Friday, October 17, 2008

సుమతీ శతకం poem9

ఈ రోజు ఇంకో సుమతీ పద్యాన్ని చూద్దాము.

ఉడుముండదె నూరేండ్లును

బడియుండదె పేర్మి బాము పదినూరేండ్లున్

మడుపునఁ గొక్కెర యుండదె

కడు నిల బురుషార్థపరుడు గావలె సుమతీ!

తాత్పర్యం: ఉడుము నూరేళ్లు, పాము పది వందల ఏళ్లు, కొంగ చెరువులో చిరకాలం జీవిస్తున్నాయి. వాటిజీవితాలన్నీ నిరుపయోగాలే. మానవుని జీవితం అలా కాక ధర్మార్థకామమోక్షాసక్తితో కూడినది కావాలి.


ఈ సృష్టి లో ఎన్నో రకాల జీవులున్నాయి. ఈ సృష్టిలో ప్రతీ జీవికి, ప్రతీ వస్తువుకీ ఏదో ఒక అర్ధం ఉంటుంది తప్పకుండా..

నిజం చెప్పాలంటే ప్రాణులన్నీ కూడా ఎవరు చేయాల్సిన పని వాళ్లు చేయాలి. అప్పుడే ఈ సృష్టి సమతుల్యం దెబ్బతినకుండా ఉంటుంది. అంటే బ్యాక్టీరియా లాంటి జీవులు లేకపోతే ఈ ప్రపంచంలో ఏది degrade అవ్వదు. అలాగే శాఖాహారులు, మాంసాహారులు అయిన ఎన్నో జీవులు దేని జీవన విధానం అది పాటించడం వల్లనే ఈ జీవన చక్రంఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది ...ఇంక మనిషి విషయానికి వస్తే, ఈ జీవ పరిణామ క్రమంలో ఎదిగిన అన్నీ జీవుల్లోకీ ఉన్నతమైన, తెలివైన ప్రాణి మానవుడే. అందుకే మనం మిగతా అన్ని జీవుల్ని మచ్చిక చేసుకోడమే కాకుండా ఎన్నోరకాలుగా exploit కూడా చేస్తున్నాము. అన్ని జీవులకంటే బాగా అభివృద్ధి చెందిన మెదడు మనిషికి మాత్రమే ఉంది. ఆలోచనా శక్తి, మంచి చెడు తెలుసుకోగలిగే విచక్షణా జ్ఞానం, మన భావాలని ఒక భాషలో వ్యక్తపరచగలిగే మనకి మాత్రమే సొంతం. కానీ...వాటిని మనం ఎంత వరకు ఉపయోగిస్తున్నాం? అన్నదే ఈ పద్యం లో నీతి.


ఉడుము నూరేళ్ళు, పాములు పది వందల ఏళ్ళు బతుకుతాయి అంటున్నారు. మీకు తెలుసో లేదో...ఉడుము అనే జీవి నిజంగానే అన్నేళ్ళు బతుకుతుంది. ఈ ఉడుము గురించి ఇంకో చిత్రం కూడా ఉంది. ఈ సృష్టిలో ఈ జీవి గొప్పతనం దానికే ఉంటుందని ఇందాకే అనుకున్నాం కదా... ఇంతలోనే మంచి ఉదాహరణ కూడా దొరికింది. అదీ ఈ ఉడుము తన కాళ్ళతో ఏదయినా పట్టుకుందంటే దాన్ని విడిపించడం ఎవ్వరి తరమూ కాదు. అందయూక్ మన వాళ్లు ఏదయినా గట్టిగా పట్టుబడితే ఉడుము పట్టు అంటూ ఉంటారు. నేనెక్కడో చదివాను చిన్నప్పుడు...అది ఏంటంటే మన ఛత్రపతి శివాజీ ఉన్నాడు కదా..యుక్తికీ, శక్తికీ, ధైర్యసాహసాలకి మారు పేరు అయిన శివాజీ ఏదో రాజ్యం కోట ఎక్కడం కోసం ఉడుముని పైన గోడ మీద వేసి దాని పట్టుని సహాయంగా తీసుకుని పైకి ఎగబ్రాకాడట. నిజంగా ఈ సంగతి నేను చదివాను ఎప్పుడో స్కూల్ లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ పద్యం చూసి నాకు గుర్తొచ్చింది. నిజమే అయ్యి ఉండచ్చు..మరి ఉడుము పట్టు అలాంటిది కదా..!

ఇంకో సంగతీ...పాములు పది వందలేళ్ళు బ్రతుకుతాయని ఊరికే మాటవరసకి అన్నట్టున్నారు. ఎందుకంటే అన్ని సంవత్సరాలు పాములు బ్రతకవు. కానీ, పాములకు దగ్గర జాతి అయిన తాబేళ్లు మాత్రం చాలా ఏళ్ళు జీవిస్తాయి. అంటే..100 ఏళ్ళ పైన..అన్నీ జీవుల్లోకెల్లా ఎక్కువ బ్రతకగలిగే జంతువు ఇదే అనుకుంటా....


ఇవన్నీ సరే గానీ...ఈ పద్యంలో చెప్పదలుచుకున్న ఉపదేశం ఏంటంటే... ఎన్నో జీవులు ఎన్నో ఏళ్ళు బతుకుతూనే ఉంటాయి. కానీ, మనిషికి మాత్రమే ధర్మార్ధకామమోక్షాలను తెలుసుకునే అవకాశం ఉంది. అందుకే మనిషి జన్మ ఎత్తినందుకు సార్ధకత్వం ఉండాలి అంటున్నారు. ఏమో మరి...మనం ఎంతవరకు సార్ధకత్వం చేసుకోగలమో...ఆ విషయం మాత్రం మీరే చెప్పాలి...నాకంత సీన్ లేదు :) :)ప్రేమతో...

మధుర వాణి

No comments: