Thursday, October 23, 2008

ఆడించి అష్టాచెమ్మా ఆడించావమ్మా... నీ పంట పండిందే ప్రేమ...!!

అందరికీ నమస్కారం..!
కొత్తగా మొదలుపెట్టిన కొత్త కోయిల స్వరాల్లో ఇవ్వాళ మొదటి స్వరం వినిపిస్తున్నాను :)
మధ్యనే విడుదలైన "అష్టాచెమ్మా" అనే అచ్చ తెలుగు సినిమాలోనిది పాట. జాతీయ అవార్డు గ్రహీత అయిన ఇంద్రగంటి మోహన కృష్ణ గారు సినిమాకి రచన-దర్శకత్వం వహించారు. మీకు తెలుసో లేదో గానీ.. గ్రహణం అనే సినిమా కి ఈయన కి జాతీయ అవార్డు వచ్చింది. నేను ఆసినిమా చూసాను. అది ఒక ఆర్ట్ సినిమా కాబట్టి చాలా నెమ్మదిగా సాగుతుంది. కానీ చూస్తే బావుంటుంది. ఇలాంటి సినిమాల్ని చూసే ఓపిక చాలా మందికి ఉండదనుకోండి. కానీ, మన తెలుగు దర్శకుడికి జాతీయ అవార్డు తెచ్చిన సినిమా కదా.. ఎలా ఉంటుందో చూద్దామని నేను చూసాను. నాకయితే నచ్చింది. మామూలు కమర్షియల్ సినిమాల్తో పోల్చకుండా చూస్తే మీకు కూడా నచ్చే అవకాశం ఉంది. వీలుంటే ఒకసారి ప్రయత్నించండి.
అది సరే గానీ, మళ్లీ మన అష్టా-చెమ్మా సినిమా విషయానికొస్తే, ఆట ఆడినట్లుగానే సినిమాలో కూడా నలుగురు ఉంటారు. వీళ్ళ మధ్య సాగే ఆటే సినిమా కథాంశం. ప్రిన్స్ మహేష్ బాబు చుట్టూ సినిమా కథ తిరుగుతూ ఉంటుంది. హాస్యరస ప్రధానమైన చిత్రంగా దర్శకుడు దీన్ని మలచారు. 'కలర్స్' స్వాతి, భార్గవి అనే ఇంకో అమ్మాయి ఇందులో హీరోయిన్స్ గా నటించారు. భార్గవి ఇంతకు మునుపు కొన్ని చిన్న పాత్రల్లోనూ, అమృతం లాంటి టీవీ సీరియల్స్ లోనూ కనిపించింది. సినిమాలో మొదటిసారి హీరోయిన్ గా నటించింది. నానీ, శ్రీనివాస్ అవసరాల అనే ఇద్దరు యువకులు సినిమా ద్వారా పరిచయం అయ్యారు. వాళ్ల నటనకి చాలా మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. సినిమా కి సంగీతం అందించింది కళ్యాణి మాలిక్. చాలా చక్కని సంగీతాన్ని అందించారు. ఈయన MM కీరవాణి గారి సోదరుడు. గతంలో ఆంధ్రుడు, బాస్ లాంటి చిత్రాలకి సంగీతాన్నందించారు. అలాగే కొన్ని పాటలు కూడా పాడారు. ఇంక సాహిత్యం విషయానికొస్తే, పాటలన్నీకూడా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసారు.
నేను ఇప్పుడు చెప్పబోయే పాటని శ్రీకృష్ణ పాడారు. ఒకసారి సాహిత్యం చూడండి. చాలా బావుంటుంది.
అలిగిన ప్రియురాలిని బుజ్జగిస్తూ అబ్బాయి పాడుతున్న పాట ఇది.

ఆడించి అష్టాచెమ్మా ఆడించావమ్మా... నీ పంట పండిందే ప్రేమ...
నిజంగా నెగ్గడం అంటే... ఇష్టంగా ఓడడం అంతే..!
మాటే అంటే.. చిన్నారి నమ్మదేంటమ్మా...
నిజంగా నెగ్గడం అంటే... ఇష్టంగా ఓడడం అంతే..!

ఊరంతా ముంచేస్తూ.. హంగామా చేస్తావేంటే గంగమ్మా...
ఘోరంగా నిందిస్తూ.. పంతాలెందుకు చాల్లే మంగమ్మ...
చూసాక నిన్నూ... వేసాక కన్నూ.. వెనక్కెలాగా తీసుకోనూ...
ఏం చెప్పుకోనూ.. ఎటు తప్పుకోనూ.. నువ్వద్దన్నా నేనోప్పుకోనూ...
నువ్వేసే గవ్వలాటలో.. మెలేసే గళ్ళ బాటలో...
నీదాకా నను రప్పించింది నువ్వేలేమ్మా....
నిజంగా నెగ్గడం అంటే... ఇష్టంగా ఓడడం అంతే..!

...నా నేరం ఏముందే... ఏం చెప్పిందే నీ తలలో జేజెమ్మా...
మందారం అయ్యింది.. రోషం తాకి జళ్ళో జాజమ్మా...
పువ్వంటి రూపం... నాజూగ్గా గిల్లి కెవ్ అంది గుండె నిన్న దాకా...
ఉళ్ళట్టి కోపం... వళ్ళంతా అల్లి నవ్వింది నేడు ఆగలేక...
మన్నిస్తే తప్పేం లేదమ్మా... మరీ మారం మానమ్మా..
లావాదేవీలేమీ అన్నీ కొత్తేం కాదమ్మా...
ఈ పాట మొత్తంలో నాకు బాగా నచ్చిన వాక్యం ఇదీ..

నిజంగా నెగ్గడం అంటే... ఇష్టంగా ఓడడం అంతే...!!

మీరేమంటారు మరి???


ఇంక సెలవు మరి. మళ్లీ కలుద్దాం..!

4 comments:

Anonymous said...

cienema super comedy

Amarendra Reddy Sagila said...

Hi Vaani,

Wanted to write to you in Telugu, but a little tied up now....

Love your blogs......love the way you express and share your thoughts......

By the way, the storyline of the movie "Ashta Chemma" is taken from a play by Oscar Wilde. The play is "The Importance of Being Ernest." If you watched the Spiderman movies, you will remember that the girlfriend of Spiderman acts in a play and spidy promises her that he will come and watch it. It is the same play.

Ikkada Mahesh peru la ee story lo Ernest anna maata..... (I hate to read/write telugu in Roman script).


Keep writing....I have read most of your posts. And I am grateful to you for introducing to me wonderful songs like Laali Laali.....with lyrics....

Wish I could write like you do....


Regards,
Amar

హరే కృష్ణ said...

నాని characterisation చాలా బావుంటుంది
దర్శకుని ప్రతిభ చాలా ఫ్రేమ్స్ లో కనబడుతుంది..ఈ సినిమా తర్వాత వేరే సినిమాలు రిలీజ్ అవ్వలేదా

పామరులకి సైతం చాలా అర్ధమయ్యేలా చెప్పడం సిరివెన్నలకే సాటి!

మధురవాణి said...

@ అమరేంద్ర,
నా రాతలు, నాకిష్టమైన పాటలు మీకు నచ్చుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కొత్తగా నా బ్లాగులో ఉన్న పాటలని ఇక్కడే వినడానికి వీలుగా ప్లేలిస్టు విడ్జెట్ పెట్టాను. బ్లాగంతా ఓపిగ్గా చదవడమే కాకుండా, మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఈ బ్లాగు మొదలు పెట్టినప్పుడు నాకూ అస్సలు అయిడియా లేదు నేను కాస్తో కూస్తో రాయగలను అని. కాబట్టి మీరు కూడా రాయడం మొదలు పెట్టేయండి.. అదే వచ్చేస్తుంది. :)

ఇంకా అష్టా చెమ్మా విషయానికి వస్తే, స్పైడర్ మ్యాన్ సినిమా ఎప్పుడో ఒకసారి చూసాను గానీ, ఆ సీన్ అంత వివరంగా గుర్తు లేదు. :p
కానీ, మొన్నీ మధ్యనే అష్టా చెమ్మా మళ్ళీ చూసినప్పుడు గమనించాను. సినిమా టైటిల్స్ లో 'Thanks to Oscar Wilde for his wild inspiration' అని వేశారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకున్నామనే కాబోలు!

@ హరే కృష్ణ,
సినిమా నాక్కూడా చాలా నచ్చింది. :)
ఈ దర్శకుడి సినిమా మళ్ళీ రాలేదు. ఏదో ప్రొడక్షన్ లో ఉన్నట్టుంది..
ఇక సిరివెన్నెల గురించి కొత్తగా ఏం చెప్పగలం! :)