Friday, December 23, 2011

It's a wonderful life


క్రిస్మస్ పండుగ వచ్చేస్తోంది కదా.. సందర్భంగా క్రిస్మస్ టైం లో చూడదగిన ఒక గొప్ప సినిమా గురించి చెప్తాను. ఇది 1946 లో తీసిన నలుపు తెలుపు సినిమా. సినిమా పేరు It's a wonderful life. అప్పుడెప్పుడో పాత కాలంలో తీసిన సినిమా అయినప్పటికీ నిర్మాణపు విలువలు గానీ, నటీనటుల అభినయాలు గానీ చూడచక్కగా అత్యంత సహజంగా, సినిమా చూసిన మనకి ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటాయి. సినిమాకి కథ, కథనం, దర్శకత్వం నాకైతే అద్భుతం అనిపించింది. ఇంక సంభాషణల గురించైతే సినిమాకి అవే ప్రాణం అని చెప్పుకోవాలి. సినిమా చూసి నచ్చలేదు అనేవారుండరని నా నమ్మకం. నాకైతే నా ఆల్ టైం ఫేవరేట్ సినిమాల లిస్టులో సినిమా చేరిపోయింది.
కొన్ని నెలల క్రితం మొదటిసారి నేనీ సినిమా చూసినప్పుడే నా బ్లాగ్లో ఒక పోస్ట్ రాద్దామనుకున్నాను. కానీ, అదేంటో ఒకోసారి ఏదైనా మరీ ఎక్కువ నచ్చేసినా దాని గురించి ఏమని చెప్పాలో, ఎలా అక్షరాల్లో పెట్టాలో తోచదు. నేనీ సినిమా చూసే సమయానికి సినిమా కథ గురించి నాకస్సలేమీ తెలీదు. సినిమా చూస్తున్నప్పుడు నిజంగా చాలా థ్రిల్లింగా అనిపించింది. అందుకని ఇప్పుడీ సినిమా కథ మొత్తం వివరంగా చెప్పడం నాకిష్టం లేదు. అదీ గాక సినిమాని సమీక్షించేంత సాహసం కూడా నేను చెయ్యలేను కాబట్టి క్లుప్తంగా సినిమా కథని పరిచయం చెయ్యడానికి ప్రయత్నిస్తాను.

అనగనగా ఒక చిన్న మారుమూల పల్లెటూర్లో ఒక తెలివైన, చురుకైన అబ్బాయి. 'డబ్బు సంపాదన, మన కోసం మనం బ్రతికాం' అన్నదాని కన్నా మన చుట్టూ ఉన్న వారిలో కనీసం నలుగురి జీవితాల్లోనైనా సరే వెలుగులు నింపడంలోనే గొప్ప సంతృప్తి ఉందని నమ్మే తండ్రికి వారసుడైన అబ్బాయికి చిన్న ఊర్లో ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ బ్రతకడం అస్సలు ఇష్టం లేని పని. ఎప్పటికైనా చదువు ముగించుకుని కుగ్రామం నుంచి బయటపడి దేశ విదేశాల్లోని ప్రముఖమైన ప్రదేశాలన్నీ సందర్శిస్తూ మొత్తం ప్రపంచాన్నంతా చుట్టి రావాలని చిన్ననాటి నుంచీ అతని కల, ఆశయం. పట్టుదలగా అనుకున్నది ఏదైనా భేషుగ్గా సాధించగల తెలివితేటలు, సమర్ధత కలిగిన అబ్బాయి తన ఆశయాలకి అనుగుణంగా అన్నీ సిద్ధం చేసుకుంటాడు. కానీ వాళ్ళ నాన్న మనస్తత్వాన్ని వారసత్వంగా అంది పుచ్చుకున్న యువకుడు తన జీవితంలోని ప్రతీ మలుపులోనూ తన సొంత కలలు నిజం చేసుకోడం కంటే తన చుట్టూ ఉన్న వారి కళ్ళల్లో ఆనందాన్ని చూడటం ముఖ్యమనుకుంటాడు. అలాంటి మంచి మనసున్న వ్యక్తి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది, ఎలాంటి ఇబ్బందులూ, కష్టాలూ ఎదుర్కోవలసి వచ్చింది, చివరికి అతను జీవితంలో ఏం సాధించగలిగాడు, అతని చివరికి మిగిలింది ఏంటి, తనకి (మనకి కూడా) జీవితం అందించిన స్ఫూర్తి ఏంటీ.. అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

అదే చిన్న ఊర్లో ఒక ముచ్చటైన అమ్మాయి. చిన్ననాటి నుంచీ తన మనసంతా ఒక అబ్బాయి స్నేహం వైపే మొగ్గేది. చాలా చిన్నప్పుడే "నేను అబ్బాయిని జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటా" నన్న గట్టి నిర్ణయానికొచ్చేసేంత ఇష్టం, ఆరాధనా అబ్బాయంటే! అమ్మాయికి వయసుతో పాటు అతగాడిపై ప్రేమ కూడా పెరుగుతూ వస్తుంది. అబ్బాయికి కూడా అమ్మాయి అంటే ఇష్టం ఉన్నప్పటికీ అతని ధ్యాస, దృష్టి మిగతా బోల్డు విషయాలపై ఉండటం వల్ల ప్రేమా, పెళ్ళీ గురించిన ఆలోచన తక్కువ. అసలా అమ్మాయి కళ్ళల్లో ఎప్పుడు చూసినా ఇతగాడిపై ప్రేమ తప్ప మరేం కనిపించదు.. అంతలా ఆరాధిస్తుంటుంది.
వాళ్ళ చిన్నప్పటి రోజుల తర్వాత మళ్ళీ అమ్మాయికి పద్దెనిమిదేళ్ల ప్రాయంలో ఒకానొక సందర్భంలో మన హీరో ఎదురుపడతాడు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని ఆశ్చర్యానందాలలో తేలిపోయి కళ్ళతోనే ఇష్టం ప్రదర్శించుకుంటారు.
ఆనాటి వెన్నెల రాత్రి నిర్మానుష్యంగా ఉన్న వీధుల్లో ఇద్దరూ అలా అలా నడుచుకుంటూ వెళుతుండగా అబ్బాయి అడుగుతాడు.. "నీకోసం ఏం ఇమ్మంటావ్ చెప్పు.." అంటూ ఆకాశంలోకి చూస్తే అక్కడ వెన్నెల్లో మెరిసిపోతున్న చందమామ కనిపిస్తుంది.
"నీక్కావాలా చెప్పు.. నేనిప్పుడే ఆకాశంలోకి ఒక తాడు వేసి చంద్రుణ్ణి కిందకి లాగేసి భూమ్మీదకి దించి నీకు కానుకగా ఇచ్చేస్తా"నంటాడు.
".. సరే.. నేనా చందమామని తీసుకుంటాను. తర్వాత?" అంటుంది అమ్మాయి.
" తర్వాతేముందీ.. నువ్వా జాబిలిని అమాంతంగా మింగేసేయ్.. అప్పుడు వెన్నెలంతా నీలోనే నిండిపోతుంది. నీ కళ్ళల్లోంచీ, చేతి వేలి కొనల నుంచీ, నీ కురుల చివర్ల నుంచీ వెన్నెల కురుస్తుంది..." అంటూ మురిపించేస్తాడు మన హీరో.
సినిమాలో నాకు చాలా చాలా ఇష్టమైన సన్నివేశం ఇదే! అందమైన జ్ఞాపకాన్ని అమ్మాయి పదిలంగా దాచుకుంటుంది. అదెలాగో సినిమాలో చూడాల్సిందే! ;)

తర్వాత అమ్మాయి చదువు కోసమనీ, అబ్బాయి బాధ్యతలలో తలమునకలైపోతారు. అమ్మాయి పెళ్ళి చేసుకోడానికి బాగా డబ్బున్న వేరే అబ్బాయిలున్నా గానీ తన ఆశ, ధ్యాస నిత్యం అబ్బాయి మీదే పెట్టుకుంటుంది. ఇతగాడినే వలచి వరిస్తుంది. అది మొదలు అతను వేసే ప్రతీ అడుగులో వెన్నంటి నడుస్తుంది. అచ్చమైన అర్ధాంగిలా అతను చేసే ప్రతీ పనిలో తోడుగా నిలబడుతుంది. అతని కష్టనష్టాల్లో పాలు పంచుకుంటుంది. ఒకానొక సందర్భంలో అతను అమ్మాయికి విలాసవంతమైన జీవితాన్ని ఇవ్వలేకపోతున్నాననిపించి "నువ్వెందుకసలు నన్ను పెళ్ళి చేసుకున్నావ్?" అంటాడు కొంచెం దిగాలుగా. అప్పుడా అమ్మాయి తేలిగ్గా నవ్వేసి "నువ్వు నన్ను పెళ్ళి చేసుకోకపోయుంటే నేను ఒంటరిగానే ఉండిపోయేదాన్ని. నువ్వే ఎందుకు కావాలనుకున్నానంటే నా పిల్లలు అచ్చం నీలాగే ఉండాలనుకున్నాను కాబట్టి.." అంటుంది. అతని సాహచర్యం తప్ప ప్రపంచంలో విలువైనది మరేదీ లేదనుకుంటుంది. అమ్మాయి ప్రేమనీ, ప్రేమపై తనకున్న నమ్మకాన్నీ చూస్తే ప్రేమని మించిన పెన్నిధి జీవితంలో మరేం ఉంటుంది అనిపిస్తుంది.

ఇంత చెప్పేసాక సినిమాలో ఇంకా కథేం మిగిలి ఉంటుంది చూట్టానికి అనుకుంటున్నారా! నేనింతవరకూ చెప్పింది కేవలం అబ్బాయి, అమ్మాయి మధ్యనున్న ప్రేమని గురించిన చిన్న భాగం మాత్రమే! అసలు కథ సినిమాలో వేరే ఉంది. అదేంటో చెప్పను గానీ, సినిమా చూసాక నాకేమనిపించిందో చెప్తాను.
జీవితం మనకొక విలువైన బహుమతి అనీ, It's a wonderful life! అనీ సినిమా మరోసారి మనకి గుర్తు చేస్తుంది. సినిమా చూసేసాక మనం చాలా ఆలోచనల్లో పడిపోతాం. మన లైఫ్ ఎంత వండర్ఫుల్ అనే ప్రశ్నకి సమాధానం వెతుక్కునే పనిలో పడిపోతాం. అలాగే, మన జీవితానికున్న విలువ కేవలం మన కోసం మనం ఏం సాధించాం అన్నదొక్కటే కాదు, మన చుట్టూ ఉన్న వారి జీవితాల్లో ఎంతవరకూ మనం సంతోషాన్ని నింపగలిగాం అన్నదాని మీద కూడా ఆధారపడి ఉంటుందని గుర్తిస్తాం. ఎప్పుడైనా జీవితంతో పాటు తీసే పరుగులో అలసిపోయి, విసుగెత్తిపోయి, విరక్తి చెంది "అబ్బా.. అసలు అనవసరంగా పుట్టానేమో.. అసలీ జన్మే లేకపోయుంటే ఎంత బావుండేది.. అయినా నా పిచ్చి గానీ నేను పుట్టనంత మాత్రాన ప్రపంచానికి వచ్చే నష్టమేముంది" లాంటి ఆలోచనలు రావొచ్చు. జీవితం మీద విరక్తి కలిగే అలాంటి క్షణాల్లో ఖచ్చితంగా సినిమా గుర్తొచ్చి తీరుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా మనలో ఒక ఆశావహ దృక్పథాన్ని, స్ఫూర్తిని కలిగిస్తుందని మాత్రం నమ్మకంగా చెప్పగలను. అందుకే మరి సినిమా అమెరికన్ ఫిలిం ఇన్స్టిట్యూట్ వారి సత్కారాలు ఎన్నింటినో అందుకుంది.
This movie has been voted the #1 inspirational film of all time in AFI's "100 Years, 100 Cheers", Ranked as the #1 Most Powerful Movie of All Time, Also ranked as the #20 Greatest Movie of All Time.
సినిమా గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూడొచ్చు. సినిమా చూసేసిన తరువాత సినిమా గురించిన కొన్ని ఆసక్తికరమైన సంగతుల్ని ఇక్కడ చూడొచ్చు.

నేను ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువ చూడనంటూ కాస్త బద్ధకించినా సరే విసుక్కోకుండా "చాలా మంచి సినిమా. ఒక్కసారి ఓపిక చేసుకుని చూడండి. సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. చూసాక మీరే సినిమా గురించి ఒక పోస్ట్ రాసి అందరికీ పరిచయం చేస్తారు చూడండి" అంటూ బోల్డంత ఓపిగ్గా నాకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి మరీ ఇంత మంచి సినిమాని నాకు చూపించిన మనందరి చల్లటి ఫ్రెండ్ గారికి బోల్డు బోల్డు థాంకులు చెప్తూ.. క్రిస్మస్ కి మీకో బుల్లి కానుకగా పోస్ట్ మీకే అంకితం. క్రిస్మస్ రోజున మీ కోసం కూడా ఒక ఏంజెల్ వచ్చి మీ విషెస్ అన్నీ తీర్చెయ్యాలని మనసారా కోరుకుంటూ Merry Christmas! :)

Tuesday, December 20, 2011

ఇదేనా.. ఇదే నా.. మొదటి ప్రేమలేఖ!


ప్రియమైన మీకు,
"మీకు ఏంటి మీకు.. నాకో పేరుంది తెలీదా.." అన్నట్టు అలా కోపంగా చూడకండి. మరేం చెయ్యమన్నారు చెప్పండి నన్ను. ఇప్పటికే పది కాయితాలు మార్చాను మిమ్మల్ని ఏమని పిలవాలో తెలీక. అసలు జవాబు రాయకుండా ఊరుకుందామనుకున్నాను గానీ పేద్ద బడాయిగా నా జవాబు చూసే ఎంత నచ్చానో తెలుసుకుంటానని ముందరి కాళ్ళకి బంధం వేసేసారుగా! పైగా నా మాటల్లో వినాలనుంది అని గారంగా అడుగుతూనే అంతలోనే నీ ఇష్టం అంటూ నిష్టూరమాడేసరికి ఎలాగైనా జవాబు రాయక తప్పింది కాదు.

అయినా, మీరసలు మహా గడుసువారు సుమా! మీకేం.. ఎంచక్కా నాలుగు వాక్యాలు ఉత్తరం రాసి పడేసారు. ఆ ఉత్తరం నా కంటే ముందు మా చిన్నారి చేతిలో పడటం వల్ల నాకెన్ని తిప్పలొచ్చిపడ్డాయో మీకేమన్నా తెలుసా! అది అక్కా అని పిలవడం మానేసి.. క్షణానికోసారి "రాధీ.. నా ప్రియమైన రాధీ.." అంటూ నా ప్రాణాలు తోడేస్తోంది. ఇంకా నయం, నాన్నగారు చూసారు కాదు. మీ ఉత్తరం సంగతి నాన్నగారికి చెప్పకుండా దాచడం కోసం రోజూ నేను మా చెల్లి గాడిద చెప్పిన పనల్లా చెయ్యాల్సి వస్తోంది తెలుసా మీకు! అప్పటికీ మా చిన్నత్తకి తెలిసిపోయింది. మీ ఆయన ఆషాఢం దాకా కూడా ఆగేట్టు లేడే అమ్ములూ.. తాంబూలాలు కూడా తీసుకోక మునుపు నించే ప్రేమలేఖలు రాస్తున్నట్టున్నాడుగా.. అంటూ ఆట పట్టించింది.

