Monday, October 27, 2008

సుమతీ శతకం పద్యం13

ఈనాటి సుమతీ పద్యం ఇదే..!

ఎప్పుడు దప్పులు వెదకెడు

నప్పురుషుని కొల్వ గూడ దదియెట్లన్నన్

సర్పంబు పడగనీడను

గప్పవసించిన విధంబు గదరా సుమతీ!

తాత్పర్యం: నల్లతాచు నీడలో నివశించే కప్ప బతుకు ఎంత అస్థిరమో ఆవిధంగానే ఎప్పుడూ తప్పులు వెతికేయజమానిని సేవించే వాడి బ్రతుకు ప్రాణభయంతో కూడినదే సుమా!

ఎలాంటి యజమాని కొలువు చేయకూడదో.. ఈ పద్యంలో వివరిస్తున్నారు. ఎప్పుడూ తప్పులు వెతికే యజమాని దగ్గర పని చేయకూడదనీ, అలా చేస్తే పాము నీడలో బ్రతికే కప్పలాగా ఎప్పుడూ అపాయమేనని అంటున్నారు.


ఏంటోనండీ.. ఈ పద్యం లో ఇలా ఉంది కానీ, అసలు అలాంటి ఉత్తమమైన బాస్ లు ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతారండీ బాబూ? అవునా కాదా...? మీరే చెప్పండి. అసలు ఉద్యోగం దొరకడమే గగనమైపోతున్న ఈ రోజుల్లో, బాస్ చాలా మంచి వాడవ్వాలని కోరుకుంటే మనకి ఇంక ఉద్యోగాలొచ్చినట్టే... కదా... :( అంటే నా ఉద్దేశ్యం బాసులందరూ విలన్లని కాదు గానీ..ప్రతీ బాస్ లో కొంచమైనా విలనిజం ఉంటుదని అన్నమాట...అంతే కదా మరి...హ్హ హ్హ హ్హ... అసలు టీ టైములో టీ తాగడం కంటే కూడా సహోద్యోగులందరూ సేద తీరేది బాస్ ని తిట్టుకునే కదా.. :)

ఏది ఏమైనప్పటికీ ఈ పద్యం మన ప్రస్తుత పరిస్థితులకి సరిగ్గా అన్వయించుకోడం కష్టమే అనిపిస్తుంది. పూర్తిగా కాకపోయినా, కొంతవరకైనా మనం బాస్ వ్యక్తిత్వాన్ని పరిగణనలోకి తీసుకోవడం అవసరమంటాను. మా స్నేహితులు కొంతమంది డాక్టరేట్ కోసం పరిశోధన చేస్తున్నారు. వాళ్ల అనుభవాలు కొన్ని విన్న తరువాత ఎవరికైనా అనిపిస్తుంది మనం ఉద్యోగం సంతోషంగా చేయడానికి బాస్ వ్యక్తిత్వం కూడా ఒక ముఖ్యమైన అంశం అని. బాస్ వచ్చి ప్రతీ అర గంటకీ ఇప్పుడేమి చేస్తున్నావు, అది వచ్చిందా, ఇది ఏమయింది, ఇందాక అయిదు నిమిషాలేమిచేసావు, ఎనిమిది గంటలకి ఒక పది నిమిషాలు ఎందుకు ఆలస్యంగా వచ్చావు, టీ తాగడానికి అయిదు నిమిషాలకంటే ఎక్కువ ఎందుకెళ్ళావు ....ఈ రకంగా కాదేదీ హింసకి అనర్హం అన్నట్టుగా...పీల్చి పిప్పి చేసేసే తింగరి బాస్ లు చాలామంది ఉంటారండీ బాబు...!! మీకు మాత్రం ఇలాంటి బాస్ లు లేకపోతే చాలా అదృష్టవంతులనుకొని దేవుడికొకసారి ధన్యవాదాలు చెప్పండి. ఒకవేళ ఇలాంటి చట్రంలో మీరు మాత్రం ఇరుక్కుపోయి ఉంటే మాత్రం.. మిమ్మల్ని ప్రభువే కాపాడాలి.. :) అలా ఉంటే మాత్రం, వెంటనే పరిగెత్తుకుని బయటికి వచ్చెయ్యండి. బతికుంటే బలుసాకు తినయినా బతకచ్చు. మరీ అంత నరకమైన ఉద్యోగం చేసి బతికేంత దుస్థితి ఎందుకులెండి...

మనకెవ్వరికీ అలాంటి పరిస్థితి ఎప్పుడూ రాకూడదని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. పనిలో పనిగా మీరందరూ కూడా ఒకసారి 'తథాస్తు' అనేయ్యండి. సరేనా..!

ఇక ఉంటాను మరి సెలవిప్పించేస్తే...


ప్రేమతో...

మధుర వాణి

2 comments:

S said...

"నల్లతాచు నీడలో నివశించే కప్ప బతుకు ఎంత అస్థిరమో ఆవిధంగానే ఎప్పుడూ తప్పులు వెతికేయజమానిని సేవించే వాడి బ్రతుకు ప్రాణభయంతో కూడినదే సుమా!"
- నాకేమిటో ఈ పోలిక అంత నచ్చలేదు. తప్పులు వెదికే యజమాని ని సేవించే వాడికి ప్రాణ భయం ఎందుకు ఉంటుంది? ఉంటే గింటే ఉద్యోగం పోతుందన్న భయం ఉంటుంది గానీ! (ఉద్యోగమే ప్రాణం కాదు. ఉద్యోగం లేకపోవడం వల్ల కొన్నాళ్ళకి మనిషికి తిండీ తిప్పల్లేక పోతాడేమో కానీ, యజమాని అతన్ని చంపడు కదా!) కనుక, పాము-కప్ప పోలిక ఇక్కడ అంత నప్పలేదేమో అనిపిస్తోంది.

మధురవాణి said...

@ S,
కొలువునీ, యజమానినీ నువ్వక్కర్లేదు అని మొహం మీద చెప్పేసి తెగతెంపులు చేసుకోడం ఈ కాలంలో సాధారణం కానీ, అప్పటి కాలానికి అది చాలా కష్టమైన విషయమనుకుంటాను.
అంతెందుకు.. ఇప్పటి కాలంలోనైనా ఉదాహరణకి PhD తీసుకుంటే ఒకోసారి సగంలోకి వచ్చాక ఉండాలో, వదిలేయ్యాలో తేల్చుకోలేని పరిస్థితులు వస్తాయి. కొన్ని సందర్భాల్లో అన్నీ ఫెయిర్ గా ఉండవు.. తప్పు యజమాని లేదా బాస్ చేసినా, మనం చేసినా తిప్పలు మనకే వస్తాయి. పైగా, వదిలేసి వెళ్లాలని ఉన్నా అన్నీసార్లు ఉద్యోగాన్ని వదిలించుకు వెళ్ళడం అంత వీజీ కాకపోవచ్చు కదా!
ఇది చిన్న విషయంలా కనిపించినా చాలా పెద్ద రిస్క్ అని చెప్పడం కోసం అంత పెద్ద పోలిక వాడారేమో మరి! :)