Friday, December 09, 2011

మార్పూ.. మనసూ!




ఇన్నేళ్ళల్లో బస్టాపులో నిలబడి ఎన్నిసార్లు బస్ కోసం ఎదురు చూసానో! అలా ఎదురు చూపుల్లో నుంచి అలవాటుగా ఆలోచనల్లో జారిపోయి పరధ్యానంలో బస్ మిస్సయిన రోజులు ఎన్నో! ఊరి సముద్రం.. ఇన్నేళ్ళుగా తన కెరటాల చప్పుడులో వినిపించే, నాకు మాత్రమే అర్థమయ్యే వింత భాష.. మళ్ళీ ఎన్నాళ్ళకి వినగలనో! వీధీ, ఇల్లూ వాకిలీ.. ఎంతగా అలవాటైపోయాయో.. నేనే ఆలోచనల్లో ఉన్నా నా ప్రమేయం లేకుండానే పాదాలు వాటంతట అవే ఇల్లు చేర్చేస్తాయి. మేడ మెట్లు ఎన్ని వందల సార్లు ఎక్కీ దిగి ఉంటానో కదా! నాకు బాగా అలవాటైన కాలింగ్ బెల్ అరుపు, వీధి గుమ్మం తలుపు.. దీనికి ఆనుకుని ఎన్ని సాయంత్రాలు తన కోసం ఎదురు చూస్తూ ఎన్నెన్ని ఊసుల మాలలల్లానో! బాల్కనీలో నించుని పదే పదే వీధి మొగ వైపే చూస్తూ పిల్లలు స్కూల్ నుంచి ఇంకా రాలేదేమని ఆదుర్దాగా ఎన్ని మాట్లు పచార్లు చేసానో! ఇక్కడ వంట గది కిటికీ ముందు నించుని బయట కనిపించే పచ్చటి చెట్టుని చూస్తూ ఎన్ని వేనవేల ఆలోచనల్లో విహరించానో! ప్రతి రోజూ చెట్టు కొమ్మలపై వచ్చి వాలే చిన్ని చిన్ని గువ్వపిట్టలతో కలిసి ఎన్నెన్ని ఊసులు కలబోసుకున్నానో! ఏంటో.. ఉన్నట్టుండి దేన్నైనా వదిలేసి వెళుతుంటే, బాగా అలవాటైపోయిన వాటికి దూరమైపోతుంటే అప్పటికప్పుడు ఉన్నట్టుండి అన్నీటి మీదా విపరీతమైన ప్రేమ పొంగుకొచ్చేస్తుంది కదా! లేకపోతే వీటన్నీటి మీదా నాకింత ప్రేముందని నేనెప్పుడూ గుర్తించలేదేమో! ఇన్నేళ్ళూ చాలా మాములుగా చేసిన రోజు వారీ పనులన్నీ రోజెందుకో చాలా ప్రత్యేకంగా అపురూపంగా అనిపిస్తున్నాయి.

అయినా అసలు 'మార్పు' అన్న మాట వింటే చాలు.. మనసుకి ఎందుకో అంత ఉలికిపాటు! అప్పుడే కొత్తగా పరిచయమైన రోజునేమో నువ్వెవరివో పరాయివన్నట్టు, నీతో నాకేంటి అన్నట్టు కళ్ళెగరేసి పొగరుగా చూస్తుంది. రోజుల పేజీలు తిప్పేస్తూ పోయిన కొద్దీ తనకే తెలీకుండా బోల్డంత మమకారం పెంచేసుకుని 'నువ్వంటూ రాక మునుపు నేనెలా ఉన్నానో' అన్న స్పృహే కోల్పోతుంది. విధిగా కాలం చల్లే మత్తులో చిక్కుకుపోయిన అదే మనసు 'నువ్వు లేకపోతే అసలు నేనెలా మనగలనూ?' అంటూ అమాయకంగా ప్రశ్నిస్తుంది. సరిగ్గా అప్పుడే 'మార్పు' అనివార్యం, అవసరం, నిరంతరం.. అంటూ విధో, తలరాతో, దైవమో, దెయ్యమో తెలీదు గానీ ఉన్నపళంగా మనని ఎత్తుకెళ్ళి మళ్ళీ ఒక సరికొత్త ప్రపంచంలో పడేస్తుంది. ముందు నాలుగు రోజులు.. ఉదయం కళ్ళు తెరిచిన క్షణం కనిపించే సూర్యుడి దగ్గర నుంచీ, రాత్రి పూట జో కొట్టి నిదుర పుచ్చే జాబిలీ దాకా ఏవీ పట్టాన నచ్చవు. ఇవన్నీ ఇన్నాళ్ళూ నేను స్నేహం చేసిన నా నేస్తాలు కాదు. మా ఊర్లో జాబిల్లే నాక్కావాలీ.. ఇదేదో కొత్త లోకం నాకేం బాగాలేదు.. నా పాత లోకమే నాక్కావాలి అని మొండిగా ఎదురు తిరిగి మారాం చేస్తూ ఉంటుంది వెర్రి మనసు.

కానీ, కాలం చేసే మాయని తప్పించుకోగల సమర్థత తనకెక్కడిదీ! తనలో వస్తున్న కొత్త మార్పుని తానే గుర్తించలేనంత అలవోకగా మెలమెల్లగా కొత్త ప్రపంచానికి అలవాటు పడిపోయి మళ్ళీ విధిగా కొత్త బంధాలు పెనవేసుకుపోతూ ఉంటుంది. అప్పుడప్పుడూ తలవని తలంపుగా గత స్మృతుల మేఘాలు మెరిసి జ్ఞాపకాల జడివాన కురిసి మనసుని పన్నీటి జల్లుల్లోనో, కన్నీటి జల్లుల్లోనో తడిపేసి పోతాయి. కానీ, ఎక్కడా క్షణమైనా కాలు నిలపక మనని సైతం తనతో పాటు పరుగులు తీయమంటూ హడావిడి పెట్టేసే ఆత్రం కాలం సొంతం కదా! నిమిషమైనా నిలువనీక అలా అలా ముందుకి పద పదమంటూ నిత్యం తరుముతూనే ఉంటుంది. అలా పరుగులు తీస్తూనే అక్కడక్కడా మన దారిలో గబగబా చేతికందిన జ్ఞాపకాల జాజిపూలని గట్టిగా గుప్పిట చిక్కించుకుని, జాజిపూల పరిమళాల్ని గుండెల్లో భద్రంగా దాచుకుంటూ ముందుకి.. మును ముందుకి సాగిపోడమే! అప్పుడప్పుడూ వెనక్కి తిరిగి చూడాలనిపిస్తుంది. అంతలోనే ఏదో సంశయం.. నేను చాలా దూరం నడిచి వచ్చేశానేమోనని! కొంచెం తటపటాయిస్తూనే మెల్లగా వెనక్కి తిరిగి చూస్తే నాకెంతో ప్రియమైన పూదోటలు కనుచూపు మేరలో కనిపించవు.. తరచి తరచి చూస్తే ఆకాశం కౌగిట్లో ఒదిగిన దూరపు కొండల్లా మసక మసగ్గా కనిపిస్తాయి. అంతలోనే కళ్ళల్లో నీళ్ళు నిండిపోయి దృశ్యం అంతా మరింత ముద్దైపోయి చూపు మసక బారుతుంది. ఇంతలో ఎక్కడి నుంచో నవ్వుల గలగలలు వినిపించి నా వెనకచూపుని మరల్చి ముందుకి చూడవోయ్ అంటూ పిలుస్తాయి. నవ్వుల తెరల్లో వీచే క్రొంగొత్త స్నేహ సమీరాలు నా తడి కళ్ళని ఆప్యాయంగా తడిమి నా పెదవులపై చిరునవ్వులు పూయిస్తాయి. నా ఎద లోతుల్లో పదిలంగా దాగి ఉన్న ఆనాటి జాజిపూల పరిమళాల్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూనే ఉంటాయి!

వైశాఖం మోసుకొచ్చే మరుమల్లెల సుగంధాలు, శ్రావణ మేఘాలు విసిరే విరిజల్లులూ, శారద రాత్రుల్లో విరిసే వెన్నెల మెరుపులూ, హేమంతంలో తరువులు చిత్రించే వర్ణసమ్మేళనాలు, శిశిరంలో మదిని మత్తెక్కించే మంచు మురిపాలు.. మార్పు అంటే ప్రకృతి సొంపుగా చిత్రించే కాలాలన్నీటి రంగుల కలబోతేగా! మన జీవితమూ అంతేనేమో!

* నా ప్రియ 'నేస్తం' కోసం.. ఇష్టంగా మురిపెంగా..!

30 comments:

nestam said...

ఊ..ధ్యాంక్స్ అనే పదం చిన్నదయిపోయినా అంతకు మించిన పెద్ద పదం తట్టడంలేదు మధు..లవ్ యూ

శశి కళ said...

yenta baagaa vraasaavu madhura...
kannayyaki vaalla ama premato tinipinchina goru muddalla unnayi
nee palukulu

లలిత (తెలుగు4కిడ్స్) said...