అసలయినా మీకు కాస్తైనా భయం భక్తీ ఏవన్నా ఉన్నాయా అని.. ఆ రోజున పెళ్ళి చూపులప్పుడు కూడా అంతే.. మా పడమటి గదిలో ఐదు నిమిషాలు నాతో మాట్లాడిన తర్వాత బయటికి వెళ్తూ వెళ్తూ చుట్టూ ఎవ్వరూ లేరు కదాని వెనక నుంచి నా జడ పట్టుకు లాగారా.. మా రాజి పిన్ని చూడనే చూసింది.. తర్వాత వంట గదిలోకి వెళ్ళినప్పుడు అమ్మా, పెద్దమ్మా, అత్తా, బామ్మా అందరి ముందూ నన్ను దొరకబుచ్చుకుని "ఏమే అమ్ములూ.. కాబోయే శ్రీవారు జడొక్కటే లాగాడా.. లేకపోతే చెయ్యి పట్టుకు లాగాడు కూడానా?" అని అడిగేసరికి అందరూ ఘొల్లున నవ్వారు. అబ్బ.. సిగ్గుతో చచ్చిపోయాను తెలుసా!

ఆ రోజు మీరు నన్ను చూసి వెళ్ళిపోయాక రాత్రి భోజనాల దగ్గర మీ గురించిన మాటలు వచ్చాయి. నేనూ, చిన్నారి పక్క గదిలోకి వెళ్ళి కూర్చుని పెద్దవాళ్ళ మాటలన్నీ ఆలకిస్తున్నాం. పెదనాన్నగారేమో "అబ్బాయి చాలా బుద్ధిమంతుడిలా ఉన్నాడు. అమ్ములుకి బంగారం లాంటి సంబంధం చూసావురా" అని మెచ్చుకోలుగా అనేసరికి నాన్న కళ్ళల్లో ఎంత నిశ్చింతో! ఇంతలో బాబాయేమో "అబ్బాయి బుద్ధిమంతుడే కాదన్నయ్యా.. చాలా తెలివైనవాడు, సమర్ధుడు కూడా. మన అమ్ములు నిజంగా అదృష్టవంతురాలు" అన్నాడు. "ఒక్క పిల్లాడే కాదు కుటుంబమంతా కూడా చాలా నెమ్మదస్తుల్లా ఉన్నారు. మనలో యిట్టే కలిసిపోయారు. మన పిల్ల సుఖపడుతుందిలే" అంది పెద్దమ్మ. ఆ తర్వాత నాన్నగారు పెదనాన్నగారితో "చెరువు కింది మాగాణి రెండెకరాలు అమ్ముదాం అనుకుంటున్నా అన్నయ్యా.. అమ్ములుకి కొత్త నగలు చేయించుదాం.. నా బంగారు తల్లికీ ఏ లోటూ జరగకూడదు" అంటూ చెప్తుంటే నిజం చెప్పొద్దూ.. నా కళ్ళల్లోంచి కన్నీళ్లు జలజలా రాలిపోయాయి. చిన్నారి నన్ను దగ్గరికి తీసుకుని బుజ్జగించింది. ఆ రోజు రాత్రంతా కలత నిద్రే అయ్యింది నాకు. మీకు నేను నచ్చాను, మీలాంటి మంచి మనసున్న వ్యక్తికి భార్యని అవబోతున్నానన్న ఆనందం, ఉద్వేగం ఒక వైపూ, అమ్మా వాళ్ళందరినీ తలచుకుని అందరినీ వదిలి దూరంగా వెళ్ళిపోవాలన్న భయమూ, బెంగా మరో వైపూ. అసలీ మధ్యన బాధా, సంతోషం రెండూ కలగలిసిపోయి పదే పదే నా కళ్ళు కన్నీళ్ళ కొలనులౌతున్నాయి.

