Tuesday, October 02, 2012

మనసు పలికే.. మధువొలికే..


కొంతమందితో స్నేహం రోజుల వ్యవధిలోనే పెరిగి పెద్దదయినట్టు అనిపిస్తుంది. కొంతమంది నేస్తాలతో ఆర్నెల్లకో ఓసారి మాట్లాడినా అంతే ఆత్మీయంగా అనిపిస్తుంది. అలాంటి అరుదైన స్నేహితురాలు ఒకరిని పరిచయం చేస్తానివాళ. తనే 'మనసు పలికే' బ్లాగర్ అపర్ణ. మరి మొదట మా పరిచయానికీ, ఆనక మా స్నేహానికీ వారధి అక్షరాలే కదా.. అందుకే ముందు తన కలం గురించి చెప్తానేం.. :-)

తనేదో వినయం కొద్దీ తను రాసేవి తవికలు అంటుంది గానీ.. నాకైతే తన కవితల్లో తనదైన విలక్షణ ఆలోచనా శైలి, లోతైన భావపరంపర కనిపిస్తాయి. తను ఎంచుకునే పదబంధాలు, పదాల అల్లిక సరళంగా ఉంటూనే ప్రత్యేకంగా అనిపిస్తాయి. అక్షరం మీద మనం పెంచుకున్న మమకారానికీ, అక్షరానికి దూరమైన ఎడబాటు మనసులో మిగిల్చే వెలితికి ఇంతందమైన అక్షరరూపం ఇవ్వొచ్చా అనిపిస్తుంది. ప్రతి నిత్యం పరుగులు తీస్తూ జీవించడం మర్చిపోయి కేవలం బతికెయ్యడానికి అలవాటు పడిపోతున్న మనల్ని ఆపి " క్షణం అడిగిన ప్రశ్న".. బోల్డు ఆలోచనల్లో పడేస్తుంది. ఒకోసారి నేనే నీవన్నంత ఆత్మీయంగా అనిపించిన బంధాలే కంటికి కనిపించని దిగంతాల దూరంలోకి జారిపోయినట్టు మారిపోయే సంక్లిష్టమైన మనఃస్థితిని "నీకూ నాకూ మధ్య.." అంటూ అపర్ణ రాసిన కవితలో మన జ్ఞాపకాల గుర్తులేవో కదలాడినట్టనిపిస్తాయి. కొలతలకీ, లెక్కలకీ అందని సముద్రమంత ప్రేమని అనుభూతి చెందారా ఎప్పుడైనా? అందమైన మనసున్న అమ్మాయి "మౌనముద్ర" దాల్చితే ఎంత మనోహరంగా ఉంటుందో, అదే మనసుకి మనసైన బంధం అందరానిదైపోయి "మరీచిక" లా మిగిలిపోతే మనోవేదన ఎలా ఉంటుందో మీకేమన్నా తెలుసా? అప్పుడెప్పుడో ఇంటర్ చదువుకునే రోజుల్లో అంత చిన్న వయసులోనే అపర్ణ "నేను నేనే" అంటూ ఎంత చక్కటి కవిత రాసిందో మీరే చూడండి.

నాకు బోల్డంత సంబరంగా అనిపించే విషయం ఒకటుంది. అదేంటంటే అపర్ణకి తెలుగు బ్లాగుల గురించి నా బ్లాగు పరిచయం ద్వారానే తెలిసిందట. తను తరచూ చదివే బ్లాగుల గురించి ఎంతో అభిమానంగా తన జ్ఞాపకాలు పంచుకుంది. తెలుగు బ్లాగ్లోకానికి కొత్తగా వచ్చినవాళ్ళు టపాలు చదివితే ఒక్కసారే ఆణిముత్యాల్లాంటి బ్లాగులు కొన్నింటిని పరిచయం చేసుకోవచ్చు.

అప్పుడప్పుడూ వైవిధ్యమైన అంశాలని ఎంచుకుని ఆలోచింపచేసే చక్కటి కథలు కూడా రాస్తుంటుంది అపర్ణ. కుటుంబంలో తల్లీ కొడుకులు, అత్తా కోడళ్ళూ, భార్యా భర్తల మధ్యన సహజంగా ఎదురయే పరిస్థితులు, సమస్యల మూలంగా వాళ్ళ వాళ్ళ అంతరంగంలో ఆలోచనలు ఎలా సాగుతుంటాయి అనే అంశాన్ని తీసుకుని తను రాసిన "అంతర్మథనం" అనే కథ కుటుంబ సంబంధాల్లోని విభిన్న కోణాల్ని స్పృశిస్తుంది. సరికొత్త ఎత్తుగడతో మొదలై, తర్వాత ఏం జరగబోతోందో ఏవిటో అన్న ఆసక్తిని రేకెత్తిస్తూ ఊహించని కొత్త మలుపుతో ముగిసే "దుష్యంతుడు" కథ, మనమూ ఎప్పుడో అప్పుడు ఇలానే ఆలోచించామేమో కదూ అని ప్రతి ఒక్కరూ తమలోకి తాము తొంగి చూసుకునేలా చేసే కథ " రోజు" చదివితే భవిష్యత్తులో తన నుంచి మరిన్ని మంచి కథల్ని చూడగలమన్న నమ్మకాన్ని కలిగిస్తాయి. కథలే కాదు "అనగనగా ఒక ప్రయాణం" లాంటి తన నిజ జీవిత అనుభవాలు, ఆలోచనలు మనల్ని కూడా ఆలోచింపజేస్తాయి.

అప్పుడప్పుడూ సరదా కబుర్లు చెప్పి చాలా నవ్విస్తుంటుంది కూడా.. "బల్లి దోశ" గురించి విన్నప్పుడు ఔరా.. అనుకోడం మా వంతయ్యింది. ఆదివారం అగచాట్ల గురించి చెప్పినప్పుడు బోల్డు నవ్వేసాము. లోకంలో నాలాంటి వాళ్ళందరూ బరువూ బాధ్యత అనో, సన్నగా నాజూగ్గా మారిపోడం ఎలా అనో తీవ్రంగా ఆలోచించేసి బుర్ర బద్దలు కొట్టేసుకుంటుంటే మా అప్పు మాత్రం బోల్డు తిండి తిప్పలు పడుతూ "కొవ్వుదాతా సుఖీభవ" అంటూ విచిత్రమైన స్లోగన్లు వినిపిస్తూ బంపర్ ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటుంది. అన్నట్టు "మొగలిరేకులు" గుచ్చుకుంటే ఎలా ఉంటుందో, "అందమే వ్వాఆ..నందం" ఎలా అవుతుందో తప్పక తెలుసుకోవాలి మీరు. అప్పుడప్పుడూ క్లాసులో నిద్రొచ్చినప్పుడు "తన పేరు అపర్ణ కాదు" అంటుంది కానీ మీరు మాత్రం నిజమని నమ్మకండేం! :-)

"కాళ్ళకి చక్రాలొచ్చాయోయ్.." అంటూ అపర్ణ గంతులేసినప్పుడు మేమందరం కూడా ఎంతో సంతోషించాం. బ్లాగు నేస్తాలందరినీ కలిసిప్పటి వేడుకలో నేను పాలు పంచుకోలేకపోయినా అపర్ణ "ఆనందమానందమాయే" అంటూ తన అక్షరాలతో వేలు పట్టుకు తీస్కెళ్ళి అవన్నీ తిప్పి తీసుకొచ్చినప్పుడు భలే అనిపించిందిలే! మా అపర్ణకి లెక్కలు అదేనండీ గణిత శాస్త్రం బ్రహ్మాండంగా వచ్చు. వయొలిన్ వాయించేంత సంగీతజ్ఞానం ఉంది. ఇంకా తనలో చిన్నారి పంతులమ్మ కూడా దాక్కుని ఉంది. చూసారా.. అమ్మాయి గారికి ఎన్నెన్ని కళలున్నాయో! అన్నట్టు.. పచ్చటి చేల మధ్యన పాడిపంటలతో కళకళలాడుతూ ఉండే అపర్ణ వాళ్ళ ఇంటికి మనకి సదా ఆహ్వానం ఉంటుందని చెప్పింది. ఎంత మంచి మనసో కదా తనది! :-)

మా ఇద్దరి స్నేహం గురించి చెప్పాలంటే అప్పుడెప్పుడోనే "తోటకూర అనుబంధం" విషయంలో మేమిద్దరం గట్టిగా గిల్లుకుని మరీ సేం పించ్ చెప్పుకున్నాం. ఇంకా, గోదావరి ఒడ్డు, రాముల వారి సన్నిధి, సీతమ్మ వారి కోవెల, అభయాంజనేయ స్వామి కొలువు.. అంటూ బోల్డు ఉద్వేగంగా, సంబరంగా మా ఊరి కబుర్లు కలబోసుకోవడం మా ఇద్దరికే సొంతమైన అందమైన అనుభూతి. అన్నట్టు గోదారంటే గుర్తొచ్చింది.. చాలా సినిమాల్లో వచ్చిన మంచి మంచి గోదారి పాటలన్నీ ఏరి కూర్చి అపర్ణ రాసిన "గోదావరి పరవళ్ళు,"  "వేదమంటి మా గోదారి" చిత్రాలు మీరు తప్పక చూడాల్సిందే!

మా ఇద్దరికీ కలిసే మరో అభిరుచి 'సిరివెన్నెల సాహిత్యం'. అప్పుడప్పుడూ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన పాటల్లోంచి తనని బాగా ఆకట్టున్న చక్కటి పాటలు కొన్నింటిని ఎంచుకుని అర్థవంతమైన, అందమైన వ్యాఖ్యానాలతో వర్ణిస్తూ తన "విరజాజుల సిరివెన్నెల" బ్లాగులో విశ్లేషిస్తుంటుంది అపర్ణ.

అపర్ణ రాతల గురించి ఒక్కమాటలో చెప్పాలంటే తన మనసు పలికేది మౌనగీతం కాదని తనంటుంది.. మధువొలికే మధురగీతం అని నేనంటాను. తన రాతలు చదివాక మీరూ నాతో ఏకీభవిస్తారని నా నమ్మకం. :-)

ఇక తన వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే.. తనతో కొద్ది పరిచయంలోనే ఎవరికైనా తనలాంటి మంచి స్నేహితురాలు ఉంటే బావుండనిపించేంత స్నేహశీలి. స్స్వచ్ఛమైన మనసుతో చిన్నపిల్లలా అల్లరి చేసే కలుపుగోలు మనస్తత్వం తనది. తను స్నేహానికి ఎంత విలువిస్తుందో తన నేస్తం ఒకరి గురించిన మురిపెం చూస్తేనే తెలుస్తుంది. రోజుల్లో ఇంతందంగా మల్లెచెండు అల్లడం వచ్చిన అమ్మాయిలు ఎంత అరుదో మీరే చెప్పండి. అంతే కాదు.. అపర్ణ ఎంత చక్కగా బొమ్మలు గీస్తుందో! అసలు అపర్ణతో ఒకసారి మాట్లాడిన వాళ్ళెవరైనా ముగ్ధులవాల్సిందే తెలుసా.. తను మాట్లాడే పద్ధతిలో, మాటల్లో ఆత్మీయతతో పాటు ఒద్దిక, అణకువ ఉట్టిపడుతూ.. "ఆహా.. అసలు ఆడపిల్లలంటే ఇలా మాట్లాడాలి" అన్నంత ముచ్చటేస్తుందంటే నమ్మండి. ఎన్నాళ్ళ తరవాత మాట్లాడినా తన గొంతులో పలికే మార్దవం, తను చూపించే ఆపేక్ష బోల్డు ఇష్టంగా ఉంటాయి నాకైతే.

ఇంత చక్కటి అమ్మాయికి, ఆత్మీయ నేస్తానికీ పుట్టినరోజు వస్తూనే తనకి ఇదివరకెన్నడూ ఎరుగని ఎన్నెన్నో కొంగొత్త అనుభూతుల్ని, బోల్డన్ని అమూల్యమైన బంగారు క్షణాలని, మరపు రాని మధురానునుభూతుల్ని, అంతు లేని సంతోషాల్ని తన జీవితంలోకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మా ప్రియనేస్తం 'మనసు పలికే' అపర్ణకి ప్రేమపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.


21 comments:

వనజవనమాలి said...

మధుర వాణి గారు .. చక్కని బ్లాగ్ ని మరింత చక్కగా పరిచయం చేసారు. వీలు వెంబడి.. ఈ బ్లాగ్ ని నిశితంగా చూడటానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదములు.

అపర్ణ గారు. పుట్టినరోజు శుభాకాంక్షలు.

జ్యోతిర్మయి said...

అపర్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు.

మధుర వాణి గారు మీలాంటి మంచి స్నేహితురాలు వున్న అపర్ణ గారు చాలా అదృష్టవంతులు. మధురంగా చెప్పారు శుభాకాంక్షలు.

Lasya Ramakrishna said...

Thanks for introducing a good blog.

శశి కళ said...

చక్కని అపర్ణ గూర్చి అంటే చక్కగా వ్రాసావు
మధుర మీ అనుభందం ఇలాగే కల కాలం ఉండాలి
అపర్ణ పుట్టిన రోజు శుభాకాంక్షలు

హరే కృష్ణ said...

Awesome మధుర!

అపర్ణ కు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు :)

వేణూశ్రీకాంత్ said...

పోస్ట్ చాలా బాగుంది మధుర.
అప్పూకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు:)

రాజ్ కుమార్ said...

మీ పోస్టు కి పెద్ద BINGO. చక్కగా రాశారు. ;)

మనసుపలికే అపర్ణ కి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు

శ్రీలలిత said...


హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు...

రాజేంద్ర తడవర్తి said...

అపర్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

ఎప్పటి లాగే చాలా బాగా రాసారు.. చక్కని పరిచయం.. అంతకంటే చక్కని మీ స్నేహం..

మాలా కుమార్ said...

అపర్ణ కు జన్మదిన శుభాకాంక్షలు .

ఫోటాన్ said...

మనసు పలికే అపర్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు :)

వెంకట రాజారావు . లక్కాకుల said...

మధుర వాణి స్నేహ మధు వొల్కి కూర్చిన
బర్తుడే టపా అపర్ణ గూర్చి
పరిచయమ్ము చేసె - నిరువురు చెలులకు
సకల శుభము లొసగు సాయి ప్రభుడు .
----- సుజన-సృజన

సి.ఉమాదేవి said...

స్నేహబంధము ఎంత మధురము!అపర్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు,చక్కటి పోస్ట్ రాసిన మీకు అభినందనలు.

kallurisailabala said...

బ్లాగ్ గురించి చక్కగా రాసావు మధుర. ఆలస్యం గా చూసాను ఈ పోస్ట్ అయిన కూడా అపర్ణ కి హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు.

మధురవాణి said...

@ వనజ వనమాలి,
అలాగే చూడండి.. మీకు తప్పకుండా నచ్చుతుంది. ధన్యవాదాలండీ..

@ జ్యోతిర్మయి,
ఇంత చక్కటి స్నేహితులు దొరికిన అరుదైన అదృష్టం నాదేనండీ.. ధన్యవాదాలు.. :)

@ లాస్య రామకృష్ణ,
సంతోషమండీ..

@ శశి కళ,
మీ ప్రేమపూర్వక దీవెనకి ధన్యవాదాలండీ..

@ హరేకృష్ణ,
థాంక్యూ! :)

మధురవాణి said...

@ వేణూ శ్రీకాంత్,
థాంక్యూ వేణూ.. :)

@ రాజ్ కుమార్,
థాంక్యూ సో మచ్ రాజ్.. :)

@ శ్రీలలిత,
ధన్యవాదాలండీ..

@ రాజేంద్ర తడవర్తి,
థాంక్యూ సో మచ్.. :)

@ మాలా కుమార్,
ధన్యవాదాలండీ..

మధురవాణి said...

@ ఫోటాన్,
థాంక్యూ..