"ఇన్నేళ్ళూ చాలా మాములుగా చేసిన రోజు వారీ పనులన్నీ ఈ రోజెందుకో చాలా ప్రత్యేకంగా అపురూపంగా అనిపిస్తున్నాయి." మీ స్నేహితురాలి మనసులోని ఈ భావన ఇలా ఊహించి వ్రాయగలిగారో :) బావుంది. మారే ముందు పాతదే ఎంత కొత్తగా అనిపిస్తుందో, నాకూ ఈ మధ్యే అనుభవమయ్యింది.

నేస్తం said...

అబ్బా ప్రతి లైను మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేలా ఉంది..మనసును చదివేసావ్..

జ్యోతిర్మయి said...

"గబగబా చేతికందిన జ్ఞాపకాల జాజిపూలని గట్టిగా గుప్పిట చిక్కించుకుని, ఆ జాజిపూల పరిమళాల్ని గుండెల్లో భద్రంగా దాచుకుంటూ" అత్భుతమైన భావవ్యక్తీకరణ..చాలా బావుంది మధుర గారూ..

శ్రీనివాస్ said...

షరామామూలుగా భావుకత్వం పొంగిపోర్లింది

మాలా కుమార్ said...

చాలా బాగా రాసావు మధు .

sunita said...

కనీసం ఓ ఐదు సార్లు ఈ బాధ అనుభవించి ఉంటాను మధూ! చాలా బాగా చెప్పావు.

శిశిర said...

రూపమే లేని మనసుకి అక్షరాలతో రూపునిచ్చే శిల్పివి అనిపిస్తావు మధురా నువ్వు నాకు.

రాజ్ కుమార్ said...

................

Sriharsha said...

అయినా అసలు 'మార్పు' అన్న మాట వింటే చాలు.. మనసుకి ఎందుకో అంత ఉలికిపాటు! అప్పుడే కొత్తగా పరిచయమైన రోజునేమో నువ్వెవరివో పరాయివన్నట్టు, నీతో నాకేంటి అన్నట్టు కళ్ళెగరేసి పొగరుగా చూస్తుంది. రోజుల పేజీలు తిప్పేస్తూ పోయిన కొద్దీ తనకే తెలీకుండా బోల్డంత మమకారం పెంచేసుకుని 'నువ్వంటూ రాక మునుపు నేనెలా ఉన్నానో' అన్న స్పృహే కోల్పోతుంది
Hmm chala bhaga chepparu ....

Unknown said...

నిన్న నేటికన్నా ఎప్పుడూ మధురమే, జీవితంలో కలిగే మార్పులలో ఎన్నిటితోనో మనసు బంధం పెంచుకుంటుంది. చదువుతున్నంతసేపూ మనసుని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. ఎప్పటిలా మీ రచన అద్భుతం "మధుర వాణి" గారూ!

కొత్తావకాయ said...

చాలా బాగుంది మధురవాణి గారూ! రంధ్రాన్వేషణ అనుకోకండి కానీ, చంద్రిక అంటేనే వెన్నెల కదా.. "శరచ్చంద్రిక వెదజల్లే వెన్నెల మెరుపులు.."

రసజ్ఞ said...

ఊ బాగా వ్రాశారు! ఊ అద్భుతంగా వ్రాశారు! ఊహూ అసామాన్యంగా వ్రాశారు!

లత said...

చాలా బావుంది మధురా

nirmal said...

Manasukavi madhuravani Garu.superb

Balu said...

జ్నాపకాల పందిరిలో జాజిపూల ఊసులన్నీ వెన్నెల వాకిట్లో విరబూసినట్టుగా...అధ్బుతంగా చెప్పారు.

వేణూశ్రీకాంత్ said...

నువ్వును మీరు తో రిప్లేస్ చేసుకుని శిశిర గారి కామెంట్ మళ్ళీ చదువుకోండి. చాలా బాగారాశారు.. మార్పుతో డీల్ చేసిన ప్రతి ఒక్కరికి అరే ఇవి నా ఫీలింగ్సే అనిపించేలా.

Chandu S said...

మరీ అంత దగ్గరగా ఒచ్చి చెప్తారే?
బాగా చెప్పగలనన్న అహంకారం కాకపోతే!

నిషిగంధ said...

మధురా, నువ్వు నేస్తం ఇంట్లో రెండ్రోజులు ఉండి వచ్చావా!?!? తన పరిస్థితిని ఇంతలా మనసుకి పట్టించుకుని అక్షరాల్లో పెట్టావ్!! చాలా బావుంది! :-)

కొత్తావకాయ said...

Bravo!!! :)

ఏకాంత్ said...

When I shared this article with one of my friend...here is the paravasam she replied to me. This reply belongs here so posting it here. Please excuse me for not typing in telugu.

Bhavaalu ave aina...naa Padajalam inta paravasanni ivvaledemo...

Really thanks for this article...

Naa voohalake madhura tana ink to dressed up anipinchindi.. Language is the dress of thought kabatti...

And I came to know something we all know but pretend to ignore is.. I am not the only one with these thoughts..

kiran said...

షరామామూలుగా భావుకత్వం పొంగిపోర్లింది :))
kekaa :)

పద్మవల్లి said...

మధురా.. మళ్ళీ ఇంకోసారి... మనసులో దూరి చూసినట్టు ఎంత బాగా వర్ణించావో, వీడ్కోలు బాధ, బెంగ. అది నాకు బాగా తెలుసు. ఈరోజు వరకు అక్కడున్న చెట్లూ, పుట్టలూ, మనుషులూ, ప్రాణం ఉన్నవీ లేనివీ అన్నీ అలాగే ఉంటాయి, కానీ రేపటి నుండీ మనం మాత్రమే అక్కడ ఉండం అన్న ఫీలింగ్..హుమ్..
మనం అక్కడ ఉండం అన్నదా, లేక మనం లేక పోయినా అందరూ అలాగే బాగానే ఉంటారు అన్నదా ఎక్కువ బాధ పెట్టేది అనేది నాకెప్పుడూ అనుమానమే.
ఇల్లు, ఉద్యోగం, వూరు ... వదిలింది ఏదైనా గానీ తప్పని,తప్పించుకోలేని ఒక సంధికాలం. ఆ జ్ఞాపకాలు మనల్ని వేదిస్తాయా, ఓదారుస్తాయా అనేది వాటితో మనకున్న అనుబంధాన్ని బట్టి ఉంటుందనుకుంటా.

సరిగ్గా ఇలాంటి పరిస్థితులే కాకపోయినా, కొంచెం ఇలాంటి ఫీలింగ్స్ గురించే, కుప్పిలి పద్మ రాతలు చెప్పాను గుర్తుందా?
"అప్పుడప్పుడూ మనసులో కలిగే బెంగ,: ఇల్లు ఖాళీ చేసి వెళ్ళినప్పుడు, వూరు ఖాళీ చేసినపుడు, మనసు ఖాళీ చేసుకుంటున్నపుడు వుండే బెంగ. ఒక సజీవమైన చలనంలో ఉన్నా జీవిత దశను అటక మీదకి ఆల్బంలోకి సర్దేస్తున్నట్టు కలిగే బెంగ."
"గడిచి వచ్చిన జీవితాన్ని, ఎప్పుడైనా నెమరువేసుకుంటే, మనం దాటి వచ్చిన మజిలీలు, మార్చుకున్న దారులు తియ్యటి జ్ఞాపకాలుగా గుర్తొస్తాయి."

మధురవాణి said...

@ నేస్తం,
ఉహూ.. నాకు థాంక్స్ వద్దు.. లవ్ మాత్రం చాలు.. అదొక్కటీ తీసుకుంటాలే! ;)
కాసేపు పరకాయ ప్రవేశం చేసి నీ మనసులోకి వచ్చేసి రాసాన్లే.. :))))
హమ్మయ్యా.. నీకు నచ్చిందిగా.. నేను హ్యాపీ.. :)

@ శశి కళ,
అబ్బా.. మీ కామెంట్ కి సూపర్ లైక్ అండీ శశి గారూ.. మరి కృష్ణప్రేమతో పోల్చి చెప్పారుగా.. అందుకనన్నమాట! థాంక్యూ థాంక్యూ.. :)

@ లలిత,
అంటే, ఇలాంటి పరిస్థితి మనమూ ఎప్పుడో ఒకసారి ఎదుర్కొనే ఉంటాం కదా.. అదీ గాక స్నేహితురాలి మనసు మనకి తెలీకుండా ఉంటుందా. అందుకని ఇలా అలవోకగా రాయగలిగానేమో! ధన్యవాదాలండీ.. :)

మధురవాణి said...

@ జ్యోతిర్మయి, మాలా కుమార్,
ధన్యవాదాలండీ.. :)

@ శ్రీనివాస్, కిరణ్..
అన్నా చెల్లెళ్లిద్దరూ పొగిడారా, వెక్కిరిస్తున్నారా.. ఆయ్!
థాంక్యూ.. :))

@ సునీత గారూ,
హుమ్మ్.. ఐదు సార్లా.. :(
ఉన్న చోటు మారిన ప్రతీసారీ మళ్ళీ కొత్తగా ఇదే మొదటిసారన్నట్టు ఈ బాధ అనుభవిస్తూనే ఉంటాం కదా!
థాంక్యూ!

@ శిశిర, వేణూ..
ఇదిగో పిల్లలూ.. మీరిద్దరూ కలిసి ఎంచక్కా నన్నిలా పొగిడేసి వెళ్ళిపోయారు. నేనేమో అప్పటి నుండి మబ్బుల్లో విహరిస్తూనే ఉన్నాను.. మర్యాదగా వచ్చి నన్నిప్పుడు నేల మీదకి దించండి.. :D
Thank you so much my dear friends! :)

మధురవాణి said...

@ రాజ్ కుమార్,
ఆ చుక్కల భావమేమి రాజకుమారా.. :)

@ హర్ష భారతీయ,
ధన్యవాదాలండీ! :)

@ చిన్ని ఆశ గారూ,
నిజమేనండీ.. బాగా చెప్పారు.. నిన్న నేటికన్నా ఎప్పుడూ మధురమే..
నేను రాసింది మీకు నచ్చినందుకు సంతోషం.. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. :)

@ రసజ్ఞ గారూ,
హహ్హహ్హా.. ఊ ఊహూ భాషలో మెచ్చుకున్నారన్నమాట నన్ను.. థాంక్యూ థాంక్యూ.. :))

@ లత గారూ,
ధన్యవాదాలండీ! :)

మధురవాణి said...

@ కొత్తావకాయ గారూ,
చా.. అలా ఎందుకనుకుంటానండీ! కాస్త హడావుడిలో రాసానేమో.. పొరపాటు దొర్లిందని చూసుకోలేదు. సరిదిద్దినందుకు బోల్డు ధన్యవాదాలు. :)

@ నిర్మల్ గారూ,
అయ్య బాబోయ్.. నాకంత అర్హత లేకపోయినా కాసేపు మీ ప్రశంస చూసి మునగచెట్టు చిటారు కొమ్మల దాకా వెళ్ళిపోయానండీ.. థాంక్యూ సో మచ్.. :))

@ బాలు,
అబ్బ.. ఒకే వాక్యంగా ఎంతందంగా వ్యక్తీకరించారండీ.. సూపర్! బోల్డు ధన్యవాదాలు.. :)

@ చందు S,
How sweet! మీ కామెంట్ చూసి మురిసి ముక్కలైపోయానంటే నమ్మండి... :D
మీరు పోస్టులే కాదు కామెంట్స్ కూడా బ్రహ్మాండంగా రాస్తారన్నమాట.. :))) ఎప్పటికీ గుర్తుండిపోతుంది మీ కామెంట్.. థాంక్యూ సో మచ్! :)

మౌనముగా మనసుపాడినా said...

బాగుంది

మధురవాణి said...

@ నిషిగంధ,
హహ్హహ్హా నిషీ.. అవును.. మొన్నామధ్య రహస్యంగా కలలో వెళ్ళి నేస్తం వాళ్ళింట్లో రెండ్రోజులు ఉండి వచ్చానుగా! ;) :D
థాంక్యూ సో మచ్ డియర్.. :)

@ ఏకాంత్,
మీకూ, మీ స్నేహితురాలికీ బోల్డు ధన్యవాదాలండీ.. ఈ విషయంలో మనందరి భావాలు దాదాపు ఒకటేనన్నమాట.. Nice to hear from you and your friend! :)

@ పద్మవల్లి,
హుమ్మ్.. నిజమే.. రేపటి నుంచీ అన్నీ అలాగే ఉంటాయి కదా ఒక్క మనం తప్ప.. :(
మీరు చెప్పిన రెండు విషయాలూ బాధ పెడతాయనుకుంటాను.. జ్ఞాపకాలు వేధిస్తాయా ఓదారుస్తాయా అంటే.. హుమ్మ్.. అన్నీ రకాల జ్ఞాపకాలూ ఉంటాయిగా మరి!

కుప్పిలి పద్మ గారి expression సూపర్ కదా అసలు! ఆ వాక్యాల్ని నా బ్లాగ్ముఖంగా మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసినందుకు బోల్డు థాంకులు మీకు.. :))

@ మౌనముగా మనసు పాడినా,
ధన్యవాదాలండీ.. :)