Tuesday, October 07, 2008

పూసింది పూసింది పున్నాగ...పూసంత నవ్వింది నీలాగా...

"పూసింది పూసింది పున్నాగ...పూసంత నవ్వింది నీలాగా..." పాట, సినిమా తెలుగుదనాన్ని ఇష్టపడే ప్రతీ ఒక్కరి ప్రియమైన పాటల సంకలనం లో తప్పకుండా ఉంటుంది. పాట 1991 లో వచ్చిన "సీతారామయ్య గారి మనవరాలు" అనే చిత్రంలోనిది. క్రాంతి కుమార్ దర్శకత్వం వహించిన చిత్రంలో మన నటసామ్రాట్ Dr.అక్కినేని నాగేశ్వరరావు గారు, నటీమణి మీనా తాతా-మనవరాలుగా నటించారు అనడం కంటే పాత్రలకు ప్రాణం పోశారు అంటే బావుంటుంది. నానమ్మ పాత్రలో రోహిణి హట్టంగడి గారు కూడా జీవించారు. చిత్రం అంతా తెలుగు ఆచారాలు, సాంప్రదాయాలు, పల్లెటూరు, పచ్చని పొలాలు, అనురాగాలు, అనుబంధాలతో నిండి ఉంటుంది. అంటే అచ్చ తెలుగు చిత్రం అన్నమాట. చిత్రం అయిపోయేలోపు ఒక్కసారయినా కళ్ళల్లో నీరు తిరగక మానదు. అంతగా మనసుకి హత్తుకునేలా ఉంటుంది. కథానాయిక మీనా అచ్చ తెలుగు పుత్తడిబొమ్మలా లంగావోణీల్లో ఎంత అందంగా ఉంటుందో..! ఇంత చక్కటి చిత్రానికి ఇంకా చక్కటి సంగీతాన్ని MMకీరవాణి గారు అందించారు. అన్ని పాటల్లోనూ ఆహ్లాదమైన సంగీతం, దానితో పాటు అర్ధవంతమైన సాహిత్యం చిత్రానికి మరింత శోభని తీసుకొచ్చాయి. అన్నీ పాటల్లో, పూసింది పూసింది పున్నాగ అనే పాట అందరికి చాలా ఇష్టమైన పాట. పాటని SP.బాలు, చిత్ర ఆలపించారు. పాట రాసిందెవరో చాలా కష్టపడి వెతికి మరీ తెలుసుకున్నాను. అది ఎవరంటే తెలుగు పాటలకి అద్భుత సాహిత్యాన్ని అందించిన మన వేటూరి సుందరరామమూర్తి గారు. ఎందుకో ఆయనే రాసి ఉంటారని నాకు కూడా అనిపించింది.
సరే మరి...ఈ తీయని పాటని మళ్లీ ఇవాళ ఒకసారి విని ఆనందించండి.


ఇంక సెలవు ఇవాళ్టికి..!
ప్రేమతో...
మధుర వాణి

No comments: