Tuesday, June 29, 2010

గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణా గంటలే మోగనేలా..

'యువరత్న' నందమూరి బాలకృష్ణ గారి సినిమా పాటలు నాలుగు చెప్పండి అని తెలుగువారినైనా అడిగితే వెంటనే ఏం సమాధానం వస్తుంది? 'లక్స్ పాపా లక్స్ పాపా లంచ్ కొస్తావా..' అనో, 'నిన్న కుట్టేసినాది మొన్న కుట్టేసినాది గండు చీమ' అనో, 'అందాల ఆడబొమ్మ..' అనో, 'సింహమంటి చిన్నోడే వేట కొచ్చాడే' అనో చెప్తారు కదా! ఎందుకంటే, మరి ఆయన పాటలు అలాంటివే ఎక్కువ పాపులర్ కాబట్టి. కానీ, ఇలాంటి వాటికి భిన్నంగా ఆయన సినీమాల్లోంచి ఒక మెలోడీని నేను మీకు గుర్తు చేస్తున్నా ఇప్పుడు. :-)

అదే 1994 లో వచ్చిన 'గాండీవం' సినిమాలోని 'గోరువంక వాలగానే' అనే పాట. యీ సినిమాలో బాలకృష్ణ సరసన కథానాయికగా రోజా నటించింది. అక్కినేని నాగేశ్వర రావు గారూ, మోహన్ లాల్, శ్రీ విద్య ఇతర తారాగణం. ఇప్పుడు హిందీలో ఎడాపెడా కామెడీ సినిమాలు తీసేస్తున్న ప్రముఖ మళయాళ దర్శకుడు ప్రియదర్శన్ యీ సినిమాకి దర్శకుడు. యీ సినిమాకి MM కీరవాణి గారు స్వరాలందించారు. యీ పాటని కీరవాణి గారి పాటల్లో ఆణిముత్యం అనుకోవచ్చు.

యీ పాట గురించి తెలిసినవాళ్ళతో పాటుగా తెలియని వాళ్ళు కూడా చాలామందే ఉంటారని నాకనిపించింది. ఇంతకీ నాకీ పాట ఎలా పరిచయం అయిందంటే... చిన్నప్పుడు వేరే ఊర్లో ఉండే మా నాన్న స్నేహితుడు ఒకాయనకి ఆడియో షాప్ ఉండేది. ఆయన దృష్టిలో మంచి పాటలు అనిపించినవన్నీటిని ఏరి కూర్చి ప్రత్యేకంగా నాన్న కోసమని కొన్ని కేసెట్లు రికార్డ్ చేసి పెట్టేవారు ఆయన. నాన్న ఊరెళ్ళినప్పుడల్లా కొత్త కేసెట్లు పట్టుకొచ్చేవారు. చిన్నప్పుడు మేమెప్పుడూ పెద్దగా సినిమాలు చూసింది లేదు. కానీ, పాటలు మాత్రం చాలానే వినేవాళ్ళం. అలా అప్పట్లో యీ పాట విన్నప్పుడు పదాలు పెద్దగా అర్ధం కాకపోయినా కూడా బాగా నచ్చేసింది మా ఇంట్లో అందరికీ. చాలా యేళ్ళ తరవాత మళ్ళీ ఇంటర్నెట్లో వెతికి పట్టుకున్నా యీ పాటని. నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఇదొకటి :-)

యీ పాట ట్యూన్ ఎంత బాగుంటుందో పాటలో అలవోకగా పారాడే తెలుగు పదాలు అంతకంటే అందంగా అనిపిస్తాయి. మహానుభావుడు వేటూరి గారు స్వర్గాన ఉన్నారో ఉన్నారో గానీ మనకిలాంటి అందమైన తెలుగు పాటల్ని మిగిల్చి వెళ్ళిపోయారు. యీ పాటలో సాహిత్యం వింటుంటే నిజంగా చెవిలో తేనె పోసినట్టుంటుంది. వాక్యం బాగుంది అని చెప్పాలంటే, పాటలో ఉన్న ప్రతీ ఒక్క లైను గురించీ చెప్పాల్సి వస్తుంది. :-) ఒక్కమాటలో చెప్పాలంటే అందమైన తెలుగు పదాలతో సయ్యాట ఆడించారు వేటూరి గారు యీ పాటలో. ఓసారి క్రిందన రాసిన పాట సాహిత్యం చూస్తే మీరూ యీ విషయం ఒప్పుకుంటారు.

