Thursday, April 28, 2011

జర్మనీలోని మా ఊరి కబుర్లు ఇవాళ్టి ఆంధ్రజ్యోతిలో..

ఇక్కడ జర్మనీలోని మా ఊరి గురించి నేను చెప్పిన కబుర్లని అందమైన వ్యాసంగా తీర్చిదిద్ది ఇవాళ్టి ఆంధ్రజ్యోతిలో 'నవ్య' విభాగంలో ప్రచురించారు అరుణ పప్పు గారు. నా బ్లాగ్ముఖంగా అరుణ పప్పు గారికి మరోసారి ధన్యవాదాలుros తెలుపుకుంటున్నాను. మా ఊరి కబుర్లు మీరూ ఓసారి చదివెయ్యండి మరి..senyum

Sunday, April 24, 2011

నా కథ 'ఎంత ఘాటు ప్రేమయో!' 'మాలిక పత్రిక' ఉగాది సంచికలో..

నేను వ్రాసిన 'ఎంత ఘాటు ప్రేమయో!' అనే కథ 'మాలిక పత్రిక' ఉగాది సంచికలో ప్రచురితమైంది. నా కథని అంగీకరించి ప్రచురించిన మాలిక పత్రిక సంపాదక వర్గానికి మరోసారి నా బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చదివి చూసి మీ అభిప్రాయాలని తెలియజేస్తారని ఆశిస్తూ..

Wednesday, April 20, 2011

నీతో నా ప్రేమకథ!నువ్వే కావాలంటూ పెంకిగా మారాం చేస్తోన్న మనసుని బ్రతిమాలుతూ నువ్వు కరిగిపోయిన కలవని నచ్చజెప్పబోయాను..
నే చెప్పిందంతా బుద్ధిగా విన్నట్టే విని అంతలోనే మళ్ళీ మొదటికొచ్చి నువ్వే కావాలని మంకుపట్టు పడుతోందీ మొండి ఘటం..
నా మనసుని ఊహల ఊయలలో ఊపుతూ నిద్ర పుచ్చేందుకు నిన్ను తలచుకుంటూ నీ పారాయణం చెయ్యక తప్పింది కాదు..

ఉదయసంధ్యలో వెల్లువలా వచ్చి నా కనురెప్పలను ముద్దాడిన చిరువెచ్చని రవికిరణాల్లో నీ చురుకైన చూపుల్ని తలపుకి తెచ్చా..
అపరాహ్నం వేళ చెప్పాపెట్టకుండా గభాల్న వచ్చి నను నిలువెల్లా తడిపేసిన జడివాన చినుకుల్లో నీ చిలిపి అల్లరిని మననం చేసా..
వాలుపొద్దులో ఒళ్ళు ఝల్లనిపించేలా ఉక్కిరిబిక్కిరిగా నను చుట్టేసి చక్కిలిగింతలు పెట్టిన పిల్లగాలిలో నీ స్పర్శానుభూతిని గుర్తు చేసా..

మునిమాపు వేళ ఎగిరే మబ్బుల చాటునుండి నాతో దోబూచులాడిన చందమామలో దాక్కుని నవ్వింది నువ్వేనంటూ చెప్పా..
ఈ చల్లటి రాతిరేళలో నను మురిపిస్తూ మైమరపిస్తున్న శశికిరణాల సోయగంలో నీ దొంగ చూపులు పోల్చుకోమని చెప్తున్నా..
నింగినంతా పరుచుకుని వెన్నెల పూత పూసుకుని మెరిసిపోతున్న తారలన్నీ నువ్వు నా కోసం దాచుంచిన మల్లెమొగ్గలని చెప్తున్నా..

అలా నాక్కనిపించిన ప్రతి దృశ్యంలోనూ నిన్నే చూపిస్తూ నీ ఊసుల జోలపాటతో నా మనసుని జో కొట్టే ప్రయత్నం చేస్తున్నాను..
నే చెప్పే ఊసులకి ఊ కొడుతూ నీ మీద తనకున్న ప్రేమనంతా కళ్ళల్లో నింపుకుంటూ మెల్లగా మత్తుగా నిదురలోకి జారుకుంటోంది..
హమ్మయ్యా.. నా పాచిక పారినట్టే ఉంది.. నా మనసుని మాయ చేస్తూ నే వేసిన నీ ప్రేమ మంత్రం పారింది.. మరొక రోజు గడిచింది..

రేపు తెల్లారుతూనే మళ్ళీ నువ్వెక్కడంటూ, నిన్ను చూపించమంటూ, తెచ్చివ్వమంటూ గడుగ్గాయిలా అల్లరి మొదలెడుతుంది..
అప్పుడు నా కంటిపాప వెలుగులో నీ జ్ఞాపకాల రంగులద్దుతూ సర్వత్రా నిన్నే చిత్రిస్తూ మళ్ళీ ఈ గారడీ విద్యలు ప్రదర్శించాలి నేను..
ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు గడిచినా నా మనసుకి నీ మరుపన్నదే రాదు.. నాకు అలుపంటూ రాదు.. నా ఈ కథనానికి కాలదోషం పట్టదు..
నా మనసు లోగిట్లో నిత్యం అలరారే ఈ కథాక్రమానికి ముగింపంటూ లేదు.. నీతో నా ఈ ప్రేమకథ కంచికెళ్ళడమన్న మాటే లేదు..
కానీ.. ఇంతందమైన ఈ ప్రేమకథ అచ్చంగా కథలానే మిగిలిపోయిందన్నది మాత్రం నిరంతరం నన్ను గాయపరిచే చేదు వాస్తవం!

Monday, April 04, 2011

చినుకమ్మ జ్ఞాపకాలు..


పొద్దున్నే లేచి కళ్ళు నులుముకుంటూ వెళ్ళి కిటికీ తెరలు తొలగించి చూడగానే ఉస్సూరనిపించింది. కిటికీ అద్దమంతా పరుచుకున్న వాన చినుకులు బద్ధకంగా జారుతున్నాయి. నిన్నా మొన్న 'వసంతం వచ్చేసిందహో..' అని ప్రకటించేసినట్టు పెళ పెళమని ఒకటే ఎండ! నిన్న ప్రదర్శించిన ప్రతాపానికి సూర్యుడు అలసిపోయి గుర్రు పెట్టి నిదరోతున్నాడేమో ఇవ్వాళ తెల్లారేసరికి ఇంకా చీకటి తెరలు తొలగిపోనట్టే ఉంది.
హబ్బా.. ఇన్ని నెలల నుంచీ ఎదురుచూస్తూ ఇంకా చురుక్కుమనిపించే ఎండని కొంచెమైనా ఆస్వాదించనేలేదు.. ఇంతలోనే అప్పుడే మళ్ళీ వర్షమా.. అని కొంచెం విసుగ్గా అనిపించింది. ఇవ్వాళ ఉగాది పండుగ.. సెలవూ లేదూ ఏమీ లేదు.. కొలువుకి పోవలసిందే! పండగలూ, పబ్బాలూ ఈ దేశంలో ఎలాగూ ఉండవు.. కనీసం వానొస్తుంది కదా అనైనా సెలవు ఇచ్చెయ్యొచ్చు కదా!
హుమ్మ్.. వానొస్తే సెలవులు అనుకోగానే, మనసు చిన్నతనంలోకి జారిపోయింది.. చిన్నప్పుడు వానొస్తే ఎంత సరదానో కదా! వానలో ఇష్టమొచ్చినట్టు తడవడం, వానా వానా వల్లప్ప అంటూ తిరగడం, కాగితం పడవలు చేసుకోడం.. ఎంత తియ్యటి జ్ఞాపకాలో!

చిన్నప్పుడు మా ఇంటి వెనకాల పెంకులు, రేకులతో వేసిన కొట్టం ఉండేది. అసలు అది కట్టింది పశువుల కోసం కానీ, అప్పటికి ఇంట్లో పాడి తీసెయ్యడం వల్ల.. ఆ కొట్టం ఖాళీగా ఉండేది. ఒక మూల పెద్ద రోలు, ఇంకా, కట్టెలపొయ్యి, ఇంకా వాడని సామాన్లు, అవీ ఇవీ ఉండేవి. ఇంకో పక్కకి స్నానాలగది ఉండేది. మా ఊర్లో ఎక్కువ శాతం ఉప్పు నీళ్ళే వచ్చేవి అందరిళ్ళలోనూ. చాలా దూరంలో ఊరికి ఒక పక్క మంచి నీళ్ళ బావి, మరో పక్క మంచినీళ్ళ పంపు ఉండేవి. అక్కడి నుంచి రోజూ మంచినీళ్ళు తెచ్చుకునేవాళ్ళం తాగడానికి. చిన్నప్పుడు నేను కూడా వీధిలో వాళ్ళందరితో పాటు కలిసి వెళ్ళి మంచినీళ్ళు మోసుకొచ్చేదాన్ని. కొత్తల్లో మా ఇంట్లో వాళ్ళందరూ తెగ నవ్వేవారు నేను తెచ్చిన మంచినీళ్ళ బిందె చూసి. ఎందుకంటే, ఇంటికొచ్చేసరికి పావు వంతు బిందె ఖాళీగా ఉండేది. అంటే, తొందరగా ఇంటికెళ్ళి బరువు దింపేసుకోవాలన్న ఆరాటం కొద్దీ గబగబా నడవడం వల్ల నీళ్లన్నీ తొణికిపోయేవన్నమాట! అప్పటికీ, మా అమ్మ అటక మీద నుంచీ ఎప్పడిదో పాతదైన ఒక చిన్న ఇత్తడి కూజా బిందె తీసి తళ తళా మెరిసేలా తోమి ఇచ్చింది నా కోసం. కొన్నాళ్ళ తర్వాత స్టీలు బిందె కూడా కొన్నది.. అదయితే బరువు తక్కువ ఉంటుందని. అదీ గాక, వీలుని బట్టి మా అమ్మ కొంచెం దూరం ఎదురొచ్చేది నా దగ్గర నుంచి నీళ్ళ బిందె అందుకోడానికి. ఇప్పుడు అవన్నీ గుర్తొస్తే చాలా చిత్రంగా అనిపిస్తుంది నాకు. అంత పెద్ద పెద్ద బిందెలు అంతంత దూరాలు ఎలా మోసేసానా చిన్నప్పుడు అని.. ఇప్పుడు మాత్రం చచ్చినా మోయ్యలేనని నా నమ్మకం.. అంతగా అభివృద్ధి చెందాను కదా మరి!

ఇంట్లో బోరులో వచ్చే నీళ్ళు ఉప్పగా ఉంటాయి కాబట్టి వర్షం నీళ్ళు నిలవ చేసేది మా అమ్మ. వర్షం మొదలయ్యాక ఓ అరగంటకి రేకుల మీద దుమ్ము ధూళి అంతా కొట్టుకుపోయి శుభ్రపడ్డాక రేకుల మీద నుంచి పడే వర్షపు ధార కింద బిందెలు, బక్కెట్లు, పెద్ద తపేళాలూ అన్నీ పెట్టి వాన నీళ్ళు నింపేది. వాన నీళ్ళు మంచినీళ్ళు కదా.. అందుకని తరవాత రెండు మూడు రోజులదాకా ఉప్పు నీళ్ళ బదులు వాటిని వాడుకోవచ్చని నింపి పట్టేది మా అమ్మ. ఇదంతా బానే ఉంది గానీ, వానలో పిల్లల్ని తడవనివ్వరు కదా జలుబు చేస్తుంది, జ్వరమొస్తుంది అంటూ. మాములప్పుడు ఇటు పుల్ల తీసి అటు పెట్టని నేను వానొచ్చినప్పుడు మాత్రం పని చేయడంలో తెగ ఉత్సాహం చూపించేదాన్ని. ఉదాహరణకి "అమ్మా, అదిగో ఇంటెనకాల అక్కడ చూసావా.. పీట తడిచిపోతోంది, చెంబు వానలోనే ఉండిపోయింది, నీళ్ళ గాబు దగ్గర బక్కెట్టు తడిసిపోతోంది.. అంటూ ఏదోక కుంటి సాకు చూపెట్టి అమ్మ సమాధానం కోసం ఎదురు చూడకుండా ఒక్క అంగలో తుర్రుమని పారిపోయేదాన్ని వానలో తడవడం కోసం. అలా కాసేపయ్యాక అయ్యయ్యో మొత్తం తడిచిపోయానే.. నూనె పెట్టుకున్న తలంతా తడిచిందే.. అని చూసుకుని.. అయ్యయ్యో ఇంక తలస్నానం చెయ్యాలి అనుకోడం.. ఎలాగూ తల స్నానం చేసేటప్పుడు ఇంకాసేపు తడిస్తే మాత్రం ఏం పోయిందన్న వంకతో మళ్ళీ కాసేపు వానలో చిందులెయ్యడం.. అలా ఉండేది నా వరస!

చిన్నప్పుడు మా ఊర్లోనే ఉన్న ఒక చిన్న ప్రైవేటు బళ్ళో చదూకునేదాన్ని కదా! మా బళ్ళో సర్కారు బడి మాదిరి ఊరికే చిన్న వర్షం రాగానే సెలవులిచ్చేవారు కాదు. అందుకని పొద్దున్నే వర్షం మొదలవగానే ఇంకా ఇంకా పెద్దగా కురవాలి అని తెగ కోరుకునేదాన్ని నేను. అలా జరక్కపోతే కనీసం మధ్యాహ్నం అన్నం టైములో అయినా వర్షం పెద్దగవ్వాలి అనుకునేదాన్ని. అప్పుడైతే ఇంట్లోవాళ్ళు ఈ పూట బడికొద్దులేమ్మా ఇంత పెద్ద వానలో అంటారు కదా.. అందుకనన్నమాట! చిన్న వర్షం అయితే, గొడుగిచ్చి మరీ పంపేవారు బడికెళ్లమని. అప్పుడు మాత్రం భలే కోపం వచ్చేదిలే నాకు! ఆ తర్వాత కొన్నాళ్ళకి మా నాన్న ఒక బొమ్మల గొడుగు కొనుక్కొచ్చారు నాకోసం. అప్పటిదాకా ఆ పల్లెటూర్లో మామూలు నల్ల గొడుగులు చూడటమే గానీ, ఇలాంటి రంగు రంగుల బొమ్మల గొడుగులు ఉంటాయనే తెలీదు నాకైతే! నాకే, కాదు మా ఊర్లోనే పిల్లలెవరికీ తెలీదు అసలు. బోల్డుమంది పిల్లలు పాత యూరియా బస్తాలని నెత్తి మీద గొడుగులా కప్పుకుని వచ్చేవాళ్ళు బడికి. అలాంటి టైములో ఆ బొమ్మల గొడుగేసుకుని మహా గర్వంగా బడికెళ్ళేదాన్ని నేను. అంతే కాదు, ఆ గొడుగు వచ్చిన దగ్గర నుంచీ ఎప్పుడెప్పుడు వానొస్తుందా.. నా బొమ్మల గొడుగేసుకుని బడికెళదాం అని తెగ ఎదురు చూసేదాన్ని నేను. ఆహా.. ఎంత గొప్ప రోజులవి!

ఎనిమిదో తరగతి నుంచి పక్కూరి కెళ్ళి చదూకునే రోజుల్లో పెద్ద వర్షం వస్తే మధ్యాహ్నం నుంచి బడికి సెలవలిచ్చేవారు. తీసుకెళ్ళిన అన్నం క్యారేజీని అలాగే ఇంటికి మోసుకొచ్చి, ఎంచక్కా మధ్య గదిలో గచ్చు మీద టీవీ ముందు కూర్చుని అదే అన్నం క్యారేజీలో అన్నం తినేదాన్ని. మా అమ్మేమో.. ఇంట్లో తినేప్పుడు కూడా ఆ చిన్న గిన్నెల్లో కష్టపడటం ఎందుకూ.. హాయిగా పళ్ళెంలో పెట్టుకుని తినొచ్చుగా అనేది. నాకు మాత్రం బళ్ళో తినాల్సిన అన్నం క్యారేజీ అలాగే ఉంచి ఇంట్లో తినడం భలే ఆనందంగా ఉండేది. బహుశా వాన వల్ల అనుకోకుండా సెలవు వచ్చిందన్న విషయాన్ని పదే పదే తల్చుకుని మురిసిపోడానికి అలా అన్నం తినడం ఒక అవకాశమని మరి నా భావనేమో మరి!

