చాలా చాలా రోజుల తరవాత ఇవాళ నేనొక పాట గురించి రాస్తున్నా నా బ్లాగులో. అసలు పాటల గురించి చెప్పమని నన్నెవరైనా అడగాలే గానీ, ఇహ ఆ తరవాత నే చెప్పేది వినలేక 'ఎందుకు కదిలిచ్చాంరా బాబూ' అనుకోవాల్సివచ్చేలాగా చెప్పుకుంటూ పోతూనే ఉంటాను. ఎందుకంటే పాటలంటే నాకంత ప్రేమ మరి.! నన్ను మురిపించి మైమరిపించే పాటలు ఒకటా రెండా..బోలెడున్నాయి మరి.. అంచేత చెప్పుకుంటూ వెళ్తే చాంతాడంతో.. చైనా వాల్ అంతో అవుతుంది ఆ పాటల లిస్టు. అసలు మీకో సంగతి తెల్సా.? ఈ బ్లాగు మొదలుపెట్టినప్పటి నా ఆలోచన నాకిష్టమైన పాటల గురించిన అనుభూతులు పంచుకుందామనే.. ఒకవేళ నాలా స్పందించే వాళ్ళుంటే.. అది మరింత సంతోషం కదా..! అలా అనుకుని మొదలెట్టాక మొదట్లో చాలా పాటల గురించి రాశాను. ఆ తరవాత నా బుర్రలో పురుగు తిరిగినప్పుడల్లాఏదో ఒకటి రాస్తూ, మీ బుర్రలు తింటూ.. క్రమంగా నా బ్లాగు కాస్తా ఒక కలగూరగంపలా తయారయింది :) సరే.. ఇక సుత్తి ఆపి అసలు సంగతి.. అదే పాట గురించి చెప్పమ్మా.. అనుకుంటున్నారా.? వస్తున్నా.. అక్కడికే వస్తున్నా.. వచ్చేశా :)
ఆ మధ్య (అంటే చాలా రోజుఅల క్రితం అని).. తమిళ్ హీరో సూర్య తండ్రి - కొడుకు పాత్రల్లో నటించిన 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' అనే సినిమా ఒకటి వచ్చింది. మీరు చూసారా.? చాలా మందికి సినిమా పెద్దగా నచ్చలేదు (నాకు తెలిసిన వాళ్ళకి). నాకు మాత్రం తెగ నచ్చేసింది సినిమా. వరుసగా రెండ్రోజుల్లో రెండు సార్లు చూసాను :) కాకపోతే, నేను ఇంట్లో డీవీడీ చూసాను కానీ, అదే సినిమా హాల్లో అయితే కొంత బోర్ కొట్టే అవకాశం ఉంది.. సినిమా నిడివి దాదాపు మూడుగంటలు అవడం చేత. స్థూలంగా సినిమా కథ చెప్పాలంటే.. తండ్రి చనిపోయిన వేళ ఒక కొడుకు తండ్రి తననెలా అడుగడుగునా తోడుగా ఉండి నడిపించాడు అనేది తనకు తాను గుర్తుకు తెచ్చుకుంటూ కథంతా మనకి చెప్తున్నట్టుగా ఉంటుంది. ఈ సినిమా తీయాలనుకునే సమయంలో వాళ్ల నాన్నగారు చనిపోవడం వల్ల దర్శకుడు బాగా కలత చెందారట. ఆ తరవాత 'నాన్నతో ఒక కొడుకుకున్న అనుబంధం' అనే ఈ అంశాన్నే తీసుకుని ఈ సినిమాని తీసారు దర్శకుడు గౌతం వాసుదేవ్ మీనన్. ఈయన గతంలో సూర్య హీరోగా వచ్చిన 'కాక్కా కాక్కా' (తెలుగులో వెంకీ 'ఘర్షణ గా వచ్చింది), మాధవన్ 'చెలి', కమలహాసన్ నటించిన 'రాఘవన్ అనే సినిమాలకి దర్శకత్వం వహించారు. ఇవన్నీ తమిళ సినిమాలే అయినా కూడా తెలుగు అనువాదాలు కూడా విజయవంతమయ్యాయి. ఈ సినిమాలన్నీ కూడా సంగీతపరంగా బాగా ఆకట్టుకున్నాయి. సంగీతదర్శకుడు హారిస్ జయరాజ్, గౌతం మీనన్ కలయికలో వచ్చిన పాటలన్నీ కూడా చాలావరకు బావుండేవే. కానీ, సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా సమయంలో వారిరువురికీ ఏవో అభిప్రాయబేధాలు రావడం వల్ల సమీప భవిష్యత్తులో మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి పని చేసే అవకాశం లేదట.
సరే.. మళ్ళీ ఈ సినిమా విషయానికొస్తే కథానాయకుడు తొలిచూపులోనే ఒక అమ్మాయిని ప్రేమించి చాలా కష్టపడి ఆ అమ్మాయి ప్రేమని పొందుతాడు. దురదృష్టవశాత్తూ ఆ అమ్మాయి చనిపోవడం.. మన కథానాయకుడు విపరీతమైన డిప్రెషన్లోకి వెళ్ళడం జరుగుతుంది. హీరో ఇంటిపక్కనే ఉండే హీరో చెల్లెలి ప్రాణ స్నేహితురాలు స్కూల్ రోజుల్నించే హీరోని ప్రేమిస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి మీద తనకున్న ఇష్టాన్ని హీరో తనకుతాను తెలుసుకుని ఆ అమ్మాయిని స్వీకరించే సమయంలో ఒక పాట వస్తుంది. ప్రస్తుతానికి నేను నేను చెప్పేది ఆ పాట గురించే. 'నిదరే కల ఐనది. కలయే నిజమైనది' అనే పల్లవితో సాగుతుంది పాట. ఇకపోతే ఈ పాట పాడిన అమ్మాయి పేరు సుధా రఘునాథన్. ఈ గాయని పేరు ఇదివరకు నేనెక్కడా వినలేదు. ఇదే మొదటిపాటేమో తెలీదు మరి. ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి కాకపోయినా పాట భావాన్నంతా గొంతులో నింపి ఎంత మధురంగా పలికించిందో ఒకసారి వింటే గానీ అర్ధం కాదు. ఈ పాట సంగీతం కంటే కూడా, గాత్రం మీదనే ఎక్కువ ఆధారపడి ఉంది. పాటలో అంతర్లీనంగా, మృదువుగా సాగిపోతుంటుంది సంగీతం. సినిమాలో కథానాయిక ఎన్నో ఏళ్లుగా హీరోపై ప్రేమని పెంచుకుని, అతని సంతోషాల్నీ, వేదనల్నీ అన్నిటినీ ప్రేమిస్తూ..అతని ప్రేమ కోసం మౌనంగా సాగించిన సుధీర్ఘ నిరీక్షణ అనంతరం..అతని ప్రేమని పొందిన పరవశంలో తన్మయత్వంతో పాడే పాట ఇది. చిత్రీకరణ కూడా చాలా బావుంటుంది. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరు అద్భుతంగా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. నిజంగా జరిగేది చూస్తున్నామేమో అన్న అనుభూతి కలుగుతుంది మనకు. ఈ గొప్పతనం అంతా ఖచ్చితంగా దర్శకుడికే చెందుతుంది.
ఈ సినిమాలో అన్నీ పాటలు బాగానే ఉన్నా, అన్నీటికంటే ఈ పాట నాకు చాలా చాలా నచ్చింది. డబ్బింగ్ పాటలయినా కూడా వేటూరి గారు చాలా కష్టపడి ఒక మంచి రూపు తీసుకొచ్చారు పాటలకు అనిపిస్తుంది మనకి. నిజానికి స్నేహితుడొకరు మొదట ఈ పాట బావుందని చెప్తే..నేను విని 'హమ్మో.. డబ్బింగ్ పాట అని బాగా తెలిసిపోతుంది. నాకు ఎక్కడం కష్టం' అన్నాను. కానీ, సినిమా చూసిన తరువాత పాటలన్నీ తెగ నచ్చేసాయి నాకు. వరుసగా కొన్నిరోజులవరకూ అవే అవే విన్నాను. మీరూ ప్రయత్నించి చూడండి. అన్నట్టూ.. ఈ సినిమా గురించి మరో మాట..జై చిరంజీవ, అశోక్ తదితర చిత్రాల్లో నటించిన బాలీవుడ్ తెలుగమ్మాయి సమీరా రెడ్డి ఈ సినిమాలో ఒక హీరోయిన్. మిగతా సినిమాలు చూసి ఈ సినిమా చూస్తే.. అసలు ఆ అమ్మాయేనా అనే సందేహం వచ్చినా ఆశ్చర్యం లేదు. అంత చక్కగా ఉంటుంది ఆ అమ్మాయి ఈ సినిమాలో. వీలైతే ఈ సినిమా చూడండి. పాటలు మాత్రం తప్పకుండా విని చూడండి. సాహిత్యం క్రింద ఇస్తున్నాను చూడండి.
నిదరే కల ఐనది.. కలయే నిజమైనది..
బతుకే జత ఐనది.. జతయే అతనన్నది..
మనసేమో ఆగదు.. క్షణమైన తోచదు..
మొదలాయే.. కథే ఇలాఆఆఆఆ..
నిదరే కల ఐనది.. కలయే నిజమైనది..
బతుకే జత ఐనది.. జతయే అతనన్నది..
మనసేమో ఆగదు.. క్షణమైన తోచదు..
మొదలాయే.. కథే ఇలాఆఆఆఆ..
వయసంతా వసంత గాలి.. మనసనుకో.. మమతనుకో..
ఎదురైనది ఎడారి దారి.. చిగురులతో.. చిలకలతో..
యమునకొకే సంగమమే.. కడలి నది కలవదులే..
హృదయమిలా అంకితమై.. నిలిచినది.. తనకొరకే..
పడిన ముడి.. పడుచోడి.. ఎద లో చిరు మువ్వల సవ్వడి..
నిదరే కల ఐనది.. కలయే నిజమైనది..
బతుకే జత ఐనది.. జతయే అతనన్నది..
మనసేమో ఆగదు.. క్షణమైన తోచదు..
మొదలాయే.. కథే ఇలాఆఆఆఆ..
అభిమానం అనేది మౌనం.. పెదవులపై పలకదులే..
అనురాగం అనేసరాగం.. స్వరములకే దొరకదులే..
నిన్ను కలిసిన ఈ క్షణమే.. చిగురించే మధు మురళి..
నిను తగిలిన ఈ తనువే.. పులకరించే ఎద రగిలి..
యెదుట పడి కుదుటపడే.. మమకారపు నివాళి లే ఇది..
నిదరే కల ఐనది.. కలయే నిజమైనది..
బతుకే జత ఐనది.. జతయే అతనన్నది..
మనసేమో ఆగదు.. క్షణమైన తోచదు..
మొదలాయే.. కథే ఇలాఆఆఆఆ..
14 comments:
>>
అభిమానం అనేది మౌనం.. పెదవులపై పలకదులే..
అనురాగం అనేసరాగం.. స్వరములకే దొరకదులే..
I like very much the above two lines.
మంచి పాట...
చాలా రోజుల తర్వాత మళ్ళా చక్కని పాటలని మాకు పరిచయం చేస్తున్నారు, అభినందనలు. పాటలో భావం మాత్రం భలేగుంది.
‘‘ఈ పాట పాడిన అమ్మాయి పేరు సుధా రఘునాథన్. ఈ గాయని పేరు ఇదివరకు నేనెక్కడా వినలేదు. ఇదే మొదటిపాటేమో తెలీదు మరి.‘‘
మధురవాణి గారూ, సుధారఘునాథన్ గారు ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు. మీరు వినకపోవడం తప్పేమీ కాదుగానండి, కొత్తమ్మాయేమోనని రాసే ముందు ఒకసారి గూగిలించయినా చూడాల్సింది కదండీ.
@ గణేష్ గారూ,
నాక్కూడా పాటలోని ఈ వాక్యాలు బాగా నచ్చుతాయి :)
@ మురళి గారూ,
:)
@ లక్ష్మి గారూ,
అవునండీ.. భావం వల్లనే పాటకి మరింత అందం వచ్చింది.
@ అరుణ పప్పు గారూ,
'మొదటిపాటేమో' అనడంలో నా ఉద్దేశ్యం.. సినిమా పాటలు పాడటం మొదటిసారేమో.. ఇంతకుముందు ఎప్పుడూ సినిమా పాటల్లో ఆవిడ పేరు, గొంతు విన్లేదు అని మాత్రమేనండీ.!
ఆవిడ గురించి సమాచారం తెలియచేసినందుకు ధన్యవాదాలు.
సుధా రఘునథన్ గారు Morning Raaga అనే సినిమా లొ "Thaaye Yashoda" అనే పాట పాడారు మధురవాణి గారు. మీకు వీలున్నప్పుడు వినండి. చాలా బాగుంటుంది.
నిజంగానే సినిమా బోర్ కొట్టిందండీ ...కధ బాగా సా .....గినట్టనిపించింది .పాట మాత్రం బావుంటుంది .మీరు పరిచయం చేసిన విధానం బావుంది . కొత్తసినిమా రివ్యూ రాయొచ్చు మీరు .
పాట ఇప్పుడే విన్నానండీ దౌన్లొడ్ చెసుకుని...బాగుంది.(i didnt see the movie.)కానీ సుధా రఘునాథన్ గారి గొంతు కర్నాటక సంగీతానికే బాగా సరిపోతుందేమో అనిపించింది.ఆవిడ సుప్రసిధ్ధ కర్నాటక విద్వాంసురాలు.క్లాసికల్ సింగర్స్ తొ సినిమా పాటలు పాడించటం పాత ప్రయోగమే అయినా "మనొహరా.." పాటను బోంబే జయశ్రీ గారితొ పాడించినప్పటి నుంచీ,అది బాగా హిట్ అయినప్పటినుంచీ ఈ ప్రయోగాలు ఎక్కువైపొయాయి.కాని కొందరి గొంతులు కొన్నింటికే సరిపొతాయి అనిపిస్తుంది నాకైతే! నేనూ పాటల పిచ్చిదాన్నే.బాగుంటే చాలు.పాత కొత్త అని లెదు.అన్ని వినేస్తాను.
మధురవాణి గారు మంచి పాటను పరిచయం చేశారు. నేను నిజజీవితానికి దగ్గరగా ఉన్న సినిమాలు చూడను (అంటే అన్ని తెలుగు సినిమాలు చూస్తాను అని అన్నమాట) ఇలా డబ్బింగు సినిమాలు ఎవరన్నా బాగుంది అంటే దాని నిజభాషలో చూస్తాను (భాష రాకపోయినా..) అలాంటప్పుడు ఇలాంటి పాటలు, వాటి సాహిత్యం మిస్సవుతాను. మీలాంటివారి చలవవల్ల చదవ గలుగుతున్నా.. పాట దిగుమతి చేసుకున్నాను.. విన్నాను చాలా బాగుంది. ధన్యవాదాలు. నాఅంతట నేనుగా ఎప్పుడో కొన్ని తెలుగు పాటలు విన్నాను అప్పటినుంచి చెవులు పనిచేయడం మానేశాయి. ఇప్పుడు బానే ఉన్నాయిలేండి. అడిగినందుకు ధన్యవాదాలు. మరో సారి మంచి పాట వినిపించారు. ధన్యవాదాలు. మీకు నచ్చిన పాటలను ఓ లిస్టు చేసి ఉంచకూడదూ? వాటి గురించి రాయక పోయినా.. 'తనది కాకపోతే ... ' అని సామెత ఉందిలేండి. అడగడం తేలికని అడిగేశా.. :-)
@ శిరీష గారూ,
ఇప్పటివరకు సుధా రఘునాథన్ గారూ పాడిన తెలుగు సినిమా పాటలు ఈ రెండేనండీ. ఒకటి మీరు చెప్పిన రాగం సినిమాలో పాట (లు) మరియు నేను ఇక్కడ చెప్పిన పాట. వీలు చూసుకుని మీరు చెప్పిన 'రాగం' పాటని వింటాను. ధన్యవాదాలు.
@ పరిమళం గారూ,
అవునండీ.. అదీ సినిమాహాల్లో చూస్తే మరింత సా..గినట్టుగా ఉండి మన సహనాన్ని పరీక్షించే అవకాశం ఉంది :)
అయితే మరి సినిమా రివ్యూలు రాసెయ్యొచ్చునంటారు ;)
@ తృష్ణ గారూ,
నేను ఆవిడ కర్ణాటిక్ సంగీతం ఎప్పుడూ వినలేదండీ. అందుకే నాకు ఈ పాట బాగా నచ్చేసింది. నేను పైన చెప్పినట్టుగా సినిమా చూడటం వల్ల కూడా పాట ఎక్కువ నచ్చేసిందినాకు :)
మీరూ పాటలు వినడంలో నా జట్టే అన్నమాట.. మళ్ళీ same pinch అయితే ;)
@ ఆత్రేయ గారూ,
"నేను నిజజీవితానికి దగ్గరగా ఉన్న సినిమాలు చూడను (అంటే అన్ని తెలుగు సినిమాలు చూస్తాను అని అన్నమాట)" :)))))
నాకు నచ్చిన అన్ని పాటల లిస్టు చేయలేదు గానీ, ఈ బ్లాగు మొదలెటాక రాసిన/రాస్తున్న అన్నే పాటలను ఒక లిస్టుగా చేసి ఉంచుతున్నానండీ. ఒకసారి ఇక్కడ చూడండి.http://madhuravaani.blogspot.com/search/label/%E0%B0%AA%E0%B0%BE%E0%B0%9F%E0%B0%B2%20%E0%B0%9C%E0%B0%BE%E0%B0%AC%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE
నా తెలుగు భాషా లోపం వల్లనో, ఇంకెందువల్లో కాని, ఈ పాట భావం ముక్క కూడా నాకు తలకెక్కలేదు. అనువాద చిత్రాల్లోని మంచి పాటలని మన రచయితలు కసితీరా కావాలని ఖూనీ చేస్తారేమోనని నా అనుమానం. "బతుకు జత అవ్వటం" అనే కాంసెప్టు అంతరార్థమేమిటో నాకయితే వంటబట్టలేదు. "వయసంతా వసంత గాలి.. మనసనుకో.. మమతనుకో" గుర్తొచ్చిన పదాన్ని గుర్తొచ్చినట్టు వాడేయటం కవిత్వమనిపించుకోదు. వయసంతా గాలట. మనసనుకోవాలట. మమతనుకోవాలట. పాట మొత్తానికి ఒక థీం, soul వుండాలన్న విషయాన్నటుంచితే కనీసం అర్థవంతమైన వాక్యాలు కూడా లేకపోతే lyrics రాసి ఏం లాభం. రచయిత వేటూరి అని online search చేస్తే తెలిసింది. నిన్నే పోయారు. ఇంకా ఎక్కువ విమర్శించటానికి మనసు రావట్లేదు.
రాకేశ్ గారూ,
సాధారణంగా డబ్బింగ్ పాటలు కొంచెం అదోలానే ఉంటాయి అక్కడక్కడా ముక్కలు ముక్కలుగా అనిపిస్తాయి. డబ్బింగ్ పాటలు రాయడం కష్టమని కూడా నా ఫీలింగ్. నిజానికి వేటూరి గారు డబ్బింగ్ పాటలు రాయడంలో చాలావరకూ న్యాయం చేశారని నా ఉద్దేశ్యం. ఇక ఈ పాట విషయానికొస్తే, 'బతుకు జతవ్వడం' అంటే ఇప్పటిదాకా ఉన్న ఒంటరి బతుకులో జత కలిసింది, ఆ జత కూడా ఎన్నేళ్ళ నుంచో నేను ఆరాధిస్తున్న అతనే నాకు జత అయినది.. అని అర్ధం. నిజానికి ఆ సినిమాలో ఆ సన్నివేశానికి ఈ పాట మ్యూజిక్ గానీ, సాహిత్యం గానీ బాగా సరిపోయాయని నాకనిపించింది. ఇక పోతే వయసంతా వసంత గాలి.. విషయంలో నేనెక్కువగా ఏమీ చెప్పలేను. కవులు రకరకాలుగా పోలికలు రాస్తుంటారు. అవి కొంతమందికి నచ్చుతాయి. కొంతమంది అస్సలు కనెక్ట్ అవ్వలేరు. అర్ధం పర్ధం లేనివిగా అనిపిస్తాయి. అది వ్యక్తిగత అభిరుచిని బట్టి మారుతూ ఉంటుందని నా అభిప్రాయం.
ఈ పాటలో సాహిత్యం చాలా బాగుందనే నా అభిప్రాయం. మీరన్న ఒక theme, soul కూడా ఉన్నాయని నాకనిపించింది. అందుకే నేనీ పాట గురించి రాశాను. ఉదాహరణకి రెండో చరణం చూడండి. చాలా క్లియర్ గానే ఉంది కదా భావం. ఏదేమైనా సంగీతం, సాహిత్యం విషయాల్లో ఒక్కో వ్యక్తీ ఒక్కోలా స్పందిస్తుంటాం. అదీ bottom line!
avunandi. idoka beautiful song.
Sudha Raghunathan gaariki Padma Sri award kuda vachindi. She is a famous claasical singer. aavida gontulo ee maata enta adbhutam gaa saagindo. lyrics ichinanduku boledu thanks madhura vaani garu.
Post a Comment