Thursday, October 30, 2008

సుమతీ శతకం పద్యం 14

నమస్కారం..!
ఈ రోజు మనం చూడబోయే సుమతీ పద్యం ఇదే..!

ఎప్పుడు సంపద కలిగిన

అప్పుడె బంధువులు వత్తురది యెట్లన్నన్

దెప్పలుగ జెరువునిండిన

గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ!

తాత్పర్యం: చెరువు నిండా నీరు చేరగానే వేలకొద్దీ కప్పలు అందులో చేరునట్లే సంపద కలిగిన వారి వద్దకే బంధువులు ఎక్కువగా జేరుకొందురు.


ఈ పద్యం తెలియని తెలుగు వాళ్లు దాదాపుగా ఉండరనుకుంటున్నాను. పెద్దగా చదువురాని వాళ్లు కూడా ఈ పద్యం చెప్తూ ఉంటారు. మరి ఈ పద్యం లో ఉన్న విషయం అలాంటిది కదా..!


నిజానికి ఈ పద్యం లో నీతి గురించి నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరి జీవితంలోకి తరచి చూసినా కనీసం ఒక్క అనుభవం అయినా కనిపిస్తుంది. ఒకటేమిటిలే.. చాలానే ఉంటాయి. ఈ పద్యం లో బంధువులు అన్నారు గానీ, స్నేహితులకీ, కుటుంబ సభ్యులకీ కూడా ఇది చాలా సందర్భాల్లో వర్తిస్తుంది. అంటే అందరూ అలా ఉంటారని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు గానీ, అలాగే ఎక్కువ శాతం మంది ఉంటారన్నది మాత్రం అందరూ ఒప్పుకునే వాస్తవం.


ఏదో సినిమా పాటలో చెప్పినట్టు.. డబ్బుంటే సుబ్బారావు గారు అంటారు లేకపోతే సుబ్బి గాడు అంటారు. అంటారు అంటారు కాదు గానీ..మనందరం అలాగే అంటాం కదండీ..!! ఉదాహరణకి ఎవరన్నా కోట్ వేసుకుని కనిపించారనుకోండి.. ఎవరయ్యా నువ్వు? అని ఎవరమూ అడగము కదా...వెంటనే అండీ..అనేస్తాము. అదే షాపుల్లో పని చేసే అబ్బాయిలని, కొంచెం సాదా సీదాగా కనిపించే వాళ్ళని మాత్రం 'ఆ.. ఏంటి బాబూ..ఎంటయ్యా..? అని అనేస్తాము. పొరపాటున కూడా అండీ.. అన్న మాట నోటి నుంచి వచ్చిన పాపాన పోదు. అదే మరి లోకం పోకడ అంటే.. :)


అది సరే కానీ.. మనకి జీవితంలో కస్టాలు రావడం కూడా ఒకోసారి చాలా మేలుని కలిగిస్తుంది తెలుసా..! అది ఎలా అంటే.. అసలు నిజమైన స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు ఎవరో మనకి అప్పుడే తెలుస్తుంది. నేను నిజ జీవితంలో చాలా చూసాను ఇలాంటివి. అంటే.. మీరు కూడా చూసే ఉంటారనుకోండి :) కాకపోతే నాకు తెలిసినవి చెప్తున్నానన్న మాట.. అంతే...

నా స్నేహితురాలు ఒక అమ్మాయి ఉంది. వాళ్ల అమ్మ, నాన్నగారు వాళ్ల చుట్టాలని అంటే..వాళ్ల పెద్దమ్మలు, పెద్ద నాన్నలు..ఇలాంటి వాళ్ళందరినీ ఎన్నోసార్లు ఆదుకోడమే కాకుండా, చిన్నవాళ్ళకి పెళ్ళిళ్ళు లాంటివి కూడా చేసారు. అసలు వీళ్ళింటికి ఎప్పుడు వెళ్ళినా గానీ, ఒక పెద్ద మంద ఉండేది. ఎవరో ఒకళ్ళు వారాల పాటు వీళ్ళింట్లో తిష్ట వేసేవారు. అలా ఉన్నన్ని రోజులూ బాగానే ఉన్నారు. వీళ్ళకి వ్యాపారం లో కొంచెం నష్టం రాగానే ఎక్కడ వాళ్ల మీద భారం పడుతుందేమోనని అందరూ మొహాలు చాటేశారు. వీళ్ళు పాపం కనీసం అప్పు కూడా అడగలేదు ఎవరినీ...అయినా గానీ ముందే పలాయనం చిత్తగించారన్న మాట. కానీ, నాకు బాగా బాధనిపించిన విషయం ఏంటంటే.. వ్యాపారంలో నష్టం వచ్చినదాని కంటే కూడా.. ఇన్ని రోజులు ఆత్మీయుల్లాగా ఉన్నబంధువులందరూ ఒకేసారి ఇలా నిజరూపాల్లో అవతరించేటప్పటికి పాపం వాళ్లు చాలా పెద్ద షాక్ లోకి వెళ్లిపోయారు. వాళ్లందరూ దూరమవ్వడాన్ని తట్టుకోవడం చాలా కష్టమైంది వాళ్ళకి అసలు కష్టం కంటే ముందు.. తరవాత నా స్నేహితురాలు కుటుంబం అంతా పాపం చాలా కష్టాలు పడి ప్రస్తుతానికి ఎలాగో నిలద్రొక్కుగోగలిగారు. కానీ, ఇప్పటికీ బాధపడుతూనే ఉంటారు.. మన అనుకున్నవాళ్లందరూ ఇలా చేశారనీ.. :(

అందుకే అసలు ఎవరి మీద మరీ ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదు అనిపిస్తుంది ఇలాంటివి చూసినప్పుడు... కానీ, ఇలాంటి వాటికి అతీతంగా ఒక్క నిజమైన నేస్తం ఉంటే చాలు కదండీ..! ఆ ఆసరా తో ఎన్ని కష్టాలైనా ఈదెయ్యగలం అనిపిస్తుంది.

కానీ, మనం మంచిగా ఆలోచిస్తున్నాం కదా అని అందరూ అలా ఆలోచించరు అనే కఠినమైన వాస్తవాన్ని మనం తెలుసుకోగలగాలి. అలాగే ఈ ప్రపంచంలో ఏదయినా సాధ్యమే అని గుర్తుంచుకోవాలి. అప్పుడే అన్ని రకాల సమస్యలని భరించగలిగే శక్తి మనకి వస్తుంది.


అందుకే...బంధువులొస్తున్నారూ..జాగ్రత్త సుమా..!! :)


ప్రేమతో...

మధుర వాణి

Monday, October 27, 2008

దీపావళి శుభాకాంక్షలు..!!

'దీపావళి' అంటే దీపాల వరుస అని అర్ధం. దాదాపుగా మన భారతదేశం మొత్తం ప్రజలు జరుపుకునే పెద్ద పండుగ దీపావళి. చిన్నపిల్లల దగ్గరనుంచి పెద్ద వాళ్ల దాక అందరూ చాలా రోజుల ముందునుంచే చాలా హడావుడి చేస్తుంటారు. ఎందుకంటే మరి టపాకాయల పండుగ కదా.. అందుకన్న మాట..!!
టపాసులు కాల్చుకోవడం ఒక్కటే కాకుండా దీపాలు కూడా వెలిగించండి. క్రొవ్వొత్తులు కాకుండా మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగించడానికి ప్రయత్నించండి. అలాగే టపాకాయలను కాల్చేప్పుడు జాగ్రత్త సుమా..!!

మీకు, మీ కుటుంబ సభ్యులకూ, మీ స్నేహితులకూ... అందరికీ దీపావళి అనేక శుభాలనీ, సౌఖ్యాలనీ తీసుకురావాలని, లక్ష్మీ మాత కటాక్షం మనందరికీ ఎల్లప్పుడూ ఉండాలని... మనస్పూర్తిగా కోరుకుంటూ....

ప్రేమతో...
మధుర వాణి

నన్ను చూపగల అద్దం నువ్వు కాక మరి.. ఎవరు అన్నది మనసే..!!

అభివందనం..!!
ఈ పోస్ట్ title చూసారా? అసలు ఈ వాక్యం వింటేనే ఎంత సంతోషంగా ఉంది కదా..! ఇది ఒక పాట పల్లవి. ఆ పాట గురించే నేను ఇప్పుడు మీకు చెప్పబోయేది. అసలు ఈపాట విన్నప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ పాట గురించి మీ అందరికీ చెప్పాలా అని చాలా ఉబలాటంగా ఎదురు చూస్తున్నాను. అసలు ఇలాంటి వాక్యాలు విన్నప్పుడల్లా.. అది రాయగలిగిన వారు ఎంత అదృష్టవంతులో కదా..! అంత అందమైన భావాలని వ్యక్తపరచగలగడం నిజంగా ఒక వరం. నేనూ ఉన్నాను ఎందుకు?? అనిపిస్తుంది. కానీ, మళ్ళీ అంతలోనే సంతోషంగా కూడా అనిపిస్తుంది. కనీసం ఇంత అందమైన భావాలని ఆస్వాదించే గుణం అన్నా ఉంది కదా.. అని సరిపెట్టుకుంటుంటాను. మీరేమంటారు మరి..??

ఈ పాట కూడా "ఆవకాయ బిర్యాని" సినిమాలో పాట. ఈ సినిమా ఇంకా విడుదల అవ్వలేదు. పాటలు మాత్రమే రిలీజ్ అయ్యాయి. కానీ, అప్పుడే నేను ఈ పాటలకి చాలా పెద్ద అభిమానినైపోయాను. ఒకసారి వింటే మీరు కూడా అలాగే అయిపోతారు. నాది గ్యారంటీ..!
ఇంతకు ముందుగా చెప్పినట్టుగా శేఖర్ కమ్ముల నిర్మాణంలో అనీష్ కురువిల్లా దర్శకత్వంలో మొదటి సినిమా ఇది. గోదావరి సినిమాలో రాజీని పెళ్లి చేసుకున్న రవి గుర్తున్నాడా? అతని పేరే కమల్ కామరాజు. అతనే ఈ సినిమాలో కథానాయకుడు. ఇంక హీరోయిన్ విషయానికొస్తే అచ్చ తెలుగమ్మాయి, కొత్త అమ్మాయి, పేరు బిందు మాధవి. సంగీత దర్శకుడు మణికాంత్ కద్రికి తొలి సినిమా అయినా గానీ, అద్భుతమైన, మధురమైన సంగీతాన్ని ఇచ్చాడు. మన దేశంలో ఉన్న అతి కొద్ది మంది గొప్ప saxophonists లో ఒకరైన కద్రి గోపాలనాధ్ గారి తనయుడే ఈ మణికాంత్ కద్రి. సాహిత్యం హ్యాపీడేస్ ఫేం వనమాలి అందించారు.

పాటని కార్తీక్, శ్వేత చాలా చాలా బాగా పాడారు. ఒక్కసారి ఈ పాటలోని వాక్యాలు చూసారంటే మీరు పాట వినకుండా ఉండలేరు. మీరే చూడండి కావాలంటే..!!నన్ను చూపగల అద్దం నువ్వు కాక మరి.. ఎవరు అన్నది మనసే..
నన్ను
చూపగల అద్దం నువ్వు కాక మరి.. ఎవరు అన్నది మనసే..!!

నిదురించిన
నా ఆశలు ఎదురుగ నిలిచిన నిమిషాన..
ఇన్నాళ్ళకు
నీలో నను దాచిన సంగతి కనుగొన్నా..
నిదురించిన
నా ఆశలు ఎదురుగ నిలిచిన నిమిషాన..
నేనిక
లేనా.... నువ్వయ్యానా...!!!

నన్ను చూపగల అద్దం నువ్వు కాక మరి.. ఎవరు అన్నది మనసే..
నన్ను
చూపగల అద్దం నువ్వు కాక మరి.. ఎవరు అన్నది మనసే..!!

క్షణమే... మనకై వేచీ..మనసులనే ముడి వేసీ..
కడ
దాకా... నీతో సాగే.. కలలేవో.... చిగురించే..
నిలువెల్లా
నాలోనా... తడబాటే చూస్తున్నా..!!
నిను
చేరే వేళల్లో.. తపనేదో... ఆగేనా...!!!

నన్ను చూపగల అద్దం నువ్వు కాక మరి.. ఎవరు అన్నది మనసే..
నన్ను
చూపగల అద్దం నువ్వు కాక మరి.. ఎవరు అన్నది మనసే..!!

నడిచే ఏడు అడుగుల్లో అడుగొక జన్మ అనుకోనా..!! వెలిగే కోటి తారల్లో మనకొక కోట కడుతున్నా..!!

హాయ్ హాయ్...
కొత్త కోయిల స్వరాల్లో ఈ రోజు మరో పాటను గురించి చెప్పబోతున్నాను. పైన ఈ పోస్ట్ పేరు చూసారుగా...అదే ఈ పాట పల్లవి. మధ్యనే పాటలు విడుదలయిన "ఆవకాయ బిర్యాని" అనే సినిమాలోనిది ఈ పాట. డాలర్ డ్రీమ్స్, ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్ లాంటి మంచి చిత్రాలని మనకి అందించిన శేఖర్ కమ్ముల గారు నిర్మించిన సినిమా ఇది. డాలర్ డ్రీమ్స్ నుంచి ఈనాటి దాక శేఖర్ తో పాటు తోడుగా నిలబడి, శేఖర్ అన్నీ సినిమాలకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా, కో-డైరెక్టర్ గా పని చేసిన తన స్నేహితుడు అనీష్ కురువిల్లా ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అనీష్ అంతకు మునుపు హైదరబాద్ బ్లూస్ తో ప్రసిద్ది పొందిన నగేష్ కుకునూర్ తో కూడా పని చేసారట.

త్వరలో ఈ 'ఆవకాయ బిర్యాని' సినిమా రిలీజ్ అవ్వబోతుంది. పాటలు విన్నాక సినిమా ఖచ్చితంగా బావుంటుందని నాకనిపిస్తుంది. ఈ సినిమాకి సంగీత దర్శకుడైన మణికాంత్ కద్రి కి ఇదే మొదటి సినిమా. పాటలకు సాహిత్యం హ్యాపీ డేస్ తో ప్రసిద్ది పొందిన వనమాలి రాసారు. ఈ సినిమాలో ఉన్నా ఆరు పాటల్లో ఏదీ తీసివేయదగింది కాదు. కానీ, ప్రస్తుతానికి మాత్రం ఈ పాట గురించి మాట్లాడతాను. ఈ పాట నిడివి 3 నిముషాల కన్నా తక్కువే. అయినా చాలా ఆహ్లాదంగా ఉంటుంది వినడానికి. చిత్రీకరణ కూడా అలాగే చేసి ఉండచ్చని నేను ఊహిస్తున్నాను. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ ఇద్దరూ తెలుగువాళ్ళే కావడం మరో విశేషం. సరే మరి...ఈ పాట సాహిత్యం ఒక సారి చూడండి. ఎంత బావుందో మీకే తెలుస్తుంది.
ఇంక పాట వింటుంటే ఉషోదయ వేళ చల్లని తెమ్మెరగా గాలి తెర తాకినట్టుగా ఉంటుంది.
విని చూడండి. మీకే తెలుస్తుంది..!

నడిచే ఏడు అడుగుల్లో అడుగొక జన్మ అనుకోనా..!!
వెలిగే
కోటి తారల్లో మనకొక కోట కడుతున్నా..!!
చిలకా
గోరువంక.. చెలిమే మనది కాదా..!
పిల్లా
పాపలింక.. కలిమే కలిసి రాదా..!
నేలైనా
.. ఇకనైనా.. నీ పాదాల వేలై నా.. తాకేనా..!!!

కురిసే
పండువెన్నెల్లో... కునుకే చాలు వళ్ళో...!!
మెరిసే
మేడలెందుకులే... మదిలో చోటు చాల్లే...!!
ఊగే
డోలలూ...సిరులే పాపలూ...!
నీతో
కబురులే... నా మునిమాపులు...!
కలలే నిజమయ్యే.. బ్రతుకే పంచితే చాలు.. నూరేళ్ళూ..!!!

అబ్బాయి కాలు నెల తాకకుండా గొప్పగా చూసుకుంటాను అని చెప్తూ ఉంటే.. అమ్మాయేమో నువ్వు తోడుగా ఉండే సంతోషం చాలు...మేడలు, మిద్దెలు అవసరం లేదు అని చెప్తూ ఉంది. ఎంత ముచ్చటగా ఉందో కదా..!

ఈ పాటని నరేష్ అయ్యర్, చిత్ర ఆలపించారు. మెలోడీస్ ని ఇష్టపడే వారు తప్పకుండా వినాల్సిన పాట.
మీరు
కూడా ఒకసారి విని చూడండి.

సుమతీ శతకం పద్యం13

ఈనాటి సుమతీ పద్యం ఇదే..!

ఎప్పుడు దప్పులు వెదకెడు

నప్పురుషుని కొల్వ గూడ దదియెట్లన్నన్

సర్పంబు పడగనీడను

గప్పవసించిన విధంబు గదరా సుమతీ!

తాత్పర్యం: నల్లతాచు నీడలో నివశించే కప్ప బతుకు ఎంత అస్థిరమో ఆవిధంగానే ఎప్పుడూ తప్పులు వెతికేయజమానిని సేవించే వాడి బ్రతుకు ప్రాణభయంతో కూడినదే సుమా!

ఎలాంటి యజమాని కొలువు చేయకూడదో.. ఈ పద్యంలో వివరిస్తున్నారు. ఎప్పుడూ తప్పులు వెతికే యజమాని దగ్గర పని చేయకూడదనీ, అలా చేస్తే పాము నీడలో బ్రతికే కప్పలాగా ఎప్పుడూ అపాయమేనని అంటున్నారు.


ఏంటోనండీ.. ఈ పద్యం లో ఇలా ఉంది కానీ, అసలు అలాంటి ఉత్తమమైన బాస్ లు ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతారండీ బాబూ? అవునా కాదా...? మీరే చెప్పండి. అసలు ఉద్యోగం దొరకడమే గగనమైపోతున్న ఈ రోజుల్లో, బాస్ చాలా మంచి వాడవ్వాలని కోరుకుంటే మనకి ఇంక ఉద్యోగాలొచ్చినట్టే... కదా... :( అంటే నా ఉద్దేశ్యం బాసులందరూ విలన్లని కాదు గానీ..ప్రతీ బాస్ లో కొంచమైనా విలనిజం ఉంటుదని అన్నమాట...అంతే కదా మరి...హ్హ హ్హ హ్హ... అసలు టీ టైములో టీ తాగడం కంటే కూడా సహోద్యోగులందరూ సేద తీరేది బాస్ ని తిట్టుకునే కదా.. :)