@ వెంకట రాజారావు. లక్కాకుల,
అందమైన పద్యంతో భలే శుభాకాంక్షలు చెప్పారండీ.. బోల్డు ధన్యవాదాలు.

@ C.ఉమాదేవి,
మీ అభినందనలకీ, శుభాకాంక్షలకీ ధన్యవాదాలండీ..

@ కల్లూరి శైలబాల,
చాన్నాళ్ళకి కనిపించావే.. థాంక్యూ డియర్.. :)

oddula ravisekhar said...

2011 december 10 తెలుగు బ్లాగర్ల సమావేశం hyderabad లో జరిగినప్పుడు నేను హాజరయ్యాను.అప్పుడు అపర్ణ గారు కూడా వచ్చారు.మీరు చెప్పిన కొన్ని పోస్ట్ లు చదివాను.చాలా బాగా వ్రాస్తుంది.గలగలా మాట్లాడుతూ అందరిని పరిచయం చేసుకుంది.మీడియా వారు కూడా ఆమె ఇంటర్వ్యూ తీసుకున్నారు.మీరు స్నేహానికి ఇచ్చే విలువ మీరు వర్ణించిన తీరు అద్భుతం.మరొక బ్లాగును గురించి ఇంత గొప్పగా,అందంగా వ్రాయటం గ్రేట్.

మధురవాణి said...

@ oddula ravisekhar,
ఓ.. అయితే మీకు అపర్ణ తెలుసన్నమాట. సంతోషమండీ.. మీ ప్రశంసాపూరకమైన అభినందనకి బోల్డు ధన్యవాదాలు.

మనసు పలికే said...

ముందుగా, శుభాకాంక్షలందించిన మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా గురించి ఇంత స్పెషల్‌గా, స్పెషల్ టైం తీసుకుని మరీ టపా రాసిన మధురకి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే. నా పాత టపాలన్నీ వెతికి మరీ లంకెలు పెట్టి ఇంత ఓపిగ్గా రాసిన నేస్తానికి, చిరకాలం మా స్నేహం ఇలాగే ఉండాలని కోరుకోవడం తప్ప ఇంకేమి ఇవ్వగలను?

గత కొన్ని నెలలుగా ఇంటర్‌నెట్ సదుపాయం లేక బ్లాగుల్లోకీ, జిమెయిల్ లోకీ రాలేకపోయాను. అన్ని నెలలు దూరంగా ఉన్న తరువాత ఎవరు మాత్రం నన్ను గుర్తు పెట్టుకుంటారులే అన్న అంతరాత్మ అభిప్రాయాన్ని తప్పని ఎత్తి చూపుతూ ఇందరు నేస్తాలు పంచిన వాత్సల్యాన్ని స్వీకరించడానికి చెమ్మగిల్లిన కళ్లే ముందుగా తయారవుతున్నాయి. ప్రస్తుతానికి మాటల సహకారం అందడం కష్టంగా ఉంది. ఇంతటి అభిమానాన్ని అనుభవించడం మొదటిసారి కదా..

నా ఇంతటి ఆలస్యాన్ని నా మనసు క్షమించకపోయినా సహృదయంతో మీరంతా క్షమించి నా ధన్యవాదాలని స్వీకరిస్తారని, మన బంధాలు ఇలాగే కలకాలం పచ్చగా కొనసాగడానికి మీ స్నేహహస్తాన్ని అందిస్తారని మనసారా కోరుకుంటూ..

మీ అపర్ణ.

మధురవాణి said...

@ అపర్ణా..
Pleasure is all mine dear! పుట్టినరోజు పూట నీక్కొంచెం ఎక్కువ సంతోషం ఇద్దామని నీ బ్లాగుని తోడు తీసుకొచ్చుకున్నాను విష్ చెయ్యడానికి.. నీ ఆనందం చూసి నాక్కూడా సంబరంగా ఉంది. మనం ఎవరం కోరుకున్నా మన స్నేహం చిరకాలం ఇలాగే ఉండాలని తప్ప ఇంకేం కావాలి చెప్పు.. :)