Monday, January 24, 2011

మౌనమే మోహన రాగమయే వేళ..

ఒకోసారి నేనొక్కదాన్నే ఉన్నప్పుడో, నిశ్శబ్దంగా ఉండే రాత్రి పూటో పాటలు వినాలనిపిస్తే వినడానికి నాకో ప్రత్యేకమైన ప్లే లిస్టు ఉంటుంది. అందులో ఉండేవన్నీ మంద్రంగా సాగే సంగీతంలో మార్దవంతో నిండిన స్వరాలున్న పాటలే! అదిగో ఆ జాబితాలోని ఒక పాటే ఇది. ఈ పాట హరిహరన్ పాడారు. ఆయన పాడిన ఎన్నో పాటల్లాగే మృదువుగా సాగిపోతుంది ఈ పాట కూడా! సిరివెన్నెల గారి పదాలు ఆయన స్వరంలో అలవోకగా జారిపోతున్నట్టు ఉంటాయి. కీరవాణి గారు స్వరపరచిన బాణీలలో నాకు నచ్చేవాటిల్లో ఈ పాట ముందు వరుసలో ఉంటుంది.

మరుగేల.. నీ మనసుకి ఆ ముసుగేల.. చందమామ లాంటి భామా.. అని అబ్బాయి చెప్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. మాటలకందని భావాలు చూపుల్లో పలుకుతాయని, చూపులు చేరలేని తావులకి ఊహలు చేర్చుతాయని.. ఎంతందంగా చెప్పారో సిరివెన్నెల గారు!
చుట్టూ పూర్తి నిశ్శబ్దంగా ఉన్న పరిసరాల్లో ఈ ఒక్క పాటే చెవులకు వినిపిస్తుంటే ఈ పాటలో రాసినట్టు 'మౌనమే మోహన రాగమయే వేళ..' అనిపిస్తుంటుంది నాకు.

ఈ పాట 1999 లో వచ్చిన 'అల్లుడుగారు వచ్చారు' అనే సినిమాలోది. జగపతిబాబు, హీరా, కౌసల్య నటించగా కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమాలోని పాటలన్నీటికి సిరివెన్నెల గారు సాహిత్యం అందించారు. ఈ సినిమాలోనే బాలు గారు పాడిన 'నోరార పిలిచినా' అనే పాట, కీరవాణి గారు స్వయంగా పాడిన 'రంగురంగు రెక్కల' పాట కూడా బాగుంటాయి. ఈ పాట మీక్కావాలంటే ఇక్కడ చూడండి. ఓసారి విని చూడండి.. మీక్కూడా నచ్చుతుందేమో! :)

మరుగేల.. మబ్బు ముసుగేల..
ఓ చందమామా.. ఓ చందమామా..
మనసున మల్లెలు విరిసిన వేళ..
మమతల పల్లవి పలికిన వేళ..
మౌనమే మోహన రాగమయే వేళ..
మరుగేల.. మబ్బు ముసుగేల..
ఓ చందమామా.. ఓ చందమామా..

మాటకు అందని ఊసులు లేవా చూపులలోనా..
చూపులు చేరని సీమలు లేవా ఊహలలోనా..
కనుచూపులో.. చిగురాశలు.. బరువైన రెప్పల్లో బంధించకు..
మది వీధిలో.. స్వప్నాలకి.. సంకెళ్ళు వేసేటి జంకెందుకు..
ఊయలలూపే మృదుభావాలు.. ఊపిరి తీగను మీటే వేళ..
మౌనమే మోహన రాగమయే వేళ..

మరుగేల.. మబ్బు ముసుగేల..

కాంచన కాంతుల కాంచన బాట కనపడలేదా..
కొమ్మన కూసిన కోయిల పాట వినపడలేదా..
ఉలి తాకిన.. శిల మాదిరి.. ఉలికులికి పడుతోంది ఎదలో సడి..
చలి చాటున.. మరుమల్లెకి.. మారాకు పుడుతోందో ఏమో మరి..
చెంతకు చేరే సుముహుర్తాన.. ఆశలు తీరే ఆనందాన..
మౌనమే మోహన రాగమయే వేళ..

మరుగేల.. మబ్బు ముసుగేల..

Wednesday, January 12, 2011

ఆలోచనలు..


ఆలోచనలు..

ఏవో లోకాల్లో విహరింపచేస్తాయి..
ఆకాశం అంచులదాకా ఎగరేస్తాయి..
ఊహల సందడిలో ఉర్రూతలూగిస్తాయి..
ఆశల పల్లకీలో ఊరేగిస్తాయి..
కోరికల దీపాలు వెలిగిస్తాయి..
గమ్మత్తైన మత్తులో పడేస్తాయి..

నిరాశల నీడల్ని గుర్తుకి తెస్తాయి..
పదునైన వాస్తవంలోకి తీసుకొస్తాయి..
తలపుల తీరంలో నిలబెడతాయి..
ఇష్టాలూ అభిమానాలూ పెంచుతాయి..
బంధాలూ ప్రేమలూ తుంచుతాయి..
నవ్వులు రువ్వుతాయి..
కన్నీళ్లు జారుస్తాయి..

పున్నమి వెలుగులు విరజిమ్ముతాయి..
అదాటున అమావాస్య చీకట్లోకి తోసేస్తాయి..
సప్తవర్ణ కాంతులతో మెరిపిస్తాయి..
రేయిలోని నలుపంతా తెచ్చి పులిమేస్తాయి..