ఏది ఏమైనప్పటికీ ఈ పద్యం మన ప్రస్తుత పరిస్థితులకి సరిగ్గా అన్వయించుకోడం కష్టమే అనిపిస్తుంది. పూర్తిగా కాకపోయినా, కొంతవరకైనా మనం బాస్ వ్యక్తిత్వాన్ని పరిగణనలోకి తీసుకోవడం అవసరమంటాను. మా స్నేహితులు కొంతమంది డాక్టరేట్ కోసం పరిశోధన చేస్తున్నారు. వాళ్ల అనుభవాలు కొన్ని విన్న తరువాత ఎవరికైనా అనిపిస్తుంది మనం ఉద్యోగం సంతోషంగా చేయడానికి బాస్ వ్యక్తిత్వం కూడా ఒక ముఖ్యమైన అంశం అని. బాస్ వచ్చి ప్రతీ అర గంటకీ ఇప్పుడేమి చేస్తున్నావు, అది వచ్చిందా, ఇది ఏమయింది, ఇందాక అయిదు నిమిషాలేమిచేసావు, ఎనిమిది గంటలకి ఒక పది నిమిషాలు ఎందుకు ఆలస్యంగా వచ్చావు, టీ తాగడానికి అయిదు నిమిషాలకంటే ఎక్కువ ఎందుకెళ్ళావు ....ఈ రకంగా కాదేదీ హింసకి అనర్హం అన్నట్టుగా...పీల్చి పిప్పి చేసేసే తింగరి బాస్ లు చాలామంది ఉంటారండీ బాబు...!! మీకు మాత్రం ఇలాంటి బాస్ లు లేకపోతే చాలా అదృష్టవంతులనుకొని దేవుడికొకసారి ధన్యవాదాలు చెప్పండి. ఒకవేళ ఇలాంటి చట్రంలో మీరు మాత్రం ఇరుక్కుపోయి ఉంటే మాత్రం.. మిమ్మల్ని ప్రభువే కాపాడాలి.. :) అలా ఉంటే మాత్రం, వెంటనే పరిగెత్తుకుని బయటికి వచ్చెయ్యండి. బతికుంటే బలుసాకు తినయినా బతకచ్చు. మరీ అంత నరకమైన ఉద్యోగం చేసి బతికేంత దుస్థితి ఎందుకులెండి...

మనకెవ్వరికీ అలాంటి పరిస్థితి ఎప్పుడూ రాకూడదని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. పనిలో పనిగా మీరందరూ కూడా ఒకసారి 'తథాస్తు' అనేయ్యండి. సరేనా..!

ఇక ఉంటాను మరి సెలవిప్పించేస్తే...


ప్రేమతో...

మధుర వాణి

Sunday, October 26, 2008

మాఘ మాసం ఎప్పుడొస్తుందో... మౌన రాగాలెన్నినాళ్లో ...!!

నమస్కారం..!
మనందరికీ చాలా నచ్చే ఒక మధుర గీతాన్ని ఇవ్వాళ నేను మీకు గుర్తు చేస్తున్నాను. పైన చూసారుగా...ఆ పాట గురించే నేను మాట్లాడేది. "మాఘ మాసం ఎప్పుడొస్తుందో... మౌనరాగాలెన్నినాళ్లో..." అని మొదలయ్యే ఈ పాట 1997 లో వచ్చిన "ఎగిరే పావురమా.." అనే సినిమాలోనిది. ఈ సినిమా విడుదలైన రోజుల్లో చాలా హిట్ అయ్యి మంచిపేరు తెచ్చుకుంది. సకుటుంబ, వినోదాత్మక చిత్రాలను అందించే SV కృష్ణారెడ్డి గారి చాలా మంచి సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఆయన సినిమాలకి చాలావరకు సంగీత దర్శకత్వం కూడా ఆయనే వహిస్తారని మనందరికీ తెలుసు.

ఈ సినిమాలో పాటలన్నీ వీనులవిందుగా ఉండేవే. అయినాగానీ, ఈ మాఘమాసం పాటకు ప్రత్యేకంగా చాలా మంది అభిమానులుంటారు. గులాబీ సినిమాలోని 'ఈ వేళలో నీవు ఎం చేస్తూ ఉంటావో' అనే పాట తో పాపులర్ అయిన సునీత ఈ పాట పాడడంతో తెలుగు సినిమా ప్రపంచంలో ఒక స్థిరమైన స్థానాన్ని సంపాదించుకోగలిగింది. ఈ సినిమాలో శ్రీకాంత్, JD చక్రవర్తి హీరోలుగా నటించారు.

సినిమా ద్వారా 'లిరిల్ బేబీ' లైలా హీరోయిన్ గా పరిచయం అయింది. అమాయకమైన మొహం, చిన్నపిల్లలాంటి నవ్వు కలిగిన ఈ అమ్మాయి ఈ సినిమాలో లంగా వోణీలలో, రిబ్బన్లతో రెండు జడలు వేసుకుని చాలా ముద్దుగా ఉంటుంది. అమ్మాయి తెలుగులో కంటే కూడా, తమిళ్ లో ఎక్కువ సినిమాలు చేసి చాలా పాపులర్ అయింది. తరువాత లైలా ఒక ఇరానియన్ వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుని సినిమాల నుంచి విరమించింది. తనకి ఒక బాబు కూడా. లైలా అభిమానులందరి కోసం నేను తన కుటుంబం ఫొటోస్ ని ఇక్కడ post చేస్తున్నాను. చూసి ఆనందించండి.











ఇంక మళ్ళీ పాట విషయానికి వస్తే, ఈ పాటకి సాహిత్యం వేటూరి సుందరరామమూర్తి గారు. సాహిత్యం చాలా బావుంటుంది. ఒకసారి చూద్దామా మరి...!

మాఘమాసం
ఎప్పుడొస్తుందో.. మౌన రాగాలెన్నినాళ్లో..!
మంచు
మబ్బు కమ్ముకొస్తుందో... మత్తు మత్తు ఎన్నియెల్లో..
ఎవరంటే
ఎట్టమ్మా... వివరాలే గుట్టమ్మా...
చికుబుకు
చికు చిన్నోడోయమ్మా..!

తీపి చెమ్మల తేనె చెక్కిలి కొసరాడే నావోడు...
ముక్కు
పచ్చలు ఆరలేదని ముసిరాడే నా తోడు..
నా
.. కౌగిలింతల కానుకేదని అడిగాడే ఆనాడు..
లేతలేతగా
సొంతమైనవి దోచాడే నాడు..
ఓయ
మ్మో....ఆ.. హాయమ్మా వలపులే తోలిరేయమ్మ వాటేస్తే..
చినవాడు నా సిగ్గు దాచేస్తే....

మాఘమాసం ఎప్పుడొస్తుందో.. మౌన రాగాలెన్నినాళ్లో..!
మంచు
మబ్బు కమ్ముకొస్తుందో... మత్తు మత్తు ఎన్నియెల్లో..
ఎవరంటే ఎట్టమ్మా... వివరాలే గుట్టమ్మా...
చికుబుకు చికు చిన్నోడోయమ్మా..!

తేనె మురళికి తీపి గుసగుస విసిరాడే పిల్లగాడు..
రాతిమనసున
ప్రేమ అలికిడి చిలికాడే చినవోడు..
నా
.. కంటిపాపకు కొంటె కలలను అలికాడే అతగాడు..
ఒంటి
బతుకున జంట సరిగమ పలికించేదేనాడో..
ఓయమ్మా
.. ... వళ్ళంతా మనసులే.. తుళ్ళింత తెలుసులే..
పెళ్ళాడే శుభలగ్నం నాడూ..

మాఘమాసం ఎప్పుడొస్తుందో.. మౌన రాగాలెన్నినాళ్లో..!
మంచు
మబ్బు కమ్ముకొస్తుందో... మత్తు మత్తు ఎన్నియెల్లో..
ఎవరంటే
ఎట్టమ్మా... వివరాలే గుట్టమ్మా...
చికుబుకు
చికు చిన్నోడోయమ్మా..!

మరి మీరు కూడా ఈ పాటని మళ్లీ ఒక్కసారి గుర్తు తెచ్చుకుని ఆనందించండి..!
మళ్లీ కలుద్దాం..!!

Saturday, October 25, 2008

సుమతీ పద్యం 12

ఈ రోజు నేను చెప్పబోయే సుమతీ పద్యం తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే మననారం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం కాబట్టి. మళ్ళీ ఇన్నేళ్ళకి ఆ పద్యాన్ని గుర్తు తెచ్చుకోవడం ఒకరకంగా స్కూల్ రోజుల్ని కూడా గుర్తు చేస్తుంది నాకయితే. మీకు కూడా తప్పకుండా లాగే అనిపిస్తుందని నా నమ్మకం. ఇదే ఆ పద్యం.

ఉపకారికి నుపకారము

విపరీతముగాదు సేయ వివరింపంగా

నపకారికి నుపకారము

నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ!

తాత్పర్యం: మేలు చేసిన వానికి మేలు చేయుట గొప్ప కాదు. హాని చేసిన వానికి అంతకుముందు వాడు చేసినదోషాలను లెక్కచేయక ఉపకారం చేసేవాడే నేర్పరి.

చూసారుగా..పైన పద్యాన్ని..మీకేమనిపిస్తుంది? అదంతా నిజమే కానీ, ఈ రోజుల్లో అంత మహాత్ములెవరుంటారు? ఒకవేళ అలా చేద్దామనుకున్నా అలాంటి మనుషులు ఈ ప్రపంచంలో బతకలేరు. ఇప్పటి పరిస్థితులు అలాంటివి మరి. ఏం చేస్తాం?? అని ఒక నిట్టూర్పు విడుస్తున్నారా? మీ మనసులో ఏమనుకుంటున్నారో సరిగ్గా చెప్పానా? :)


నాకయితే ఎవరికీ ఉపకారం చేయకపోయినా ఫరవాలేదు కానీ, అపకారం మాత్రం చేయకుండా ఉండగలిగితే చాలు అనిపిస్తుంది.


