Friday, February 10, 2012

ని ని ని నిగ్రహం!

"కళ్ళు వెళ్ళిన ప్రతీ చోటుకీ మనసు వెళ్ళకూడదు.. మనసు వెళ్ళిన ప్రతీ చోటుకీ మనిషి వెళ్ళకూడదు.." అని లోకోక్తి. అలా కళ్ళ వెంబడీ మనసు వెంబడీ ముందూ వెనకా చూసుకోకుండా పొలోమని పరుగులెత్తకుండా బుద్ధి అనే పదార్థాన్ని కాస్త ఉపయోగించి వాటి అధీనంలోకి మనం జారిపోకుండా వాటినే మన చెప్పుచేతల్లో ఉంచుకోగలగడాన్నే 'నిగ్రహం' అంటారనుకుంటా. ఒక్క ముక్కలో చెప్పాలంటే, నిగ్రహం అంటే మన చిత్తచాంచల్యాన్ని అదుపులో పెట్టుకోడమన్నమాట.
చిన్నప్పుడు నాన్న వెంట మిఠాయిల దుకాణానికో, పుస్తకాల కొట్టుకో వెళ్ళినప్పుడు అక్కడ కళ్ళెదురుగా నోరూరిస్తూ కనిపించే మిఠాయిలన్నీ కొనేసుకుంటే బాగుండుననీ, కొట్లో ఉన్న రకరకాల పెన్సిళ్ళన్నీ మనింటికి తెచ్చేసుకుంటే బాగుండనీ అనిపించేది కదా.. అలాగే ఎప్పుడేది తోస్తే అది మాట్లాడెయ్యడం, ఏడవడం, నవ్వడం, ఎగరడం, గెంతడం, అరిచి గీపెట్టడం, ఉన్నపళంగా కూలబడి ఫలానాది కావాలని పేచీ పెట్టడం.. ఇలాంటివన్నీ దాదాపూ ప్రతీ ఒక్కరూ చిన్నతనంలో చేసే పనులే. కానీ, అదంతా చిన్నతనం కాబట్టి మనం ఏం చేసినా చెల్లిపోయేది. "ఇంకా చిన్నతనం కదూ.. కాస్త జ్ఞానం వస్తే అన్నీ వాళ్ళే తెలుసుకుంటార్లే.." అంటూ పెద్దవాళ్ళు కూడా పిల్లల చేష్టలని చూసీ చూడనట్టు పోతుంటారు.చిన్నప్పుడు ఇంట్లోనూ, బళ్ళోనూ నిత్యం మనకి కాపలా కాస్తూ "ఇది చెయ్యొద్దు, అలా చెయ్యాలి.." అంటూ వెంటపడి మనల్ని పద్ధతిగా సరైన దారిలో నడిపించడానికి చుట్టూ బోలెడు మంది. అదే ఇప్పుడైతే మనం పెద్దయిపోయాం కదా మరి.. అంచేత మనకి గొప్ప జ్ఞానంతో పాటుగా ఎప్పుడేది చేయాలో, దేన్ని ఎంతవరకూ తెలుసుకోవాలో బోల్డంత విజ్ఞత వచ్చేసింది(?) అని తలచి అందరూ మనల్ని "నీ అంతట నువ్వు సొంతంగా ఏదోక దారిలో నడవవోయ్.." అని లోకం మీద వదిలేస్తారు. పైగా మనం ఎదిగే కొద్దీ అవసరం అయినవీ కానివీ లెక్కలేనన్ని విషయాలు తెలిసిరావడం పుణ్యమా అని మరింత గందరగోళం అయ్యే అవకాశం కూడా ఉంది. ఏతావాతా అన్నీ కలగలిపి ఇప్పుడు చచ్చినట్టు తెలిసొస్తుంది బతుకులో ఉన్న అసలు మజా ఏంటని.. ;)
మీరే చెప్పండి.. ఎవరికన్నా సలహాలు ఇవ్వడం, సుద్దులు చెప్పడం మహా సులువు గానీ మనకి మనం బుద్ధి చెప్పుకోడం ఎంత కష్టమైన పని అసలు.. నిర్మొహమాటంగా, నిర్దాక్షిణ్యంగా మన లోపాలు మనమే ఎంచి, "నువ్వు మారాల్సిందేనోయ్.." అని గొంతెత్తి అరిచి మరీ మనసు చెవి మెలిపెట్టి అదుపాజ్ఞలలో ఉంచడం.. హబ్బా.. మాటల్లో చెప్తుంటేనే నీరసం వచ్చేస్తోంది బాబూ.. చేతల్లో అంటే ఇంకెంత కష్టమో కదా.. ప్చ్.. :(
అసలు ముందు మనం ఫలానా విషయంలో నిగ్రహం పాటించాల్సిన అవసరాన్ని నిజాయితీగా గుర్తించడానికి తెగ సతమతమైపోయి, ఎలాగో అతి కష్టం మీద నిజాన్ని ఒప్పుకుని, సరే ఏమైతే అయింది ఘాట్టిగా ప్రయత్నం చేద్దామన్న నిర్ణయానికొచ్చి, రకరకాల వ్యూహాలు పన్నుతూ మన మీద మనమే గెలవడానికి యుద్ధాలు చేస్తూ, గెలిచామన్న ఆనందంలో మళ్ళీ ఓడిపోతూ, ఓడిపోతున్నామేమో అన్న బెంగలో అప్పటికప్పుడు ఏదోక మెట్టవేదాంతాన్ని ఆశ్రయించి మనకి మనం సర్ది చెప్పుకుంటూ...... చెప్తూ పోతే ఇదొక అంతు లేని కథ. కాదంటారా? ;)
