Monday, July 22, 2013

My San Francisco Diary - 2


మొత్తానికి అలా నా శాన్ ఫ్రాన్సిస్కో ప్రయాణం అనుకోగానే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకునే ముందు చెయ్యాల్సిన ఒక ముఖ్యమైన పని ఒకటుందని గుర్తొచ్చింది. ఈ ప్రయాణం అంటూ కుదిరితే కలవాల్సిన ఇంకో స్నేహితురాలికి కుదురుతుందో లేదో కనుక్కోవాలి. అదంతా చెప్పే ముందు అసలు తనెలా నా స్నేహితురాలైందో.. ఉహూ కాదు కాదు నేనెలా తనకి స్నేహితురాలిని ​అయ్యానో చెప్పాలి మరి! :-)

2008 సెప్టెంబరులో నేను బ్లాగు మొదలుపెట్టే సమయానికి నాకు ఇంటర్నెట్లో తెలుగులో టైప్ చెయ్యొచ్చన్న విషయం కూడా తెలీదు. అప్పటికి ఏదో చిన్నప్పుడు స్కూల్లో తెలుగు చదవడం తప్పించి తెలుగు సాహిత్యం గురించి ఏ మాత్రం అవగాహన లేదు కాబట్టి ఈ తెలుగు బ్లాగులున్నాయని తెలిసిన కొత్తలో కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్న ​సామెలాగా ఏ మాత్రం వీలు దొరికినా తెలుగు కథలు, బ్లాగులూ తెగ చదివేస్తూ ఉండేదాన్ని. అలా అప్పుడప్పుడూ కౌముది చూస్తుండేదాన్ని. 2008 డిసెంబరులో ఒక శుక్రవారం రాత్రి అలా కౌముది చూస్తుండగా 2008 లో సీరియల్ గా వచ్చిన ఒక నవల కంటపడింది. ఏ సీరియల్ అయినా నెలకో భాగం చదివి హీరోయిన్ ఎవరిని ప్రేమిస్తుంది, హీరో బతుకుతాడా లేదా అనుకుంటూ మళ్ళీ వచ్చే నెల దాకా గోళ్ళు కొరుక్కుంటూ టెన్షన్ పడటమంటే నాకు మా చెడ్డ బద్ధకం. అందుకని ఏవైనా ​సరే పూర్తిగా ఉన్న నవలలే మొదలెట్టి ఇంకది అయిపోయేదాకా కాళ్ళు తిమ్మిర్లు పట్టినా, కళ్ళు పోయేలా ఉన్నా సరే మధ్యలో ఆపకుండా ఎంసెట్ కి ప్రిపేర్ అయినదానికంటే ఎక్కువ ఏకాగ్రతతో చదువుతుంటాను. అలా ఆ శుక్రవారం రాత్రి దాదాపు పదిన్నర దాటాక 'ఊసులాడే ఒక జాబిలట' అనే పేరుతో ఒక నవల కనపడింది కౌముదిలో. ఊరికే ఏంటో చూద్దామని ఒక పేజీ చదివాక ఇక ఆపడం అనేది నా చేతుల్లో లేకుండా పోయింది. ఎలాగూ వీకెండ్ కదా అన్న ధైర్యంతో అలా కూర్చుని నవలంతా పూర్తి చేసాను. అంటే ఏదో న్యూస్ పేపర్ చదివినట్టు కాదు మళ్ళీ. మధ్య మధ్యలో నవలలో వచ్చే చిన్ని కవితల దగ్గర అలా ఆగిపోయి, వాటి గురించి ఆలోచించుకుంటూ, నవలలో పాత్రలు చెప్పే మాటలు, అభిప్రాయాలే కాకుండా, వాళ్ళు చెప్పనివి, వాళ్ళ చుట్టూ జరిగేవన్నీ నేను ఊహించుకుంటూ వాళ్ళ వెనకాలే వాళ్ళ ఊరి వీధుల్లో, ఇళ్ళల్లో తిరిగేస్తూ, వాళ్ళ సంతోషాలని, నొప్పినీ నేను కూడా అనుభవిస్తూ ముగింపుకొచ్చేసరికి నవల్లో ప్రధాన పాత్ర అయిన కార్తీకని వదల్లేక అదేదో మా ఇంటి పక్కనమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయినట్టు బేర్ మని ఒకట ఏడుపు.. :-) పుస్తకాలు చదివి కూడా ఏడుపొస్తుందని నాకప్పటిదాకా అనుభవం కాకపోవడం వల్లనుకుంటా చాలా అంటే చాలా కదిలిపోయాను.

నేనంత మెల్లమెల్లగా చదువుతూ కూర్చోవడం ​వల్ల నవల పూర్తయ్యేసరికి తెల్లవారుజాము నాలుగు గంటలు దాటింది. అప్పుడు కూడా నాకు నిద్ర పోవాలనిపించలేదు. అప్పుడే కొత్తగా బ్లాగు రాస్తున్న ఉత్సాహం కూడా ఉందేమో, అంతగా కదిలించిన కార్తీక గురించి, ఊసులాడే ఒక జాబిలట నవల గురించి అప్పటికప్పుడు నా మనసులో మెదులుతున్న భావాలన్నీ రాయడం మొదలుపెట్టాను. అప్పట్లో నేరుగా బ్లాగర్ పేజీలో టైప్ చేసుకోడం ఒక్కటే తెలుసు నాకు. అలా దాదాపు ఒక రెండు గంటల సేపు కూర్చుని నవల పేజీలు  వెనక్కీ ముందుకీ తిప్పుకుంటూ, అందులోని చిన్ని కవితల్ని కూడా కోట్ చేస్తూ ఒక యాభై లైన్ల దాకా రాసాక ఏదో టెక్నికల్ ఎర్రర్ వచ్చి బ్రౌసర్ ఫ్రీజ్ అయింది. నేను రాసిన డ్రాఫ్ట్ అంతా ​సేవ్ అవ్వకుండా పొరపాటున డిలీట్ అయిపోయిందని నాకు అర్థం కావడానికి ఇంకో పదిహేను నిమిషాలు పట్టింది. ఎంత ప్రయత్నించినా అది రిట్రైవ్ చెయ్యడం చేతకాలేదు. అప్పటికే ఉన్న కార్తీక తాలూకు దిగులు, నేను రాసిన పోస్టు డిలీట్ అయిపోవడం, రాత్రంతా నిద్ర లేకపోవడం అన్నీ కలిసి బాధతో పాటు విపరీతమైన అసహనం, కోపం వచ్చాయి. లాప్టాప్ పక్కన పడేసి  నిద్రపోయాను ఆ రోజుకి. తర్వాత చాలా రోజుల దాకా నాకు బ్లాగర్ పేజీ మీద కోపం పోలేదు. అప్పటినుంచీ బ్లాగర్లో టైప్ చెయ్యడం మానేసాను. వేరే ఎలా రాసుకోవాలో ​నేర్చుకుని ​అక్కడ రాసి తెచ్చి బ్లాగ్లో పేస్ట్ చెయ్యడమే. ఆ నవల చదివాక దాదాపు చాలా రోజుల దాకా ఏ పని చేస్తున్నా కార్తీక గుర్తొస్తూ ఉండేది. లాబ్లో మొక్కలు నాటుకుంటూ, ఇంట్లో గిన్నెలు కడుక్కుంటూ, వంట చేసుకుంటూ కార్తీక గురించి ఆలోచిస్తూ ఉండేదాన్ని.
అప్పటి దిగుల్లోంచి కాస్త బయట పడ్డాక ఒక రోజు... సరే నవల గురించి నేనొక పోస్టు రాసి రచయిత్రి బ్లాగులో ఆ లింక్  నాకింత నచ్చిందండీ అని చెప్దామనుకున్నది ఎలానూ కుదరలేదు. అంతమాత్రాన అసలు కనీసం ఒక్క ముక్క కూడా చెప్పకపోతే ఎలా అనిపించింది. మళ్ళీ అంతలోనే 'చాలా బాగా రాసారండీ' అని ఒక్క ముక్కలో చెప్తే నాకింత నచ్చిందని ఆవిడకెలా తెలుస్తుంది అని పెద్ద సందేహమొకటి. ఉహూ ఇలాక్కాదు, చెప్పి తీరాల్సిందేనని అనుకుని 'ఊసులాడే ఒక జాబిలట' నవలా రచయిత్రి నిషిగంధ గారి బ్లాగులో ఒక కామెంట్ పెట్టాను. దానికి ఆవిడ నాకు ఫ్యాన్లూ, ఏసీలూ వద్దులే గానీ ఒక ఫ్రెండ్ కావాలి. ఓకే నా.. అని సమాధానం ఇచ్చారు. అప్పుడు నేనెంత సంబరపడ్డానో చెప్పాలంటే, బహుశా చిరంజీవి ఫ్యాన్స్ ఎవరికైనా చిరంజీవి ఎక్కడో కనిపించి తిరిగి హలో చెప్తే ఎలా కిందా మీదా అయిపోతారో.. ఇంచుమించు అంత థ్రిల్ అయిపోయాను. ఇంత గొప్ప రచయిత్రి నేనెవరో ఏవిటో తెలీకుండా నన్ను స్నేహితురాలిగా ఉండమని అడుగుతోందేంటి.. అని చా..లా హాశ్చర్యపోయాను.
మనం ఎప్పుడైనా ఎవరినైనా మరీ  అభిమానిస్తే, ఎవరి మీదైనా ఎక్కువ గౌరవం పెంచుకుంటే వాళ్ళని ఎప్పుడూ కనీసం ఒక కిలోమీటరు ఎత్తులో కూర్చోబెట్టి చూస్తూ ఉంటాం. వాళ్ళు మాములుగానే మాట్లాడినా సరే మనం మాత్రం మాములుగా ఫీలవ్వకుండా వాళ్ళని మామూలు మనుషుల్లా చూడకుండా వేరే లోకానికి సంబంధించిన వాళ్ళని చూసినట్టు చూస్తూ అతి గౌరవమర్యాదలు ప్రకటిస్తుంటాం. అచ్చం నేను అలాగే చూసేదాన్ని నిషి బ్లాగుల్లో ఎక్కడన్నా ఎదురుపడినప్పుడు. తను మొదటిసారి నా బ్లాగులో కామెంట్ పెట్టినప్పుడు నాకేదో అవార్డ్ వచ్చినంత పొంగిపోయా.. :-)
సరే.. అలా నాకు అభిమాన రచయిత్రి అయిపోయిన నిషిగంధ గారితో పరిచయం కలిగాక నేను కాస్త భయం భయంగా దూరదూరంగా నించుని మాట్లాడుతూ ఉండే రోజుల్లోనే తన ఈమెయిల్ ఐడీ తెలిసి 2011 జనవరిలో తన పుట్టినరోజుకి విష్ చేస్తూ మెయిల్ చేస్తే తను చాలా ఆప్యాయంగా బదులిచ్చారు. తర్వాత కొన్ని నెలలకి నిషి గూగుల్ బజ్లోకి వచ్చి అప్పుడప్పుడూ కబుర్లు చెప్పేవారు. నిషిగంధ గారు, పద్మవల్లి గారు, కొత్తావకాయ గారు, వీళ్ళందరూ కొత్తగా ఆ టైములోనే పరిచయం అయ్యారు గూగుల్ బజ్లో. 2011 సెప్టెంబరులో ఒక రోజు బజ్లో వాళ్ళందరూ తిలక్ 'అమృతం కురిసిన రాత్రి' గురించి మాట్లాడుకుంటూ ఏదో కవిత ​తన దగ్గరుందని వాళ్ళకి పంపిస్తానని చెప్పారు నిషి. అప్పుడు నేను తనకి మెయిల్ చేసి నాక్కూడా పంపండి అని అడిగితే "అలాగే పంపిస్తాను కానీ ఒక షరతు. నువ్వు 'మీరు, గారు' మానేసి అర్జెంటుగా 'నువ్వు' అనాల్సిందే. నీకు చాలాసార్లు చెప్పాను ​కానీ నువ్వసలు నా మాట వింటున్నట్టు లేదు" అన్నారు. అప్పుడసలు మామూలుగా మొహమాటపడలేదు నేను. అయ్య బాబోయ్ మీ అంతటి మిమ్మల్ని పట్టుకుని నువ్వు అనడానికి నాకు నోరెలా వస్తుందండీ అని ​చాలా ఫీలైపోయి తనతో కూడా అదే అన్నాను కానీ తను ససేమిరా అనేసరికి నాకింక తప్పలేదు. :-)
అప్పటి నుంచీ అప్పుడప్పుడూ బజ్లో పాటల చర్చలు జరిగినప్పుడు మెయిల్లో కొన్ని మంచి మంచి పాటలు పంపిస్తూ ఉండేది నిషి. 2012 జనవరిలో తన పుట్టినరోజు వచ్చినప్పుడు నిషికి సర్ప్రైజ్ లా ఉంటుందని తనకి కాల్ చేసి విష్ చెయ్యమని తన ఫోన్ నంబర్ నాకిచ్చారు పద్మవల్లి గారు. అప్పుడే మొదటిసారి తనతో నేను ఫోన్లో మాట్లాడటం. మేమిద్దరం మొదటిసారి ఫోన్లో మాట్లాడుకుంది కేవలం 18 నెలల క్రితమేనని గుర్తొస్తే అస్సలు నమ్మలేని విషయంలా అనిపిస్తుంది ఇప్పుడు. ఆ రోజు నేను హేపీ బర్త్ డే అని చెప్పి నువ్వు బిజీగా ఉంటావేమో కదా ఈ రోజు అని మొహమాటంగా వెంటనే పెట్టేస్తానంటే తను పర్లేదని చెప్పి ఎప్పటినుంచో తెలిసున్న పాత స్నేహితురాలితో మాట్లాడినట్టు చాలాసేపే మాట్లాడింది. తర్వాత మా మధ్య మాటల వారధి బలపడి స్నేహం ఎదుగుతూ ఉన్న రోజుల్లో ఉన్నట్టుండి ఒక రోజు ఎందుకో ఊసులాడే ఒక జాబిలట కార్తీక గుర్తొచ్చి అప్పుడు 2008 లో నవల చదివినప్పటి జ్ఞాపకం గురించి చెప్తూ నిషికి ఒక మెయిల్ రాసాను. దానికి తను స్పందించిన తీరు ఎప్పటికీ మర్చిపోలేను. దాని గురించి ఇప్పుడు మళ్ళీ వర్ణించనులెండి. అది నాకొక్కదానికే సొంతం అన్నమాట! ;-)
2012 ఫిబ్రవరిలో ఒక రోజు ఉదయాన్నే పోస్టులో నాకోసం అట్టపెట్టె ఒకటి వచ్చింది. దాని మీదున్న నిషి పేరు చూసి ఆశ్చర్యం కాదు ఏకంగా షాకే అయ్యాను. తనో చిన్ని కానుక పంపించింది నాకోసం. నా బెస్ట్ ఫ్రెండ్ అనబడే ఒక మనిషి నాకు తెలీకుండా నా అడ్రస్ నిషికి ఇచ్చి హెల్ప్ చేసి ఇద్దరూ కలిసి సైలెంట్ గా సర్ప్రైజ్ ప్లాన్ చేసారని తర్వాత తెలిసింది. కానీ అసలా గిఫ్ట్ వచ్చిన రోజు మాత్రం నేల మీద పాదాలు ఆనలేదంటే మీరు నమ్మాలి! తర్వాత అలా అలా రోజూ పాటల గురించి మాట్లాడుకోవడంతో మొదలెట్టి కాదేదీ మాట్లాడుకోడానికీ, నవ్వుకోడానికీ అనర్హం అన్నట్టు వాగులా, వరదలా, ఇంకా వాటన్నీటికంటే ఉధృతంగా అంతూ పొంతూ లేకుండా మా కబుర్లు సాగుతూ...నే ఉన్నాయి, ఉంటాయి కూడా! ఒకసారి ఇంకో స్నేహితురాలు సౌమ్య మా ఇంటికొచ్చినప్పుడు నేను, నిషి మాట్లాడుకున్నది చూసి మీరిద్దరూ ​మాట్లాడుకోడం తక్కువ, నవ్వుకోడం ఎక్కువ అనుకుంటా కదా అని సరదాగా అంటే నిజమే కదా అనిపించి భలే నవ్వొచ్చింది. అసలు ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఒకప్పుడు నిషిగంధ అంటే కార్తీక గుర్తొచ్చే నాకు ఆ ​మర్యాద, గౌరవం అన్నీ పక్కకి పోయి నేను ఎదురు తనని బెదిరించే స్థాయికి వచ్చేసాను. మరేం చేస్తాం చెప్పండి. బాగా గారం చేసి పాడు చేసేవాళ్ళదే బాధ్యతంతా, నేనే పాపమూ ఎరుగను. ;-) కాంతి గారు, నిషి ముందు నుంచే మంచి స్నేహితులవడం, తర్వాత నాకు వీళ్ళిద్దరితో స్నేహం కలవడంతో ట్రయాంగిల్ ఫ్రెండ్షిప్ స్టోరీ అయిందన్నమాట కథ! అసలు వీళ్ళిద్దరూ నన్నెంత గారం చేస్తుంటారంటే నా గురించి వీళ్ళిద్దరి మాటలు వింటే నేనెవరో కిండర్ గార్డెన్ కి వెళ్ళే పిల్లనేమో అనుకోగలరు ఎవరైనా. పొద్దున్నే ఎనిమిదింటికి నిద్ర లేచాను తెలుసా అంటే అయ్యో తల్లీ ఎనిమిదింటికే నిద్ర లేచావామ్మా నిద్ర ​సరిపోయిందా అని అడిగే టైపన్నమాట. ఎప్పుడన్నా మాటల్లో ఏదన్నా ​వస్తువు బాగుందంటే చాలు ఏదో చిన్నపిల్లలకి బొమ్మలు కొనిచ్చినట్టు ​చిటుక్కున పంపించేస్తారు. ఎవరి​కి ఎప్పుడు ఏం​ కొన్నా +1 లాగా ప్రతీసారీ పక్కన నాకుండాలి. నేనేది చేసినా అద్భుతం కంటే ఒక్క మెట్టు కూడా కిందకి దిగి రారన్నమాట. అయితే నాలో అంత గొప్పతనమూ, అద్భుతమూ లేవని నాకు తెలిసినా సరే వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు ​కావు, నిజాలే! ఎందుకంటే ఆ అద్భుతం వాళ్ళకి నా మీదున్న ప్రేమలో ఉంది. అందుకని వాళ్ళ కళ్ళలోంచి నేనెప్పుడూ అలానే కనిపిస్తుంటాను. నాది భలే అదృష్టం కదూ! :-)
ఊ.. ఇప్పుడు మనం ఫ్లాష్ బ్యాక్ లోంచి రింగులు తిప్పుకుంటూ మళ్ళీ మన San Francisco ట్రిప్ దగ్గరికి వస్తే టికెట్స్ బుక్ చేసుకునే ముందు మన నిషి మాత గారి వీలు తెలుసుకోవాలన్నమాట. తనకి అస్సలే మాత్రం ఛాయిస్ లేకుండా ఇలా నేను జూన్ రెండో వారంలో మాత్ర​మే రాగలను. ఈసారికి ​మీ ఊరి వైపు ​రాలేను కాబట్టి నువ్వే శాన్ ఫ్రాన్సిస్కో రాగలవా, నువ్వు ఏ సంగతీ చెప్తే దాన్ని బట్టి ట్రిప్ సంగతి ఆలోచిద్దాం అని మెయిల్ రాసాను. తను వెంటనే అదేంటీ మా ఊరికి రావా అని ఒక్క ఎదురు ప్రశ్న కూడా వెయ్యకుండా ఆ టైంలో మాకు చాలా బిజీ ఉంటుంది ఆఫీసులో. అయినాసరే నువ్వింకేం ఆలోచించకుండా టికెట్స్ బుక్ చేసెయ్. అంతగా సెలవులు తీసుకోవడం కుదరకపోతే నేను వీకెండ్ రెండు రోజుల కోసమైనా వస్తాను అని చాలా సంబరంగా రిప్లై ఇచ్చింది. అలా రెండు రోజులు వచ్చి పోడానికి తను ఉండేది కాలిఫోర్నియాలో కాదు. అమెరికాకి ఇంకో పక్క నుంచి ఆరేడు గంటలు పైగా ఫ్లైట్ జర్నీ చేసి రావాలి. అయినా సరే నిమిషం కన్నా ఎక్కువ ఆలోచించకుండా, నువ్విలా చెయ్యొచ్చు కదా అనో, చెయ్యలేదు ఎందుకనో ఒక్క ​ఎదురు ప్రశ్న కూడా వెయ్యకుండా సరేనంది. ఎందుకలా.. అంటే మరి తను నిషిగంధ కదా.. అందుకే అలా! :-)
నేను నిషి ఊ.. అన్నాక కాంతి గారితో ఇంకో నాలుగు వారాల్లో నేనూ, నిషీ మీ ముందుందాం అనుకుంటున్నాం.. మరి మీరేవంటారు? అని అడిగాను. రోజూ అడిగీ అడిగీ అప్పుడే రెండు రోజుల నుంచీ అడగడం మానేసారేమో నేను చెప్పింది నిజమేనా అని నమ్మడానికి కాసేపు పట్టింది కాంతి గారికి. నిజ్జంగా నిజమేనని చెప్పి టికెట్స్ బుక్ చెయ్యగానే డేట్స్ చెప్తాను. నేను బుక్ చేసాక నిషి కూడా చేస్తుంది అని చెప్పాను. ఆ రోజు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయి మా ముగ్గురిలో ఎవరికీ నిద్ర పట్టలేదని తెల్లారి చెప్పుకున్నాం. తర్వాత రెండు మూడు రోజుల్లో నేను టికెట్స్ బుక్ చేసాక నిషి కూడా చేసేసింది. ఇంక అప్పటి నుంచీ మూడు వారాల తర్వాత ఈ రోజు ఏం చేస్తూ ​ఉంటామో అని రోజూ ఊహించుకుంటూ, కలలు కంటూ, తెల్లారాక రాత్రి నాకేం కలొచ్చిందో తెల్సా అని చెప్పుకుంటూ అలా అలా మూడు వారాలు గడిచిపోయాయి.
ప్రయాణం ఇంకో వారంలోకి వచ్చాక నాకు ఉన్నట్టుండి ఇంటి మీద, ఇంబ్బాయ్ మీద బెంగొచ్చేసింది తన కన్నా ముందే ఊరెళ్ళిపోతున్నానని. తనతో పాటు సిడ్నీకి వెళ్ళడం లేదుగా అని మళ్ళీ ఇంకో దిగులు. ఏదో సామెత చెప్పినట్టు భరించాల్సిన బాధ్యత ఉన్నవాళ్ళకి తప్పదు కదా పాపం. అందరిళ్ళలోలా కాకుండా మా ఇంట్లో ఎప్పుడూ రివర్స్ సర్దిచెప్పడాలు ఉంటాయన్నమాట. రెండు వారాలే కదా.. ఇప్పుడిలా అంటున్నావ్ గానీ ఒక్కసారి మీ ఫ్రెండ్స్ ని చూడగానే నన్నూ, ఇంటినే కాదు, నీ రీసెర్చ్ టాపిక్ ఏంటో కూడా మర్చిపోతావ్.. ఏం పర్లేదు​అయాం ష్యూర్ ​యు విల్ హేవ్ ఎ గ్రేట్ టైం దేర్ అని చెప్పాడు. బయలుదేరే ముందు వచ్చిన శనివారం రోజు బోల్డు కష్టపడి నాతో పాటు ఎండలో తిరిగి తనకస్సలు ఇష్టం లేని షాపింగ్ పనిలో కూడా హెల్ప్ చేసాడు మా ఇంటబ్బాయ్. :-)

ఇంకేముంది... తర్వాతి పేజీ ప్రయాణమే.. About to take off to San Francisco... I'm all excited! 10 comments:

వేణూశ్రీకాంత్ said...

ముందు పోస్టూ ఇదీ చదువుతుంటే మీ excitement అంతా పక్కనే ఉండి చూస్తున్నట్లు ఉంది మధురా. వెరీ నైస్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్ :-)

ఇందు said...

Avunammaaa avunu. Neeku Nishi, Kanthi garu gurtostaru kani nenu kaaduga :'( pho nuvvu.....:-P bagundammay nee SFO dairy vairy ;-) waiting 4 next post

MURALI said...

:) థాంక్స్ మధుర. నీ ఆనందం మాతో పంచుకుంటూ, మాకు కూడా ఆనందం కలిగిస్తున్నందుకు

తృష్ణ said...

I'm all excited... to read :-)
nice to know about a beautiful friendship!

Lasya Ramakrishna said...

అందమైన స్నేహం గురించి మీ జ్ఞాపకాలు, మీ ప్రయాణం విశేషాలు చాలా బాగున్నాయి. మరి మాకెప్పుడు పంచుతారు మీ స్నేహామృతాన్ని. నేనూ మీ రచనలకి ఎసి ని, ఫ్యాన్ నే..........

రాధిక(నాని ) said...

చాలా బాగున్నాయి మీ శ్రాన్ఫ్రాన్సిస్కో కబుర్లు .మీతోపాటు నేనూ ఉన్నట్టు అనిపిస్తుంది చదువుతుంటే ..మీ ఫోటోలు చాలా బాగున్నాయి :))

Tejaswi said...

ఒక చక్కటి స్నేహబంధంగురించి తెలుసుకోవడం ఆనందంగా ఉంది. కింది కొటేషన్ కూడా చాలా బాగుంది.

శుభాభినందనలు.

Praveena said...

Madhuravaani gaaru,
Great to know about your wonderful friendship.Thanks for sharing your experiences and introducing 'ఊసులాడే ఒక జాబిలట' to us .Mee post chadivaka oka evening continuous ga novel chadivesanu. Chaala interesting ga vundi.Next emi avuthundo ani next page ki velthune vunnanu.Inthaku mundu eppudu novel ila okesari complete cheyaledu.

మధురవాణి said...

@
​వేణూ శ్రీకాంత్, తృష్ణ గారూ, మురళీ..
I'm glad to hear that you all are enjoying my memories. Thanks for sharing my happiness! :-)

@ ఇందు,
హహ్హహ్హా.. నువ్వు గుర్తు రాకుండా ఉంటావా మరీనూ.. :)
తెల్సా నీకు.. మొన్ననే వేరే ఒక ఫ్రెండ్ అడిగింది నన్ను.. అమెరికా వెళ్తే మరి మీ ఇందుని కలిసారా అని.. లేదండీ ఈసారి కుదర్లేదు. మిస్సయ్యాము కానీ ఎప్పుడో తప్పకుండా కలుస్తాం అని చెప్పాను. ​
:-
​)

@ Lasya Ramakrishna,
మా స్నేహం ఊసులు, మా జ్ఞాపకాలు మీకు ​
నచ్చినందుకు సంతోషమండీ.. నిషి విషయంలో అనుకోకుండా అలా జరిగింది కానీ స్నేహితులు అవ్వడానికి తప్పనిసరిగా ఫాన్లు, ఏసీలు అవ్వాల్సిన అవసరమేం లేదు కదండీ. ​మన ఆలోచనలు, అభిప్రాయాలు కలిసే నేస్తాలు ఎదురుపడినప్పుడు ఇట్టే స్నేహం చిగురిస్తుంది. ఈ స్నేహాలన్నీ మన పరిచయం లాగానే బ్లాగుల దగ్గర మొదలైనవేనండీ.. మీ అభిమానానికి బోల్డు ధన్యవాదాలు. :-)

మధురవాణి said...

​@ రాధిక (నాని),
నాతో పాటు మీరు కూడా షాన్ ఫ్రాన్సిస్కో చూడ్డానికి వచ్చినందుకు బోల్డు థాంక్సండీ.. :-)

@ Tejaswi​,
​ధన్యవాదాలండీ.. ​ఆ కొటేషన్ నేను సొంతంగా రాసింది కాకపోయినా నా స్నేహితులని నిర్వచిస్తున్నట్టుందని పెట్టానండీ. :)

@ Praveena,
మీక్కూడా 'ఊసులాడే ఒక జాబిలట' నచ్చిందన్నమాట. చాలా సంతోషమండీ.. నాక్కూడా మొదటిసారి చదివినప్పుడు మీలానే అనిపించింది. థాంక్స్ ఫర్ ది కామెంట్. :)​