మనం ప్రపంచంలో జరిగే చాలా సంఘటలని చూసినప్పుడల్లా మనసుకి చాలా బాధగా అనిపిస్తుంది. అలాగే ఈ ప్రపంచం అసలెటుపోతోంది? ఏమిటీ విపరీత సంఘటనలు..అనిపిస్తుంది. ఉదాహరణకి ఎవరి మీదో కోపంతో ఎవరో బాంబులు పెట్టి, దానికి అభం శుభం తెలియని సామాన్య ప్రజలు పార్కుల్లోనూ, హోటళ్ళలోనూ , రోడ్ల మీద ఇలాంటి మామూలు ప్రదేశాల్లో బలి అయిపోతుంటే చాలా బాధేస్తుంది. కానీ, ఏమి చెయ్యాలో అర్ధం కాదు. మతాల పేరు మీద, దేవుడి పేరు మీద, రాజకీయ పార్టీల పేరు మీద, చివరికి సినిమా హీరోల మీద అభిమానం తో కూడా గొడవలు చేసే స్థాయికి ఎదిగాం మనం. వీటన్నిటికీ పురికొల్పబడే ముందు, ఒక మనిషిగా ఒక్క నిమిషం ఆలోచించగలిగినా ఈ అనర్ధాలన్నింటిలో చాలా వరకు జరగవు కదా..!


అసలు ఈ ప్రకృతి సృష్టిలో ఎన్నో అపాయాలు ప్రాణుల చుట్టూ ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. ఎప్పుడేమి జరుగుతుందో ఎవరం చెప్పలేము. అలాంటప్పుడు బ్రతికినన్ని రోజులు సంతోషంగా గడుపుతూ, ఎదుటి వారిని బాధపెట్టకుండా బ్రతకచ్చుగా... ఈ సృష్టిలో ఏదో అతీంద్రియ శక్తి అన్నీ జీవరాసుల్నీ నడిపిస్తూ ఉంటుంది. ఆ శక్తినే మనం దైవం అంటాం. దేవుడనే వాడు మనం ఏ రూపంలో ఉన్నాడనుకుంటే ఆ రూపంలో మనకి కనిపిస్తాడు. ఏ మతం ఏ సూక్తులు చెప్పినా చివరికి నదులన్నీ సముద్రంలో కలిసినట్టుగా, మతాలన్నీ సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికీ, లోక కళ్యాణానికీ ఉద్దేశించబడినవే కదా..!


నా ఇల్లు, నా కుటుంబం, నా వాళ్లు అనుకుని నీవాళ్ళ సుఖం కోసం పాటుపడాలి. అంతే కానీ, ఏ స్వాభిమానం మితిమీరి మా ఊరు, మా రాష్ట్రం, మా భాష అనే అభిమానం కాస్తా వేరే వారి మీద ద్వేషానికి దారితీసేంత స్థాయికి వెళ్ళకూడదు కదా..!


మొత్తానికి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎన్నో జరుగుతున్నా, ఇంకా చాలా మంది మనుషుల్లో మానవత్వం ఉందని నేను నమ్ముతున్నాను. అదొక్కటే కాకుండా ఎందరో మహానుభావులు తమకి ఏ రకంగా సంబంధంలేని శరణార్ధులను ఆదుకుంటున్నారు. వారికోసమే తమ తమ జీవితాలని వెచ్చిస్తున్నారు. అలాంటి మహానుభావులందరూ మనకి తెలిసుండకపోవచ్చు. కానీ, చాలా మంది ఉన్నారు. వాళ్ల అందరి పుణ్యం వల్లే మనలాంటి మామూలు మనుషులకి ఇంకా అన్నం దొరుకుతుందని నాకనిపిస్తూ ఉంటుంది.


ఏది ఏమైనా మన వల్ల ఎవరికీ అపకారం కలగకుండా ప్రయత్నిద్దాం... ఏమంటారు మరి??


ప్రేమతో...

మధుర వాణి

Thursday, October 23, 2008

ఆడించి అష్టాచెమ్మా ఆడించావమ్మా... నీ పంట పండిందే ప్రేమ...!!

అందరికీ నమస్కారం..!
కొత్తగా మొదలుపెట్టిన కొత్త కోయిల స్వరాల్లో ఇవ్వాళ మొదటి స్వరం వినిపిస్తున్నాను :)
మధ్యనే విడుదలైన "అష్టాచెమ్మా" అనే అచ్చ తెలుగు సినిమాలోనిది పాట. జాతీయ అవార్డు గ్రహీత అయిన ఇంద్రగంటి మోహన కృష్ణ గారు సినిమాకి రచన-దర్శకత్వం వహించారు. మీకు తెలుసో లేదో గానీ.. గ్రహణం అనే సినిమా కి ఈయన కి జాతీయ అవార్డు వచ్చింది. నేను ఆసినిమా చూసాను. అది ఒక ఆర్ట్ సినిమా కాబట్టి చాలా నెమ్మదిగా సాగుతుంది. కానీ చూస్తే బావుంటుంది. ఇలాంటి సినిమాల్ని చూసే ఓపిక చాలా మందికి ఉండదనుకోండి. కానీ, మన తెలుగు దర్శకుడికి జాతీయ అవార్డు తెచ్చిన సినిమా కదా.. ఎలా ఉంటుందో చూద్దామని నేను చూసాను. నాకయితే నచ్చింది. మామూలు కమర్షియల్ సినిమాల్తో పోల్చకుండా చూస్తే మీకు కూడా నచ్చే అవకాశం ఉంది. వీలుంటే ఒకసారి ప్రయత్నించండి.
అది సరే గానీ, మళ్లీ మన అష్టా-చెమ్మా సినిమా విషయానికొస్తే, ఆట ఆడినట్లుగానే సినిమాలో కూడా నలుగురు ఉంటారు. వీళ్ళ మధ్య సాగే ఆటే సినిమా కథాంశం. ప్రిన్స్ మహేష్ బాబు చుట్టూ సినిమా కథ తిరుగుతూ ఉంటుంది. హాస్యరస ప్రధానమైన చిత్రంగా దర్శకుడు దీన్ని మలచారు. 'కలర్స్' స్వాతి, భార్గవి అనే ఇంకో అమ్మాయి ఇందులో హీరోయిన్స్ గా నటించారు. భార్గవి ఇంతకు మునుపు కొన్ని చిన్న పాత్రల్లోనూ, అమృతం లాంటి టీవీ సీరియల్స్ లోనూ కనిపించింది. సినిమాలో మొదటిసారి హీరోయిన్ గా నటించింది. నానీ, శ్రీనివాస్ అవసరాల అనే ఇద్దరు యువకులు సినిమా ద్వారా పరిచయం అయ్యారు. వాళ్ల నటనకి చాలా మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. సినిమా కి సంగీతం అందించింది కళ్యాణి మాలిక్. చాలా చక్కని సంగీతాన్ని అందించారు. ఈయన MM కీరవాణి గారి సోదరుడు. గతంలో ఆంధ్రుడు, బాస్ లాంటి చిత్రాలకి సంగీతాన్నందించారు. అలాగే కొన్ని పాటలు కూడా పాడారు. ఇంక సాహిత్యం విషయానికొస్తే, పాటలన్నీకూడా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసారు.
నేను ఇప్పుడు చెప్పబోయే పాటని శ్రీకృష్ణ పాడారు. ఒకసారి సాహిత్యం చూడండి. చాలా బావుంటుంది.
అలిగిన ప్రియురాలిని బుజ్జగిస్తూ అబ్బాయి పాడుతున్న పాట ఇది.

ఆడించి అష్టాచెమ్మా ఆడించావమ్మా... నీ పంట పండిందే ప్రేమ...
నిజంగా నెగ్గడం అంటే... ఇష్టంగా ఓడడం అంతే..!
మాటే అంటే.. చిన్నారి నమ్మదేంటమ్మా...
నిజంగా నెగ్గడం అంటే... ఇష్టంగా ఓడడం అంతే..!

ఊరంతా ముంచేస్తూ.. హంగామా చేస్తావేంటే గంగమ్మా...
ఘోరంగా నిందిస్తూ.. పంతాలెందుకు చాల్లే మంగమ్మ...
చూసాక నిన్నూ... వేసాక కన్నూ.. వెనక్కెలాగా తీసుకోనూ...
ఏం చెప్పుకోనూ.. ఎటు తప్పుకోనూ.. నువ్వద్దన్నా నేనోప్పుకోనూ...
నువ్వేసే గవ్వలాటలో.. మెలేసే గళ్ళ బాటలో...
నీదాకా నను రప్పించింది నువ్వేలేమ్మా....
నిజంగా నెగ్గడం అంటే... ఇష్టంగా ఓడడం అంతే..!

...నా నేరం ఏముందే... ఏం చెప్పిందే నీ తలలో జేజెమ్మా...
మందారం అయ్యింది.. రోషం తాకి జళ్ళో జాజమ్మా...
పువ్వంటి రూపం... నాజూగ్గా గిల్లి కెవ్ అంది గుండె నిన్న దాకా...
ఉళ్ళట్టి కోపం... వళ్ళంతా అల్లి నవ్వింది నేడు ఆగలేక...
మన్నిస్తే తప్పేం లేదమ్మా... మరీ మారం మానమ్మా..
లావాదేవీలేమీ అన్నీ కొత్తేం కాదమ్మా...
ఈ పాట మొత్తంలో నాకు బాగా నచ్చిన వాక్యం ఇదీ..

నిజంగా నెగ్గడం అంటే... ఇష్టంగా ఓడడం అంతే...!!

మీరేమంటారు మరి???


ఇంక సెలవు మరి. మళ్లీ కలుద్దాం..!