సరదాగా కొన్ని ఉదాహరణలు చూద్దాం..
ఏదో కొంపలు మునిగిపోయే రాచకార్యాలని చక్కదిద్దుతున్నట్టు పది నిమిషాలకోసారి జీమెయిల్ చూసుకోడం.. పక్కన ఆఫీసులో చెయ్యాల్సిన ముఖ్యమైన పనులు బోలెడు ఉండి కూడా... ఐదు నిమిషాలు కూర్చుని ఫేస్బుక్లోనో, ప్లస్లోనో అప్డేట్స్ చూసి వెళదాం లెమ్మని ఐదు నిమిషాలు అనుకున్నది కాస్తా అరగంటవ్వడం..బ్లాగులో కొత్త పోస్ట్ రాసిన పాపానికి ఎవరన్నా దయ తలచి కొత్త కామెంటు రాసారేమోనని పదే పదే చెక్ చేసుకోవడం..ఈనాడు పేపర్, ఐడిల్ బ్రెయిన్, గ్రేటాంధ్రా తదితర వెబ్సైట్లు అర నిమిషానికోసారి రిఫ్రెష్ చెయ్యడం..
(
ఇందులో ఎవరెవరి ఓపికని బట్టి వాళ్ళు ఆర్కుట్లూ, ట్విట్టర్లూ, మన్నూ మశానం అంటూ ఇంకా మన దుంప తెంచేవి ఎన్నున్నా.. అవన్నీ కలిపేసుకోవచ్చు. రాయైయేతేనేం! ;)రోజంతా 'క్రికిన్ఫో' లోనే తచ్చాడింది చాలక తెల్లవారి ఆఫీసులో మీటింగున్నా సరే అర్ధరాత్రుళ్ళు అరగంటకోసారి లేచి మరీ ఐఫోన్లో క్రికెట్ స్కోర్లు చూసుకోవడం..టీవీ సీరియల్ టైముకి చూడలేకపోతే ఎపిసోడ్లో హీరోయిన్ వాళ్ళ అత్త విషం కలిపిచ్చిన పాలు తాగేసి చచ్చిందా లేదా అన్న టెన్షన్ తో మనం చచ్చిపోవడం..యాంగ్రీ బర్డ్స్, గాడిద ఎగ్సూ ధ్యాసలో పడిపోయి తిండీ, నిద్రే కాకుండా అసలు కనురెప్పలు వాల్చడం కూడా మర్చిపోయేంతగా వీడియో గేమ్స్ ఆడటం..బ్లాగుల్లోనో, టీవీలోనో వంటల ఫోటోలూ, ప్రోగ్రాములూ చూసి అప్పటికప్పుడు ఆకలేసేసి అవే తినాలనిపించి పిచ్చెక్కిపోడం..బజ్లోనో, ప్లస్లోనో వాడి వేడి చర్చల్లో ఎడాపెడా కామెంట్సు రాస్తూ రాస్తూ ఎప్పటికో యథాలాపంగా గడియారం కేసి చూసుకుని కెవ్వుమనడం..వగైరా..
అసలిలాంటివన్నీ చూస్తుంటే మనోనిగ్రహం, ఆత్మనిగ్రహం మాదిరి నెట్టిగ్రహం (నెట్టు మీద నిగ్రహం :P) అని ఒక పదం కనిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనిపిస్తుంది. :Dఅసలు కన్నా ఫేకు ముద్దన్నట్టు.. నిజ జీవితంలో వాటి కన్నా మిథ్యా ప్రపంచంలోని విషయాల్లో నిగ్రహంగా ఉండటం మరింత కష్టమేమో అనిపిస్తుంటుంది నాకు. బయట ప్రపంచంలో కన్నా నెట్ ప్రపంచంలో మన వ్యాపకాలకి రెండో వ్యక్తి ప్రమేయం అక్కర్లేకపోవడం, మన చుట్టూ ఉండే వాళ్ళెవరి నియంత్రణ దాదాపుగా ఉండకపోవడం, మరీ ముఖ్యంగా వేదికపై ఎప్పుడూ శూన్యత అనే పరిస్థితికి ఆస్కారమే లేకుండా ఎవరున్నా, ఎవరు పోయినా, ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతూ డైనమిక్ గా, లైవ్లీ గా ఉండటం.. ఇవన్నీ కొంతవరకూ కారణాలేమో మరి!
అన్నీటికన్నా విచిత్రం ఏంటంటే, ఎవరికి వారు.. "ఆఫ్టరాల్.. ఇదొక మిథ్యా ప్రపంచం.. ఊహాలోకం లాంటిది.. నా నిజ జీవితానికి దీని వల్ల ఒరిగేదీ, పోయేదీ ఏమీ లేదు. అంచేత నేనసలు చాలా తేలిగ్గా తీసుకుంటాను.." అని అనుకుంటూనే (అనుకుంటున్నామన్న భ్రమలోనా!?) వాళ్ళకి తెలీకుండానే ఇక్కడ జరిగే ప్రతీ విషయానికీ నిజజీవితంలో మాదిరే స్పందిస్తూ, విలువనిస్తూ పోతారు.ఇక్కడ కూడా పరిచయాలూ - స్నేహాలూ, అనుబంధాలూ - ఆత్మీయతలూ, అపార్థాలూ - గొడవలూ, వాదాలూ - ప్రతివాదాలూ, కక్షలూ - కార్పణ్యాలూ, కుట్రలూ - కుతంత్రాలూ, తిట్లూ - దీవెనలూ, నవ్వులూ - ఏడుపులూ... అన్నీ అచ్చంగా నిజ జీవితంలో మాదిరే అనుభవిస్తున్నామన్నది నిజం కాదంటారా?