మనసుని లాక్కెళ్ళి గతానికి కట్టేస్తాయి.
జ్ఞాపకాల సంద్రంలో ముంచేస్తాయి..
మానిపోయిన గాయాల్ని రేపుతాయి..
మనసుకి ముసుగేస్తాయి..
ఓదార్పుని పంచుతాయి..
అలసిన మనసుకి సాంత్వన కలిగిస్తాయి..

ఎన్నో రూపాల్లో కనిపిస్తాయి..
రూపమూ లేదనిపిస్తాయి..
అంతా ఆనందమే అనిపిస్తాయి..
అదంతా భ్రాంతేనని తేల్చేస్తాయి..

మురిపిస్తాయి.. మైమరపిస్తాయి..
కవ్విస్తాయి.. కైపెక్కిస్తాయి..
కదిలిస్తాయి.. కరిగిస్తాయి..
చెరిపేస్తాయి.. మరిపిస్తాయి..
మాటలకి అందవు.. మౌనంలో దాగవు..
పరుగు ఆపవు.. చేతుల్లో చిక్కవు..

పగలూ లేదూ.. రాత్రీ లేదూ..
అలుపూ లేదు.. అదుపూ లేదు..
నిన్న.. ఇవ్వాళ.. రేపు.. అనుక్షణం..
నన్నొదిలి మాత్రం ఎక్కడికీ పోవు!

Wednesday, January 05, 2011

అంతకన్నా ఒకటెక్కువే!"యే.. పో.. నువ్వెప్పుడూ ఇంతే! తొండి చేస్తావ్! పంది.."
"నువ్వే పంది.. కుక్క"
"నువ్వే పంది, కుక్క, ఎద్దు"
"నువ్వే పంది, కుక్క, గాడిద, ఎద్దు"
"నువ్వు పది సార్లు పంది, కుక్క, ఎద్దు, గాడిద.."
"నువ్వే.. వంద సార్లు పంది కుక్క.."
"నువ్వు వెయ్యి సార్లు పంది కుక్క.."
"నువ్వే లక్ష సార్లు పంది కుక్క.."
"నువ్వు కోటి సార్లు.."
"నువ్వు మిలియన్ సార్లు.."
"నువ్వు బిలియన్ సార్లు"
"యే.. పో.. నువ్వు ఎన్ననుకున్నా అంతకంటే ఒకటి ఎక్కువే!"
"ఎహే.. నువ్వే పో.. నువ్వు ఇన్ఫినిటీ సార్లు పంది కుక్క.."
"నువ్వు ఇన్ఫినిటీ కి ప్లస్ వన్.."
"అహా.. ఇన్ఫినిటీ తరవాత ఇంకేం ఉండదమ్మా పెద్ద! అన్నీటికంటే అదే ఎక్కువ!"
"ఏం కాదు.. నేను ముందే చెప్పాగా.. నువ్వు ఎన్ననుకున్నా అంతకంటే ఒకటి ఎక్కువని.. ఇన్ఫినిటీ ప్లస్ వన్"
"అయితే.. నువ్వు యూనివర్స్.. ఇంక అంత కంటే పెద్దది ఏమీ ఉండదు తెల్సా! స్కూల్లో మా టీచరు కూడా చెప్పారు"
"అబ్బ ఛా.. అంత లేదు బాబూ.. నాది యూనివర్స్ ప్లస్ వన్.."
"అయితే పో.. నువ్వు ఎన్ననుకున్నా అంతకంటే నావి రెండు ఎక్కువే! యూనివర్స్ ప్లస్ వన్ కి ప్లస్ టూ"
"దానికన్నా ఒకటి ఎక్కువే!"
"దానికన్నా రెండెక్కువే!"
"ఇంకా దానికి కూడా ఒకటి ఎక్కువే!"
"మళ్ళీ దానికి కూడా.. రెండు ఎక్కువే!"
"ప్లస్ వన్"
"ప్లస్ టూ"

ఓయ్ పిల్లలూ.. ఏంటా గొడవా, అరుపులూ.. ఏం చేస్తున్నారు అసలక్కడ! నోర్మూసుక్కూర్చుని పుస్తకాలు తెరవండి.. అస్సలు భయమూ, భక్తీ లేకుండా పోతుందీ మధ్య మీకు. ఎంతసేపూ ఆటలూ, పోట్లాటలే.. చదువూ సంధ్యా లేకుండా.. అయిదు నిమిషాల్లో నేనక్కడికి వచ్చేసరికి ఇద్దరూ పుస్తకాల ముందు కనపడాలి. లేకపోతే వీపు విమానం మోత మోగిస్తా! -marah ఇది మా అమ్మ కేక!
అంతే.. ఇంక నేనూ మా తమ్ముడూ.. గప్ చుప్ సాంబార్ బుడ్డి.. మా లెక్కలన్నీ గోదాట్లోకీ, మేం మాత్రం పుస్తకాల్లోకీ.. sengihnampakgigi

...........

పైనదంతా చదివాక మీక్కూడా స్కూల్ రోజులు గుర్తొచ్చే ఉంటాయి కదూ! నిన్న రాత్రి నేనూ, మా ఇంటబ్బాయ్ ఇలాగే వాదులాడుకుంటూ అలా ఇన్ఫినిటీ, యూనివర్స్ దాకా వెళ్లి వచ్చాం.. ఇంతా చేసి చివరికి మా వాదన ఎక్కడ ఎందుకు మొదలయ్యిందో మర్చిపోయాం..jelir ఏదేమైనా నేను మాత్రం కాసేపు స్కూల్ రోజుల్లోకి వెళ్లేసి వచ్చా! మిమ్మల్ని కూడా పంపిద్దామనే ఈ టపా!senyum