Sunday, December 18, 2011

నిన్నా.. నేడూ..


మల్లె పందిరి చెప్పింది నా మొహంలో ఏదో కొత్త మెరుపు కనిపిస్తోందని..
గులాబీ మొగ్గలు చెప్పాయి నాలో నును సిగ్గు తొంగి చూస్తోందని..
ముద్దబంతి మేలమాడింది మధ్య నేను చూపులతోనే మాట్లాడేస్తున్నానని..
తూగుటుయ్యాల అల్లరి పెట్టింది నేను కళ్ళు తెరిచే నిదరోతున్నానని..
జాబిల్లి ఆట పట్టించింది తనతో పోటీగా వెన్నెల జల్లులు కురిపిస్తున్నానని..
చెల్లి అలిగింది తనకి చెప్పకుండా నాలో నేనే నవ్వేసుకుంటున్నానని..
అందరూ పోగై నన్నింతలా వేధిస్తున్నారని నేనెళ్ళి అద్దంలో మొహం చూసుకున్నానా..
చిత్రం.. ఎప్పటిలా అద్దంలో నేను లేను.. దొంగ నవ్వులు నవ్వుతూ నువ్వే కనిపిస్తున్నావ్!

చేతిలోని పుస్తకం బిక్క మొహమేసింది తనని దాటి ఎక్కడో చూస్తున్నానంటూ..
కొలనులో కలువలు నిలదీశాయి నీ నవ్వులు ఎక్కడ పారేసుకున్నావంటూ..
కంచంలోని ఆవకాయన్నం మరింత ఎరుపెక్కింది తనపై కినుక వహించానంటూ..
నిద్రాదేవి అలిగి దూరంగా వెళ్ళిపోయింది నేను తనని దరి జేరనీయడం లేదంటూ..
ముద్దగా విరిసిన నైట్ క్వీన్ పూగుత్తులు చిన్నబుచ్చుకున్నాయి వాటి ఊసే మరిచానని..
నల్లటి మేఘాలు కమ్మేసి ముసురు పట్టిన ఆకాశం నా ప్రతిబింబంలా ఉన్నావంది..
అందరూ ఒక్కటైపోయి నన్నింతలా నిందిస్తున్నారని నేనెళ్ళి అద్దంలో మొహం చూసుకున్నానా..
చిత్రం.. అప్పటిలా అద్దంలో నువ్వు లేవు.. అక్కడున్న చిన్నబోయిన మోము.. నాదేనా!?


11 comments:

రసజ్ఞ said...

వావ్ చాలా బాగుంది! బొగడ పూల సువాసనలు వెదజల్లుతూ విరజాజుల మాల తలలో తురుముకున్నట్టు, మధుమాలతి, గిన్నెమాలతి పూల పరిమళంలో సేద తీరుతున్నట్టు ఉంది!

గీతిక బి said...

సుతారంగా స్పర్శిస్తూనే... దిగులుని మిగిల్చింది.. మీ మధుమోహన రాగాల భావతరంగిణీ.

చాలా బావుంది. నిన్నా నేడే కాదు, బ్లాగ్ టెంప్లేట్ కూడా.

మౌనముగా మనసుపాడినా said...

nice

సుభ/subha said...

చాలా బాగుందండీ భావన...

వేణూశ్రీకాంత్ said...

Good One... బాగా చెప్పారు..

వేణూశ్రీకాంత్ said...

I meant బాగారాశారు ఇక్కడ పక్కనతనితో బాగాచెప్పారు అని అంటూ అదే కామెంట్ లో రాసేశా :-P

kastephale said...

బాగుంది.

Unknown said...

కంచంలోని ఆవకాయన్నం మరింత ఎరుపెక్కింది...
బాగుందండీ...
మంచంపైన నిద్రాదేవి పరుపు దిగిపోయింది...
...సరదాకి మీ లైన్ కి ప్రాస ట్రై చేశాము.... ;)

జ్యోతిర్మయి said...

పున్నమి...అమావసి

మధురవాణి said...

@ రసజ్ఞ,
నేను రాసిందేమో గానీ మీ వ్యాఖ్య మాత్రం ఘుమఘుమలాడుతూ భలే ఉందండీ.. బోల్డు ధన్యవాదాలు.. :)

@ గీతిక బి,
అయితే పోస్టూ, టెంప్లేట్ రెండూ బావున్నాయంటారు.. థాంక్యూ థాంక్యూ.. :)

@ మౌనముగా మనసు పాడినా, సుభా, కష్టేఫలే,
స్పందించినందుకు ధన్యవాదాలండీ.. :)

మధురవాణి said...

@ వేణూ శ్రీకాంత్,
చూస్తున్నా చూస్తున్నా.. ఈ మధ్య పరధ్యానం ఎక్కువైపోతోంది మీకు.. :)))))
Thanks for the comment!

@ చిన్ని ఆశ,
హహ్హహః.. బాగుందండీ మీ ప్రాస.. థాంక్యూ.. :)

@ జ్యోతిర్మయి,
ఊ.. అంతేగా మరి! పున్నమి వెంట అమావాస్య, అమావాస్య వెంట పున్నమి రాక మానవుగా.. :)