Wednesday, July 25, 2012

ఎంత ఎంత వింత మోహమో!

పందిరి మంచం మీద బోర్లా పడుకుని చెంప కింద రెండు చేతులూ పెట్టుకుని మంచం అంచున చేరి నేల మీదకి చూస్తూ ఉంటే చెంప మీద నుంచి కిందకి జారి గాలికి సన్నగా ఊగుతున్న నల్లటి జడ తను ఊగుతూ కింద నున్నటి గచ్చు మీద మెరుస్తున్న తన నీడతో దోబూచులాడుతోంది. కదిలే నీడల వెంట కుడి చేతి చూపుడు వేలితో రాస్తూ వాటి వెనకాలే నే పరిగెడుతూ నీడల్లో ఎవరి పోలికలో వెతుకుతూ ఉండిపోయాను చాలాసేపటి దాకా..
గదిలో పక్కగా నీ చేత్తో వేలాడదీసిన రంగు రంగుల మట్టి గంటలు గాలి పిలుపులకి గలగలమంటూ బదులిస్తున్నాయి. పాదాలపైన తారాడుతున్న వెండి మువ్వలు గాలి పాటకి తాళం వేస్తున్నాయి. పడగ్గది గుమ్మానికి కట్టిన పల్చటి అడ్డు తెరలు గాలి అలలు తరిమినప్పుడల్లా ఎగిరెగిరిపడుతూ నా ముందు దాకా వచ్చి మళ్ళీ అంతలోనే ఉస్సూరంటూ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. తెరలు ఎగిరొచ్చిన ప్రతీసారి నా కళ్ళు అప్రయత్నంగా అటుకేసి చూస్తున్నాయి. తెరలు కాస్తా దోవకి అడ్డు తప్పుకుని ఎవరినో చూపిస్తాయని కన్నులకి వల్లమాలిన ఆరాటం కాబోలు!

తుంటరి గాలి పదే పదే గుమ్మపు తెరలని నా ముందుకి తోస్తూ మళ్ళీ మళ్ళీ ఆశలు కల్పిస్తూ అంతలోనే అడియాసలు చేస్తూ నాతో ఆటలాడుతోంది. ఉహూ.. సారి మాత్రం తల తిప్పి అటుకేసి చూడొద్దని ఉక్రోషంగా అనుకుంటుంటే ఆకతాయి కంటిపాపలు నా కన్నుగప్పి మళ్ళీ మళ్ళీ అటే చూస్తూ నన్ను మాయ చేసేస్తున్నాయి. నా తిప్పలు చూసి కిటికీలోంచి తొంగి చూస్తున్న సన్నజాజి తీగన దాగిన దోర మొగ్గలు నువ్వెంత ఆత్రపడినా మేమింకా విచ్చుకోడానికి నాలుగు ఘడియలైనా సమయముందిలే అంటూ అతి కష్టం మీద నవ్వాపుకునే ప్రయత్నం చేసాయి. నేనడిగానా మిమ్మల్నా సంగతి.. అంటూ ఎర్రగా వాటికేసి చూసి చివాలున లేచి పడగ్గదిలోంచి బయటికి నడిచాను. నా వెనకే గుబురుగా అల్లుకున్న సన్నజాజి తీగ ఆకులన్నీ పకపకా నవ్వుతున్న సవ్వడి చెవిన పడినా విననట్టు నటించాను. అబ్బా.. పట్టరాని ఉక్రోషం.. ఎవరి మీదా.. నన్ను చూసి నవ్విన జాజి కొమ్మ మీదా.. నాకీ పాట్లు తెచ్చిపెట్టిన నీ మీదా.. ఏమో అట్టే తేల్చుకోలేకపోతున్నా..

ఉహూ.. ఇలాక్కాదని చెప్పి ఇంటి ముందు సింహద్వారం పక్కనే ఉన్న ఉయ్యాల బల్ల మీద పుస్తకం చేత పట్టుక్కూర్చున్నా. రోజూ తమ వెంట పరుగులు తీసే కళ్ళు వేళ బద్ధకంగా కదలకపోడం చూసి చిన్నబుచ్చుకున్న అక్షరాలు బారులు తీరి నించుని మా పట్ల నీకీ ఉపేక్ష తగునా అన్నట్టు.. దీనంగా నాకేసి చూస్తున్నాయి. అయినా లాభం లేకపోయేసరికి అంతటితో ఊరుకోకుండా బలవంతంగానైనా నన్ను తమ వెంట లాక్కెళ్ళడానికి నానా తంటాలూ పడసాగాయి. ఉహూ.. ఎక్కడా.. అసలు చోటైనా రెప్పలు క్షణమైనా నిలవందే.. అంతులేని ఆరాటాన్ని నిలువెల్లా నింపుకుని మరింకేం పట్టనట్టు పదే పదే వాకిటి వైపే తొంగి తొంగి చూస్తున్నాయి. ఎంతసేపైనా ఇదే తంతు అయ్యేసరికి ఇహ అక్షరాల గోల పడలేననుకుని చప్పున మొహం తిప్పేసుకుని నిర్దాక్షిణ్యంగా పుస్తకం నోరు నొక్కేసి పక్కన పడేసాను. హమ్మయ్యా.. ఇంక నా కళ్ళకి అడ్డం పడే వాళ్ళెవరూ లేరు సుమా.. అని నిశ్చింతగా వాకిలికి కళ్ళప్పగించేశాను.

ఉయ్యాల ఊగనా వద్దా అన్నట్టు మెల్లగా కదులుతోంది అట్టే గడవని నిమిషాల్లాగే! అబ్బా.. ఏం చేసైనా కాలాన్ని తొందరపెట్టి ముందుకి పద పదమని అదిలించలేం కదాని.. అదో అసహనం తోడై అస్సలు ఉన్న చోట ఉండనివ్వడం లేదు నన్ను. ఎవర్ని విసుక్కోవాలో తెలీని అయోమయంలో సారికి ఉయ్యాల మీద అలిగేసి ఒక్క ఉదుటున తన ఒడిలో నుంచి బయట పడ్డాను. కాసేపు తోటలోని మొక్కల మధ్యన తిరుగుదామని బయలుదేరాను. మధ్యన నువ్వు నాకోసం తెచ్చిన చెంగావి రంగు మందార కొమ్మ అప్పుడే వేళ్ళూనుకోడమే కాకుండా చిరుమొగ్గ తొడిగి ఎంత వయ్యారాలు పోతోందో.. మందారం మోమున ఒలికిపోతున్న ముగ్ధత్వాన్ని చూడగానే అందాకా ఉన్న విసుగు మాయమై పెదవులు విచ్చుకున్నాయి. నాలుగు రోజుల నుంచీ ముద్దుగా కనువిందు చేస్తున్న ఎర్ర గులాబీని తాకీ తాకగానే పూరేకులన్నీ జలజలా రాలి నా పాదాల్ని తడిపేసాయి. వాటన్నిటినీ ఆప్యాయంగా దోసిట్లోకి ఎత్తుకొచ్చి ఉయ్యాల బల్ల మీద వదిలొచ్చిన పుస్తకం గుండెల్లో భద్రంగా దాచేసాను. జాజుల మీద అలిగొచ్చిన ఉక్రోషంతో మల్లె పందిరి చుట్టూ రోజుటి కన్నా మరింత మురిపెంగా ప్రదక్షిణాలు చేసి మొగ్గ మొగ్గనీ పలకరించి ఇవాళ మా ఊసులు వినే భాగ్యం అచ్చంగా మీకే రాసిచ్చేస్తున్నానంటే సంబరంగా నవ్వాయి. పక్కనే తులసి కోటలో కొలువు దీరిన తులసి కొమ్మ నన్ను చూసి నిండుగా నవ్వేసరికి సిగ్గు ముంచుకొచ్చేసింది. నేను ఇంట్లోకి పరుగు తీయబోతూ వెనుదిరిగేసరికి వాకిట్లో నువ్వు!