ఇప్పుడు నిగ్రహం లేకపోవడం వల్ల వచ్చే ఇంకో రకం కష్టాలు చూద్దాం ..
బజార్లో షాపుల ముందున్న డిస్కౌంట్ బోర్డులో లేక డిస్ప్లేలో ఉన్న అందమైన బట్టలనో చూసి మంత్రం వేసినట్టు లోపలికెళ్ళిపోయి పర్సులు ఖాళీ చేసుకొచ్చుకోవడం..స్నేహితులో, పక్కింటి వాళ్ళో కొనుక్కున్న కొత్త నగల్ని చూసి అప్పులు చేసి మరీ బంగారం కొనుక్కోడం.. ఒక్క రోజుకీ పిజ్జా తినేస్తాను.. రేపటి నుంచి మాత్రం జంక్ ఫుడ్ తినకుండా ఆరోగ్యకరమైన తిండే తింటాను అని గోడ మీద రాసి పెట్టుకోడం..బ్యాంకు వాడు గారంగా అడిగాడు కదాని డామ్మని పడిపోయి లోన్లు తీసుకుని తర్వాత ఏళ్ళ తరబడి వాటిని కట్టలేక సతమతమైపోడం,క్రెడిట్ కార్డు వాడు అడక్కముందే బోల్డు లిమిట్ ఇచ్చాడని మురిసిపోయి ఎడాపెడా గీకెయ్యడం..కొత్తగా రిలీజ్ అయిన మాక్ బుక్కో, ప్యాడో, సెల్ ఫోనో చూసి ఇంట్లో ఉన్న ఇద్దరు మనుషులకీ నాలుగో గాడ్జెట్ కొనడం..
ఇవన్నీ సంసారపక్షమైన సమస్యలన్నమాట.. :D ఇలాంటివి ఎవరికి వారు గుర్తించి బయటపడాల్సిందే తప్ప.. రెండో వ్యక్తి చూస్తూ ఊరుకోడం తప్ప పెద్ద చెయ్యగలిగిందేమీ లేదు.. పైగా, ఇలాంటి విషయాల్లో నిగ్రహం కోల్పోతే వాటి పరిణామాలు దీర్ఘకాలికంగా భరించాల్సి వస్తుంది. ఇలాంటివి ఒకటీ రెండు సార్లు పడి లేస్తే ఎవరైనా సరే తప్పకుండా నేర్చేసుకుంటారని నాకనిపిస్తుంది.ఇంకో రకం కూడా ఉంది..అచ్చంగా మనసుకీ, భావోద్వేగాలకీ సంబంధించిందీ.. నవ్వు, ఏడుపు, నొప్పి, బాధ, కోపం, ఇష్టం, ప్రేమ, ద్వేషం, అభిమానం, అసహ్యం... ఇలాంటివి ప్రదర్శించడంలో నిగ్రహం చూపడం..సాధారణంగా ఇలాంటి వాటి గాఢత, మనిషిపై వాటి ప్రభావం, తదనంతర పరిణామాలు కొంచెం తీవ్రంగానే ఉంటాయి. చిత్రం ఏంటంటే, ఇవి నిజ జీవితంలోనూ, మిథ్యా ప్రపంచంలోనూ సర్వ కాల సర్వావస్థల్లోనూ మన వెన్నంటే ఉంటాయి.
మనమూ, మన సంతోషమో, బాధో ముఖ్యం అనుకున్నవాళ్ళు మన మనసెరిగే ప్రవర్తిస్తారు. అలాక్కాదూ.. మాకదేం తేడా పడదని పట్టించుకోని వాళ్ళని మనం కూడా వదిలెయ్యడానికి సిద్ధపడాలి. అనుచితమైనదాని వైపే పదే పదే మనసు పరిగెడుతుంటే కాస్త పగ్గాలేసి వెనక్కి లాగి కూర్చోబెట్టాల్సిందే తప్పదు. అదే కదా మరి నిగ్రహం అంటే!
చిన్నప్పుడు ఇంటికి ఎవరైనా వస్తారని తెలిస్తే వాకిలి దగ్గరే కాలు కాలిన పిల్లిలా తెగ పచార్లు చేస్తుంటే మా అమ్మ నవ్వుతూ "ఎందుకే అంత ఆత్రం.. వాకిలి దాకా వచ్చినవాళ్ళు ఇంట్లోకి రాకుండా పోతారా?" అని నవ్వేది. అలాగే, నిజంగానే మన దగ్గరికి రాదలచుకున్న వాళ్ళు, మాట్లాడదల్చుకున్న వాళ్ళు గుమ్మం దాకానో, ఫోన్ దాకానో వచ్చి వెనక్కి వెళ్ళిపోరు కదా.. మనం కాస్త మనోనిగ్రహం పాటించి చాదస్తం తగ్గించుకుని అతిగా ఆలోచించడం మానేస్తే.. అదే మనసుకి సరైన మందు. అలాగే ఎప్పుడూ గుడ్డిగా మనసు మాటే కాకుండా అప్పుడప్పుడూ బుద్ధి మాట కూడా వింటే సరి.. దారి తప్పిపోకుండా ఉంటాం.
అదన్నమాట సంగతి.. ఇంతకీ మీరు విషయంలో నిగ్రహాన్ని సాధించాలో ఆలోచించుకున్నారా మరి? ;)

28 comments:

Lasya Ramakrishna said...

నిగ్రహం గురింఛి బాగా చెప్పారు.

కాయల నాగేంద్ర said...

నిగ్రహం కోల్పోతే దాని వల్ల జరిగే అనర్థాల గురించి
చాలా చక్కగా వివరించారు. ప్రతి ఒక్కరికి ఉపయోగ
పడేలా రాసారు.

కృష్ణప్రియ said...

నిజమే. నేనైతే ఊరగాయలు తినకుండా, తెలుగు సినిమాలు చూడకుండా నిగ్రహం గ ఉందామని ఎప్పుడూ విఫలమౌతూనే ఉంటాను.. :-(((


(కింద రాసింది..ఊర్కే సరదాకి....)

పర్వాలేదు లెండి. ఏ వయసుకి ఆ ముచ్చట.(ఏ వయసు కి కోల్పోవాలనిపించే నిగ్రహాల లిస్టు వేరేవి ఉంటాయి కదా) అన్నీ కాకపోయినా, కొన్ని నిగ్రహాలు అప్పుడప్పుడూ కోల్పోతూ ఉంటేనే మజా.

షుగర్ బాగా ఉన్నవాళ్లు అప్పుడప్పుడూ ఐస్క్రీం లూ, బీపీ ఉన్న వాళ్లు ఊరగాయలూ, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్లు అరకేజీ నూనె తో చేసిన వంటలూ.. బరువెక్కువైన వాళ్లు పైవన్నీ,..

మనం వస్తున్నామని గుమ్మం దగ్గర ఎవరైనా తచ్చాడుతూ ఉన్నారు అని తెలిస్తే మనకెంత బాగుంటుంది?

మరీ నిగ్రహం మూర్తీభవించిన మనిషి లా ఉంటే, జీవితం బొత్తి గా యాంత్రికమైపోతుంది. అలాగే, ఫలానా మధురవాణి/కృష్ణప్రియ లని చూడు ఎంత 'నిగ్రమో' నువ్వూ ఉన్నావు ఎందుకూ... అన్న మాటలు పడ్డవారంతా మనకి శత్రువులైపోతారు.. ఏమంటారు?

Zilebi said...

మధుర వాణీ గారు,

ఏమి నిగ్రహం మాటో, మీ మాయో గాని, మీ టపా చదవకుండా మాత్రం నిగ్రహించు కోలేక పోతున్నా నండీ!!

చీర్స్
జిలేబి.

పరుచూరి వంశీ కృష్ణ . said...

బాగుంది మధురవాణి గారు ... బాగా రాసారు ....ఉదాహరణలు సూపర్

జ్యోతిర్మయి said...

