Monday, June 06, 2011

మనసా.. మాటాడమ్మా!

ప్రేమ, ప్రేమ బోల్డంత ప్రేమ.. ఇంక అంతకు మించి ఈ అమ్మాయి మనసులో ఎంత వెతికినా వేరే ఇంకేదీ కనిపించదేమో అన్నంత ప్రేమ! చాలా అబ్బురంగా అనిపిస్తుంది నాకైతే! నిజంగా 'నేను' అన్న స్పృహ పూర్తిగా కోల్పోయి మొత్తంగా నీలో కరిగిపోయేంత ప్రేమ ఎంత అందమైన భావనో కదా! అసలు నిజంగా అంత నిష్కల్మషంగా, అంత గొప్పగా ప్రేమించగలిగితే ఆ భావం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పడానికొస్తుందంటారా? ఏమైనా ఒక్కోసారి మన ఉనికిని పూర్తిగా మర్చిపోయి ఇంకొకరిలో మనం ఒదిగిపోవడం బాగుంటుంది.. ఈ పాటలో లాగా!

పెళ్లిని గురించి భర్తనిగురించి అమాయకత్వం స్వచ్చత నిండిన ఓ అమ్మాయి అంతరంగం ఈ పాట. భర్తే లోకం, ఇద్దరూ ఒకటైన క్షణం నుంచి తన చుట్టూనే నా ప్రపంచం, తనతోనే నా కష్టం, సుఖం, సంతోషం,ఆనందం.. అన్నీ అని మనసా వాచా నమ్మి ప్రేమించే భార్య మనసుని అక్షరాల్లో చూపిస్తే ఈ పాటలాగే ఉంటుంది..

భర్తని అంత అమాయకంగా, స్వచ్చంగా ప్రేమించే అమ్మాయిని "నువ్వంటే నాకు ఇష్టముంది.. ప్రేముంది.. కానీ, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బోల్డు డబ్బు కలిసొస్తుంది" అంటూ విడాకులడిగే భర్తని ఎలా దారికి తీసుకొస్తుందన్నదే ఈ సినిమా కథ! రమ్యకృష్ణ గ్లామర్ వెనక దాగున్న నటిని మనకి పరిచయం చేసిన అతి కొద్ది సినిమాల్లో ఈ సినిమా ఒకటి. ఈ పాట SV కృష్ణారెడ్డి దర్శకత్వంలో 1997 లో శ్రీకాంత్, రమ్యకృష్ణ నటించిన 'ఆహ్వానం' సినిమాలోది. సంగీతం కృష్ణారెడ్డి గారే కాగా, సాహిత్యం అందించింది సిరివెన్నెల గారు.

ఫలానా సందర్భంలో ఒక వ్యక్తి అమ్మాయైనా, అబ్బాయైనా ఎలా ఆలోచిస్తారు, వాళ్ళ మనసులో భావాలెలా ఉంటాయని సిరివెన్నెల గారు భలే రాస్తారు. నాకనిపిస్తుంది.. ఆయన ఏదో జన్మలో బోల్డు పుణ్యం చేసుకుని ఉండటం వల్ల ఎవరి మనసులో ఏముంటుందో పరకాయ ప్రవేశం చేసినట్టుగా అంత ఖచ్చితంగా తెల్సుకోగలరేమో.. అలాగే మళ్లీ వాటిని ఇంతందంగా అక్షరాల్లో అద్దడం.. ఆహా.. ఇలాంటి సాహిత్యం వినగలగడం మన అదృష్టం అనుకోవాలి.. :)

ఈ పాట ఎప్పుడు విన్నా ఒకసారి విని ఆపెయ్యడం నా వల్ల కాదు. కనీసం వరసగా ఒక పదో, పాతికో సార్లు వింటే గానీ ఈ పాట ఫీల్ లో నుంచి బయటికి రాలేను. :) అబ్బ.. చిత్ర ఎంతందంగా పాడతారు! తన మనసులోంచి వచ్చిన మాటల్లాగా.. ఆవిడ తియ్యటి గొంతులోని స్వచ్ఛతేనేమో ఈ పాటలోని భావానికి ప్రాణం పోసింది. ఈ పాటలో బాగున్న వాక్యాన్ని రాయాలంటే.. పాట మొత్తం మళ్ళీ తిరగరాయాలి.. కావాలంటే మీరే చూడండి.. :)

ఈ పాటని ఇక్కడ వినొచ్చు.. మీక్కావాలంటే ఇక్కడ చూడండి.

మనసా.. నా మనసా.. మాటాడమ్మా!
ఎగసే భావాలతో పలికే ఈ సమయంలో.. ఇంత మౌనమా!
మనసా నా మనసా మాటాడమ్మా!

చెవిలో మంగళవాద్యం మ్రోగేటి వేళలో.. విన్నా నీ అనురాగపు తేనె పాటని...
మెడలో మంగళసూత్రం చిందించు కాంతిలో.. చూశా నీతో సాగే పూల బాటని...
నీతో ఏడడుగులేసి నడిచిన ఆ నిమిషం.. నాతో తెలిపిందొకటే తిరుగులేని సత్యం..
నేను అన్న మాటకింక అర్ధం నీవంటూ..!

మనసా.. నా మనసా.. మాటాడమ్మా!

తల్లి తండ్రి నేస్తం ఏ బంధమైనా.. అన్నీ నీ రూపంలో ఎదుట నిలిచెగా!
తనువు మనసు ప్రాణం నీవైన రోజున.. నాదని వేరే ఏది మిగిలి లేదుగా!
ఎగసే కెరటాల కడలి కలుపుకున్న వెనక.. ఇదిగో ఇది నది అంటూ చూపగలరా ఇంకా!
నీవు లేని లోకమింక నాకు ఉండదంటూ..!

మనసా.. నా మనసా.. మాటాడమ్మా!
ఎగసే భావాలతో పలికే ఈ సమయంలో.. ఇంత మౌనమా!
మనసా.. నా మనసా..

12 comments:

శ్రీనివాస్ said...

:)

ఆ.సౌమ్య said...

నాకు చాలా ఇష్టమైన పాట ఇది మధుర...అసలు చిత్ర ఎంత బాగా పాడారో!
ఎగసే భావాలతో పలికే ఈ సమయంలో, ఇంత మౌనమా!...ఇది సిరివెన్నెల కదా రాసింది... ఆ మాత్రం లోతు ఉంటుందిలే!

వేణూ శ్రీకాంత్ said...

చాలా బాగా రాశారు మధురా.. ఒకటికి రెండు సార్లు చాదువుకున్నా మీ వ్యాఖ్యానం.. నాకు కూడా చాల ఇష్టం ఈ పాట.
ఎగసే కెరటాల కడలి కలుపుకున్న వెనక.. ఇదిగో ఇది నది అంటూ చూపగలరా ఇంకా!
ఇలాంటి సత్యాలను చక్కగా అన్వయిస్తూ ఎంత బాగా రాశారో.

మాలా కుమార్ said...

ఇందాకే అనుకున్నాను , ఈ మధ్య మధురవాణి అగుపించటము లేదు అని . ఏమిటి బిజీనా ఎక్కడా కనిపించటం లేదు .

లత said...

బాగా రాశారు మధురా, నాకూ చాలా ఇష్టం ఈ పాట
"నేను అన్న మాటకింక అర్ధం నీవంటూ" ఆ వాక్యం మరీ ఇష్టం
మొన్నే నేనూ ఇదే పాట పోస్ట్ చేశాను

గీత_యశస్వి said...

ఎగసే కెరటాల కడలి కలుపుకున్న వెనక.. ఇదిగో ఇది నది అంటూ చూపగలరా ఇంకా!

ee vakyam naaku baaga ishtam.
ee picture mottham lo nenu ramyakrishnani, ee song ni special attentiontho chusthanu.

pallavi said...

hi madhura garu, Iam new 2 u but not 2 ur blog.. ur blog is very nice mam, i like ur "manasa maatadamma" post.. its a nice song.. meru chaala baaga rasarandi..

వనజవనమాలి said...

ఆస్వాధన చాల గొప్పది. ఆస్వాదించే గుణం మనకి..లేకుంటే..మంచి సాహిత్యం రాదూ...సంగీతం జనియించదు. తాను ఆస్వాదించి అ ఆస్వాదనని ఇతరులకి పంచడమే..పనిగా పెట్టుకున్న ఎందరో..మహానుభావులు...ఆ..తీపి కోతని అనుభవిస్తూ.. మీరు..పాటని పరిచయం చేసిన తర్వాత మరి కొందరు.. భావాలకందని మధుర భావంలో.. తేలుతూ.. ఊగుతూ .. మీకు అభినందనలు

హరే కృష్ణ said...

వ్యాఖ్యానం పాటని డామినేట్ చేసేసింది :(((

Anonymous said...

Don't main. I have low knowledge in movies. I also here this song in a movie and the actress is RASI...

మధురవాణి said...

@ శ్రీనివాస్,
:)

@ సౌమ్యా, వేణూ..
అవునూ.. నిజంగా ఇది సిరివెన్నెల గారి అక్షరాలూ చేసే మాయే! :)

@ మాలా గారూ,
కనిపిస్తూనే ఉన్నాగా ఎక్కడోచోట! :))

@ లత గారూ,
అవునండీ.. ఇద్దరమూ భలే రాశాం అనుకోకుండా! :)

మధురవాణి said...

@ గీత_యశస్వి,
అవునండీ.. నాకీ సినిమాలో రమ్యకృష్ణ చాలా నచ్చేస్తుంది.. :)

@ పల్లవి గారూ,
మిమ్మల్ని ఇలా కలుసుకోవడం సంతోషంగా ఉంది. నా బ్లాగు చదువుతున్నందుకు థాంక్సండీ! :)

@ వనజవనమాలి,
చాలా సంతోషమయిందండీ మీ వ్యాఖ్య చూసి.. అసలు పాటల గురించి రాసి నేను అందరికీ బోర్ కొట్టిస్తున్నానేమో అని అప్పుడప్పుడూ సందేహం వస్తుంటుంది నాకు.. ఇలాంటి వ్యాఖ్యలు చూసినప్పుడు నాలాగా ఆలోచించే వారున్నారని సంతోషంగా అనిపిస్తుంది. ధన్యవాదాలండీ! :)

@ హరే కృష్ణ,
అమ్మయ్యో.. మరీ ఇంత పెద్ద పొగడ్తే! థాంక్యూ! :))

@ అనానిమస్,
మీరనుకునే ఆ పాట కూడా 'మనసా..' అని వస్తుందేమోనండీ పల్లవిలో.. అందుకే మీకలా అనిపించి ఉండొచ్చు.. ఈ పాట మాత్రం ఈ సినిమాలోదే! :)