Saturday, October 11, 2008

ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుకీ..అటో ఇటో ఎటోవైపు..

"ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుకీ..అటో ఇటో ఎటోవైపు.."
ఈ వాక్యం వినడానికి ఎంతబావుందో కదా..! అందులో ఎంత వాస్తవం, ఎంత మార్గదర్శకం ఉందో కదా..!
ఈ ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది మనుషులు ఉన్నారు. అందరూ ఒక్కో విధమైన మనస్తత్వాలు, ఆలోచనలు కలిగిఉంటారు. ఒకరికి మంచి అనిపించేది మరొకరికి చెడు అనిపిస్తుంది, మరొకరికి పిచ్చితనం అనిపిస్తుంది. ఒక్కటే విషయం, చూసే మనిషి దృక్పథాన్ని బట్టి అభిప్రాయం మారుతూ ఉంటుంది.

ఈ ప్రపంచంలో ప్రతీ మనిషి జీవితంలో ఎన్నో సమస్యలు.అవి మామూలే...సముద్రపు అలల్లా వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ, కొంతమందికి జీవితమే ఒక సమస్య . వాళ్ళనే మనందరం అనాధలు అంటూ ఉంటాం. అనాధలు అంటే ఎవరూ లేనివారనేగా మన ఉద్దేశ్యం. ఎన్నో కారణాల వల్ల ఈ ప్రపంచంలో ఒంటరిగా వదలివేయబడ్డ పసిపాపలే అనాధలవుతారు. ఇంత మంది మనుషులున్న ఈ విశాల ప్రపంచంలో తమకి మాత్రమే ఎందుకు ఎవరూ లేరో వాళ్లకేప్పుడూ అర్ధం కాని విషయం. ఒకోసారి విధి వక్రీకరించి తనవాళ్ళని పోగొట్టుకోవడం వల్ల కూడా కొంతమంది పిల్లలు అనాధలవుతారు. అలాంటి దురదృష్టానికి గురి అవ్వని మన లాంటి అదృష్టవంతులైన మనుషులు అలాంటి పసిపాపల కోసం ఎంతో కొంత ఆలోచించాలి. ఏదో ఆకలితో ఉన్నారని ఒక పూట అన్నం పెట్టడమో, ఒక పది రూపాయలు ఇవ్వడమో చేసి ఊరుకుంటే సరిపోదనీ, అది సరి కాదని కూడా నా అభిప్రాయం. దాని వల్ల వారి జీవితంలో ఎటువంటి మార్పు ఉండదు. చేతనయితే వారి మీద జాలి, దయ చూపించకుండా ప్రేమ చూపించగలగాలి. మనం చేసే చిన్న పని ద్వారానయినా వాళ్ల జీవితంలో ఒక మార్పు రావాలి. వాళ్లు భవిష్యత్తులో మంచి మనసున్న మనుషులుగా ఎదగాలి. ప్రతీ మనిషి జీవితానికి కనీస అవసరాలయిన తిండి, నీడ, ఆరోగ్యం కాకుండా చదువు కూడా కావాలి. అప్పుడే వాళ్ల జీవితాన్ని వాళ్ళే నిర్మించుకోగలిగే విజ్ఞానం, శక్తి వస్తాయి.


సరే..! ఇదంతా బానే ఉంది. మాకూ ఇలాంటి భావాలు, ఆలోచనలు చాలా ఉన్నాయి. కానీ, మన వ్యక్తిగత జీవితం గురించి కూడా ఆలోచించుకోవాలి కదా అని అనుకుంటున్నారా? ఇలాంటివన్నీ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కదా... ఇంకా మేము ఇరవైల్లోనే ఉన్నాము, జీవితంలో ఇంకా స్థిరపడలేదు, ఇప్పుడే ఉద్యోగం వచ్చింది కానీ కొంచెం ఆర్ధిక స్థిరత్వం వచ్చేవరకు ఇలాంటివి అమలు చేయడం కష్టం, ఇంట్లో బాధ్యతలు ఉన్నాయి కదా....ఇలా ఇలా ఏదో ఒక రకంగా మీ ఆలోచనలు సాగుతూ ఉండవచ్చు. నాకెలా తెలుసంటే నేను కూడా అలాగే చాలా సార్లు ఆలోచించాను కాబట్టి. ఇలానే మాట్లాడుకుంటూ ఉండగా ఒకసారి నా స్నేహితుడన్నాడు నాతో... "నేను పేద కుటుంబంలో పుట్టి చాలా కష్టపడి చదువులో ఈ స్థాయికి వచ్చాను. చదువుకునే రోజుల్లో నేను కష్టపడే ప్రతీ దశలోనూ, నాకు ఉద్యోగం వచ్చాక ఎంతో మందికి ఎన్నో చేయాలి భవిష్యత్తులో అని ఎన్నో అనుకున్నాను. తరవాత కొంతకాలానికి నా చదువయిపోయి ఒక చిన్న ఉద్యోగం వచ్చింది. కానీ, నా కుటుంబ బాధ్యతలు, నా స్వంత జీవితంలో ఉన్న పరిస్థితుల్ని బట్టి ఇంకా కొన్ని రోజులకి పెద్ద ఉద్యోగం వచ్చాక నా వంతు కృషి తప్పకుండా చేయాలి అనుకున్నాను. ఇలా కొంత కాలం గడిచాక ఒకరోజు అకస్మాత్తుగా నా మనసుకి ఒక విషయం తట్టింది. అది ఏంటంటే...నువ్వు ఒకటి చేయాలి అని గట్టిగా నిర్ణయించుకున్నప్పుడు ఎంతో కొంత చేయగలవు ఏ పరిస్థితిలోనయినా.. నువ్వు వస్తుందనుకే ఆ అత్యంత అనుకూల పరిస్థితి మన జీవితాల్లో ఎన్నటికీ రాదు. ఎందుకంటే మన అవసరాలు, ఆశలు ఎప్పటికీ పూర్తి అవ్వవు. ఒకవేళ అయినా కూడా సరికొత్తవి ఆ జాబితాలో చేరుతూనే ఉంటాయి. కాబట్టి ఉన్నంతలో ఏదో ఒకటి వెంటనే మొదలు పెట్టు." ఎవరో గొప్పవాళ్ళు చెప్పినట్టు "వేయి మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది". కానీ, ఆ ఒక్క అడుగు ఎప్పుడు వెయ్యాలా అని ఎదురుచూస్తూనే కాలం గడిచిపోతుంది, ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో..
ఈ విషయం గురించి ఈ రోజు ఇక్కడ చెప్పే ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే నాకు తెలిసిన దాన్ని చెప్పడం వల్ల ఇది చదివగానే ఆ మొదటి అడుగు వేయాలని ఎదురుచూస్తున్నవారెవరైనా ఉంటే కనీసం ఒక్కళ్ళయినా వెంటనే ముందడుగు వేస్తారని..

అలా మొదటి అడుగుగా... నేను నా స్నేహితుడి ద్వారా ఒక ఆర్గనైజేషన్ గురించి తెలుసుకున్నాను. అది ప్రపంచం మొత్తం అనాధ పిల్లలకోసం నడుపుతున్న ఒక సంస్థ. మన ఇండియా లో కూడా ఉంది. వాళ్ళేం చేస్తారంటే, ఇలాంటి పిల్లలను వెళ్లి వెతికి తీసుకొచ్చి వాళ్ల సంస్థలో చేర్పించుకుంటారు. ఒకోసారి తల్లితండ్రులు ఉన్నా కూడా, బాగా పేదవాళ్లవడం చేత పిల్లలని సరిగ్గా చూసుకోలేని, చదువు చెప్పించలేని స్థితిలో ఉన్న పిల్లలని కూడా చేర్చుకుంటారు. అలాంటి పిల్లకి, మంచి తిండి, ఉండటానికి వసతి, ఆరోగ్యం, చదువుకునే అవకాశం కల్పిస్తారు. అయితే వీళ్ళు ఎవరి దగ్గరినుంచైనా విరాళాలు తీసుకుంటారు ఈ సంస్థ నడపడం కోసం. వీళ్ళు చేసే ఒక గొప్ప విషయం ఏంటంటే...మనం ఒక చిన్న విరాళం ఇచ్చినందుకు ప్రతిఫలంగా మనకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తారు. అది ఎలా అంటే...వాళ్ల website లో చాలామంది పిల్లల photos ఉంటాయి పేరు, ఊరుతో సహా.. ఎవరో ఒకళ్ళని మనం సెలెక్ట్ చేసుకుని నెలకి 600Rs/- INR పంపిస్తే ఆ child కి కావలసిన అన్ని సౌకర్యాలనీ వాళ్లు అమరుస్తారు. మనమే కాకపోయినా ఎవరో ఒకళ్ళు ఆపని చేస్తారు. కానీ, మనం చేస్తే ఆ సంస్థ వాళ్లు, ఆ child photo ని మనకి పంపించడమే కాక, ఎప్పటికప్పుడు వాడు ఏమి చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు, ఎలా చదువుతున్నాడు, వాడి progress card ...లాంటివి కూడా పంపిస్తారు. మనకి కావాలంటే అప్పుడప్పుడూ వెళ్లి వాడిని కలవచ్చు. వెళ్ళలేకపోయినా ఉత్తరాలయినా రాయచ్చు. So, almost its a kind of virtual adoption. అలా అని, మీరు ఇన్ని రోజులు కట్టాలి అనే నిర్భందం లేదు. ఒక నెల నుంచి మొదలుకుని ఎన్ని నెలలయినా కట్టచ్చు మీ వీలుని బట్టి. ఇలాంటివి ఎంత సంతోషాన్నిస్తాయో నేను మాటల్లో చెప్పలేను. ఒకసారి చేసి చూస్తే మీరే స్వయముగా తెలుసుకోవచ్చు.
ఈ రోజుల్లో 600 రూపాయలు చిన్న మొత్తమేనని నా అభిప్రాయం. ఎందుకంటే మనం ఒక జత బట్టలు కొనుక్కుందామన్నా అంతకంటే ఎక్కువే అవుతుంది. కాబట్టి ఆలోచించి చూడండి మీరు చేయగలేరేమో...!!
ఇంతకీ... మీకు ఆ website అడ్రస్ చెప్పలేదు కదూ...! చూడండి ఇదే ఆ site.
http://www.worldvisionindia.org/

ఇలాంటిది నాకు తెలిసింది ఇంకోటి కూడా ఉంది. ఒకసారి మీరు కూడా చూడండి.
http://www.nice-india.org/

మరి ఒక మంచి పని కోసం మన మొదటి అడుగు ముందుకి వేద్దామా...??
ప్రేమతో...
మధుర
వాణి


5 comments:

Anonymous said...

Great post.. great move... i will start sending from this month.. thanks for good info...
venkat.

మధురవాణి said...

Thanks a lot venkat..!
I am also doing it and thanks for joining..!
I am really happy to see atleast one person got motivated by my post.

sreev said...

dear Madhura vaani gaaru, it's a very inspiring post. When I decided to start Sphoorti (http://www.sphoorti.org), lot of people wondered why at an early age of 28/29, I ventured into starting an organization for children belonging to underprivileged and vulnerable groups.

Most of the thoughts you have expressed are in fact what I too had when I was toying with the Sphoorti idea.

Please visit Sphoorti and interact with our children, I am sure our kids will give you a memorable experience.

Visit www.sphoorti.org/blog

Regards
Srivyal,
Founder, Sphoorti Foundation

Unknown said...

Great post Thanks for giving the information I will try my level best to contribute

మధురవాణి said...

@ Anand Mohan,
I really appreciate your response. :-)