ఒక్కోసారి మౌనంలో ఉన్నంత ఆనందం ఎక్కడా లేదనిపిస్తుంది. ఒక చల్లని వెన్నెల రేయిలో ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ ఉంటే మౌనంగానే ఉండాలనిపిస్తుంది. ఏదైనా సవ్వడి చేస్తే ఆ అపురూపమైన భావమేదో జారిపోతుందేమోననిపిస్తుంది. వేసవి సంధ్యా సమయంలో చల్లగాలికి ఊగుతూ ఉండే ఆకులనూ, సుగంధాన్ని వెదజల్లే మల్లెలనూ, జాజులనూ చూస్తూ ఉంటే... ఆ మౌనంలో ఏదో తెలియని మధుర సంగీతం వినిపిస్తుంది. శీతాకాలం ఉదయాన్నే పూల రెక్కలపైనా, ఆకులపైనా నిలిచిన మంచుబిందువులపైన బాలభానుని కిరణాలు ప్రసరించినప్పుడు కనిపించే అందం చూస్తూ ఉంటే మౌనంగానే ఉండాలనిపిస్తుంది.
మనకి ఎంతో ప్రాణప్రియమైన వ్యక్తి ఎదురుగా ఉన్నప్పుడు ఎన్నో వేలమాటల్లో చెప్పలేని భావాన్ని మన మౌనం మాత్రమే సరిగ్గా వ్యక్తపరచగలుగుతుంది . అలాగే మనం ఎంతో ఆప్తులయిన స్నేహితులని విడిచి దూరంగా వెళ్తున్నప్పుడు కూడా మౌనమే శరణ్యమౌతుంది. మనసుకి ఎంతో ఆవేదన కలిగినప్పుడూ, ఆనందం కలిగినప్పుడూ, జీవితంలో కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలోనూ, ఇలా జీవితంలో ప్రతీ మలుపులోనూ మనం తప్పకుండా మౌనాన్ని ఆశ్రయిస్తాం. మనం అయోమయ పరిస్థితుల్లో (confusion) ఉన్నప్పుడు కాసేపు మౌనంగా ఉంటే మన మనసు తేలికపడి స్వచ్ఛమైన ఆలోచనలు (clear ideas) వస్తాయి.
ఒక రకంగా మౌనం లేని జీవితమే మనకి లేదు. అసలు మౌనంలో ఉన్నప్పుడే మనలోని మనల్ని వీక్షించే అవకాశం కలుగుతుంది. మన గురించి మనం ఆలోచించుకునే వీలుంటుంది. మౌనంగా ఉండడం కూడా ఒక hobby లాగ అలవాటు చేసుకుంటే బావుంటుంది. అప్పుడు ఈ యాంత్రిక జీవనంలో మన మనసు ఏమంటుందో వినిపించుకోవడానికి కాస్త వీలు చిక్కినట్టవుతుంది. మనసుకి ప్రశాంతతను అందివ్వాలనుకుంటే మనం ఎక్కడికో వెళ్ళనవసరం లేదు. మన గదిలోనే కాసేపు మౌనాన్ని ఆశ్రయిస్తే చాలు. వితండంగా వాదించేవాళ్ళని మౌనంతో మాత్రమే గెలవగలం.
దైవాన్ని కనుక్కోవాలంటే అది మౌనంలోనే సాధ్యం అంటారు. ఎందుకంటే దేవుడికి మౌనమే ప్రియం. దైవసృష్టి అయిన ఈ ప్రకృతిలోని మొక్కలు, పూవులు, నక్షత్రాలు, చందమామ...అన్ని మౌనంలోనే ఉంటాయి. మౌనంగా ఉన్నప్పుడే మనలోని అంతరాత్మనీ, ఆత్మనీ, పరమాత్మనీ స్పృశించగాలుగుతమని ఎంతోమంది గొప్పవాళ్ళు చెప్పారు. మౌనంతోనే ఎంతో శక్తి, ఓరిమి కూడా వస్తాయి.
మౌనం గురించి కొన్ని మంచి వాక్యాలు ఇక్కడ ఉంచుతున్నాను. చూడండి ఎంత బావున్నాయో..!
-->
“Silence is the true friend that never betrays.”
“The best answer to anger is silence.”
“Saying nothing...sometimes says the most.”
“Let us be silent, that we may hear the whispers of the gods.”
“Silence is sometimes the answer.”
“We must have reasons for speech but we need none for silence.”
సరే మరి..ఈ వారాంతపు సెలవులని బాగా ఆనందించండి. అలాగే వీలుంటే ఇంత అపురూపమైన మౌనాన్ని కాసేపు ఆస్వాదించండి.
మళ్లీ కలుద్దాం.
ప్రేమతో..
మధుర వాణి
3 comments:
Hi Madhuravani Garu,
Mouname nee bhasha o Muga Manasa....chala baagundandi.
I just want to give one suggestion....
Meeeru ilantivi raasetappudu...evaina live examples teesukunte...readers ki chadavaali ane interest baaga kalugutundi...
Keep posting this type of articles....
Hanu....
ముందుగా మీకు క్రుతజ్ఞతలు మాకు
మాకు, అన్నమయ్య సంకీర్తనలు మీకు లబిస్తె మాకు అందిచగలరు
కమలాకర్
హలో కమలాకర్ గారు..
మీరు అడిగినలాంటివి తప్పకుండా చేస్తాను. ఇంకా కొత్త కొత్త ఆలోచనలు కొన్ని ఉన్నాయి. కానీ, అవన్నీ మొదలుపెట్టడానికి కొంచెం సమయం పడుతుంది. అలాగే వీక్షకుల సంఖ్య కూడా కొంచెం పెరిగితే అప్పుడు ఇంక బావుంటుందని అనుకుంటున్నాను. ఈ blog ఇంకా పెద్దగా ఎవరికీ తెలియదండి. కొంచెం ఎక్కువ మందికి తెలియచేసే ప్రయత్నం ఏదన్నా చేయాలి.
మీకు నా ధన్యవాదాలు.
keep visiting..!
మధురవాణి
Post a Comment