Monday, May 13, 2013

ఊహా విహంగాలు


ఆకాశవీధిలో మబ్బుల ముంగిట్లో మునిగాళ్ళ మీద కూర్చుని శ్రద్ధగా మెలికల ముగ్గు పెడుతున్న ఓ హిమకిన్నెర చేతి వేళ్ళ నుంచి సుతారంగా రాలుతున్న మెత్తటి వజ్రాల పొడి నేలని హత్తుకునే తొందరలో మంచు ముత్యాల్లా మారి మట్టిపై పారాడుతున్న పచ్చిక పరకల ఒడిలోనూచిన్నారి గడ్డి పువ్వుల దోసిళ్ళలోనూ పోగవుతోంది. ఇదివరకెరుగని కొత్త ఆనందాన్ని రుచి చూసిన మైమరపులో పువ్వులన్నీ కిలకిలా నవ్వుతూ ఎవరెవరికి ఎంత పెద్ద మంచు నిధి దొరికిందో బేరీజు వేసుకోవడంలో నిమగ్నమై ఉండగానే సూరీడు విసిరిన ఎర్రటి కిరణాలు మెరుపు వేగంతో దూసుకొచ్చి పువ్వుల లోగిలిలో జొరబడి వాటి మంచు మురిపాలను క్షణాల్లో స్వాహా చేసేసాయి. ఖాళీ అయిపోయిన పూరెమ్మలతో, భారమైన మనసుతో మిగిలిన గడ్డిపూలన్నీ మళ్ళీ మరోసారి దివి నుంచి భువికి జారే హిమపాతం కోసం, తమ హృదయాన్ని తడిపే హిమబిందువుల కోసం కనులు తెరిచే కలలు కంటూ, తమ కలలు నిజం చేయమని దోసిలొగ్గి ఆకాశానికి విన్నవించుకుంటున్నాయి. ఈ చిన్నారి పువ్వుల ఆశల ఊసులు నింగి దాకా చేరేనో.. మేఘమాలికలు కరుణించి వానజల్లుని ధారపోసే లోపు తాము కన్న కలలతో పాటు  లేత సుమబాలల బ్రతుకు అడుగంటి వడలిపోయేనో.. ఏమో.. ఏ గంధర్వలోక తుషారపు జల్లుల్లో ఘనీభవించిన మలుపో ఇది!

అందమైన పూదోటలో లెక్కకి చిక్కనన్ని పువ్వులు రంగురంగుల వలువలు చుట్టుకుని ముచ్చటగా ముస్తాబై వయ్యారంగా కొమ్మల అంచున చేరి సౌందర్యంలో ఒకరిని మించినవారు మరొకరని వాదులాడుకుంటున్నాయి. పువ్వులన్నిటికీ మధ్యవర్తిగా నిలిచిన కొండగాలి వాటి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నంలో నానా తంటాలు పడుతూ ఒక పువ్వు నుంచి మరో పువ్వు దగ్గరికీ చక్కర్లు కొడుతూ రివ్వు రివ్వున తిరిగేస్తోంది. వీటన్నిటికీ దూరంగా ప్రత్యేకంగా పాదు చేసి ఒంటరిగా పెరుగుతున్న గులాబీ మొక్క చిటారు కొమ్మన తన తాహతుకి మించిన పరిమాణంలో ఓ ఎర్ర గులాబీ మొగ్గ తొడిగింది. పూట పూటకీ ఒక్కో పొర విడివడి గులాబీ రేకులు ఒక్కొక్కటే కనులు తెరిచే కొద్దీ కొమ్మకి తలకు మించిన భారమై వంగిపోతున్నా సరే కొత్తగా సంతరించుకుంటున్న తన సొగసుని చూసుకుంటూ మురిసిపోతోంది. ఎక్కడి నుంచో ఝూమ్మని ఎగిరే జుంటి తుమ్మెద ఒకటి దారి తప్పి దూసుకొచ్చి గులాబీ పువ్వు మోముపై వాలింది. అనుకోని అతిథిలా వచ్చి మరులు గొల్పిన భ్రమరానికి తేనియ తానాలాడించి తీపి వేడుక చేసి తరించింది గులాబీ బాల. అటుపైన వీడుకోలైనా అడగక వీడిపోయిన భ్రమరం కోసమై నిరీక్షణలో అలసి సొలసి సొమ్మసిల్లిపోయింది. తనలో మిగిలున్న ఆశనంతా రంగరించి ఒక్కొక్క గులాబీ రెక్కనీ రాలుస్తూ గాలి పల్లకీ సాయమడిగి తన మధుమానసాన్ని అర్పించిన మధుపం జాడకై అన్వేషిస్తూ దిక్కు దిక్కుకీ పరుగులు తీస్తోంది. క్షణక్షణానికీ ప్రాణం కొడిగడుతున్న గులాబీకి ఈ జన్మకి మళ్ళీ ఆ తుమ్మెద ఎదురయ్యేనా.. ఆనాటి తేనెల తీపిని మరచిన మధుపానికి ఈ గులాబీ పిలుపు వినిపించేనా.. విషాదం పలికించే చక్రవాకమా, ఆశలు పండించే భూపాలమా.. ఏమో.. ఏ స్వర్గలోకపు స్వరకర్త శృతి చేసిన జీవనరాగమో ఇది!

ఊహలు.. అందమైన రంగురంగుల ఊహలు.. నువ్విచ్చిన రెక్కలతో ఆకాశం అంచుల దాకా ఎగురుతున్న నా మధురోహలు.. నేనెంత వద్దన్నా వారించినా క్షణానికొకటి పుడుతూ నను వేధించే ఊరుకోనివ్వని ఊహలు! సరిహద్దులెరుగని సాగర తీరాన ఇసుక తిన్నెల్లో నీ తడి అడుగుల్లో అడుగునై ఒదిగిన మధుర క్షణం, నీ నవ్వుల సడిలో నా పంట పండించే గవ్వల మోతలు గలగల మోగిన సంబరం, వెన్నెల నీడల తోడుగా నీలో మమేకమైపోయిన అద్భుతం, నీలాల కంటిపాప మౌనంగా నీ రూపాన్ని పదిలపరచుకున్న మురిపెం, నీకై దాచుంచిన తలపుల తపనలన్నీ కన్నీటి చినుకుల్లా కరిగించి ఆర్తిగా నిను కొలుచుకున్న తన్మయత్వం, నీ సాంగత్యంలో జన్మజన్మలకీ చాలినంత భాగ్యాన్ని మూటగట్టుకున్న పరవశం.. ఆగనంటూ దాగనంటూ మనసు లోతుల్లోంచి నిరంతరంగా ఊరుతున్న ఊహలు.. చీకటి రాతిరిని మెరిపించే చిట్టి మిణుగురుల్లా అనంతంగా వెల్లువెత్తుతూ నా చుట్టూరా ఆశల వెలుగులు నింపుతూ నాలో కొత్త ఊపిరులూదుతున్న ఊహా విహంగాలు! ఇన్ని వేనవేల ఊహల్లో ఏ ఒక్కటైనా రెక్కలు కట్టుకు నీ దాకా ఎగిరొచ్చి నీ అమృత స్పర్శ సోకి అమరత్వాన్ని పొందాలని పడే ఆరాటం ఏనాటికైనా వాటిని ఆశలతీరానికి చేర్చేనా.. ప్రణయదేవత ప్రసాదించిన అపురూప వరమో.. రాతి హృదయపు మూసిన తలుపుల వెనుక దాగిన ఘోర శాపమో.. ఏమో.. ఏ విధాత లిఖించిన చేవ్రాలో ఇది!