Friday, March 02, 2012

చిన్న కిట్టి

"నా ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళింట్లో బుజ్జీ అనో చిట్టీ అనో ముద్దుపేర్లు ఉంటాయి ఎంచక్కా.. మీరు మాత్రం నాకలాంటి ముద్దుపేర్లు ఏం పెట్టలేదు.." అంటూ అప్పుడప్పుడూ గుర్తొచ్చినప్పుడల్లా నేను మా అమ్మతో పోట్లాడుతూ ఉంటాను. "అలా ఏదన్నా ముద్దు పేరు పెడితే ఇంకదే అలవాటు అయిపోయి అసలు పేరుని పూర్తిగా వదిలేస్తామేమో, అదీ గాక చక్కటి పేరు ఎంచి పెట్టుకుంది ఎందుకూ.. పిలుచుకోడానిక్కాదూ.. అందుకే చిన్నప్పటినుంచీ అసలు పేరుతోనే పిలిచాం నిన్ను.." అంటుంది మా అమ్మ. "అయినా సరే, నేనొప్పుకోను.. అసలలా ప్రత్యేకంగా ఒక ముద్దు పేరుంటే ఎంత బాగుంటుంది చెప్పు .. మీరు నాకు చాలా అన్యాయం చేశారు అంత గొప్ప ఫీలింగ్ ని పోగొట్టి.. హు హూ హూ.." అని ఓ తెగ వేధించేస్తుంటే ఒకసారి మా అమ్మ నాకొక కొత్త విషయం చెప్పింది . అదేంటంటే, చిన్నప్పుడు నాకొక ముద్దు పేరు ఉండేదంట. అదే 'చిన్న కిట్టి'. ఆ కథేంటో చెప్తానిప్పుడు.. బుద్ధిగా ఊ కొట్టేయ్యండి మరి..

మా తమ్ముడు నాకంటే రెండేళ్ళు చిన్న. వాడు మెల్లిగా అడుగులేసే సమయానికి నన్ను పట్టుకోడం కష్టమైపోయేదంట అమ్మావాళ్ళకి. ఊరికే కాళ్ళకి అడ్డం పడుతూ ఉంటే అప్పుడప్పుడూ నన్నూ, మా తమ్ముడినీ కాసేపు పక్కనే ఉన్న మా పెదనాన్న వాళ్ళ దగ్గర వదిలేదంట అమ్మ. అదీగాక ఒక్క నిమిషం చూడకుండా వదిలినా నేను వెళ్ళి మట్టి తినేదాన్నంట. ఎప్పుడూ నేను తినడమే కాక మా తమ్ముడు వద్దని ఊసేసినా సరే "బావుంటుందిరా.. తినూ తినూ.." అని వాడికి బలవంతంగా నోట్లో పెట్టి మరీ తినిపించేదాన్నంట. అందుకని చెప్పి కాపలాగా మా పెదనాన్న వాళ్ళ దగ్గర కూర్చేబెట్టేది అన్నమాట మమ్మల్ని. అయితే అప్పటికి వాళ్ళ అమ్మాయి అంటే మా అక్క, ఇంకా వేరే పెదన్నాన్నల పిల్లలు చాలామంది హైస్కూలుకి వెళ్ళే వయసు పిల్లలు. ఆ పల్లెటూర్లో గవర్నమెంటు బళ్ళో చదూకునేవారు. అప్పట్లో వీళ్ళెవ్వరూ అంత శ్రద్ధగా చదూకోట్లేదని చెప్పి అదే బళ్ళో పనిచేసే మాస్టారింట్లో ఈ పిల్లలందరికీ ట్యూషన్లు పెట్టి చదివించేవారు. రోజూ పుస్తకాలు చేతిలో పట్టుకుని స్కూలుకి వెళ్ళి వచ్చే వాళ్ళని చూసి నాక్కూడా వెళ్ళాలనిపించి మా ఇంట్లో పుస్తకాల కోసం వెతుక్కున్నానంట. అప్పట్లో మా నాన్నకి జాతీయ యువజన కాంగ్రెస్ లో క్రియాశీలక సభ్యత్వం ఉండేది. పార్టీ విషయాల్లో చాలా చురుగ్గా ఉంటూ యూత్ కాంగ్రెస్ వర్క్ షాప్స్ లో పాల్గొనడంలాంటివేవో చేసేవారుట. అందుకని పాతవీ, కొత్తవీ కలిపి మా ఇంట్లో కాంగ్రెస్ డైరీలు బోలెడు ఉండేవి. ఇప్పటికీ కొన్ని ఉన్నాయి మా ఇంట్లో. ఇప్పుడు మా అమ్మ వాటిల్లో పాలవాడి లెక్కలు, ఇస్త్రీ బట్టల లెక్కలు రాస్తుందనుకోండి.. అది వేరే విషయం. :) ఏ మాటకామాటే, డెబ్భై, ఎనభైల్లోని ఆ పాత డైరీలు కొన్ని భలే బాగుండేవి.. కాంగ్రెస్ నాయకుల ఫోటోలు, కాంగ్రెస్ జెండా ఎలా రూపాంతరం చెందింది.. అవన్నీ బొమ్మలుంటాయి ఆ డైరీల్లో మధ్య మధ్య పేజీల్లో.. చిన్నప్పుడు భలే ఇష్టంగా ఉండేది అవన్నీ చూడటం.

ఇంతకీ అసలు కథలోకొస్తే, నేను చేతుల నిండా మోయగలిగినన్ని డైరీలు పట్టుకుని మా అక్కతో పాటు స్కూలుకి వెళతానని వెంటపడేదాన్నంట. సర్లే.. మరీ అంత ఉత్సాహపడుతోంది కదా.. అందుకని అక్కతో పాటు ట్యూషన్ కి పంపిద్దాం. అక్కడ అక్షరాలు నేర్పమని చెప్దాం. అలాగైనా కాసేపు ఇల్లు ప్రశాంతంగా ఉంటుందని తలచి ఒక రోజు నన్ను ఎత్తుకుని వెళ్ళి ఆ ట్యూషన్ మాస్టారికి అప్పజెప్పి వచ్చారంట. ఆయన నన్ను చూడగానే మహా ముచ్చటపడిపోయి అలాగే రోజూ పంపించండి అని చెప్పారంట. మా అక్క పేరు కృష్ణలీల. అందరూ తనని కృష్ణా.. అని పిలుస్తారు. తోటి పిల్లలేమో కిట్టీ అని పిలిచేవారంట. తనతో పాటు వచ్చాను కదా మరి.. అందుకనేమో మరి.. ఆయన నన్ను ముద్దుగా 'చిన్నకిట్టీ' అని పిలిచేవారట. రోజూ ఉదయం వెళ్ళిన దగ్గరి నుంచీ మళ్ళీ వచ్చేసేదాకా ఎంచక్కా నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని నాతో ఆడుకునేవారంట ఆయన. అంత వివరంగా నాకేం గుర్తు లేదు గానీ.. ఆ పెంకుటింటి మధ్య గదిలో కిటికీలోంచి సన్నగా వెలుతురూ పడటం, ఆయనేమో గోడకానుకుని బాసింపట్టు వేసుక్కూర్చుని నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం లీలగా గుర్తుంది నాకు. చిన్న గిన్నెలో బియ్యం, శనగపప్పు కలిపి వండిన తీపి అన్నంలోంచి శనగప్పులు ఏరి తినిపించడం జ్ఞాపకం ఉంది. ఇంకా, వాళ్ళింటి వెనకాలున్న స్థలంలో బొగ్గులతో పని చేసే బాయిలర్ ఒకటి ఉండేది. అందులోంచి పొగలు వస్తూ ఉండేవి. ఆయన ఒళ్ళో కూర్చోడం, ఆ శనగపప్పులు తినిపించడం, బాయిలర్లోంచి పొగలు రావడం... ఇవి తప్పించి ఎవ్వరి మొహాలు గానీ, పేర్లు గానీ నాకింకేం గుర్తు లేవు.

అలా అలా కొన్నాళ్ళు గడిచేసరికి ఆ మాస్టారు ఈ చిన్నకిట్టీ మీద ప్రాణాలు పెట్టేసుకుని క్షణం అన్నా చేతుల్లోంచి దించకుండా సొంత కూతురు కన్నా ఎక్కువ ముద్దు చేస్తూ ఉండేవారట. ఆ మాస్టారి వాళ్ళింట్లో, ఆయనా, వాళ్ళావిడా, ఒక చిన్న పాప (వాళ్ళ సొంత పాప కాదు) ఉండేవారంట. మనింట్లో ఒక పిల్ల ఉండగా వేరే బయటి పిల్లని ఇంత ముద్దు చెయ్యడం ఏంటి అని వాళ్ళావిడకి కుళ్ళూ, కోపం వచ్చి ఇద్దరూ పెద్ద పెద్ద పోట్లాటలు పెట్టుకునేదాకా వచ్చిందంట వ్యవహారం. అలా అలా మొత్తానికి మా ఇంట్లోవాళ్ళకి విషయం తెలిసి.. "అయ్యయ్యో.. మన పిల్ల మూలంగా వాళ్ళింట్లో గొడవలు ఏంటీ.." అని బాధపడి నన్ను వాళ్ళింటికి పంపించడం మానేశారంట. దాంతో పాపం ఆ మాస్టారికి దాదాపు కళ్ళనీళ్ళు పెట్టుకున్నంత పనయ్యిందంట. చిన్నకిట్టీని పంపించండి అని చాలా బతిమాలారంట గానీ వీళ్ళు పంపలేదు. ఈ లోపు ఒక రోజు మా చిన్నమావయ్య (అమ్మ వాళ్ళ తమ్ముడు) వచ్చినప్పుడు ఇద్దరు పిల్లలతో మా అమ్మ బాగా ఇబ్బంది పడుతోందని చూసీ, ఎలాగూ ఈ ఊర్లో మంచి బడి కూడా లేదు కదాని చెప్పి నన్ను అమ్మమ్మ వాళ్ళ ఊరికి తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంకెవ్వరూ నన్ను చిన్నకిట్టీ అని పిలిచినవారు లేరు. ఆ పిలుపుని అందరూ మర్చిపోయారు.

కొన్నాళ్ళకి ఆ మాష్టారు దంపతులు కూడా ట్రాన్స్ఫర్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోయారు. అమ్మావాళ్ళు కూడా ఆ ఊరు నుంచి వచ్చేశారు. మళ్ళీ తొమ్మిదేళ్ళ తర్వాత ఒకరోజు ఎక్కడో బజార్లో ఆ మాష్టారు అమ్మనీ, నాన్ననీ గుర్తు పట్టి పలకరించి చిన్నకిట్టీ ఇప్పుడెలా ఉందని అడిగారు. వాళ్ళ పాప ఎలా ఉంది, ఏం చేస్తోందని అమ్మ కుశల ప్రశ్నలు అడిగింది. అప్పటికి ఇంకొన్ని రోజుల్లో నాకు ఓణీలు వేసే వేడుక చెయ్యాలని నిర్ణయించి ఉండటం చేత ఆ విషయం వాళ్ళకి చెప్పి, అడ్రసు ఇచ్చి మరీ మరీ రమ్మని చెప్పారు. మాష్టారూ, వాళ్ళావిడా ఇద్దరూ అప్పుడు మా ఇంటికొచ్చారు. అమ్మ నాకు పరిచయం చేసింది.. చిన్నప్పుడు నిన్ను చిన్నకిట్టీ అని పిలిచేవారని చెప్పానే.. ఆయనే ఈయన అని. ఆ దంపతులిద్దరూ ఎంతో ప్రేమగా నా కోసం ఒక కానుక తెచ్చిచ్చి సంతోషంగా అక్షింతలు వేసి ఆశీర్వదించారు. "చిన్న కిట్టీ ఇంత పెద్దదయిపోయిందా.." అన్నప్పుడు ఆయన కళ్ళల్లో బోల్డు ఆశ్చర్యంతో కూడిన ఆనందం కనిపించింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళు మళ్ళీ వేరే ఊరు వెళ్ళిపోయినట్టున్నారు. మరోసారి కలవనే లేదు. కానీ, ఇప్పటికీ నాకు గుర్తొచ్చినట్టు ఆయనకి కూడా చిన్నకిట్టీ అప్పుడప్పుడూ గుర్తొస్తూనే ఉంటుందేమో కదూ!

22 comments:

రసజ్ఞ said...