మీరు చాలా గుర్తొస్తున్నారు. మీ చురుకైన చూపులు కూడా పదే పదే గుర్తొస్తున్నాయి. అసలు మొన్నొకరోజు చిన్నారి ఏమందో తెలుసా.. మీరు పైకి అలా బుద్ధిమంతుల్లా కనిపిస్తారు గానీ చాలా అల్లరివారంట.. మా ఇంటి నుంచి వెళ్ళేప్పుడు బయట వాకిలి దాకా వెళ్ళాక మా పడమటి గది కిటికీ వైపు తిరిగి నన్ను చూసి కళ్ళతోనే వెళ్ళొస్తానని చెప్పారంట. అన్నట్టు, బామ్మకి మీరెంత నచ్చారో తెలుసా.. తూర్పు వీధిలో ఉండే సీతమ్మ గారని మా బామ్మ నేస్తురాల్లెండి. ఆవిడ వచ్చినప్పుడు మిమ్మల్ని తెగ పొగిడేసింది. మా అమ్ములుకి కాబోయే మొగుడు ఎంత అందగాడనీ, ఆరడుగుల ఎత్తూ, ఎత్తుకి తగ్గ రూపం, శ్రీరామచంద్రుడిలా ఉంటాడు తెలుసా.. పై దేశంలో చాలా పెద్ద ఉద్యోగం. పెళ్ళయ్యాక మన అమ్ములుని కూడా తీసుకెళతాడు. అంతా మా వరాల తల్లి అదృష్టం" అంటూ నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని నా బుగ్గలు పుణికింది. ఇంతలో చిన్నత్త వచ్చి "అవుననవును.. ఆరడుగుల అందగాడే.. దీన్ని ఒక్క చేత్తో ఎత్తి భుజాన వేసుకుపోగలడు కూడానూ!" అంది. అందరూ నవ్వుతుంటే సీతమ్మ గారేమో "పోనీలేమ్మా.. నీ నోము ఫలం బాగుంది.. రాముడంటి మొగుడు దొరికాడు.." అనగానే మా చిన్నారి కోతి వచ్చి "రాముడు కాదు అమ్మమ్మా.. బావ గారు సాక్షాత్తూ కృష్ణుడే.. ఆయన పేరు కూడా అదే.. కదా అక్కా.." అంటూ ఒకటే నవ్వడం నన్ను చూసి. అన్నట్టు, నేను మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా.. ఇంతకీ మీరు రాముడా.. కృష్ణుడా?

మన పెళ్ళి ముచ్చటేమో గానీ పెళ్ళయ్యేలోపు మా చిన్నారి నన్ను వేపుకు తినేసేలా ఉంది. దాని కంట పడకుంటా ఈ ఉత్తరం రాయాలంటే నా తల ప్రాణం తోకకొస్తోంది. అప్పటికీ మీ ఉత్తరం వచ్చిన రోజు నించీ ఒకటే గొడవ.. జవాబు ఏమని రాస్తావక్కా.. మా పెరటి కొబ్బరిచెట్టు మీ కుశలం అడిగే.. అంటూ కవిత్వం రాస్తావా అని. అన్నట్టు, కవిత్వం అంటే గుర్తొచ్చింది... ఆ రోజున మీరేవన్నారూ.. కవిత్వం అంటే మీకిష్టమా అని అడిగితే.. "ఇష్టమే.. కాకపోతే నా కోసం ఎవరన్నా రాస్తేనే.." అని కదూ! అమ్మో.. మీరు మాటల్లో అస్సలు దొరకరు.. ఇంత మాయ మాటలల్లడం ఎక్కడ నేర్చుకున్నారసలు.. మీరొచ్చి వెళ్ళిన నాటి నుంచీ మీరాడిన ప్రతీ మాటా పదే పదే గుర్తొస్తూనే ఉన్నాయి తెలుసా!

నిన్న సాయంత్రం నా ప్రాణ స్నేహితురాలు సుప్రియ వచ్చింది. "ఏమే రాధికా.. పెళ్ళి కొడుకులో నీకు బాగా నచ్చింది ఏంటే?" అని అడిగింది. అవునూ.. మీలో ఏం నచ్చిందబ్బా అని ఆలోచిస్తూ ఉంటే మీ కళ్ళు, నవ్వు, మాటలు.. అన్నీ వరసగా గుర్తొచ్చి ఏమని చెప్పాలో తోచక.. ఏంటో మొత్తంగా నచ్చేసినట్టున్నారే.. అనేసరికి అది నవ్వే నవ్వు నన్ను చూసి. "మొత్తానికి పిల్లాడు మొనగాడేనే.. లేకపోతే నీలాంటి మొండి పిల్లని ఒక్క చూపులోనే ఇంత మాయలో పడేస్తాడా.." అంటూ తెగ నవ్వింది. "పోవే.. మరీ చెప్తావు.. నువ్వు మాత్రం ఏడాది క్రితం నీ పెళ్ళి చూపులయ్యాక మీ ఆయన నచ్చాడని చెప్పలేదూ.." అని కస్సుమన్నాను దాని మీద. "అన్నాను లేవే.. కానీ, మరీ నీలా ఇంత మాయలో మేవెవరమూ పడిపోలేదమ్మా.. ఏంటోలే.. అంతా కృష్ణ మాయ.." అని చాలా సేపు ఏడిపించింది నన్ను.