ఇహ అంతందమైన తెలుగు పదాలు సుస్పష్టంగా, స్వచ్ఛంగా పలికే మన బాలు గారి స్వరంలో ఎంత తియ్యగా వినిపించాయో స్వయంగా వింటే గానీ అర్ధం కాదు ఎవరికైనా! యీ పాటలో బాలు గారితో పాటు చిత్ర గారు, శ్రీ కిరణ్ కూడా గొంతు కలిపారు. మీకూ యీ పాట కావాలంటే ఇక్కడ చూడండి.

గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణా గంటలే మోగనేలా..
గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిల కిలా పువ్వులే పుట్టలేదా..
బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా..
వారసుడ్ని చూసినప్పుడే వరాల వాంఛలన్ని పల్లవించగా..
నందుడింట చిందులేసే అందమైన బాలుడే తనవాడై..
గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణా గంటలే మోగనేలా..
గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిల కిలా పువ్వులే పుట్టలేదా..

ఏటి మనుగడ కోటి అలలుగ పొంగు వరదల వేగానా..
పడిలేచు అలలకు తీపి కలలకు లేని అలసట నీకేలా..
నల్ల నల్ల నీళ్ళల్లోనా ఎల్లకిలా పడ్డట్టున్న అల్లో మల్లో ఆకాశాన చుక్కల్లో..
అమ్మాయంటే జాబిల్లమ్మ అబ్బాయంటే సూరీడమ్మా ఇంటి దీపాలవ్వాలంట దిక్కుల్లో..
ఎవరికివారేయమునకు నీరే….
రేవు నీరు నావదంట నావ తోడు రేవుదంట పంచుకుంటే..


గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణా గంటలే మోగనేలా..
గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిల కిలా పువ్వులే పుట్టలేదా..

ప్రేమ ఋతువులు పూలు తొడిగిన తేనె మనసుల నీడల్లో..
మురిపాల నురగలు పంటకెదిగిన బాల సొగసుల బాటల్లో..
బుగ్గందాల ఇల్లు నవ్వే సిగ్గందాల పిల్ల నవ్వే.. బాలయ్యొచ్చి కోలాటాడే వేళల్లో..
పైరందాల చేలు నవ్వే పేరంటాల పూలు నవ్వే.. గోపెమ్మొచ్చి గొబ్బిళ్ళాడే పొద్దుల్లో..
పరవశమేదో.. పరిమళమాయే..
పువ్వు నవ్వే దివ్వె నవ్వే.. జివ్వుమన్న జన్మ నవ్వే పాడుతుంటే..

గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణా గంటలే మోగనేలా..
గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిల కిలా పువ్వులే పుట్టలేదా..
బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా..
వారసుడ్ని చూసినప్పుడే వరాల వాంఛలన్ని పల్లవించగా..
నందుడింట చిందులేసే అందమైన బాలుడే తనవాడై..

Sunday, June 20, 2010

నాన్నా...

-->

నేనెవరో తెలియని యీ ప్రపంచానికి నీ ముద్దుల యువరాణిగా నన్ను పరిచయం చేశావు.
నా బుల్లి పాదాలు కందిపోతాయేమోనన్న బెంగతో నీ అరచేతుల్లో అడుగులేయిస్తూ నడక నేర్పించావు.
నీ ఒడిలో మాటలు నేర్చుకున్నాను. నీ మాటల్లో ప్రపంచాన్ని చూశాను.

అలుపెరగని నీ శ్రమైక జీవనంలో కృషి, పట్టుదల, నిజాయితీ అంటే ఏవిటో పోల్చుకున్నాను.
నీ ఆచరణలో మానవత్వపు పరిమళాన్ని వెదజల్లడం ఎలానో తెలుసుకున్నాను.
నీ చల్లటి నీడలో స్వేచ్ఛగా నాదైన సొంత వ్యక్తిత్వాన్ని పొందగలిగాను.
నీ జీవితమంతా ధారపోస్తూ నీ చేతుల్లో అందంగా మలచబడిన శిల్పాన్ని నేను.

నా వెనక కొండంత అండలా నువ్వున్నావన్న ధైర్యమే జీవితంలో నే వేసే ప్రతీ అడుగు వెనకా ఉంది.
నా మీద నీకున్న అంతులేని ప్రేమే నన్ను విజయం వైపు పయనించేలా చేస్తోంది.
నిన్ను తలచుకోగానే వచ్చే వెయ్యేనుగుల బలమే బ్రతుకు బాటలో ఎదురయే సవాళ్ళను ఎదుర్కొని పోరాడే శక్తినిస్తుంది.
నువ్వు లేని నాకు అస్తిత్వమే లేదు. అయినా నాన్నా... నేనెవర్ని... నీ ప్రతిరూపాన్నే కదూ!


Saturday, June 19, 2010

ఇవాళ్టి 'ఈనాడు' లో నా బ్లాగు పరిచయం

ఎవరమైనా సరే బ్లాగుల్లో ఏం రాస్కుంటాం? బ్లాగంటే మన మనసులోని భావాలకి అక్షరరూపం కదా! అందుకని ఎవరి బ్లాగు మీద వాళ్లకి సహజంగానే ప్రేముంటుంది. అందుకే మన బ్లాగుకి వచ్చే చిన్న గుర్తింపైనా కూడా మనసుకి చాలా సంతోషంగా అనిపిస్తుంది కదూ! ఏంటీ.. అరవ డబ్బింగ్ సీరియల్ డైలాగుల్లాగా అనిపిస్తోందా! సరే సరే.. నేరుగా విషయానికొస్తున్నా! sengihnampakgigi

ఇవ్వాళ్టి 'ఈనాడు'లో ఈతరం పేజీలో 'బ్లాగోగులు' శీర్షికన నా బ్లాగు పరిచయం వచ్చింది.celebrate నా వరకూ నాకు ఇది చాలా పెద్ద గుర్తింపే!encem


దాదాపు రెండేళ్ళ క్రితం ఊరికే సరదాగా యీ బ్లాగు ఓపెన్ చేసాను. అప్పటికి కంప్యూటర్లో తెలుగు రాయచ్చనే విషయం కూడా తెలీదు నాకు. బ్లాగర్లో తెలుగులో రాసే వీలుందని చూసి చాలా సంతోషమేసింది. తరవాత కొన్ని రోజులకి కొత్తపాళీ గారు రాసిన కామెంట్ వల్ల జల్లెడ, తరవాత కూడలి గురించి తెల్సింది. అన్నేసి తెలుగు బ్లాగులు చూసి చాలా ఆశ్చర్యపోయాను. తరవాత క్రమంగా తెలుగు బ్లాగులు చదవడం అనేది ఒక ఇష్టమైన అలవాటుగా అయిపోయింది. అందరి రాతలూ చదువుతూ మెల్లమెల్లగా నేనూ రాయడం మొదలెట్టాను. అలా రాయడంలో ఓనమాలు దిద్దానన్నమాట మన తెలుగు బ్లాగ్లోకంలో. వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే చాలా చిత్రంగా అనిపిస్తుంటుంది నాకు. నా పాత పోస్టులు ఎప్పుడైనా చూస్కుంటే ఒకోసారి నాకే సందేహం వస్తుంటుంది. అసలిదంతా నిజంగా నేనేనా రాసింది. అప్పుడిలా రాయాలని ఎలా అయిడియా వచ్చిందబ్బా.. అనుకుంటూ నాకు నేనే బోలెడు ఆశ్చర్యపడిపోతుంటాను.rindusengihnampakgigi

యీ సందర్భంగా నా రాతల్ని చదువుతూ ఎప్పటికప్పుడు స్పందన తెలియజేస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న బ్లాగ్మిత్రులందరికీ బోలెడన్ని ధన్యవాదాలూ, కృతజ్ఞతలూ చెప్పుకుంటున్నాను.doa
ఎప్పుడైనా చాలా రోజులు కొత్త పోస్టు వేయకుండా ఉన్నప్పుడు నా బద్దకాన్ని పోగొట్టి ఏదో ఒకటి రాయాలన్న స్ఫూర్తిని నాలో నింపే నా బ్లాగు ఫాలోవర్స్ 90 మందికి పేరుపేరునా నా కృతజ్ఞతలు.tepuktangan
నాకు ప్రత్యక్షంగా తెలీకపోయినా కూడా నా బ్లాగుని చదువుతున్న వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు.tepuktangan
నేనేదన్నా కథ రాస్తే, చదువుతారా చస్తారా అంటూ వేళాపాళా లేకుండా వాళ్ళని హింసించినా కూడా ఓపిగ్గా చదివి తిట్లూ, దీవెనలూ అందించే చిన్నూకి, సుజ్జీకి నా ముద్దులు.ciumjelir

నా యీ చిన్ని బ్లాగుని ఈనాడు ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన 'మనసులోమాట' సుజాత గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.rossenyum

ఏంటీ.. మరీ ఫార్మల్ గా మీటింగులా అనిపిస్తోందా! రోజూ కాకపోయినా ఇలాంటప్పుడైనా ఓసారి.. మనల్ని వెన్నంటి నడిచే వాళ్లకి, మనల్ని నిరంతరం ప్రోత్సహించేవాళ్ళకి చిన్న థాంక్స్ అన్నా చెప్పాలి కదా! అదే యీ ముచ్చటన్నమాట!sengihnampakgigi