Thursday, October 18, 2012

అదే నీవు.. అదే నేను..


ఎటు చూసినా నేలంతా మెత్తటి తివాచీలా పరుచుకున్న ఆకుపచ్చని పచ్చిక, తివాచీ మీద అందమైన అల్లికలా పెనవేసుకున్న తెలుపు, పసుపు రంగు గడ్డిపూలు చిన్నవీ పెద్దవీ.. చుట్టూరా ముదురాకుపచ్చ రంగులో బారులు తీరిన పైన్ చెట్లతో నిండిపోయిన కొండ చరియలు.. వాటి వెనుకగా సుదూరంగా ఆకాశం ముంగిట్లో ధవళ కాంతుల్లో మెరిసిపోతూ మంచు కిరీటాల అలంకరణలో ఠీవీగా నించున్న పెద్ద పెద్ద పర్వతాలు.. తేటగా ఉన్న నీలాకాశంలో గుంపులు గుంపులుగా తేలిపోతున్న తెలతెల్లటి మబ్బు తునకలు, మబ్బులతో దోబూచులాడుతూ మధ్య మధ్యన దర్శనమిస్తున్న ఎర్రెర్రని సూరీడు.. మొత్తంగా రకరకాల ఎత్తుల్లో కొండలు, లోయలు, మైదానాలతో వయ్యారంగా ఒంపులు తిరిగి సర్వాంగ సుందరంగా వెలిగిపోతోందా ప్రదేశం. గాలి తరంగాల కదలికలకి సన్నగా ఊగుతున్న గడ్డి పువ్వులతో తేలుతున్న పచ్చిక మైదానం  ఆకుపచ్చని నదిలా ఉంది. పసిమి పూల వనం మధ్యలో పెద్దగా అలల అలజడి లేకుండా స్థిమితంగా లేత ఆకుపచ్చ, ముదురు నీలం రంగులు కలగలిసిపోయి ఆకాశాన్నంతా తన హృదయంలోనే దాచేసుకున్నట్టున్న అందమైన సరస్సు.

ప్రకృతి కాంత మధురంగా మౌనగీతం ఆలపిస్తున్న ప్రశాంత పరిసరాల్లో ఏదో సరి కొత్త లోకంలో ఉన్న భావన కలిగి పరవశంగా సరస్సులో నిశ్చలంగా నిలిచిన నీళ్ళకేసి చూస్తుండగా.. ఒడ్డు మీద నుంచి అప్పుడే సరస్సులోకి ఎగిరొచ్చిన తెల్లటి రాజహంస ఒకటి తన రెక్కల్ని అమాంతం విప్పార్చి టపటపలాడిస్తూ అందాకా ఉన్న నిశ్శబ్దాన్ని కలవరపెట్టింది. అలజడికి నీలం రంగు నీళ్ళల్లో పుట్టిన అలలన్నీ ఒకదాన్ని ఒకటి తరుముతూ సరస్సు అంచులకేసి పరుగులు తీసాయి. మరి కాసేపటికి రాజహంస అలా నీటిని చీల్చుకుంటూ దూరంగా సాగిపోయేసరికి సరస్సులో అలల తాకిడి కాస్త నెమ్మదించి మళ్ళీ నిశబ్దం అలుముకునేంతలో ఎక్కడినుంచో గాలిలో తేలి వచ్చిన కోకిల కూజితం లాంటి  మధురాలాపన లీలగా చెవుల్ని తాకింది. జావళి తెరలు తెరలుగా చెవుల్లోంచి హృదయంలోకి మెత్తగా తేనెలా జాలువారుతున్న అనుభూతి.. ఎవరిదా మంత్రముగ్ధుల్ని చేసే స్వరం అని చుట్టూ పరికించి చూస్తే సరస్సుకి ఆవలి పక్క ఒడ్డున దేవేరి ప్రత్యక్షమైంది.

ఆకుపచ్చని మైదానంలో పాల నురగ లాంటి తెల్లటి దుస్తుల నిగారింపుతో అప్పుడే దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్యలా ఉంది. కుడి చేతిలో పొడవాటి కాడ ఉన్న తెల్లటి పువ్వొకటి పట్టుకుని దాంతో తన దోవకి ఇరువైపులా నిలిచి ఉన్న గడ్డి పువ్వుల్ని పేరుపేరునా సుతారంగా పలకరిస్తూ, తన మధుర గీతికతో సుమబాలలకి అమరత్వాన్ని ప్రసాదిస్తూ ముందుకి వెళుతోంది. పిల్లగాలికి అలవోకగా తేలుతున్న తెల్లటి వస్త్రాలు కొండగాలి తెమ్మెర కాసింత దుడుకుగా వీచినప్పుడల్లా మరింత గర్వంగా మెరిసిపోతూ ఇంకాస్త బిగువుగా ఆమెని హత్తుకుపోతున్నాయి. అంతటి నిరుపమాన సౌందర్యాన్ని తమ గుప్పిట్లో దాచామన్న అతిశయం కాబోలు! బంధనాలు లేక స్వేచ్ఛగా వదిలిన ఆమె నీలి కురులు గాలి తాకిడికి అలల్లా ఎగిసిపడుతున్నాయి. కాస్త తల పక్కకి తిప్పినప్పుడల్లా చెవి పక్కగా సన్నగా రింగులు తిరిగిన నల్లటి ముంగురుల మీద సూర్యకాంతి పడి బంగారు తీగల్లా వెలిగిపోతున్నాయి. పసిడి పూత పూసినట్టున్న తన పల్చటి పాదాల అడుగులు పడిన ప్రతీ చోటా కిందనున్న పచ్చిక స్వర్గతుల్యమైనట్టుగా ప్రకాశిస్తోంది.

దేవేరి గాంధర్వ గానం చెవిలోకి జారి హృదయంలోకి చేరే కొద్దీ నాకు సుపరిచితమైన స్వరంలా తోస్తోంది. గుండె లోతుల్లో ఎక్కడో ఎప్పుడో మూగబోయిన మానసవీణా తంత్రుల్ని శృతి చేస్తున్న భావన.. మధు మోహన రాగం నాదైన ఏదో తీపి జ్ఞాపకాన్ని అస్పష్టంగా గుర్తు చేస్తోంది.  తేనెలూరే పాట మరింతగా హృదయంలో నిండిపోతున్న కొద్దీ తనని చేరాలన్న తపన క్షణక్షణానికీ అధికమై అంతకంతకూ నన్ను తరుముతోంది. కానీ ఎంచేతనో మరి.. ఎంతగా ప్రయత్నించినా ఒక్క అడుగు కూడా ముందుకి పడటం లేదు. నేను గట్టిగా ప్రయత్నించే కొద్దీ తను ఒక్కో అడుగూ దూరంగా జరిగిపోతూ నాలో మరింత ఆరాటాన్ని పెంచేస్తోంది. పట్టలేని ఉద్వేగంలో అసంకల్పితంగా గొంతెత్తి తన పేరుతో పిలిచాను. ఆశ్చర్యం.. తన పేరు నాకెలా తెలిసింది? నాకు కాకపోతే మరెవరికి తెలుస్తుంది నా దేవేరి పేరు! మళ్ళీ పిలిచాను.. మళ్ళీ మళ్ళీ పిలిచాను.. ఉహూ.. నా పిలుపులు తనని చేరుతున్నట్టు లేవు. వెనుదిరిగి చూడనైనా చూడకుండా ముందుకే సాగిపోతోంది. ముందడుగు పడని నా నిస్సహాయత, తను మరింత దూరమైపోతోందన్న ఆందోళనతో మరింత బిగ్గరగా అరిచాను. గుండెని చీల్చుకు వచ్చిన నా వెర్రి కేక దిగంతాల అంచుల దాకా వ్యాపించిందేమో అనిపించింది. కానీ తనని మాత్రం తాకలేకపోయింది..

తన కోసం ఎన్నెన్ని లోకాల్లో వెతికానో, ఎంతగా ఎదురుచూస్తున్నానో తనకి చెప్పేదెలా.. ఇప్పుడు క్షణం దాటిపోతే, తను నా కంటి ముందు నుంచి మాయమైపోతే మళ్ళీ తనని ఇంకెప్పటికైనా చూడగలనా? ఇంకెన్ని యుగాలకో  క్షణం ఎదురయేది.. అసలా అపురూప క్షణం మళ్ళీ వచ్చేనో లేనో! తన కోసమే.. కేవలం తన కోసమే.. నా  తపన, వేదన, ప్రేమ, మోహం, విరహం, జీవం, జన్మ.. సమస్తం! ఇవేవీ తనకి తెలీడం లేదా.. నా ఆర్తి తనని చేరడం లేదా.. నాలో ఆవేదన పెరిగే కొద్దీ అసహనం ఎక్కువై కోపం కూడా వచ్చేస్తోంది. ఒక్కసారైనా తను వెనుదిరిగి నాకేసి చూడదేం.. రాక్షసీ!