అయ్య బాబోయ్ మధురవాణీ గారూ మీగ్గానీ టెలీపతీ ఉందే౦ట౦డీ..ఈ నెట్టిగ్రహం గురించి, బ్లాగ్ గురించి ఈ రోజు మధ్యాహ్నం బీష్మ ప్రతిజ్ఞ చేసుకున్నాను రోజుకు మూడొందల సార్లు మైయిల్ చూడకూడదని, ముప్పై రోజులు (నా)బ్లాగుకు దూరంగా ఉంటాననినూ..పోస్ట్ రాస్తే పబ్లిష్ చేస్తాను అంతే. బ్లాగ్ మొదలెట్టిన కొత్తలో ఇలా ఉంటుందేమో అనుకున్నాను. మీర్రాసింది చదివాక నిగ్రహం చాలా అవసరమని అర్ధమయ్యింది..నా ముప్పై రోజుల వ్రతం దిగ్విజయంగా పూర్తవ్వాలని నాకోసం మొక్కో౦డే౦.

వనజ తాతినేని said...

ఇక్కడ కూడా పరిచయాలూ - స్నేహాలూ, అనుబంధాలూ - ఆత్మీయతలూ, అపార్థాలూ - గొడవలూ, వాదాలూ - ప్రతివాదాలూ, కక్షలూ - కార్పణ్యాలూ, కుట్రలూ - కుతంత్రాలూ, తిట్లూ - దీవెనలూ, నవ్వులూ - ఏడుపులూ... అన్నీ అచ్చంగా నిజ జీవితంలో మాదిరే అనుభవిస్తున్నామన్నది నిజం కాదంటారా?

నిజంగా నిజం మధురా..

మనసు చెప్పిందే కాదు.. బుద్ది చెప్పింది కూడా వినాలి. అప్పుడే నిగ్రహం..
చాలా బాగా చెప్పారు.

nsmurty said...

"The only way to get rid of temptation is to yield to it." said Oscar Wilde.

I follow him faithfully.

sandeep said...

నిగ్రహం గురించి "నిగ్రహం" లేకుండా భలే చెప్పారు :)

బులుసు సుబ్రహ్మణ్యం said...

నెట్టుగ్రహం, కామెంటుగ్రహం పాటించి ఆ గ్రహాలని దగ్గరకు రానీయకుండా సెంటిమెంటు గ్రహాన్ని తరిమేసి కళ్ళు మూసుకొని కూర్చుందామని ని గ్రహాన్ని తెచ్చుకున్నాను.
అయినా కామెంటు పెట్టకుండా ఉండలేకపోయాను.

చాలా బాగా వ్రాసారు. ఈ గ్రహాలన్నిటికి మనం బందీలం...... దహా.

రాజ్ కుమార్ said...

hmm... నెట్ నిగ్రహం... కష్టమే..
ఆల్రెడీ అందరూ ఇదే స్టేజ్ లో ఉన్నారేమో.. ;) ఏమో ఏంటీ ఉన్నాం. ;) ;) )

MURALI said...

నేను చాలా విషయాల్లో నిగ్రహం పాటించాలి. ముఖ్యంగా డబ్బులు ఖర్చుపెట్టే విషయం లో :(

వేణూశ్రీకాంత్ said...

hmmm అన్నీ తెలిసిన విషయాలే కానీ ఆచరణే కష్టం. మంచి విషయం గురించి రాశారు. గుడ్.

శేఖర్ (Sekhar) said...

ని ని ని నిగ్రహం! ... మనసులో ఉండే బావాలని కళ్ళకు కట్టినట్లు చెప్పారు....నిగ్రహం లేక తరువాత దాని వల్ల వచ్చే problems తో వేగలేక చావాలి....ఈ నెట్ నిగ్రహం పాటించక తప్పదు.....అందరికి తెలిసినవే ఐన ఆలోచించే విధం గా ఉంది మీ ఆర్టికల్...థాంక్ యు

Anonymous said...

It is a fact, not a joke

నిషిగంధ said...

చక్కగా చెప్పావ్, మధురా! బుద్దికి తెలుస్తూనే ఉంటుంది కాస్త ఎక్కువ చేస్తున్నామని.. కానీ ఎప్పటికప్పుడు మనసు దాన్ని అదిలించేస్తుంటుంది! విషయం ఏదైనా దాన్ని మనం కంట్రోల్ చేయగలిగి ఉండలి కాని అది మనల్ని కంట్రోల్ చేసే స్థాయికి వెళ్తే కష్టమే కదా!

Chandu S said...

"వాకిలి దగ్గరే కాలు కాలిన పిల్లిలా తెగ పచార్లు చేస్తుంటే "

మీ అమ్మ గారు నవ్వే వారా? ఎంత మంచివారో. మా అమ్మ వీపు మీద ఒకటేసేది.

ఇకనుండి కంద మూలాలు ట్రై చేస్తూ, గ్రీన్ టీ మాత్రం సేవిస్తూ ఆరోగ్యాన్ని కాపాడేద్దాం పొద్దున్నే అనుకున్నాను. ఇంటికొచ్చేసరికి మీ పోస్ట్. సరే నని, అన్నమూ ఆవకాయ కొంచం నెయ్యితో సగం పోస్ట్, మీగడ పెరుగుతో మిగతాదీ చదివి, చివర్న ఈ వాక్యం చూసి

"ఇంతకీ మీరు ఏ విషయంలో నిగ్రహాన్ని సాధించాలో ఆలోచించుకున్నారా మరి? ;)"

ఇంతకూ మధుర వాణి నా మీద పోస్ట్ రాశారెందుకో నని ఆలోచిస్తున్నాను. రేపటి నుండీ ప్రతిదీ నిగ్రహమే, పచ్చ గడ్డి ఫల హారమే .
Thanks for a good post

Anonymous said...

నిగ్రహం మరీ ఎక్కువైపోతే విగ్రహం (మీరాకుమార్ లాగా) అయిపోతామేమో?

మాలా కుమార్ said...

నిగ్రహం మీద బాగా రాసావు :)

సి.ఉమాదేవి said...

రాత్రి పొద్దుపోయినా నిగ్రహాన్ని తరిమికొట్టి చదివింప చేయగలడం మధురవాణి అనుగ్రహం!

Anonymous said...

:-) బావుంది. మొత్తం మీద చాలా డిఫెరెంట్ టపా తొ వచ్చారు.

మనకి జీవితంలొ ఏం కావాలొ, ఏం సాధించాలనుకుంటున్నామో, మనం మిగతా జీవితాన్ని ఎలా గడపాలనుకుంటున్నామో ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటే ఏ ఏ విషయాల్లొ నిగ్రహం పాటించాలొ తెలుస్తుంది. అన్ని విషయాల్లొ నిగ్రహం పాటించక్కర్లేదు అని నా అభిప్రాయం.

ఉదాహరణకి మీరు నాకు ఫలానాది కావాలి, అది దక్కాలంటే ఇది చెయ్యాలి, ఆ పని మీద ఇంత సమయం వెచ్చించాలి... అది చెయ్యడానికి ఈ నెట్ అడ్డుపడుతుంది అనుకుంటే నెట్ విషయం లొ నిగ్రహం పాటించొచ్చు. ఇప్పుడున్న రొజు వారి కార్యక్రమాలతొ జీవితం సాగిపొతే చాలు, ఇంతకు మించి జీవితం లొ ఇంకేం అక్కర్లేదు అని సంత్రుప్తి పడేవాళ్ళు నెట్ విషయం లొ నిగ్రహం పాటించక్కర్లేదు.

నా ఉద్దేశ్యం లొ దీనివల్ల మనం ఎదన్నా కొల్పొతున్నాం అన్న ఫీలింగ్ రానంతవరకూ ఏ విషయం లోనూ నిగ్రహం గురించి అలొచించక్కర్లేదు. కొల్పొతున్నాం అని కూడా తెలియకపొతే .. పాపం పూర్ ఫెలొస్ :-)

KumarN said...

Very Comprehensive.
Well written.

మంచు said...

ఈ పొస్ట్ కి కామెంట్ పెట్టకుండా నిగ్రహించుకొవడం కాస్త కస్టమే. అశ్లీల సినిమాల వల్ల సమాజం చెడిపొతుంది అంటూ అవే సినిమాల క్లిప్పింగ్స్ టివీలలొ పదే పదే చూపించే మీడియాలా సొషల్ నెట్వర్కింగ్ మీద రాసిన టపాలొనే ఎక్కువ వాదించను లెండి ... నా అభిప్రాయం క్లుప్తం గా చెప్పేసి పొతాను :-))

ఏ విషయం లొ అయినా అతి మంచిది కాదు, మితంగా ఉంటే అన్ని లాభాలే అని తెలుసుకొలేనంత చిన్న పిల్లలు ఇక్కడ లేరండి... అంటే బ్లాగుల్లొ, ఈ ప్లస్ సమూహం లొ. వైన్ అయినా మితం గా పిచ్చుకుంటే బొల్డు లాభాలు, దేవుడి మీద ఉన్న నమ్మకం లొ అతి చూపించినా అది అనర్ధదాయకమే.

అయితే వారికి ఎంతవరకూ ఉంటే మితమో ,ఏ లిమిట్ దాటితే అది అతొ ... అతి కి మితి కి మద్య ఉన్న గీతని తెలుసుకొవడం లొనే ఎంతొ "తెలివయిన వారు" "ఎంతొ సెన్సిబిల్ అనిపించున్న వారు" కూడా విఫలం అవుతుంటారు.

