Thursday, October 30, 2008

సుమతీ శతకం పద్యం 14

నమస్కారం..!
ఈ రోజు మనం చూడబోయే సుమతీ పద్యం ఇదే..!

ఎప్పుడు సంపద కలిగిన

అప్పుడె బంధువులు వత్తురది యెట్లన్నన్

దెప్పలుగ జెరువునిండిన

గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ!

తాత్పర్యం: చెరువు నిండా నీరు చేరగానే వేలకొద్దీ కప్పలు అందులో చేరునట్లే సంపద కలిగిన వారి వద్దకే బంధువులు ఎక్కువగా జేరుకొందురు.


ఈ పద్యం తెలియని తెలుగు వాళ్లు దాదాపుగా ఉండరనుకుంటున్నాను. పెద్దగా చదువురాని వాళ్లు కూడా ఈ పద్యం చెప్తూ ఉంటారు. మరి ఈ పద్యం లో ఉన్న విషయం అలాంటిది కదా..!


నిజానికి ఈ పద్యం లో నీతి గురించి నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరి జీవితంలోకి తరచి చూసినా కనీసం ఒక్క అనుభవం అయినా కనిపిస్తుంది. ఒకటేమిటిలే.. చాలానే ఉంటాయి. ఈ పద్యం లో బంధువులు అన్నారు గానీ, స్నేహితులకీ, కుటుంబ సభ్యులకీ కూడా ఇది చాలా సందర్భాల్లో వర్తిస్తుంది. అంటే అందరూ అలా ఉంటారని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు గానీ, అలాగే ఎక్కువ శాతం మంది ఉంటారన్నది మాత్రం అందరూ ఒప్పుకునే వాస్తవం.


ఏదో సినిమా పాటలో చెప్పినట్టు.. డబ్బుంటే సుబ్బారావు గారు అంటారు లేకపోతే సుబ్బి గాడు అంటారు. అంటారు అంటారు కాదు గానీ..మనందరం అలాగే అంటాం కదండీ..!! ఉదాహరణకి ఎవరన్నా కోట్ వేసుకుని కనిపించారనుకోండి.. ఎవరయ్యా నువ్వు? అని ఎవరమూ అడగము కదా...వెంటనే అండీ..అనేస్తాము. అదే షాపుల్లో పని చేసే అబ్బాయిలని, కొంచెం సాదా సీదాగా కనిపించే వాళ్ళని మాత్రం 'ఆ.. ఏంటి బాబూ..ఎంటయ్యా..? అని అనేస్తాము. పొరపాటున కూడా అండీ.. అన్న మాట నోటి నుంచి వచ్చిన పాపాన పోదు. అదే మరి లోకం పోకడ అంటే.. :)


అది సరే కానీ.. మనకి జీవితంలో కస్టాలు రావడం కూడా ఒకోసారి చాలా మేలుని కలిగిస్తుంది తెలుసా..! అది ఎలా అంటే.. అసలు నిజమైన స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు ఎవరో మనకి అప్పుడే తెలుస్తుంది. నేను నిజ జీవితంలో చాలా చూసాను ఇలాంటివి. అంటే.. మీరు కూడా చూసే ఉంటారనుకోండి :) కాకపోతే నాకు తెలిసినవి చెప్తున్నానన్న మాట.. అంతే...

నా స్నేహితురాలు ఒక అమ్మాయి ఉంది. వాళ్ల అమ్మ, నాన్నగారు వాళ్ల చుట్టాలని అంటే..వాళ్ల పెద్దమ్మలు, పెద్ద నాన్నలు..ఇలాంటి వాళ్ళందరినీ ఎన్నోసార్లు ఆదుకోడమే కాకుండా, చిన్నవాళ్ళకి పెళ్ళిళ్ళు లాంటివి కూడా చేసారు. అసలు వీళ్ళింటికి ఎప్పుడు వెళ్ళినా గానీ, ఒక పెద్ద మంద ఉండేది. ఎవరో ఒకళ్ళు వారాల పాటు వీళ్ళింట్లో తిష్ట వేసేవారు. అలా ఉన్నన్ని రోజులూ బాగానే ఉన్నారు. వీళ్ళకి వ్యాపారం లో కొంచెం నష్టం రాగానే ఎక్కడ వాళ్ల మీద భారం పడుతుందేమోనని అందరూ మొహాలు చాటేశారు. వీళ్ళు పాపం కనీసం అప్పు కూడా అడగలేదు ఎవరినీ...అయినా గానీ ముందే పలాయనం చిత్తగించారన్న మాట. కానీ, నాకు బాగా బాధనిపించిన విషయం ఏంటంటే.. వ్యాపారంలో నష్టం వచ్చినదాని కంటే కూడా.. ఇన్ని రోజులు ఆత్మీయుల్లాగా ఉన్నబంధువులందరూ ఒకేసారి ఇలా నిజరూపాల్లో అవతరించేటప్పటికి పాపం వాళ్లు చాలా పెద్ద షాక్ లోకి వెళ్లిపోయారు. వాళ్లందరూ దూరమవ్వడాన్ని తట్టుకోవడం చాలా కష్టమైంది వాళ్ళకి అసలు కష్టం కంటే ముందు.. తరవాత నా స్నేహితురాలు కుటుంబం అంతా పాపం చాలా కష్టాలు పడి ప్రస్తుతానికి ఎలాగో నిలద్రొక్కుగోగలిగారు. కానీ, ఇప్పటికీ బాధపడుతూనే ఉంటారు.. మన అనుకున్నవాళ్లందరూ ఇలా చేశారనీ.. :(

అందుకే అసలు ఎవరి మీద మరీ ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదు అనిపిస్తుంది ఇలాంటివి చూసినప్పుడు... కానీ, ఇలాంటి వాటికి అతీతంగా ఒక్క నిజమైన నేస్తం ఉంటే చాలు కదండీ..! ఆ ఆసరా తో ఎన్ని కష్టాలైనా ఈదెయ్యగలం అనిపిస్తుంది.

కానీ, మనం మంచిగా ఆలోచిస్తున్నాం కదా అని అందరూ అలా ఆలోచించరు అనే కఠినమైన వాస్తవాన్ని మనం తెలుసుకోగలగాలి. అలాగే ఈ ప్రపంచంలో ఏదయినా సాధ్యమే అని గుర్తుంచుకోవాలి. అప్పుడే అన్ని రకాల సమస్యలని భరించగలిగే శక్తి మనకి వస్తుంది.


అందుకే...బంధువులొస్తున్నారూ..జాగ్రత్త సుమా..!! :)


ప్రేమతో...

మధుర వాణి

No comments: