్విచ్చాఫ్ చేసేసాను.

నేను ఎక్కిన డెల్టా ఎయిర్ లైన్స్ విమానం పది గంటల పైన  ప్రయాణం చేసి నన్ను అట్లాంటా నగరానికి చేరుస్తుంది. ఇప్పటిదాకా ​ఎప్పుడూ పది గంటల సేపు ఒకే ఫ్లైట్లో కూర్చోలేదు, అన్ని గంటలు ఎలా గడుస్తాయో అనుకుంటూ కిటికీలోంచి పగటి వెలుగులో ఆకుపచ్చగా మెరిసిపోతున్న ఐరోపా ఖండపు అందాలనిఇంద్రనీలంలా కాంతులు విరజిమ్ముతున్న అట్లాంటిక్ మహా సముద్రపు నయగారాన్నీ చూస్తూ అసలు ఇంతందంగా ఈ భూమిని ఎవరు సృష్టించారో, ఈ మబ్బుల్ని, నీలాకాశాన్నీ దాటుకుని అనంత విశ్వంలోకి వెళ్తే ఇంకా ఏమేం కనిపిస్తాయో అని రకరకాల ఆలోచనలు, ఊహలు చుట్టుముట్టేసరికి చాలా సమయం గడిచిపోయింది. తర్వాత చెవిలో పాటలు పెట్టుకుని లత 'మోహన వంశీ' పుస్తకం చేతిలో పట్టుకున్నాను. కృష్ణుడిని తల్చుకోడమంటే మనకి మహదానందం కాబట్టి కృష్ణమాయలో పడి అప్పుడప్పుడూ నిద్రలోకి జారిపోతూ మళ్ళీ లేస్తూ కృష్ణుడి కథ చదూకుంటూ పది గంటలు తొందరగానే గడిచిపోయాయనిపించింది.


​​మబ్బుల పల్లకీ​ ఎక్కి ​మది కోరిన తీరాలకి ప్రయాణం..

నేను ఎక్కిన విమానం హార్ట్స్ ఫీల్డ్ - జాక్సన్ అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో దిగేసరికి లోకల్ టైం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటలైంది. ఎయిర్పోర్ట్ లో వాతావరణం చూడగానే నాకు అమెరికాకి, జర్మనీకి తేడా తెలిసినట్టనిపించింది. మా ఊరి ఎయిర్పోర్ట్ లో జనాలు ఎక్కువ ఉన్నాసరే ఎప్పుడూ అదొకలాంటి నిశబ్దమైన వాతావరణం ఉంటుంది. జనాల మాటలు, నవ్వులు బిగ్గరగా వినపడవు. అందరూ మెల్లగా మాట్లాడుకుంటూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నట్టు కనపడతారు. అదే అట్లాంటా ఎయిర్పోర్ట్ లో అయితే సెక్యూరిటీ చెక్​​ క్యూ లో నించుంటే ఎంతమంది అప్పటికప్పుడు పరిచయాలు చేసేసుకుని ఏదో ఒక కాలక్షేపం ​కబుర్లు మాట్లాడుకుంటూ  కనిపించారో! అక్కడున్న ఎయిర్పోర్ట్ స్టాఫ్ కూడా సరదాగా జోకులేస్తూ మాట్లాడుతూనే ఉన్నారు. జర్మన్లు వాళ్ళ విధుల్ని వాళ్ళు చక్కగా నిర్వర్తిస్తారు కానీ కొత్తవారితో అంత ఎక్కువ మాట్లాడరు. అవసరమైనంత మేరకే మాట్లాడతారు. అట్లాంటా ఎయిర్పోర్ట్ చాలా పెద్దది. ఫ్లైట్ లాండ్ అయిన దగ్గరినుంచీ చుట్టూ ఎటు చూసినా అట్లాంటాస్ హోమ్ ఎయిర్ లైన్స్ డెల్టా అని మహా గర్వంగా ప్రతీ చోటా రాసేసుకున్నారు. భలే అనిపించింది అది చూసి. ఏ విషయంలోనైనా ఇలా వారి గొప్పతనాన్ని ఇలా గర్వంగా ప్రకటించుకోడం అమెరికా ప్రత్యేకతేమో అనిపిస్తుంది. జర్మనీలో, ఇతర యూరోపియన్ దేశాల్లో ​తక్కువగా కనిపిస్తుంది ఇది. అంటే నా ఉద్దేశ్యం అమెరికన్స్ కి వారిదంటూ ఒక ప్రత్యేకమైన ఎక్స్ప్రెషన్, స్టైల్ ఉంటుందనిపిస్తుంది ఈ విషయంలో. :-)

అట్లాంటా నుంచి శాన్ ఫ్రాన్సిస్కో కి వెళ్ళే విమానం బయలుదేరడానికి రెండు గంటల పైనే సమయం ఉంది. కస్టమ్స్ క్లియరెన్స్ దగ్గర చాలానే ప్రశ్నలడిగారు. ఎందుకొచ్చారు, ఎవరి దగ్గరికొచ్చారు, వాళ్ళు ఎలా స్నేహితులయ్యారు, ఇదివరకు మీరెప్పుడు కలిసారు, ఇప్పటిదాకా ఎందుకు రాలేదు వగైరా చాలాసేపు అడుగుతూనే ఉన్నాడు కస్టమ్స్ ఆఫీసర్. కాసేపయ్యాక జర్మనీలో ​ఏం చేస్తుంటావు అంటే సైంటిస్ట్ ని అని చెప్తే "ఓహ్, యు మస్ట్ బి వెరీ స్మార్ట్ దెన్.." అని నవ్వి ఇంక వెళ్ళమన్నాడు. ఓహో.. సైంటిస్టుల మీద బానే నమ్మకం ఉందన్నమాట అని నవ్వొచ్చింది. కస్టమ్స్ క్లియరెన్స్ అయిపోయి, లగేజ్ తీసుకుని మళ్ళీ శాన్ఫ్రాన్సిస్కో వెళ్ళే ఫ్లైట్ కౌంటర్ దగ్గర అప్పగించి లోకల్ ఫ్లైట్స్ టెర్మినల్ కి అండర్ గ్రౌండ్ ట్రైన్లో వెళ్ళేసరికి గంట పైనే పట్టింది. మళ్ళీ కాసేపు పుస్తకం చదువుకుంటూ కూర్చున్నాక శాన్ ఫ్రాన్సిస్కో ఫ్లైట్ బోర్డింగ్ మొదలైంది. లోపలికెళ్ళాక ముందు ఫ్లైట్ కీ, దీనికీ బాగా తేడా తెలిసింది. ఎందుకో ఎప్పుడూ యూరప్లో తిరిగే ఫ్లైట్స్ మంచివి కొత్తవి ఉంటాయనిపిస్తుంది. మనకి తినే ఆసక్తి ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే ఈ లోకల్ ఫ్లైట్లో ఐదు గంటల ప్రయాణానికి సింపుల్ గా స్నాక్స్, సాండ్ విచ్ ​పెట్టాడు. అట్లాంటా నుంచి శాన్ఫ్రాన్సిస్కోకి ఐదు గంటల ప్రయాణం. అప్పటికి అలసట తెలిసొచ్చి, అబ్బా.. ఈ ఐదు గంటలు ఎప్పుడు గడుస్తాయో కదాని చాలా అసహనంగా అనిపించింది. నిద్ర పోడానికి చాలా కష్టపడ్డాను కానీ ఎంత బతిమాలినా నిద్ర రానని మొండికేసింది.


విమానం​లో నుంచి జర్మనీ​.. :-)


విమానంలోంచి భూమిని దూరం నుంచీ గమనించడం భలే ఆసక్తికరంగా ఉంటుంది. యూరోప్ మీదుగా ఎగురుతున్నప్పుడు చలికాలంలో అయితే పూర్తిగా మంచు కప్పేసిన తెల్లటి ఆల్ప్స్ పర్వతాలతో, మధ్య మధ్యన నీరు పూర్తిగా గడ్డ కట్టుకుపోయిన నదులు, సరస్సులతో కనిపిస్తే, ఎండాకాలంలో ఎటు చూసినా ఆకుపచ్చగా మెరిసిపోయే కొండలు, పొలాలతో అంతా పచ్చ పచ్చగా కనిపిస్తూ మధ్యలో ఊర్లు ఉన్న చోట ఎర్రటి పెంకుల ఇళ్ళు ఎక్కువ కనిపిస్తుంటాయి. దుబాయి లాంటి ప్రదేశాల మీదుగా చూసినప్పుడేమో విశాలమైన ఇసుక ఎడారులుపెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్ తో ఇంకొక రకంగా ఉంటుంది. మన హైదరాబాదేమో చిన్నపిల్లల ఆట వస్తువులన్నీ తీసుకొచ్చి ఒక పెద్ద కుప్పలా పోసినట్టు ​భలే కనిపిస్తుంది బొమ్మలు బొమ్మల్లాగా. అమెరికా ఏమో వీటన్నిటికీ భిన్నంగా కనిపించింది నా కళ్ళకి. బోల్డు ఎక్కువ రోడ్లూ, వందల కొద్దీ పార్క్ చేసిన కార్లు, ఇళ్ళు ఉన్న విధానం కూడా వేరేలా ఉంది. చక్కగా వరసల్లో ఒకేలాంటి బొమ్మరిళ్ళు కట్టినట్టు భలే ఉన్నాయి.  కొన్ని చోట్ల అంతా ఆకుపచ్చగా కనిపించినా ​అది ​యూరోప్ లా కాకుండా ఇంకో రకంగా ఉంది. పెద్ద పెద్ద రాతి కొండలు, పర్వతాలు, ఎడారులు, సన్నగా పాయల్లా కనిపించే నదులు, శాన్ ఫ్రాన్సిస్కో దగ్గరికి రాగానే అదేదో సముద్రం లాంటిది.. ఏంటో ఆ ఐదు గంటల ప్రయాణంలోనే చాలా వైవిధ్యం ఉన్న భూభాగాలు కనిపించేసాయి. మొత్తానికి ఎలాగైతేనేం అలా దిక్కులు చూస్తూ, ఇంకా ఎన్ని మైళ్ళు వెళ్ళాలో విమానం మ్యాప్లో చూసుకుంటూ ఎలాగో ఐదు గంటలు గడిపేసాను.


​ఆకాశంలో ​నుంచి అమెరికా.. :-)​


శాన్ ఫ్రాన్సిస్కో లోకల్ టైం ప్రకారం సాయంత్రం ఆరున్నర గంటలకి విమానం నన్ను భద్రంగా తీసుకెళ్ళి కాంతి గారి ముందు నిలబెట్టేసింది. నిజానికి విమానం దిగాక చెకింగ్లు ఏమీ లేకపోయినా లగేజ్ తీసుకుని వెళ్ళేసరికి కాస్తైనా టైం పడుతుందనుకున్నాను. తీరా చూస్తే ఇలా దిగేసి అలా కొంచెం నడిచి ఒక ఎస్కలేటర్ మీద నుంచీ దిగుతుంటే కింద కాంతి గారు, కిరణ్ ప్రభ గారు కనిపించేశారు ఎదురుగ్గా! ఒక్క క్షణం "కనిపించేసారోచ్.." అని గాల్లో తేలిపోయినట్టు అనిపించినా మరుక్షణంలో నేనింకా నా లగేజ్ తీసుకోలేదు కదా, తప్పు దారిలో వచ్చానా ఏంటీ అని సందేహం కూడా వచ్చింది. ఈ లోపు మొదటి రోజు స్కూలుకి పంపించిన ​పిల్ల కోసం స్కూలు బయట నించుని ఎదురు చూస్తున్నట్టు నించున్న కాంతి గారు నన్ను చూసి "అదిగో మధుర.." అని పరిగెత్తుకుంటూ అరక్షణంలో నా దగ్గరికొచ్చి రెండు చేతులతో నన్ను చుట్టేసారు. నిజంగా స్కూలు ముందు అయ్యుంటే ఎత్తుకునే పని కానీ నేనింత పెద్దైపోయాను కాబట్టి కుదర్లేదన్నమాట. :-) కిరణ్ ప్రభ గారు ​మాత్రం వెంటనే మా దగ్గరికి రాకుండా మా​ఇద్దరి ఉద్వేగాన్ని, సంబరాన్ని తన బ్లాక్ బెర్రీలో బంధించే ప్రయత్నం చేసారు. కాంతి గారి మొదటి మాట ఏంటంటే.. "ఇంత దూరం ప్రయాణం చేసి ​నువ్వెంత వడలిపోయి వస్తావో అని రాత్రి నుంచీ విపరీతంగా టెన్షన్ పడిపోతున్నాను. అప్పుడు ఇండియా ప్రయాణానికే అలా నీరసపడిపోయావు కదా.. అమెరికా ఇంకా దూరం కదాని చాలా కంగారుగా అనిపించింది. హమ్మయ్యా మొహం కాస్త బానే ఉంది. నాకిప్పుడు ధైర్యం వచ్చింది" అన్నారు. వెంటనే కిరణ్ ప్రభ గారు వచ్చి "ఉదయం నుంచీ ఇదే కంగారు, తన కంగారు చూసి నేను కూడా కంగారు పడ్డాను" అని నవ్వించారు. వెంటనే ఇంకా నేను లగేజ్ తీస్కోలేదు అంటే ​లగేజ్ కోసం​ అందరం కలిసి వెళ్ళొచ్చు అన్నారు. ఇంతలో కాంతి గారు "లగేజ్ సంగతి తర్వాత అసలీ జుట్టేంటి ఇలా చేసావ్? బంగారంలాంటి జుట్టంతా ఏమైపోయింది? ఈ పిచ్చి పిలక వచ్చిందేంటి? అసలు నీకెలా మనసొప్పింది....." అంటూ ప్రైవేటు మొదలెట్టేసరికి ​ఒక్కక్షణం ​నేను ఇండియా వచ్చానా అమెరికా వచ్చానా అని సందేహం వచ్చింది నాకు. ఎందుకంటే జుట్టు విషయంలో ఏమన్నా తేడాలొస్తే మా అమ్మ కూడా ఇవే అక్షింతలు వేస్తుంటుంది. అది కూడా ఒక్కసారి కాదు, కళ్ళ ముందు ఉన్నన్ని రోజులు రోజూ టిఫిను, అన్నం పెట్టినట్టు పూటకోసారి ఉంటుంది జుట్టు గురించి ప్రైవేట్ క్లాస్.. :-) సరే మొత్తానికి ముగ్గురం కలిసి వెళ్ళి లగేజ్ కలక్ట్ చేసుకుని పార్కింగ్ లోకి వెళ్ళి కారు తీసుకుని ఇంటికి బయలుదేరాం. కార్లో ఎక్కగానే "ఇదిగో నీ కోసం తెచ్చిన ఫోన్ సిమ్ కార్డ్. ఫోన్ చేతిలో పెట్టుకో. నీకే ఫోన్లు వచ్చేస్తాయి" అన్నారు. అబ్బా అప్పుడే ఎవరు చేస్తార్లెండి మరీనూ.. అన్నానో లేదో కాసేపట్లో నిషి ఫోన్ చేసింది. "నిషీ.. నేనొచ్చేసా!" ​గట్టిగ్గా అని అరిచేసరికి "గొంతు బ్రహ్మాండంగా వినిపిస్తుందిగా.. హమ్మయ్యా బానే ఉన్నావన్నమాట.. ఇంక నేను ప్రశాంతంగా ​నిద్రపోవచ్చు" అంది నిషి. తనకి పడుకునే టైం అవుతోందని మరీ ఎక్కువసేపు మాట్లాడకుండా టాటా చెప్పేసాం. 

శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్ నుంచీ డబ్లిన్ వెళ్ళడానికి San Mateo bridge దాటి వెళ్ళాలి. ఆ వంతెన పక్కనే చాలా తక్కువ ఎత్తులో నీళ్ళు కనిపిస్తుంటే చూసి "ఇదేనా మీ ఊరి సముద్రం.. భలే ఉంది కదా.. ఫ్లైట్లో నుంచి కూడా కనిపించింది. అయినా నీళ్ళు ఇంత పైకి ఉంటే ఎలా వంతెన మీదకి వచ్చెయ్యవా?" అని చాలా ఆశ్చర్యంగా అడిగాను. కిరణ్ ప్రభ గారు నవ్వి, "అది సముద్రం కాదమ్మా.. దాన్ని 'బే' అంటారు. ఎప్పుడూ ఇలానే ఉంటుంది. ఇప్పటిదాకా అయితే నువ్వన్నట్టు పొంగలేదు మరి.. ఎంతసేపూ ఆ నీళ్ళ వంకే కాకుండా ఎదురుగా చూడు ఒకసారి. వంతెన అలా గాల్లోకి పైకి వెళుతూ ఆకాశానికి వేసిన నిచ్చెన లాగా ఉంటుంది. అక్కడికి వెళ్ళాక మళ్ళీ కిందకి దిగుతాం మనం. మన ఊరు ఇంకా కొన్ని వేరే ఊర్లని కూడా కలిపి 'బే ఏరియా' అని పిలుస్తారు" అని చెప్పారు. నిజంగానే ఆ వంతెన మీద వెళుతూ అలా చూస్తుంటే చుట్టూ నీళ్ళు, ఏదో ఎక్కడో మబ్బుల చాటున దాగున్న లోకాలకి వేసిన దారి లాగా భలే కనిపించింది. తర్వాత ఆ దారిలో బోల్డన్ని సార్లు ​తిరిగాక మనింటికి వెళ్ళే దారి కాబట్టి స్వర్గలోకపు ముఖద్వారం అని పేరు ​పెట్టేసాను నేను. :-)

ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి సాయంత్రం ఏడున్నర దాటింది. ఇంకా అప్పటికి సూర్యాస్తమయపు ఛాయలు మొదలవలేదు. ఇంటికి దగ్గరలోకి ​వెళ్ళేసరికి అక్కడున్న 'రీగల్ సినిమాస్' థియేటర్ చూపించి "ఇది వచ్చిందంటే ​మనింటికి వచ్చేసినట్టే.." అని చెప్పారు కాంతి గారు. అప్పటి నుంచీ ప్రతి రోజూ అక్కడికి రాగానే "కాంతి గారూ.. రీగల్ సినిమాస్ వచ్చింది కదా అంటే మనింటికి వచ్చేసినట్టే.. మీరు బాగా గుర్తు పెట్టుకోండి.." అని చెప్పేదాన్ని. :-)

ఇంట్లోకి  అడుగు పెట్టగానే "ఆహా.. మొత్తానికి ఖండాలు దాటి, సముద్రాన్ని దాటుకుని ఇంత దూరం ప్రయాణించి అలసిపోయాక ​చివరికి ఇంట్లోకొచ్చిపడ్డాను. ​ఇప్పుడు ప్రాణానికి ఎంత హాయిగా ఉందో ​కదా.." అనిపించింది. గోరువెచ్చటి నీళ్ళు సగం అలసటని మాయం చేసాక ముందు అర్జెంటుగా నా కోసం ఎదురు చూసే వాళ్ళందరికీ క్షేమంగా ఇల్లు చేరానని మెయిల్స్ పెట్టేసాను. కాంతి గారు వేడి వేడిగా మూడు నాలుగు రకాల కూరలతో అన్నం పెట్టారు కానీ అప్పుడు సరిగ్గా తినబుద్ధి కాలేదు. ఈ లోపు కాంతి ​గారి బంధువులు పద్మ గారు ఫోన్ చేసి నాతో కూడా మాట్లాడారు. అదే మొదటిసారి మాట్లాడటం అయినా "ఆంటీ మీ కోసం ఎన్ని రోజుల నుంచీ ఎదురు చూస్తున్నారో, తన ఎక్సైట్మెంట్ చూస్తూ మేము కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం మీకోసం" అని చెప్తే నాకేం చెప్పాలో తెలీలేదు. తర్వాత చిమట శ్రీని గారు కాల్ చేసి "మా బే ఏరియాకి స్వాగతమండీ​.. మీతో నేరుగా ఎప్పుడూ మాట్లాడకపోయినా నిషిగంధ గారి ద్వారా మీ కబుర్లు తెలుస్తూ ఉంటాయి. తను కూడా వచ్చాక మనం తప్పకుండా కలుద్దాం" అని చెప్పారు. పాత పాటల పర్ణశాల 'చిమట మ్యూజిక్' సైట్ తెలీని తెలుగు పాటల ప్రేమికులు ​ఉండరంటే అతిశయోక్తి కాదు కదా! నాకు కూడా అలా ఆ వెబ్సైట్ తెలుసు గానీ దాని వెనకున్న శ్రీని గారితో పరిచయం లేదు. ​2011 లో మొదటిసారి ఆయనే స్వయంగా నన్ను పలకరించి "మీ బ్లాగు చూస్తుంటాను. చాలా బాగా రాస్తున్నారు. మీ బ్లాగ్ లింక్ మా చిమట సైట్లో పెడతాను" అని అడిగారు. "నా అక్షరాలకి అంత గొప్ప గౌరవం ఇస్తానంటే మహదానందం కదండీ" అని సరేనన్నాను. అప్పటి నుంచీ ఉన్న పరిచయం కొద్దీ  ఇప్పుడు వాళ్ళ ఊరికి వచ్చానని నాకు సాదరంగా స్వాగతం చెప్పారన్నమాట. నేను శ్రీని గారితో ఫోన్ మాట్లాడి వచ్చేసరికి కాంతి గారు, కిరణ్ ప్రభ గారూ రామజోగయ్య శాస్త్రి గారితోనూ, వారి శ్రీమతి గారితోనూ వీడియో చాట్లో మాట్లాడుతున్నారు​. అంతకు ముందు వారమే ​వాళ్ళు ​ఇక్కడికి వచ్చి వెళ్ళారట. నన్ను పిలిచి "తనేనండీ మధుర..  ​ఇందాకే ​ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చాం​" అని బోల్డు సంబరంగా చూపించారు. దానికే నేను ఆశ్చర్యపోతుంటే "పోయిన వారం మీ గురించి చాలా చెప్పారండీ. ​ఎంతగా ​ఎదురు చూస్తున్నారో మీ కోసం" అని ఆవిడ కూడా చెప్తుంటే నాకు మళ్ళీ బదులివ్వడానికి మాటలు కరువయ్యాయి. అక్కడ ఉన్నన్ని రోజులూ రోజూ ఎవరో ఒకరు ఇవే మాటలు చెప్పీ చెప్పీ నాకైతే ఆశ్చర్యమో ఆనందమో తెలీని ఏదో భావం కలిగింది. వీళ్ళందరికీ కాంతి గారు నా గురించి ఎంతలా చెప్పి ఉంటే వాళ్ళు ​అంతిదిగా గుర్తుంచుకుని అడుగుతారు అనిపించింది. హ్మ్.. కొంతమంది మనలో ఏ గొప్పతనమూ లేకపోయినా వాళ్ళకున్న స్వచ్ఛమైన మనసుతో మనల్ని గొప్పగా ప్రేమించగలరు. అలాంటి నేస్తాలు దొరకడం మన అదృష్టం  అనుకోవడం తప్ప ఇంకేం అనుకోవాలో తోచదు!

అసలు పన్నెండో తారీఖు ఉదయం జర్మనీలో నిద్ర లేచి ఇంట్లోనే ఎనిమిదింటి దాకా ఉండి తర్వాత విమానాలు ఎక్కేసి ఇంత దూరంలో ఉన్న అమెరికా వచ్చేసినా ఇంకా ఇప్పుడు పన్నెండో తారీఖు రాత్రేనా... ఒక్క రోజులో ఇంత జరిగిపోయిందా.. ఏదో ఎన్నో రోజులు ప్రయాణించి చాలా దూరం వచ్చేసి ఏదో కొత్త లోకంలో ఉన్నట్టు చిత్రంగా అనిపించింది. "కబుర్లన్నీ రేపటి నుంచీ చెప్పుకుందాం గానీ ఇవాల్టికి హాయిగా నిద్రపోమ్మా.." అని గబగబా పడుకోబెట్టేసారు కాంతి గారు. కిటికీకున్న బ్లైండ్స్ సందుల్లోంచి కనిపిస్తున్న వీధి దీపం కాంతినీ, ఆ వెలుతురులో మెరుస్తున్న పచ్చటి ఆకులున్న పెద్ద చెట్టునీ, ఆకాశంలో వెలుగుతున్న చందమామనీ చూస్తూ.... అలా అలవోకగా నిద్రలోకి జారిపోయాను.

14 comments:

Vasantha Nagalakshmi said...

Hammayah, Mottam meeda vachesi andamina anubhutulatho nidraloki vodigi poyarannamata..!!

repati kaburlakosam eduruchusthnna vasu. :)

Vasantha Nagalakshmi said...

Hammayah, Mottam meeda anukunnachotuki vachesi manchi anubhutulatho nidraloki odigi poyarannamata..!!

marusati roju kaburlakosam eduruchunna Vasu. :)

MURALI said...

మధుర, ఎక్కడికో వెళ్ళిపోతున్నావ్. మమ్మల్ని మర్చిపోకమ్మా.

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగా రాస్తున్నారు మధురా... మీ డైరీ చదువుతుంటే ఒకటే అనిపిస్తుంది you are so blessed :-)

ఇందు said...

Pichi pilaka....hhahhahaaa :)) aagu ippude velli nee pics choososta :P next part tondaragaa vesey :D

Priya said...

I got to see your pictures in Facebook and then only I came to know how excited you three friends are to meet each other and how you spent your sweet n precious moments.
After reading this it is more clear all I can say is you are so lucky and blesses Madhuragaru.

రాధిక(నాని ) said...

చాలా బాగున్నాయిఫోటోలు , మీ ప్రయాణం కబుర్లు.ఎంత అదృష్టం మీది అంత మంచి స్నేహితులు దొరికినందుకు. మీ డైరీలో ౪ పేజీ కోసం ఎదురుచుస్తుంటా

బాల said...

చాలా బాగుందండి. మిగతా భాగం కోసం ఎదురుచూస్తుంటాం.

Sudha said...

మధురా, పక్కనే నువ్వు కూర్చుని కబుర్లు చెపుతూ, ఫోటోలు చూపిస్తున్నట్లుగా వుంది ఇది చదువుతుంటే...అదే నీ స్పెషాలిటీ మరి :-) మిగిలిన కబుర్ల కోసం ఎదురు చూస్తున్నాం మరి...

లక్ష్మి said...

ప్చ్ ఏంటో... మీరందరూ ఇలా కలుసుకుంటూ ఉంటే నేను మాత్రం మొత్తానికి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టు ఉంది. కనీసం మెయిల్స్ లో ఐనా మన మాటా మంతీ సాగి ఉండి ఉంటే మీరు ఇక్కడికి వస్తున్నట్టు ముందుగా తెలిసి ఉండేది కదా మధురా, మీరొచ్చిన డబ్లిన్ కి కూతవేటు దూరం లో ఉన్నాను, ఎంచక్కా నేను కూడా కలిసి ఉండేదాన్ని కదా :( ఏది ఏమైనప్పటికీ చాలా బాగుది మీ డయరీ

నిషిగంధ said...

స్వర్గలోకపు ముఖద్వారం -- నిజంగా ఇది మాత్రం సరిగ్గా సరిపోయింది! అదేదో సినిమాలో పిల్లలందరూ సైకిళ్ళెక్కి ఆకాశంలోకి ఝామ్మని షికారెళ్ళినట్టు మనం అలా కార్లోనే ఆకాశంలోకి వెళ్ళిపోయిన ఫీలింగ్!

విమానంలోంచి తీసిన ఫోటోలు బావున్నాయి.. నువ్వు హైదరాబాద్ గురించి చెప్పింది సూపర్. :-)

మధురవాణి said...

@ Vasantha Nagalakshmi,
థాంక్స్ వసూ.. నా కబుర్ల కోసం ఎదురు చూస్తున్నందుకు.. :-)​

@ ​MURALI,
ఎక్కడికీ వెళ్ళినా నేల మీదే ఉంటాన్లే మురళీ.. ;-)​

@ వేణూ శ్రీకాంత్,
థాంక్స్ వేణూ.. ​నా సంతోషాన్ని పంచుకుంటున్నందుకు.. :-)

@ ఇందు,
హహ్హహ్హా.. నీకు అన్నీటికంటే పిచ్చి పిలక ఇంటరెస్టింగ్ గా కనిపించిందా.. :D
ఊ.. రాస్తాను వీలు చూసుకుని.. థాంక్స్ డియర్! :-)​

మధురవాణి said...

@ Priya,
Yeah.. I realize it too..​ ​
Thank you so much for your friendly response.కాంతి గారు కూడా చెప్పారు ఫేస్ బుక్లో మీరు పలకరించారని. :-)

@ రాధిక (నాని),
ఫోటోలు నచ్చినందుకు సంతోషమండీ.. అందమైన స్నేహాలు ఏర్పడటం నిజంగా అదృష్టమేనండీ.. స్పందించినందుకు ధన్యవాదాలు. :-)

@ బాల,
ధన్యవాదాలండీ.. :-)

@ Sudha,
నిజంగా మీకంత హాయిగా అనిపిస్తే ఇవన్నీ రాస్తున్నందుకు అంత కన్నా సంతోషం ఏముంటుంది చెప్పండి.. థాంక్యూ సో మచ్! :-)

మధురవాణి said...

​@ లక్ష్మి,
మీరు​'​నేను - లక్ష్మి' బ్లాగు లక్ష్మి గారే కదూ!! ​
ఎన్నాళ్ళకెన్నాళ్ళకి కనిపించారండీ.. అప్పుడెప్పుడో చాన్నాళ్ళ క్రితం మీరు కాలిఫోర్నియా వెళుతున్నారని సుజ్జీ చెప్పింది కానీ మీరు అక్కడే ఉంటున్నారని నాకసలు తెలీదండి. తెలిసుంటే ఎంచక్కా మనం కలిసి ఉండేవాళ్ళం కదా.. అయితే మిమ్మల్ని మిస్సయిపోయానన్నమాట.. :(
థాంక్యూ సో మచ్.. ఇన్నాళ్ళ తర్వాత బ్లాగు దాకా వచ్చి పలకరించినందుకు.. Nice to see you after such a long time! :-)

@ నిషిగంధ,
కదా.. నాకెంత నచ్చిందో బ్రిడ్జి మీద వెళ్ళడం.. :)
ఫొటోస్ బాగున్నాయన్నంనందుకు థాంక్స్.. :)