చందమామ రావే... జాబిల్లి రావే...కొండెక్కి రావే...గోగుపూలు తేవే...
ఈ వాక్యాలు తెలియని తెలుగు వాళ్లు ఉండరు. ఒకవేళ ఉంటే మాత్రం వాళ్లు తెలుగువాళ్లు అని చెప్పుకోకపోడమే మంచిది. చిట్టి బుజ్జాయిలకి అన్నం తినిపించడానికి అందరూ ఈ పాటనే పాడేవారు. ఇప్పటికీ చాలామంది పాడుతున్నారనీ నేను అనుకుంటున్నాను.
నేను ఇప్పుడు 1987 లో వచ్చిన "సిరివెన్నెల" అనే ఒక అద్భుత కళాత్మక చిత్రం లోని చందమామ రావే... అనే పాట గురించి చెప్తున్నాను. అసలు సిరివెన్నెల అనే పదం వింటేనే ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఆ సినిమా చూసినా, ఆ సినిమా లో పాటల్లో సంగీతం విన్నా, పదాలు విన్నా కూడా అదే అనుభూతి కలుగుతుంది. దర్శకులు "కళాతపస్వి" K.విశ్వనాధ్ గారు ఎంత బాగా పేరు పెట్టారో ఆ సినిమాకి సిరివెన్నెల అని. అంతకంటే సరైన పేరుని ఊహించలేము ఆ సినిమాకి. ఆ సినిమాలో కథానాయకుడు అంధుడైన ఒక సంగీత జ్ఞాని, అద్భుతమైన గాయకుడు. అతని కథే ఈ సినిమా. ఈ సినిమాలో ఉన్నా ప్రతీ ఒక్క పాత్రలోనూ ఒక్క్కో భిన్నమైన పార్శ్వాన్ని చూపించారు దర్శకులు. ఈ సినిమా మళ్లీ మళ్లీ చూస్తున్నప్పుడల్లా కొత్త అనుభూతి కలుగుతుంది. ఈ సినిమాలో ఉన్న పాటలన్నీ అద్భుతాలే. సంగీత దర్శకత్వం శ్రీ KVమహదేవన్ గారు వహించారు. మీ అందిరికి తెలిసే ఉంటుంది ఈ విషయం.. ఈ సినిమా తోనే మన తెలుగు సినిమాప్రపంచానికి ఒక అసాధారణమైన పాటల రచయిత సీతారామ శాస్త్రి గారి రూపంలో పరిచయం అయ్యారు. తరువాతి కాలంలో "సిరివెన్నెల" అనేది ఆయన ఇంటిపేరుగా స్థిరపడిపోయింది.
ఈ చిత్రంలో ఒక అంధురాలయిన పాప ఉంటుంది. ఈ పాత్రలో ఇప్పటి నటి మీనా బాలనటిగా నటించారు. ఆ అమ్మాయి వెన్నెల్లో బృందావనం ఎలా ఉంటుందని అడిగితే అంధుడైన కథానాయకుడు తన పాట ద్వారా ఆ అమ్మాయికి వెన్నెల్లో బృందావనం అనుభూతిని కలిగిస్తాడు. ఎంత గొప్ప భావం..!!ఎంత గొప్ప అనుభూతి..!!
అసలు ఆ పాట వింటుంటే మనకి కూడా వెన్నెల్లో బృందావనం అలాగే ఉంటుందేమో అనిపిస్తుంది. మనం కూడా వెన్నెల్లో బృందావనంలో ఉన్నట్టే ఉంటుంది.
చలువ చందనములు పూయ చందమామ రావే...
జాజిపూల తావినియ్య జాబిల్లి రావే...
కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే...
గగనపు విరితోటలోని గోగుపూలు తేవే...
మునిజన మానసమోహిని యోగిని బృందావనం...
మురళిరవళికి ఆడిన నాగిని బృందావనం...
రాధామాధవ గాథల రంజిల్లు బృందావనం...
గోపాలుని మృదుపద మంజీరము బృందావనం...
ఈ వాక్యాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో..ఈ పాటలో పిల్లనగ్రోవి సంగీతం చాలా మధురంగా ఉంటుంది. SPబాలు, సుశీల గార్లు ఈ పాటని ఇంకా తీయగాఆలపించారు. ఈ పాట గురించి ఎంత మాట్లాడినా తనివి తీరదు. కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ పాట విని వెన్నెల్లో బృందావనంలో విహరించి రండి.
ప్రేమతో..
మధుర వాణి
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
thanking you very mucheptelva
Post a Comment