Friday, October 03, 2008

సుమతీ శతకం poem4

నమస్తే.. ఇవ్వాళ సుమతీ శతకం నుంచి మరొక పద్యాన్ని ఇక్కడ ఉంచుతున్నాను.

అడియాస కొలువుఁ గొలువకు

గుడిమణియము సేయఁబోకు కుజనులతోడన్

విడువక కూరిమి సేయకు

మడవినిఁదో డరయఁకొంటి నరుగకు సుమతీ!

తాత్పర్యం: వృధా ప్రయాస అగు సేవను చేయకుము. గుడి ధర్మకర్తృత్వమును చేయకుము. చెడ్డవారితో స్నేహము చేయకుము. అడవిలో సహాయం లేకుండా ఒంటరిగా పోకుము.


ఈ పద్యంలో ఈ వృధా ప్రయాస అయిన సేవ చేయద్దని చెప్తున్నారు. ఒకోసారి మన యజమానికి ధర్మబద్దంగా ఆలోచించే మనస్తత్వం లేకపోతే, మనం ఎంతో కష్టపడి చేసే పని వల్ల కూడా మనకేమి ఉపయోగం కలగదు. మన సేవ వల్ల ఉపయోగం ఉండదని తెలిసినా కొన్ని పరిస్థితుల దృష్ట్యా తప్పక చేయాల్సివస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మన వ్యక్తిత్వానికి సరిపడే నిర్ణయాన్ని తీసుకోడానికి, మళ్లీ ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడానికి చాలా గుండె ధైర్యం కావాలి. కాని "స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః" అని చెప్పినట్టుగా మన సొంత విలువలకి, నిర్ణయాలకి కట్టుబడి ఉంటే కష్టమైనా, సుఖమైనా అందులోనే ఆత్మ సంతృప్తి ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఇక చెడ్డవారితో స్నేహం చేయకూడదని మనం చిన్నప్పుడు చాలా పంచతంత్రం కథల్లో నేర్చుకున్నాము. ఒక మనిషి వ్యక్తిత్వాన్ని అతని చుట్టూ ఉన్న స్నేహితులని బట్టి తెలుసుకోవచ్చునంటారు. తల్లిదండ్రుల్నీ , తోబుట్టువుల్నీ, బంధువుల్నీ దేవుడే ఇస్తాడు.కానీ, స్నేహితున్ని ఎంచుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఉన్నతమైన వ్యక్తిత్వం గల వాళ్లు మన స్నేహితులైతే, మనం కూడా మంచి విషయాలు నేర్చుకునే అవకాశం కలుగుతుంది. గుడికి ధర్మకర్త గా ఉండద్దని చెప్పడంలో ఉద్దేశ్యం అది చాలా కష్టతరమైన పని అనీ, నిందలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని అలా చెప్పారని నాకు అనిపిస్తుంది. ఇక చివరగా ఒంటరిగా అడవిలో వెళ్ళద్దు అంటున్నారు. మరి మీకూ తెలుసుగా అది ఎంత అపాయకరమో..అందుకే మన వాళ్లు ఒంటరిగా దూరదేశాలు పంపించడానికి కూడా అంత భయపడతారు.

ఇవ్వాల్టికి ఈ సుమతీ పద్యం గురించి చూసాము కదా...మీకూ వేరే అభిప్రాయాలు ఏమన్నా ఉంటే..మీకెల్లప్పుడూ మధురవాణిలో స్వాగతం.


ప్రేమతో..

మధుర వాణి




No comments: