ఊ.. బెంగగా ఉంది.. చాలా బెంగగా ఉంది.. నువ్వు చాలా గుర్తొస్తున్నావ్.. నువ్వు తప్ప వేరే ఇంకేం గుర్తుండటం లేదు తెలుసా! అబ్బబ్బా.. అసలు నీతో వచ్చిన చిక్కే ఇది. వద్దు వద్దని పట్టి ఆపాలని ప్రయత్నించే కొద్దీ ఇంకా ఇంకా ఎక్కువ గుర్తొచ్చేస్తుంటావ్.. అసలెందుకిలా? హుమ్మ్.. ఇప్పటికి ఈ ప్రశ్న వెయ్యి సార్లయినా వేసుకుని ఉంటాను. కానీ ఏం లాభం.. ఎంతగా తర్కించుకున్నా సమాధానమే తోచదు ఎంతకీ.
నీ ఆలోచనలు నన్నొదిలి పోవా కాసేపైనా! నువ్వు పరిచయమైన కొత్తలో ఇంత పిచ్చిగా నీ మోహంలో పడి కొట్టుకుపోతుంటే.. ఏదోలే మహా అయితే నాలుగు రోజులు వేధిస్తావ్.. ఆ తర్వాత మాములైపోతాను కదా అనుకున్నా. కానీ, ఎక్కడా.. ఈ పిచ్చి రోజు రోజుకీ పెరిగేదే గానీ తగ్గేది కాదేమోననిపిస్తోంది. నీకు నవ్వొస్తోంది కదూ! అసలు అలా ఎలా ఉండగలవ్ నువ్వు.. మాటలన్నీ లోపలే దాచేసుకుంటే అవన్నీ గొంతులో అడ్డం పడిపోతున్నట్టూ.. ఊపిరి తీసుకోడానికి ఇబ్బంది పడిపోతున్నట్టు ఉండదా నీకు? చాలా చిత్రమైన అబ్బాయివి అసలు నువ్వు.. అన్నీటికీ నవ్వేనా సమాధానం? అసలా కళ్ళల్లో ఏదో వింత మెరుపు ఉంటుంది.. చూసీ చూడగానే మాయలో పడేస్తుంది. నేనింతలా రోజుల తరబడి నీ ఊసే తలచుకుంటూ నీ కోసం పిచ్చిగా ఆరాటపడిపోతుంటానా.. నువ్వేమో తీరిగ్గా ఎప్పటికో కనిపించి మహా తేలిగ్గా చిన్ని నవ్వొకటి నా మీద విసిరేసి నీ చూపులతో మాయ మంత్రం ఒకటి వేసి నేనలా మైకంలో ఉండగానే చక్కా జారుకుంటావు.. పెద్ద మాయగాడివి నువ్వసలు!
ఛా.. ఎంతసేపటికీ నా పిచ్చి ఆరాటమే గానీ ఈ అబ్బాయికి బొత్తిగా ఏం పట్టదు. కనిపించి రెండ్రోజులైనా, వారం రోజులైనా ఏ మాత్రం బెంగే వినిపించదు ఆ గొంతులో. నన్ను మిస్సయ్యానన్న భావమే ఉండదు ఆ కళ్ళల్లో. పైగా, నా ఆరాటాన్ని మాత్రం కనిపెట్టేసి "దొరికిపోయావుగా.." అన్నట్టు ఆ దొంగ నవ్వొకటి. అలా నవ్వుతుంటే ఎంత ఉక్రోషం వచ్చేస్తుందనీ.. వెంటనే ఉన్న పళంగా చొక్కా పుచ్చుకు కిందకి లాగి తల వంచేసి పొందిగ్గా దువ్విన క్రాఫ్ అంతా చెరిపెయ్యాలనిపిస్తుంది. కానీ.. అంతలోనే తన చురుకైన చూపుల గీతని దాటలేకపోతున్నట్టు ఒక చిన్న తటపటాయింపు. సిగ్గో, బిడియమో, మొహమాటమో.. అన్నీ కలగలిసిపోయిన ఒక వింత భావన మనసంతా కమ్మేసి అడుగు ముందుకి పడనీయదు.
ఏంటో ఈ అబ్బాయి మీద ఇష్టమో, మోహమో, ప్రేమో, ఆరాధనో అర్థం కాదు. ఒకోసారి నేనూ, తనూ వేరు కాదేమో అనిపిస్తాడు. అద్దంలో కనిపించే ప్రతిబింబం మాదిరి మా ఇద్దరిలోనూ దాగున్నది ఒకటే ఆత్మేమో అనిపిస్తుంది. తనతో ఏదైనా పంచుకోగలనన్నంత దగ్గరితనం, చనువూ ఉన్నాయనిపిస్తుంది. అంతలోనే అల్లరి చేస్తున్న చిన్ని పాపాయిని కళ్ళతోనే చిన్నగా భయం చెప్పి హద్దుల్లో ఉంచుతున్న భావన, అంతలోనే గుండెల మీదకి అక్కున చేర్చుకుని నులి వెచ్చని నిశ్చింతని అందించే అనునయం, అంతలోనే ఉన్నట్టుండి సుడిగాలిలా చుట్టేసి ఊపిరాగిపోయేలా ఉక్కిరిబిక్కిరి చేసేస్తూ బిగి కౌగిలిలో బంధించేసే దుడుకుతనం.. రామచంద్రా.. ఇతగాడు నాకు అర్థం కాడు కదా!
అంతసేపూ ఉండీ ఉండీ ఉన్నట్టుండి వెళ్ళిపోతానంటాడు. వేళ కాని వేళలో అకస్మాత్తుగా ప్రత్యక్షమైపోయి ఆశ్చర్యంలో ముంచేస్తాడు. నేను తెప్పరిల్లేలోగానో మళ్ళీ అంతలోనే వీడిపోతాడు. ఎదురు చూపుల్లో రాత్రీ పగలూ తేడా లేకుండా భారంగా కదులుతుంటాయి. ఒకోసారి అసలిదంతా కేవలం నా పిచ్చే గానీ అతగాడికి ఏమీ పట్టదేమోననిపిస్తుంది. ప్రతీ క్షణం నిన్నెంత తల్చుకుంటున్నానో తెలుసా, నీ కోసం నేనెంత ఎదురు చూస్తున్నానో తెలుసా, నిన్నెంత మిస్ అవుతున్నానో తెలుసా అని తనకి చెప్పాలనిపిస్తుంది. అసలు ఈ సారి కంటికెదురు పడగానే మూతి బిగించి తల పక్కకి తిప్పేసుకుని అలిగెయ్యాలి. నన్నిలా కష్టపెడితే ఊరుకునేది లేదని గట్టిగా చెప్పాలి. ఉహూ.. తన మొహం చూస్తూనే ఆ పంతాలన్నీ పెదవి చాటునే ఆగిపోతాయి. నా పట్టుదలంతా ఎక్కడికి పారిపోతుందో అర్థం కాదు. ఎంతలా అనుకుంటానో.. ఇతగాడి మీద నుంచి ధ్యాస మళ్ళించుకోవాలి.. ఎందుకిలా బెంగని పెంచి పోషించడం అని. కానీ అదేంటో, తన కోసం బెంగపడటం కూడా బావుంటుందనిపిస్తుంది. పట్టుమని పది నిమిషాలైనా సరే ఎవరి కోసమైనా ఎదురు చూడాలంటే మహా చిరాకు పడిపోయే నేను ఎన్ని రోజులైనా క్షణక్షణాన్ని అపురూపంగా లెక్క పెట్టుకుంటూ తన పలకరింపు కోసం ఎదురు చూడటం నాకే నమ్మశక్యంగా లేదసలు. ఎందుకో ఎంతగా ఎదురు చూస్తున్నా అస్సలు విసుగే రాదు.. పైగా చాలా మురిపెంగా ఉంటుంది కూడానూ! అంతదాకా ఎంత పంతమూ పట్టుదలా ఉంటాయో ఒక్కసారి తను ఎదురుపడి అలా నాకేసి చూస్తూ నవ్వీ నవ్వగానే ఆ పల్చటి నవ్వు తెరల్లో నా బెట్టు, బింకం, మొండితనం, నా నిర్ణయాలూ.. మొత్తం అన్నీ వర్షపు నీటిలో కాగితపు పడవల్లా కొట్టుకుపోతాయి.
హుమ్మ్.. ఎన్నాళ్ళైనా ఈ అబ్బాయి మాయని చేధించలేకపోతున్నానే! పైగా ఈ మాయలో ఉండటమే చాలా ఇష్టంగా తోస్తోంది. ఎవరి ముందైనా సరే కనీసం కనురెప్పలైనా వాల్చని నేను నీ ముందు మాత్రం ఎందుకిలా అయిపోతున్నాను. నేను అన్న స్పృహ పూర్తిగా కోల్పోతున్నాను. ఎందుకిలా నీకు దాసోహమన్నట్టు అయిపోతున్నాను? కానీ, అలా నీ ముందు ఓడిపోవడంలోనూ, నీలో ఒదిగిపోవడంలోనూ ఎంతో సంతోషాన్నీ, సంతృప్తిని అనుభూతిస్తున్నాను. ఎందుకు నువ్వంటే ఇంతిష్టం అని ఎంతగా శోధించినా అంతు పట్టదు. అయినా నా పిచ్చి గానీ ఇష్టాలకి కారణాలుంటాయా.. హేవిటో.. తెలిసిన విషయాలే మర్చిపోతున్న పరధ్యానం, నిన్ను మరచిపోతున్నాననుకుంటూ పదే పదే నీ చుట్టూనే తిరిగే పరవశం.. నా మనసుకి బాగా అలవాటయ్యాయి ఈ మధ్య. సరే.. నా వల్ల ఎలాగూ కావట్లేదు కదా.. అసలీ ప్రశ్నలన్నీ నీ ముందు ఉంచితేనో.. ఏముందీ.. మళ్ళీ ఒక చిన్ని నవ్వే బదులుగా వస్తుంది నీ నుంచి.. ఏదీ సరిగ్గా చెప్పవేం అసలు.. హుమ్మ్.. అయినా అసలు ఆ చెప్పీ చెప్పకుండా చెప్పినట్టు చెప్పకపోవడంలోనే ఉందనుకుంటా నీ మాయంతా.. దొంగ పిల్లోడా!
ఒక్క రోజంతా నువ్వు కనపడకపోతే ఎన్నో యుగాలు ఎదురు చూసినట్టనిపిస్తుంది. నను నిమిషమైనా నిలువనీయకుండా నీ నవ్వుల సవ్వడి చెవుల్లో చేరి గిలిగింతలు పెడుతూ మరింత కంగారు పెట్టేస్తుంది. నువ్వు కనిపించగానే చాలా చెప్పాలనుకుంటానా.. నీ అడుగుల చప్పుడు వినీ వినగానే నా మాటలన్నీ గొంతులో నుంచి పొట్టలోకి జారుకుని చక్కిలిగింతలు పెట్టేస్తుంటాయి. మెరిసే ఆ కళ్ళలోకి చూస్తూ నిలిచిపోవాలనిపిస్తుంది. నీ అరచేతిలో ఒదిగిపోయిన నా చేతి వేళ్ళకేసి చూస్తుంటే నీ స్పర్శ తాలూకు వెచ్చదనం గుండెల్లోకి ప్రవహిస్తున్నట్టుంటుంది. మెల్లమెల్లగా నను మోహం కమ్మేస్తున్నట్టుంటుంది. ఎన్ని వేల సార్లైనా మళ్ళీ మళ్ళీ అదే మాయలో పడిపోతుంటాను అప్రయత్నంగా.. నిస్సహాయంగా!
Monday, November 28, 2011
నువ్వేం మాయ చేసావో గానీ..
Subscribe to:
Post Comments (Atom)
21 comments:
"నవ్వీ నవ్వగానే ఆ పల్చటి నవ్వు తెరల్లో నా బెట్టు, బింకం, మొండితనం, నా నిర్ణయాలూ.. మొత్తం అన్నీ వర్షపు నీటిలో కాగితపు పడవల్లా కొట్టుకుపోతాయి." మధురగారూ భలే పోలిక చెప్పారు.
ఏదో మాటల మత్తు జల్లినట్టుగా ఉంది చదువుతుంటే.అంతే ఇంకేం చెప్పలేను.
chala bavundi
వెన్నెల మాట్లాడినట్టు, సెలయేరు పెదవి విప్పినట్టు,పుప్పోడి పలకరించినట్టు మీ మదురబావాలా తో మమ్మలని మాయ చేస్తున్నారు మీరు.
మాటలకందని భావం కళ్ళలో దోబూచులాడి మనసులో అలానే పదిలమైపోయింది..
చెప్పలేని ఊసు ఏదో పెదవులపై తారట్లాడి తలపులలో కుసుమమైపోయింది..