తనింకా ఇంకా దూరమైపోతూ క్రమంగా నా కంటిపాపలో తన రూపం చిన్నదవుతూ కనుమరుగైపోతోంది. సరిగ్గా క్షణాన నాకు తెలిసొచ్చింది.. తెలివొచ్చింది.. అప్పటి నుంచీ నేను తనని గొంతెత్తి పిలుస్తున్నానని అనుకుంటున్నాను గానీ నిజానికి నా పిలుపు గొంతు దాటి బయటికి పెగలనే లేదునేను ప్రయత్నిస్తున్నాను అనుకుంటున్నాను గానీ నా మాటలన్నీ గొంతులోనే చిక్కడిపోయాయి. ఇంత కాలం తన కోసం ఎంతగా అన్వేషించాను నేను.. ఇన్నాళ్ళకి నా ప్రణయ దేవేరి నా కంటికెదురుగా సాక్షాత్కారించి తనకి చేరువయ్యే మధుర ఘట్టం తారసిల్లితే నేనే జారవిడుచుకున్నానా.. ఎందుకిలా తనని గొంతెత్తి పిలవలేకపోయాను.. పిలవడానికి విఫలమయ్యాను.. తనని నిజంగా నేనంత గాఢంగా కోరుకోవడం లేదా.. తనని చేరుకోవాలని ఆశపడటం లేదా.. నా ప్రేమ ఇంకా పరిపూర్ణం కాలేదా.. నాలో ఇంకా ఎక్కడో ఏదో అహం దాగి ఉందా.. అదే నన్ను గొంతెత్తి తనని పిలవకుండా అడ్డు పడుతోందా.. నేను పిలవకుండానే తనే వెనుదిరిగి చూసి నన్ను గుర్తించాలని ఆశిస్తోందా.. ఏమో.. స్పష్టంగా తెలియడం లేదే!

నేనీ అంతర్యుద్ధంలో ఉండగానే తను నా నుంచి మరింత దూరంగా సాగిపోతోంది.. ఇహనో ఇప్పుడో ఉత్తర క్షణంలోనో అంతర్ధానం అయిపోతుంది. నా హృదయ దేవేరి, నా ఆరో ప్రాణం, నా ఆత్మబంధువు, నాలో సగం.. నేను వదులుకోలేను.. ఇంకా మా మధ్య  దూరం నేను సహించలేను.. ఎలాగైనా తనని చేరుకోవాలి.. ఇప్పుడే క్షణంలోనే చేరుకోవాలి.. యుగాలుగా ఒకరి కోసం ఒకరు తపిస్తూ సగం సగం ప్రాణాలుగా బతుకుతున్నది మనిద్దరమేనని తనకి గుర్తు చెయ్యాలి.. మేమిద్దరం విడివిడిగా బ్రతుకుతున్న ఒకటే ఆత్మని ఈనాటికైనా గుర్తించాలి.. తనని నాలో నింపుకోవాలి.. తనలో నేను కలిసిపోవాలి.. ఎలా ఎలా.. ఎలా ఇప్పుడు తనని చేరడం? నీళ్ళ కొలనులో దూకేసి ఎలాగైనా ఆవలి ఒడ్డుకి చేరుకొని తనని అందుకోవాలి.. మరింకేం ఆలోచన లేకుండా ముందడుగు వేసెయ్యి.. .. పద.. దూకెయ్.. అసలు ఇంత పెద్ద కొలను నేను ఈదగలనా.. అవతలి ఒడ్డుకి చేరగలనా.. నే వెళ్లేసరికి తను అక్కడే నిలిచి ఉంటుందా.. ఉన్నా నన్ను గుర్తిస్తుందా.. నేను నేనేనని తనకి తెలుస్తుందా?

చప్పున తెలివొచ్చింది.. కళ్ళు తెరిచి చూస్తే కొండలూ, పచ్చిక, నీటి కొలను, నా అందాల దేవేరితో సహా అన్నీ మాయమైపోయాయి. చుట్టూ ఇంకా చీకటి.. ఓహ్.. మళ్ళీ కలేనా ఇదంతా.. ఎంత కాలమని వెంటాడుతుంది నన్ను కల.. ప్రతీసారీ నీళ్ళల్లో దూకుతానో లేదో తెలీకుండానే కలలోంచి మెలకువొచ్చేస్తుంది.. అసలు నాదని తెలిసీ తనని చేరుకోడానికి ఎందుకింత తాత్సారం? నా మనస్సులోని సంశయాలు, నాలో ఇంకా మిగులున్న చిరు అహం ఎప్పటికి సమసిపోతాయో!

నీ తలపు లేని క్షణం లేదు.. గాయపడని ఘడియ లేదు.. ఆశలు రేపని పొద్దు లేదు.. విరహాన్ని పెంచని రోజు లేదు.. ఏనాటికైనా నిన్ను నా సొంతం చేసుకోగలనన్న ఆశ.. నీ చిరుస్పర్శకి నోచుకున్న క్షణం, నీ ఊపిరి సోకిన క్షణం నాలో అణువణువూ ఇన్నాళ్ళు దాచుకున్న వియోగ వేదనని వెచ్చటి నీ శ్వాసతో తుడిచేస్తావన్న నమ్మకం నీ ఊహల్లోనే వేలాది పొద్దుల్ని సునాయాసంగా గడిపేలా చేస్తోంది.

అదే స్వప్నం.. అదే దూరం.. అదే విరహం.. అదే వేదన.. ఇంకెప్పుడూ నేను నిన్ను చేరుకునేది.. నువ్వు నాకు దగ్గరయ్యేది.. ఇంకెన్ని యుగాలు మనకీ నిరీక్షణ!

అదే నీవు.. అదే నేను.. మనం అయ్యేదెన్నడు.. నా మధుర స్వప్నం నిజమయ్యేదెన్నడు సఖీ!