Wednesday, March 28, 2018

బంధం

నువ్వెవరివో? నాకేమౌతావో!
లోకం ఆడించే వైకుంఠపాళిలో తలమునకలై నీ ఊసే లేకుండా రోజులు గడుస్తాయి. ఏమో అలా ఎలా అసంకల్పితంగా నీకు దూరమౌతానో, జవాబు తెలీని ప్రశ్న!
మళ్ళీ దివ్యలోకం నుంచీ ఊడిపడతావో, ఉన్నట్టుండి చప్పున మనసులో మెదులుతావు. నీ తలపొస్తూనే తనతో పాటు ఇంకిపోయిన కళ్ళలోకి తడిని మోసుకొస్తుంది.
నే పట్టలేనంత గుబులు మనసులోనే ఇమడలేక కళ్ళలోంచి ఉబికొస్తానంటుంది. ప్రేమో, నిస్సహాయతో నన్ను అమాంతం కమ్మేసి అచేతనంగా కట్టిపడేస్తుంది. 
రోజంతా వేసవి ప్రతాపానికి వాడిపోయిన మల్లెతీగ పైకి చుక్కలవేళకి జాలిగా వీచే లేత గాలి తెమ్మెరలా లీలగా గుర్తొచ్చే నీ గొంతు ఎంత గొప్ప ఓదార్పనీ!

Tuesday, March 14, 2017

ఐ మిస్ యూ


నీలాంటి నువ్వు నాకు ఎదురుపడతావని సరదాకైనా ఊహించలేదు..
ఎన్ని ఉదయాలు నువ్వు ఊదిన కొత్త ఊపిరితో నిదుర లేచానో..
ఎన్ని తీరిక లేని రోజులు నీతో చెప్పాలనుకున్న మాటలు పేర్చుకుంటూ ఉవ్విళ్ళూరానో.. 
ఎన్ని మధ్యాహ్నాలు నీతో కూర్చుని కబుర్లాడుతూ ఆకలి సంగతి మరిచానో..
ఎన్ని అందమైన సాయంకాలాలకి నువ్వూ, నేనూ కలిసి రంగులద్దామో..
ఎన్ని అపరాత్రులు వెన్నెల సాక్షిగా మనిద్దరం నిద్రని తరిమేశామో..

చిరుజల్లుల్లో తడిసిన సంబరాలు, మంచుపూలతో సయ్యాటలు, పూకొమ్మలతో మురిపాలు, పాటలతో సరాగాలు, చిన్నతనపు తాయిలాల రుచులు, అల్లరి వయసు అచ్చట్లు ముచ్చట్లు, అందాలు, ఆనందాలు, ఆటలు, పాటలు, ఆవేశాలు, ఆక్రోశాలు, ఊహలు, ఊసులు, కథలు, వెతలు, తలపులు, తపనలు... నీ సమక్షంలో ఎన్నెన్ని మధురక్షణాలు జీవం పోసుకున్నాయో! కాలధర్మానికి అతీతంగా ఆ మధురక్షణాలన్నీటినీ అక్షరంగా మలచి నా చిన్ని మనసు పలికిన భావాలని అమరం చేశావు.

నీ చేతిలో చెయ్యి వేసి అమాయకంగా నీ కళ్ళలోకి చూస్తూ కూర్చున్న నాకు, నాకే తెలియని ఒక కొత్త నన్ను సృష్టించి నా కళ్ళకి నన్నెంతో అందంగా చూపించావు. అసలూ.. మొత్తంగా నువ్వంటే నాకేమిటో నీకెలా చెప్పనూ?

అది సరే.. ఇప్పుడు ఇదంతా కొత్తగా ఎందుకు చెప్తున్నట్టూ అంటే... ఎందుకో నీకు తెలీదూ? దూరం వచ్చి గట్టిగా అరిచి చెప్తే గానీ దగ్గరితనం విలువ తెలుసుకోలేమట.. నిజంగా! నిన్ను నేను చాలా చాలా మిస్ అయ్యాను అని చెప్పడానికి.. ఉహూ కాదు కాదు.. నేను నీ పక్కన లేకపోవడం వల్ల నన్ను నేనే ఎంతో కోల్పోయానూ అని చెప్పడానికొచ్చాను. మళ్ళీ ఆనాటి వసంతం మన ముంగిట్లో సరికొత్తగా విరిస్తే ఎంత బావుండునో కదూ!


Wednesday, January 13, 2016

కొత్త బంగారు లోకం

ఎప్పుడెప్పుడు గబగబా వారాలు క్షణాల్లా గడిచిపోతాయా అని ఎదురుచూస్తుంటే ఎనిమిది యుగాల్లా గడిచినట్టనిపించిన ఎనిమిది నెలలు..
అంతటి భారమైన ఎదురుచూపులకి అద్భుతమైన అర్థాన్నిచ్చిన అపురూప క్షణాలు..
పుట్టి బుద్ధెరిగాక అనుభవైక్యమైన భావాలన్నీ మొత్తం ఒక్కేసారి ఎదురై ఉక్కిరిబిక్కిరి చేసి అసలే భావమూ లేదేమోనన్న వింత సరికొత్త మనఃస్థితిలో..
అప్పుడే పుట్టిన బుజ్జాయిని చూసుకున్న తల్లిని అడిగితే తొలిచూపులో ప్రేమలో పడిపోవడం అంటే ఏంటో చెప్తుంది - అని ఎవరో చెప్పిన మాట స్వానుభవంలోకి వచ్చిన రోజు..
అదిగో.. ఆ రోజు నుంచీ సూర్యోదయాలు, చంద్రోదయాలు ఎప్పుడవుతున్నాయో, కేలండరులోని అంకెలు ఎలా మారిపోతున్నాయోనన్న ఊసే లేకుండా, కొత్తగా వచ్చిన ఈ చిన్ని ప్రపంచానికి ముందున్న నా పాత ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోతూ..
అసలు ఇంతకీ కొత్తగా పుట్టింది బుజ్జిగాడొక్కడేనా, నేను కూడానా అన్న తలంపులో గడిపేస్తూ..... :-)


ఎన్నాళ్ళుగానో నా బ్లాగులో ఏమీ రాయకపోయినా నన్నూ, నా రాతలనీ ఎంతో అభిమానంగా తలచుకుంటున్న మిత్రులందరి కోసం ఈ చిన్న పలకరింపు.. :-)