ఈ రోజు పొద్దున్న ఏమైందో తెలుసా.. ఉదయాన్నే చిన్నారీ, నేనూ రామాలయానికి బయలుదేరుతుంటే అమ్మ పిలిచి పోయినేడాది సంక్రాంతికి అల్లించిన పొడవాటి ముత్యాల దండ వేసుకోమంది. "అబ్బా.. వద్దమ్మా.. ఇంత పెద్ద దండ పొట్ట దాకా వచ్చి చక్కిలిగింతలొస్తాయి. నేను వేసుకోనమ్మా.." అని గారం చేస్తుంటే ఇంతలో చిన్నత్త వచ్చి "అలా అంటే ఎలాగే అమ్ములూ.. రేపు పెళ్ళయ్యాక చక్కిలిగింతలు అని చెప్పి పుట్టింటికి పారిపోయి వచ్చేస్తావా ఏంటీ.." అంటూ నా తల మీద మొట్టికాయ వేసింది. చూడమ్మా.. చిన్నత్త రోజూ నన్నెలా వేధిస్తోందో.. అన్నాను అమ్మకి ఫిర్యాదు చేస్తున్నట్టు.. "నేనేమన్నానే రాక్షసీ.. పెళ్ళయ్యాక రోజూ మంగళ సూత్రాలు వేసుకోనంటే మీ అత్తగారు తరిమెయ్యగలరు. అలవాటు చేసుకోవాలమ్మా అని మంచిగా చెప్తుంటేనూ.." అంది. చిన్నత్త మీద పంతం కొద్దీ ముత్యాల దండ వేసుకుని కోపంగా గుడికి వెళ్ళిపోయాను. మేము గుడి నుంచి వచ్చేసరికి నాన్నగారు ఆచారి గారితో మన నిశ్చితార్ధం ముహూర్తం గురించి మాట్లాడుతున్నారు. పై వచ్చే శుక్రవారం బావుందట. పెళ్ళికేమో వైశాఖ మాసంలో ముహూర్తం చూద్దాం అనుకుంటున్నారు. మావయ్య గారికి ఫోన్ చేసి మాట్లాడారు కూడానూ.. అంటే ఇంకో పది రోజుల్లో మళ్ళీ మాకు స్వామి వారి దర్శన భాగ్యం కలిగిస్తారన్నమాట. అన్నట్టు మీకు తెలుసా.. బామ్మ చెప్పింది నిశ్చితార్థం అయితే సగం పెళ్ళి అయిపోనట్టేనంట. అంటే, మీరప్పటికి సగం సొంతమైపోతారన్నమాట!

తెలుసా.. చిన్నత్త అన్నదని కాదు గానీ ఇప్పుడు నాకు మెడలో నుంచి ముత్యాల దండ తియ్యాలనిపించట్లేదు. మీ చేతులతో నా మెడలో మూడు ముళ్ళు వేసే అపురూప క్షణాల కోసం, నన్ను మీకు సొంతం చేసే మంగళ సూత్రాలు నా గుండెలపై నిలిచే మధుర క్షణాల కోసం మురిపెంగా ఎదురు చూస్తున్నాను. నాకు మీరెంత నచ్చారో మొత్తంగా చెప్పాలంటే ఎంత పెద్ద ఉత్తరం రాసినా సరిపోదు. అసలే లెక్కల చదువులు చదివినట్టున్నారు స్వామి వారు... అలవాటులో పొరపాటుగా అలా ఉత్తరంలోని అక్షరాలని లెక్కలు కట్టి నా ప్రేమని బేరీజు వెయ్యకండని మనవి.
మీ రాక కోసం కోటి కన్నులతో ఎదురు చూస్తూ ఉంటాను.

అచ్చంగా మీకే సొంతమైన..
మీ రాధీ