Tuesday, October 07, 2008

సుమతీ శతకం poem6

సుమతీ శతకం లో నుంచి మరొక పద్యం ఇక్కడ వ్రాస్తున్నాను.

అల్లుని మంచితనంబును

గొల్లని సాహిత్యవిద్య, కోమలి నిజమున్

బొల్లున దంచిన బియ్యముఁ

దెల్లని కాకులును లేవు తెలియర సుమతీ!

తాత్పర్యం: అల్లుడి మంచితనం, గొల్లవాని పాండిత్యజ్ఞానం, ఆడదానియందు నిజం, పొల్లు ధాన్యములో బియ్యం, తెల్లని కాకులూ లోకములో ఉండవు.


అల్లుడు అనేవాడు ఎప్పుడూ అత్త మామలని పీడించడానికే తప్ప మంచిగా ఉండడని ఈ పద్యంలో చెప్తున్నారు. మన తెలుగు సాంప్రదాయంలో కట్నాలు, సారెలు, సాంప్రదాయాలు కూతురికి ప్రేమగా కానుకలు ఇచ్చేందుకు వచ్చాయి. కానీ, చివరికి అవి అల్లుడి హక్కులాగా మారాయి. మనం ప్రపంచం చాలా మారింది, అందరూ చదువుకుని చాలా విజ్ఞానవంతులవుతున్నారు. అందుకని అబ్బాయిలు చాలా మారిపోతున్నారు అని అనుకుంటున్నారు అందరూ. మారే వాళ్లు చాలా తక్కువ శాతం మంది. ఎంత చదువుకున్నా, ఏ దేశం వెళ్ళినా కట్న కానుకలని మాత్రం మర్చిపోట్లేదు. అన్నిటికంటే బాధాకరమైన సంగతి ఏంటంటే మన భారతదేశం లో వేరే అన్ని రాష్ట్రాల్లో ఈ కట్నాల గోల మన తెలుగు వాళ్ళంత లేదు. ఇందులో మనమే ప్రధమ స్థానం. మా అబ్బాయికి 2 కోట్లు కట్నం అని ఒకళ్ళు, 4 కోట్లు అని ఒకళ్ళు...చివరికి ప్రస్తుతం పెళ్లి వ్యాపారం కూడా real estate ని మించిపోతుంది. విదేశాలకి వెళ్ళింది ఎక్కువ కట్నం వస్తుందనే...అని అనే తెలుగు ప్రబుద్ధులు కూడా ఉన్నారంటే మీరు నమ్మగలరా?? అందుకని అబ్బాయిలూ...మీ ఆత్మ గౌరవాన్ని నిలుపుకోండి. మీ జీవితానికి భాగస్వామిగా అమ్మాయిని ఆహ్వానించండి. అంతే కానీ, డబ్బు కోసం కాదు.

ఉన్నత భావాలు కలిగిఉండి భార్యని స్నేహితురాలిలాగా, నిజమైన అర్ధాంగిలా చూసే అబ్బాయిలందరికీ నా అభినందనలు.

ఇంకా ఈ పద్యంలో అమ్మాయిలు నిజమే చెప్పరని కవి రాసారు. ఆయన జీవితంలో అలాంటి అమ్మాయిలని మాత్రమే చూసారేమోనని నాకనిపిస్తుంది. అందుకే అలా చెప్పారేమో..! గొల్లవాని పాండిత్యం అన్నారు కదా.. అంటే గొల్ల అనే కులం అని కాదు. అప్పట్లో బ్రాహ్మణులు తప్ప వేరే కులం వాళ్లు చదువుకునే వాళ్లు కాదు కదా..అందుకని పాండిత్య జ్ఞానం వాళ్ళకి తప్ప ఇంకెవరికి ఉండేది కాదు. అందుకని అలా అన్నారన్నమాట. చదువుకోని వాళ్ళకి పాండిత్యం ఉందని చెప్తే అది నిజం కాదని కవి ఉద్దేశ్యం. ఇంక తెల్ల కాకులు మనం ఎలాగూ చూసే అవకాశం లేదనుకోండీ..

అదన్నమాట సంగతీ..!


ప్రేమతో...

మధుర వాణి

4 comments:

కొత్త పాళీ said...

జల్లెడలో కనిపించే క్లుప్తమైన భాగంలో మీరుదహరించిన పద్యాన్ని చూసి, "దయచేసి ఇలాంటి కాలం చెల్లిన భావాల్ని ప్రకటించొద్దు" అని రాయడానికి మీ బ్లాగులోకి వచ్చాను. ఇక్కడ చక్కటి వివేచనతో, తేటైన విచక్షణతో ఉన్న మీ వివరణ చదివి చాలా సంతోషం కలిగింది. అభినందనలు.

Madhura vaani said...

కొత్త పాళీ గారు,
ముందుగా మీకు ధన్యవాదాలు.
మీరన్నట్టుగా ఇలాంటి పద్యాలలో చాల వరకు రచనా కాలం నాటి పరిస్థితులకు అనుగుణంగానే ఉంటాయి.
కానీ, అందులో కూడా మనకు వర్తించే నీతులు చాలానే ఉన్నాయి కదా...అదీ కాక మన తెలుగు పద్యాలను ఒకసారి గుర్తు తెచ్చుకున్నట్టు కూడా ఉంటుంది కదా..! అందుకే ఆ పద్యాలకు వీలయినంతలో నా భావాలను కూడా వ్రాస్తున్నాను.
మీ ప్రోత్సాహకరమైన మాటలకు ధన్యవాదాలు.
keep visiting..!
మధుర వాణి

S said...

ఈ శతక కర్త రాసినవి కొన్ని ఇందుకే నాకు నచ్చవు.... :)
కానీ, కొన్ని నచ్చుతాయి కనుక - పాపం ఆయన కూడా మనిషే కదా అని వదిలేశా ఇంక కోపం తెచ్చుకోవడం :))

మధురవాణి said...

@ S,
హహహహ్హా.. నిజమే! నాకనిపిస్తుందీ.. ఆయన కూడా పాపం తన అనుభవాల్లోంచి నేర్చుకున్న పాఠాలే రాసారేమో! ఆయన దురదృష్టం కొద్దీ అలాంటి అమ్మాయిలూ తగిలారేమో మరి! :P అయినా పాపం ఏం చేస్తాం.. మీలాగా క్షమించెయ్యడమే! ;)