నువ్వెవరివో?
నాకేమౌతావో!
ఈ లోకం ఆడించే వైకుంఠపాళిలో తలమునకలై నీ ఊసే లేకుండా రోజులు గడుస్తాయి. ఏమో అలా ఎలా అసంకల్పితంగా నీకు దూరమౌతానో, జవాబు తెలీని ప్రశ్న!
మళ్ళీ ఏ దివ్యలోకం నుంచీ ఊడిపడతావో, ఉన్నట్టుండి చప్పున మనసులో మెదులుతావు. నీ తలపొస్తూనే తనతో పాటు ఇంకిపోయిన కళ్ళలోకి తడిని మోసుకొస్తుంది.
నే పట్టలేనంత
గుబులు మనసులోనే
ఇమడలేక కళ్ళలోంచి
ఉబికొస్తానంటుంది.
ప్రేమో, నిస్సహాయతో
నన్ను అమాంతం కమ్మేసి అచేతనంగా
కట్టిపడేస్తుంది.
రోజంతా వేసవి ప్రతాపానికి వాడిపోయిన మల్లెతీగ
పైకి చుక్కలవేళకి
జాలిగా వీచే లేత గాలి తెమ్మెరలా
లీలగా గుర్తొచ్చే
నీ గొంతు ఎంత గొప్ప ఓదార్పనీ!
No comments:
Post a Comment