అలాగే ఈ విషయం లొ అతి కి మితి కి మద్య ఉన్న లిమిట్ అందరికి ఒకేలా ఉండదు. డాక్టెరట్ చేసి రీసెర్చ్ చేస్తున్న సైంటిస్ట్ అయిన మీకు ఈ నెట్వర్కింగ్ మీద స్పెండ్ చేసే టైం ఎంత లిమిటడ్ గా ఉంటుందొ... కొన్ని రంగాల్లొ (మీడియా, ప్రొఫెషనల్ రైటింగ్) ఉన్నవారికి ఇది ఒక అవసరం, ప్రజల నాడి తెలుసుకొవడానికి ఒక అవకాశం. అందువల్ల ఎవరికి వారు వాళ్ళ లిమిట్ వారు తెలుసుకొవాలి.

మధురవాణి said...

@ లాస్య రామకృష్ణ, కాయల నాగేంద్ర, పరుచూరి వంశీకృష్ణ, సందీప్, మాలా కుమార్, కుమార్ N..
నేను రాసింది మీ అందరికీ నచ్చినందుకు సంతోషంగా ఉంది. స్పందించిన మిత్రులందరికీ బోల్డు ధన్యవాదాలు.. :)

@ కృష్ణప్రియ,
హహ్హహ్హా.. మీకు ఊరగాయల విషయంలో నిగ్రహం అవసరమా.. నాకైతే నెయ్యి దగ్గర చా...లా అవసరం.. :(

బాగా చెప్పారు. అయినా అంత బుద్ధిగా అన్నీటిల్లో టక్కున నిగ్రహం వచ్చేస్తుందేంటీ.. ఎప్పటికప్పుడు నిగ్రహం నిగ్రహం అంటూ అనుకుంటూ నిగ్రహం కోల్పోడం.. ఎక్కువసార్లు జరిగేది అదే కదా! ;) మీరన్నట్టు కొన్నిసార్లు అదో సరదాలెండి.. :)

<<మనం వస్తున్నామని గుమ్మం దగ్గర ఎవరైనా తచ్చాడుతూ ఉన్నారు అని తెలిస్తే మనకెంత బాగుంటుంది?

బాగుంటుంది బాగుంటుంది.. కానీ, కొన్నాళ్ళకి మరీ లోకువైపోయి ఆ బాగుంటుందన్న విషయాన్ని కూడా మొహం మీద చూపెట్టకుండా భలే ఫోజు కొడతారు కొంతమంది.. అప్పుడు ఉక్రోషం కొద్దీ, పంతం కొద్దీ అయినా అలా గుమ్మం పట్టుకు వేళ్ళాడటం బలవంతంగానైనా సరే మానెయ్యాలనిపిస్తుంది. :P

నిజమే సుమీ.. భలే లాజిక్ గుర్తు చేశారుగా అసలు.. అవునంవును.. అలా శత్రువులు తయారవ్వకుండా ఉండటం కోసమైనా మనం అప్పుడప్పుడూ నిగ్రహం కోల్పోతున్నట్టు (నిజానికి మనసులో నిగ్రహం లేదని తెగ బాధపడిపోతూ) నటిస్తుండాలి. :))))

Thanks a lot for you comment.. :)

మధురవాణి said...

@ జిలేబీ,
హహ్హహ్హా..
తెల్సా.. నా బ్లాగు చదవడం లాంటి మంచి విషయాల్లో అస్సలంటే అస్సలు నిగ్రహం పాటించక్కర్లేదండీ.. :))))
ధన్యవాదాలు.. :)

@ జ్యోతిర్మయి,
హహ్హహ్హా... అయితే మీ మనసులో మాటలు నేను రాసానన్నమాట.. భలే భలే.. :))
కానీ, ఈ విషయంలో మీరేం పెద్దగా వర్రీ అవ్వక్కర్లేదండీ.. బ్లాగు మొదలు పెట్టిన కొత్తల్లో చాలామంది (నాతో సహా..) అంతే.. ఆ కొత్త ఉత్సాహం అలా ఉంటుందిలెండి.. కొన్నాల్లితే మాములైపోతుంది.. అయినా సరే, మీరు ముప్పై రోజుల దీక్ష పట్టారు కాబట్టి మీ వ్రతం సఫలం కావాలని కోరుకుంటున్నా.. :)))

@ వనజ వనమాలి,
నా వరకు నాకైతే అనుభవపూర్వకంగా నిజమే అనిపించిందండీ.. అందుకే అలా చెప్పాను. నా అభిప్రాయంతో ఏకీభవించినందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలండీ.. :)

@ nsmurty,
హహ్హహ్హా... Good one.. timely quote.. Thanks for sharing with us! :)

మధురవాణి said...

@ బులుసు గారూ,
హహ్హహ్హా.. మీ కామెంట్లు చూసి నవ్వకుండా నిగ్రహించుకోడం అస్సలు చేత కావట్లేదండీ.. మీరేమన్నా చిట్కాలు గట్రా చెప్తారా? ;)
బాగా చెప్పారు.. నిజమే.. ఈ గ్రహాలన్నీటికీ మనం బందీలం.. :)

@ రాజ్ కుమార్,
కదా రాజ్.. All In The Same Boat! :))

@ మురళీ,
అదొక్కటే సమస్య అయితే పర్లేదులే మురళీ.. భవిష్యత్తులో మిసెస్ మురళి చూసుకుంటారు కదా దాని సంగతి.. :D

@ వేణూ శ్రీకాంత్,
థాంక్యూ.. అదే కదా చిక్కంతా.. ఇలాంటివన్నీ చెప్పడం చాలా వీజీ.. చెయ్యడం మాత్రం బోల్డు కష్టం.. :)

@ శేఖర్,
నా అభిప్రాయాలతో ఎకీభావిన్చినందుకు సంతోషమండీ.. వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు. :)

మధురవాణి said...

@ అనానిమస్ 1,
నేను రాసిన విధానం కాస్త సరదాగా ధ్వనించినా నేను నిజమనే ఉద్దేశ్యంలోనే చెప్పానండీ.. జోక్ అని అనుకోవట్లేదు. థాంక్స్ ఫర్ ది కామెంట్. :)

@ నిషిగంధ,
బాగా చెప్పావ్ నిషీ.. బుద్ధికీ, మనసుకీ నిమిషమన్నా పడదుగా మరి అసలు.. ఎప్పుడూ కొట్టేసుకుంటూనే ఉంటాయి.. మధ్యన తీర్పులు చెప్పలేక మనం సతమతమైపోతూ ఉంటాం.. :))

@ చందు S,
హహ్హహ్హా.. శైలజ గారూ.. మా అమ్మకి అసలు దెబ్బలేసే అలవాటు లేదులెండి.. అప్పుడప్పుడూ వేస్తానని మాత్రం బెదిరించేది అంతే.. :))

బాగుంది బాగుంది మీ ఫుడ్ ప్లాన్.. ఇలా జరుగుతుందనే మరి 'ఆరోగ్యకరమైన తిండి' విషయంలో మన నిర్ణయాన్ని రేపటి నుంచి అమలు చేస్తామని గోడ మీద రాసి పెట్టుకుంటాం అన్నాను..
కానీ, నాదో పిచ్చి ఆశ.. అలా గోడకేసి రోజూ చూస్తూ చూస్తూ ఏదో ఒక రోజు కొంచెం సిగ్గేసి అయినా ఎంతో కొంత నిగ్రహం పాటించకపోతానా అని.. హిహ్హిహ్హీ.. :)))
Thanks for the comment.

@ bonagiri,
హహ్హహ్హా.. బాగుందండీ మీ ప్రాస.. :)))
అయినా, ఏదో మాట వరసకి అప్పుడప్పుడూ ఇలా గుర్తు చేసుకుంటూ ఉంటాం గానీ అంత చేటు నిగ్రహం మనకెక్కడిది చెప్పండి.. :D

@ C. ఉమాదేవి,
అబ్బా.. మీ వ్యాఖ్య చూసి అలా మబ్బుల అంచుల దాకా వెళ్ళొచ్చానంటే నమ్మాలి మీరు.. బోల్డు ధన్యవాదాలు. :)))

మధురవాణి said...

@ అనానిమస్ 2,
చాలా విలువైన మాటలు చెప్పారండీ..
మనకి ఏది సరైనది, ఏది కాదు అన్నది తేల్చుకోడం ఎలాగో చాలాసార్లు మనకి మనకే క్లారిటీ ఉండదు. మన పరిధిని అతిక్రమించి వెళుతున్నామా లేదా అన్నది అర్థం కాదు. అదొకలాంటి సందిగ్ధం ఉంటుంది.
మీరు చెప్పినట్టు ఆలోచిస్తే మన పరిస్థితి మనకి బాగా అర్థం అవ్వడమే కాక ఏది ఎప్పుడు ఎంతవరకూ నియంత్రించుకోవాలన్న దాని గురించి చక్కటి అవగాహన వస్తుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ క్రింది వాక్యంలో మొత్తం summerise చేసారు.
<< నా ఉద్దేశ్యం లొ దీనివల్ల మనం ఎదన్నా కొల్పొతున్నాం అన్న ఫీలింగ్ రానంతవరకూ ఏ విషయం లోనూ నిగ్రహం గురించి అలొచించక్కర్లేదు.

భలే లాజిక్ చెప్పారండీ.. I'll remember it forever.
Thanks a ton for your comment.

@ మంచు గారూ,
హహ్హహ్హా.. కామెంట్ పెట్టడం నిగ్రహించుకోడం అంటే గుర్తొచ్చింది.. ఆ పైన లిస్టులో ఇది కూడా చేర్చాలండీ అసలు. :)))

నిజమేనండీ.. "అతి కి మితి కి మధ్య ఉన్న గీతని తెలుసుకొవడం " ఇదే crucial point అసలు..

Thanks for your thoughtful comment. :)