బాగున్నాయి! నాకు కూడా ఇలా ముద్దు పేర్లు అంటే ఇష్టం. కాని నేను మీలా ఎప్పుడూ బాధపడలేదు నాకు బోలెడు ఉన్నాయిగా! కొన్ని అభిమానాలు ఇట్టే ఎర్పడిపోతాయి. ఈ టపా ఆయన చదివితే ఎంతో సంతోషిస్తారు కదూ!

చిలమకూరు విజయమోహన్ said...

మా ఇద్దరికీ ముద్దుపేర్లే శాశ్వతమయిపోయాయి అసలు పేర్లు చెప్తే మమ్మల్ని కనుక్కోలేనంత.

జ్యోతిర్మయి said...

బావున్నాయండీ మీ జ్ఞాపకాలు.

Lasya Ramakrishna said...

నాకు ముద్దు పేరు లేదండి :-(

Anonymous said...

good

Sravya V said...

బావున్నాయి చిన్ని కిట్టి ముచ్చట్లు :) మధుర నా చిన్నాప్పటి ముచ్చట్లు గుర్తు కి వచ్చాయి ఇవి చదవగానే .మీరు తలుచుకున్నట్లే ఆయన కూడా మీ గురించి తలచుకుంటూనే ఉంది ఉంటారు మధుర !

నిరంతరమూ వసంతములే.... said...

బాగున్నాయి మీ చిన్నప్పటి జ్ఞాపకాలు. బాగా రాశారు మధురవాణి గారు. అన్నట్టు మీ బ్లాగు కొత్త టెంప్లెట్ బాగుంది.

మాలా కుమార్ said...

నీ చిన్నకిట్టీ ముచ్చట్లు బాగున్నాయి :)

Unknown said...

ఆ పాత జ్ఞాపకం మధురం...బాగున్నాయి మీ చిన్ననాటి జ్ఞాపకాలు....చిన్న కిట్టీ...
...మిమ్మల్నే నండోయ్ మధురవాణి గారూ! ;)

ఇందు said...

నాకు కన్సిస్టెంట్ ముద్దుపేరు లేదు మధూ!! అమ్మలూ,బుజ్జి,చిట్టి,బంగారం.... ఇలా మారుతూ ఉంటాయ్ సందర్భాన్నిబట్టీ ;) మా నాన్న మాత్రం అప్పటికీ ఇప్పటికీ పాపాయ్ అనే పిలుస్తారు :) హ్మ్!! బాగున్నాయ్ నీ కబుర్లు చిన్నకిట్టీ ;)

Kranthi M said...

same to same naaku jarigindi.kaaka pothe maa mastaru inka maa sonta urlone unnaru vellinappudalla kachchitam ga kalisivastuntanu.vallaki pillalu kuda leru anduke ippatiki nevelite ento ishtam ga palakaristaru. aa kallalo velugu chusthe naaku bhale aananadam ga untundi.andamaina gnapakanni andamaina padalato chaala baaga chepparandi madhura garu :-)

భరత్ said...

మీ బ్లాగ్ చదువుతుంటే, నా చేయి పట్టుకుని ఎవరో నా బాల్యం లో కి నడిపిస్తునట్టుగా ఉంటుంది. మమసు కి ఆహ్లాదం గా ఉంటుంది.

జయ said...

చిన్నకిట్టి కి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

మధురవాణి said...

@ రసజ్ఞ,
ధన్యవాదాలు. నాకు కూడా బోల్డు ముద్దు పేర్లున్నాయండీ.. కాకపోతే అవన్నీ స్నేహితుల దగ్గరే.. ఇంట్లో మాత్రం అసలు పేరు పెట్టే పిలుస్తారు. :)
ఊ.. నిజమే గానీ.. ఆయన ఎక్కడున్నారో ఏంటో నాకు వివరాలేవీ తెలీదు కాబట్టి ఈ టపా ఆయనకీ చేరవేయలేనేమో! :(

@ చిలమకూరు విజయమోహన్ గారూ,
హహ్హహ్హా.. అవునా.. అచ్చంగా ఇదే కారణం వాళ్ళ మా ఇంట్లో ముద్దు పేర్లు అలవాటు చేసుకోలేదని అమ్మ అంటూ ఉంటుంది. :)

@ జ్యోతిర్మయి, కష్టేఫలే,
ధన్యవాదాలండీ.. :)

@ లాస్య రామకృష్ణ,
అయ్యో అవునా.. అలాగైతే ఇప్పుడు మీ వారిని బెదిరించయినా అర్జెంటుగా ఒక ముద్దు పేరు సంపాదించండి ముందు.. :))

@ నిరంతరమూ వసంతములే,
అవునా.. టెంప్లేట్ మార్చి చాలా రోజులైందండీ.. ధన్యవాదాలు.. :)

మధురవాణి said...

@ శ్రావ్య వట్టికూటి,
మరింకేం.. మీ చిన్నప్పటి ముచ్చట్లు కూడా చెప్పెయ్యండి. మేము విని పెడతాం.. :) థాంక్యూ శ్రావ్యా.. :)

@ మాలా కుమార్,
థాంక్స్ మాలా గారూ.. :)

@ చిన్ని ఆశ,
హహ్హహ్హా.. మీరెంత మంచివారండీ.. ఎంచక్కా నన్ను చిన్నకిట్టీ అని పిలుస్తున్నారు.. థాంక్యూ థాంక్యూ.. :))

@ ఇందు,
అబ్బో.. అయితే బోల్డన్ని ముద్దు పేర్లన్నా మాట నీకు. నా ఫ్రెండ్ ఒకమ్మాయిని కూడా వాళ్ళింట్లో పాపాయ్ అనే పిలుస్తారు. తన కొడుక్కి పదేళ్ళ వయసొచ్చినా వాళ్ళింట్లో ఇంకా పాపాయ్ అనే పిలుస్తారు. భలే సరదాగా ఉంటుందిలే వింటుంటే.. :)

మధురవాణి said...

@ క్రాంతి కుమార్ మలినేని,
అవునా.. భలే భలే.. అయితే మీకు సెం పించ్ అండీ.. కానీ, మీరు లక్కీ ఎంచక్కా మీ మాష్టారు మీ ఊర్లోనే ఉన్నారు కదా..
మీ జ్ఞాపకాన్ని పంచుకున్నందుకు సంతోషం. ధన్యవాదాలు. :)

@ భరత్,
మీ వ్యాఖ్య చాలా సంతోషాన్ని కలిగించింది. ధన్యవాదాలు.
చాన్నాళ్ళకి కనిపించారే.. అంతా క్షేమమేనా? :)

@ జయ,
హహ్హహ్హా.. జయ గారూ.. దట్స్ సో స్వీట్ ఆఫ్ యు.. థాంక్స్.. మీక్కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కాస్త ఆలస్యంగా.. :)

@ లోకనాథ్,
:)

Sriharsha said...

:) bavundhi

మధురవాణి said...

@ HarshaBharatiya,
Thanks :)

S said...

:-)
నాక్కూడా అందరికీ ఏదో ఒక ముద్దు పేరు ఉండడం చూసి, మహా ఆరాటంగా ఉండేది నాకు లేదే! అని. నీ పేరన్నా కాస్త పొడుగు. నా పేర్లో ఉన్నదే రెండక్షరాలు.. ఇంక దాన్ని ముద్దుగా ఏం పిలుస్తారూ! ;) కానీ, పెద్దయ్యేకొద్దీ, వద్దంటే ముద్దుపేర్లు వచ్చేసాయ్, అది వేరే సంగతి ;)

మధురవాణి said...

@ S,
హహ్హహ్హా.. అవునా.. అయితే సేమ్ పించ్ నీకు.. కాలేజ్లో మా ఫ్రెండ్ ఒకమ్మాయిని 'సౌ' అని పిలిచేవాళ్ళం.. :D
పెద్దయ్యాక వచ్చే ముద్దు పేర్లు.. నిజమే.. ఆ ముచ్చట కాస్తా తీరిపోతుంది ఇలా వచ్చి చేరిన వాటి పుణ్యమా అని.. ఇక్కడ కూడా సేమ్ పించ్.. :)

Venkata reddy said...

Hi Akka how r u Iam Venkat reddy from BCM Very well know to ur father

మధురవాణి said...

@ Venkata Reddy,
I'm fine. Thanks!
Nice to hear that you know my father. But, I guess we don't know each other. :)