డిగ్రీ చదువుకుంటూ హాస్టల్లో ఉండే రోజుల్లో, వాన కురిసిన సాయంత్రాల్లో కాలేజీ నుంచి వస్తూ దారిలో వేడి వేడి మొక్కజొన్న పొత్తులు కొనుక్కొచ్చుకుని అందరం కలిసి కూర్చుని సరదాగా ఆ రోజున ఎవరెవరి క్లాసుల్లో ఏమేం విశేషాలు జరిగాయో చర్చించుకుంటూ కులాసాగా గడిపేవాళ్ళం. యూనివర్సిటీ రోజుల్లో కూడా అంతే కొద్దో గొప్పో తేడాతో! ఈ చలిదేశానికి వచ్చాక మాత్రం వానలో తడిసే భాగ్యానికి నోచుకోలేదు. ఎలా తడవగలం మరి.. అంత చల్లటి వాన చినుకుల్లో! అదీ గాక, మనం వానొస్తుందని గమనించి బయటికెళ్ళేలోపు వర్షం ఆగిపోగలదు కూడా! లేదా మొత్తం తడవడానికి కనీసం ఓ గంటసేపు పట్టేంత పెద్ద వర్షం కురుస్తుంది.. అందుకని, వాన కురుస్తుంటే అలా చూసి సరిపెట్టుకోడమే ఇక్కడ!

ఇవాళ కిటికీలోనుంచి బయటికి చూస్తుంటే ఆకాశమంతా పరచుకుని తేలిపోతూ, మెలమెల్లగా కదలిపోతూ పల్చటి నల్లటి మేఘాలు.. సన సన్నటి వాన చినుకులు.. ఇన్నాళ్ళు శిశిరమంతా ఎండిపోయున్న నల్లటి మోడుల మీద ఇప్పుడిప్పుడే చిగురిస్తున్న పచ్చటి ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఈ సన్నటి వాన తుంపర్లలో ఇపుడిప్పుడే ప్రాణం పోసుకుంటున్న పచ్చటి చివుళ్ళన్నీ హాయిగా జలకాలాడుతున్నాయి. దూరంగా తేలిపోతున్న మేఘాల ముంగిట్లో రెండు నల్లటి పక్షులు వాన చినుకుల్లో తడుస్తూ హాయిగా స్వేచ్చగా ఆడుకుంటున్నాయి. ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్న నేలలోంచి ఉబికి వస్తున్న మెత్తటి పచ్చిక వానలో తడుస్తూ పరవశించిపోతోంది. ఈ దృశ్యం చూస్తూ నిలబడ్డ నాకు చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ వరుసగా అలా అలా గుర్తొచ్చేసాయి.

ఒకటి మాత్రం అనిపిస్తోంది.. చిన్నప్పుడు వర్షం వచ్చిందంటే కేరింతలు కొడుతూ సంబరంగా ఆడుకోడం మాత్రమే తెలుసు. పెద్దయ్యేకొద్దీ వానని చూడగానే గుండె గూడు కదిలి ఎప్పటెప్పటి స్మృతులో చెలరేగి జ్ఞాపకాల వరదలో కొట్టుకుపోతూ ఉంటామనుకుంటా! ఇదిగో ఇప్పుడివన్నీ అక్షరాల్లో నిక్షిప్తం చేస్తూ నేను చేస్తున్నది అదేగా మరి!

Sunday, April 03, 2011

ఉగాది శుభాకాంక్షలు మరియు పంచాంగం


బ్లాగ్మిత్రులందరికీ 'ఖర' నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

పండుగ రోజు పంచాంగ పఠనం చేయాలి కదా మరి! ములుగు వారి తెలుగు పంచాంగం మరియు రాశి ఫలాల కోసం ఇక్కడ చూడండి.