@వాణి గారు మనసు ఎంత మధన పడుతుందో మొత్తం చెప్పారు - నిజమే ఎంత నమ్మకం వచ్చినా దూరంగా ఉండాల్సివస్తుంది ఒక్కోసారి - ఏదైతేనేం అ పిల్లోడు ఎవరో "ఊహ కావచ్చు నిజము కావచ్చు కలల రాకుమారుడు కావచ్చు " - మీ సవ్వడంతా విని ఈసారి నవ్వు కాకుండా బదులు ఇస్తాడని ఆశిస్తున్నాను - :)
మొదట చదువుతూ నా గురించేనా రాసారు అనుకున్నా తీరా రెండో పేరా చూస్తే హయ్యో హయ్యో ...
భలేగా, చక్కగా, లింగ భేదం లేని పదాలు ఉంటే నేను నా గురించే అనుకుందును కదా హయ్యో ...
సరే లెండి చదువుతూనే మార్చుకుంటూ చదివేస్కున్నా...చాలా బావుంది అనడం కంటే సరిగ్గా(correctgaa) ఉంది..అచ్చు ఇలానే అనిపిస్తుందేమో ఆ time లో!!!!!!!!!!!!!!!
Simply superb....
మిమ్మల్నికెవ్వరూ రక్షించలేరు...:)
హ్మ్మ్... ఏం మాయ చేసావో మధురా. నువ్వు రాసినవన్నీ నాగురించేనా అని అస్తమానూ భుజాలు తడుముకోవలిసి వస్తుంది. :-))
చాలా బావుంది. అచ్చం నా ఆలోచనలు (కొన్నిసార్లేలే, మిగత క్రెడిట్ నీదే), నీ రాతల్లో ...
చాలా చాలా బావుంది మధురా,నిజంగా మీ రచనలతో మాజిక్ చేస్తున్నారు మీరు
మధురవాణి గారూ! నిజంగానే మాయ చేశారు చదువుతున్న కాసేపూ...
నీ ఈ ఊహల ఊసులు చదివాక మళ్ళీ మామూలు ప్రపంచంలోకి వచ్చి అతి మామూలుగా వ్యవహరించాలంటే ఎంత కష్టంగా ఉంటుందో నీకెప్పుడు తెలుస్తుందమ్మాయ్! :)))
Beautiful as usual :-)
@ జ్యోతిర్మయి గారూ,
ధన్యవాదాలండీ.. నాక్కూడా చాలా నచ్చింది ఆ వాక్యం.. :)
@ క్రాంతి గారూ,
చాలా సంతోషంగా అనిపించిందండీ మీ వ్యాఖ్య చూసి.. ధన్యవాదాలు కవి గారూ! :)
@ హర్ష గారూ,
ధన్యవాదాలండీ.. :)
@ రఘు గారూ,
హహ్హహ్హా.. పెద్ద ప్రశంసే ఇచ్చారుగా.. చాలా సంతోషమయింది. ధన్యవాదాలు. :)
@ సుభ గారూ,
అందమైన కవిత అల్లేసారుగా! That's so sweet of you! బోల్డు ధన్యవాదాలండీ.. :)
మా మది మనోగతాల్లో దాగిన ఊసులు...
మీ భావ తరంగాలలో ఊహలు ....
రెండు మిళితమై మీ అక్షరాల సవ్వడిలో
పొందికగా ఒదిగిపోతూ మా మనోగుడిలో
పులకింతలు కలిగిస్తూ ఆకర్షణమైన ఈ మధుర వ్యాఖ్యలుగా రూపుదాల్చేన్...!!!
మధురవాణి గారు
మీ పదాల అల్లిక, వర్ణన బాగున్నాయి
నాకైతే ఏమనిపించిందంటే
మీరు ఒక ప్రేమకథను ఒక నవల రూపం లో
ఇంకా బాగా రాయగలరేమో అనిపించింది.
నాకు మీరు రాసిన వాక్యాలు
ప్రేమకథల్లో వర్ణములలా అనిపించాయి.
క్రాంతికుమార్ గారు చెప్పినట్లు
మాటల మత్తు జల్లినట్టు గా ఉంది చదువుతుంటే..
మధురా చాలా పోస్ట్ లు పెండింగ్ ఉన్నాయి.అన్ని చదివి కామెంట్ పెడతాను.ఇది మాత్రం సూపర్..ఎన్ని వీరతాళ్ళు కావాలో నువ్వే వేసేసుకో
@ కళ్యాణ్ గారూ,
How sweet! బావుందండీ మీ ఆకాంక్ష.. మీ రికమండేషన్ పని చేస్తుందేమో చూద్దాం! :)))
బోల్డు ధన్యవాదాలు.
@ అరుణ్ K,
అయ్యో.. అయ్యో.. అయ్యయ్యో.. అంత పొరపాటు జరిగిపోయిందాండీ నా వల్ల.. అరెరే.. పోనీలెండి అబ్బాయి కోసం రాసింది అమ్మాయికి మార్చేసుకుని చదివేసుకున్నారుగా! నేను రాసింది మీకు అంతగా నచ్చినందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. :)))
@ పద్మార్పిత,
థాంక్యూ సో మచ్! :)
@ స్ఫురిత,
ఏంటండీ అలా చేతులెత్తేశారు? ఇది అన్యాయం కదూ.. సాటి స్నేహితురాలికి చేయందించాల్సింది పోయి ఇలా మునిగిపొమ్మని వదిలెయ్యడం మీకేమన్నా భావ్యమా చెప్పండి అధ్యక్షా.. :)))))
@ పద్మ గారూ..
ఆహా.. మాయా.. నేను చేసానా? (ఒక్కడు సినిమాలో మహేష్ డైలాగ్ ఏమన్నా గుర్తొస్తోందా? ;)
అయితే అప్పుడప్పుడూ మీ మనసులోని మాటల్ని నేను అక్షరాల్లో పెడుతున్నానన్నమాట! :))
అయితే మనిద్దరం సేమ్ పించ్ చెప్పుకుందాం రండి.. థాంక్యూ సో మచ్.. :))
@ లత గారూ, చిన్ని ఆశ గారూ..
హహ్హహ్హా.. మీరూ అదే మాటా.. చాలా ఆనందంగా ఉందండీ నేను రాసింది మీ అందరికీ అంత నచ్చినందుకు.. ధన్యవాదాలు.. :)
@ నిషిగంధ,
అబ్బ.. ఎంత సంబరంగా అనిపించిందో నీ కామెంట్ చూసి.. మురిసి ముక్కలైపోయానంటే నమ్ము.. ప్రతిసారీ మమ్మలనందర్నీ ఏదో మాయ ప్రపంచంలోకి తీస్కెళ్ళే నిషిని కాసేపన్నా నేను మాయ చెయ్యగలిగానంటే హెంత గొప్ప కదా మరి!! I feel honored! థాంక్యూ సో మచ్ మై డియర్ నిషీ... :)))
నువ్వు కనిపించగానే చాలా చెప్పాలనుకుంటానా.. నీ అడుగుల చప్పుడు వినీ వినగానే నా మాటలన్నీ గొంతులో నుంచి పొట్టలోకి జారుకుని చక్కిలిగింతలు పెట్టేస్తుంటాయి. మెరిసే ఆ కళ్ళలోకి చూస్తూ నిలిచిపోవాలనిపిస్తుంది. నీ అరచేతిలో ఒదిగిపోయిన నా చేతి వేళ్ళకేసి చూస్తుంటే నీ స్పర్శ తాలూకు వెచ్చదనం గుండెల్లోకి ప్రవహిస్తున్నట్టుంటుంది. మెల్లమెల్లగా నను మోహం కమ్మేస్తున్నట్టుంటుంది. ఎన్ని వేల సార్లైనా మళ్ళీ మళ్ళీ అదే మాయలో పడిపోతుంటాను అప్రయత్నంగా.. నిస్సహాయంగా!..
beautiful..
చాలా బావున్నాయండి మీ ఊహలు ఊసులు ...
@ సంతోష్ రెడ్డి,
Wow... క్షణాల్లో అందమైన కవిత అల్లేసారే! థాంక్యూ.. థాంక్యూ సో మచ్! :)
@ చైతన్య దీపిక,
మీ ప్రశంస చూసి మురిసి ముక్కలైపోయి అలా మబ్బుల దాకా వెళ్లి వచ్చానండీ.. మీ అభిమానానికి కృతజ్ఞురానిలి.. ఇప్పటికైతే నవల రాయగలిగేంత నేర్పు నాకుందనిపించడం లేదండి. ఏమైనా మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. :)
@ శైలబాల,
హహ్హహ్హా.. అయితే ఎన్ని కావాలంటే అన్ని వీరతాళ్ళు నన్నే వేసేసుకోమంటావా... ప్రస్తుతానికి నీ చేత్తో ఒకటి తీసుకుంటాన్లే.. థాంక్యూ శైలూ.. :)))
@ పల్లవి,
నా ఊహలూ ఊసులూ మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలండీ.. :)
Post a Comment