అప్పటి నుంచీ నేను నీ కోసమే.. నువ్వొస్తావని ఎదురు చూసీ చూసీ.. అరే.. నువ్వొచ్చేసావే! కానీ.... ఏం చెప్పనూ.. చెప్పడానికేం లేదే నా దగ్గర. ఎందుకింతసేపు ఆరాటపడిపోయానో నాకే తెలీడం లేదు. ఇంతసేపూ హద్దూ పద్దూ లేనట్టు అమాంతం రెక్కలు సాచి నింగిలో గువ్వల్లా ఎగిరిన అల్లరి ఊహలన్నీ నువ్వు ఎదుట పడగానే పంజరంలో రామచిలుక మాదిరి బుద్ధిగా గుండె లోలోపలి అరల్లో పదిలంగా ఒదిగిపోయాయి. ఇంతసేపూ నీతో చెప్పాలని రాసులుగా పోసిన చిలిపి ఊసులన్నీ కనుబొమ్మలు అల్లిన సిగ్గు తెరల మాటుకి పారిపోతూ నన్ను ఒంటరిగా నీ చేతికప్పగించేసి పక్కకి తప్పుకున్నాయి. ముందస్తు హెచ్చరిక లేకుండా ఎగిరొచ్చిన వాన సనసన్నటి చినుకులు రాలుస్తోంది. ఉన్నట్టుండి తరుముకొచ్చిన తడబాటుతో బొమ్మలా నించుండిపోయిన నన్ను లాలనగా చేరదీసి పసిడి బుగ్గల్లో ఎర్రెర్రని సిగ్గుల తాంబూలం పండిస్తున్న గోరువెచ్చని గిలిగింత చినుకులదా, నీదా.. కన్నా!

Thursday, July 19, 2012

మా నిజ్జం తమ్ముడు


మొన్నొక రోజు ఎక్కడో ఫోటో చూసి చాలాసేపు నవ్వుకున్నాను. వెంటనే మా తమ్ముడికి పంపాను మెయిల్లో. "భలే ఫోటో పంపావక్కా.." అంటూ వాడు కూడా ఒకటే నవ్వు. ఇంత నవ్వుకోడానికి కారణమైన మా చిన్నప్పటి జ్ఞాపకం ఒకటుంది. అదేంటో చెప్తానిప్పుడు.. శ్రద్ధగా వినెయ్యండి మరి.. :)

అప్పటికి మా తమ్ముడూ, నేనూ ఇద్దరం పదేళ్లలోపు పిల్లలమే. ఒక రోజు సాయంత్రం యథావిధిగా మా ఇంటి వెనకాలుండే పందిరి కింద మంచాల్లో కూర్చుని నేనూ, మా తమ్ముడూ మా కబుర్లు మేం చెప్పుకుంటూ అమ్మా, అమ్మమ్మా, నాన్న వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో కూడా మధ్య మధ్యలో ఆలకిస్తున్నాం. వాళ్ళు ఏదో ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఎవరికో పాపో బాబో పుట్టారని ఏదో మాట్లాడుకుంటున్నారు. అటు తిరిగీ ఇటు తిరిగీ చర్చ పిల్లలు పుట్టడం వైపు మళ్ళింది.
అప్పుడు నేను మా అమ్మని "అమ్మా.. మరి నేనెక్కడ పుట్టాను?" అనడిగితే "నువ్వు వేరే ఊర్లో మన పెదనాన్న వాళ్ళిల్లుంది కదా.. ఇంట్లో ఉత్తరం పక్క గది ఉంది చూసావా.. ఇప్పుడు అక్కా వాళ్ళు ఉంటున్నారే.. గదిలో పుట్టావు.." అని చెప్పింది. నేనలా అడిగాక ఇంక మా తమ్ముడు ఆగుతాడా.. వాడు కూడా మా అమ్మ ఒళ్ళో చేరి "అమ్మా అమ్మా.. మరి నేనెక్కడ పుట్టాను?" అనడిగాడు. "నువ్వు మన పక్కూర్లో ఉన్న గవర్నమెంటు ఆసుపత్రిలో పుట్టావు.." అని చెప్పింది. దానికి వాడు "అక్క ఇంట్లోనే పుడితే మరి నేనెందుకు ఇంట్లో పుట్టలేదు? ఆసుపత్రిలో ఎందుకు పుట్టాను" అనడిగితే నాన్న నవ్వుతూ "అక్కడైతే చాలామంది పిల్లలు పుడతారు. నువ్వు మా అబ్బాయివి కాదులే.. ఎవరో చేపలు పట్టుకునే వాళ్ళ దగ్గర దొరికితే మేము తెచ్చుకుని పెంచుకుంటున్నాం.." అని చెప్పారు. అప్పుడు వాడు బిక్కమోహమేస్తే "అదేం కాదులేరా.. నాన్న సరదాగా అంటున్నారు. అప్పుడు ఒంట్లో బాలేదని ఆసుపత్రికి వెళ్ళాం అన్నమాట.. అందుకే నువ్వు అక్కడ పుట్టావు.." అని అమ్మ సర్ది చెప్పింది. రోజుతో సరదా సంభాషణ అయిపోయిందనుకుని పెద్దవాళ్ళందరూ మర్చిపోయారు. కానీ, మేమిద్దరం మాత్రం మర్చిపోలేదుగా! ;-)

చిన్నప్పుడు మా తమ్ముడికి ఒక గొప్ప అలవాటుండేది. ఏంటంటే ప్రతీ ఐదు నిమిషాలకోసారి ఏదో ఒక కారణానికి అలిగేసేవాడు. మా బావ వాళ్ళందరూ వీడి పేరు మార్చేసి అలుగు అని పెట్టాలని చెప్పి సరదాగా ఏడిపిస్తూ ఇవ్వాళ ఎన్ని సార్లు అలిగాడని లెక్క పెడుతుండేవారు. అలవాటుతో మేమిద్దరం ఆడుకునేప్పుడో, కబుర్లు చెప్పుకునేప్పుడో ఏదో ఒకదానికి అలిగేసేవాడు. అయితే, ఒకసారి మా ఇద్దరికీ ఆటలో గొడవొచ్చిందో తెలీదు గానీ ఇద్దరం తెగ కొట్టేసుకోడం మొదలెట్టాం. నీదే తప్పంటే నీదే తప్పని, నీ మీద అమ్మకి చెప్తా అంటే, నీ మీదే నాన్నకి చెప్తాననీ.. ఇద్దరం తిట్టుకుంటూ తిట్టుకుంటూ కాసేపటికి గిచ్చుకోడం, కొట్టుకోవడం దాకా వెళ్ళిపోయాం. చిన్నప్పటి నుంచీ మా ఇద్దరి పోట్లాటలు ఎలా ఉంటాయంటే, వాడేమో దెబ్బలేస్తాడు. నేనేమో మాటలతో కొట్టే రకాన్ననమాట. అలా గొడవలో అప్పుడు మా నాన్న సరదాగా అన్న మాట గుర్తొచ్చి "పోరా.. నువ్వసలు నా సొంత తమ్ముడివి కాదు. అప్పుడు రోజు నాన్న చెప్పలేదూ.. నువ్వు ఎవరో చేపలు పట్టుకునే వాళ్ళ అబ్బాయివి. పోన్లే కదా పాపం అని నిన్ను మా ఇంటికి తీసుకొచ్చి పెంచుకుంటున్నారు." అని తిట్టాను నేను వాడిని. "చీ చీ.. నువ్వు మరీ ఇంత దుర్మార్గురాలివా.." అన్నట్టు అలా క్రూరంగా చూడకండి నన్ను. ఏదో అక్క జులుం ప్రదర్శించడంలో భాగంగా అలా రెచ్చిపోయానన్నమాట కొంచెం.. హిహ్హిహ్హీ.. :)

ఇంక నేనలా అనేసరికి వాడు పోట్లాడటం ఆపేసి అలిగేసి ఇంట్లోంచి బయటికొచ్చి ఇంటి వెనకాల మెట్ల మీద కూర్చున్నాడు. అలగడం అంటే దూరంగా వెళ్ళి మౌనంగా కూర్చోడమే కదా మరి. అప్పుడు సాయంత్రం చీకటి పడే సమయం. అమ్మ వంటింట్లో పని పూర్తి చేసుకుని మేం స్నానాలు చేసేసి వస్తే ఇంక అన్నాలు పెడతానంటూ వచ్చింది. అమ్మ వచ్చేసరికి నేనేమో ఇంట్లో కూర్చుని దూరంగా బయట కూర్చున్న వాడికేసి చూస్తున్నా.. వాడు కూడా అక్కడ కూర్చుని అదే పని చేస్తున్నాడు. ఏంటసలు మీ గొడవ అని అడిగి తెలుసుకుని నన్ను కొంచెం కోప్పడి వాడిని బుజ్జగించి అలక పోగొట్టడానికి ప్రయత్నించింది. ఉహూ.. కుదరదు అన్నాడు వాడు. వాడి మంకు పట్టు అంత సామాన్యంగా వదిలేది కాదు కదా మరి! "నేను నాన్నొచ్చేదాకా ఇక్కడే బయటే ఉంటాను. అయినా నేను మీ సొంత అబ్బాయిని కాదు కదా.. ఇంట్లోకి రాను" అన్నాడు. :)

ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. మేం బాగా చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో పాడి కోసమనీ, చేలో పనుల కోసమని  జీతగాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఇంట్లో పనులన్నీ చేస్తూ, మనింట్లోనే ఉంటూ ఏడాదికి ఇంత జీతానికి అని పనికి కుదురుతారన్నమాట. అలాగ చిన్నప్పుడు గేదెల కోసమని ఒక పదిహేనేళ్ళ వయసున్న అబ్బాయి ఉండేవాడు మా ఇంట్లో. అందరూ బుడ్డోడు అని పిలిచేవాళ్ళు అబ్బాయిని. జీతానికి ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ కంచం వేరేగా పెట్టుకుని రోజూ అందులో అన్నం పెట్టించుకుని తింటారు. అందరూ తినేది అదే అన్నం గానీ వాళ్ళు మనింట్లో లోపల కాకుండా బయట వసారాలో భోజనం చేస్తారు. ఇప్పుడు మా తమ్ముడు అలిగాడు కదా మీ అబ్బాయిని కాను నేను అని.. అందుకని "నేనిక్కడే బయటే ఉంటాను. నాకో కంచం ఇస్తే ఇక్కడే బయటే అన్నం తినేసి, నా కంచం నేనే కడిగేసి అదిగో కిటికీలో పెట్టుకుంటాను. అదిగో, మంచం బయటే వేసుకుని పడుకుంటాను. ఇంట్లోకి రాను. రేపటి నుంచి స్కూలుకి కూడా వెళ్ళను. చేనికి వెళ్తాను.. ఇంట్లో పనులన్నీ చేస్తాను." రకంగా చిన్నప్పుడు బుడ్డోడు చేసే పనులన్నీ నేను చేస్తానంటూ పెద్ద లిస్టు చదివాడు. అమ్మ ఎంత బతిమాలినా ఇంట్లోకి రాలేదు. అందరం కలిసి నాన్న కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాం. ప్రతీ రోజూ నాన్న స్కూటర్ శబ్దం వీధి మలుపులో వినిపించగానే ఆనందంగా ఒక్క గెంతులో గేటు దాకా పరిగెత్తుకెళ్ళే వాడు కాస్తా రోజు అలిగిన మొహంతోనే ఎదురెళ్ళాడు. నాన్న స్కూటర్ దిగీ దిగగానే "నేనేం మీ నిజం కొడుకుని కాదు కదా.. అక్క ఒక్కతే మీ సొంత కూతురు కదా.." అని మొత్తం వాడి ఆక్రోశమంతా వెళ్ళగక్కాడు. నాన్న వాడిని దగ్గరికి తీసుకుని అదంతా ఉట్టిదేనని చాలాసేపు ఓపిగ్గా వివరించి చెప్పి పన్లో పని నన్ను కూడా దగ్గరికి పిలిచి "పెద్దదానివయ్యుండీ నువ్విలా ఏడిపించొచ్చా తమ్ముడిని.. మన తమ్ముడు కదా.. ఎంత కొట్టుకుంటే మాత్రం అలా అనడం తప్పు కదా.." అని కాసేపు సుద్దులు చెప్పి ఇద్దరికీ కలిపి అన్నం తినిపించారు. వాడి అలకా, మా ఇద్దరి పోట్లాట రెండూ తీర్చేసి కథ సుఖాంతం చేసారు.
అదన్నమాట మా ఫ్లాష్ బ్యాక్ కథ.. అందుకని పైనున్న బొమ్మ చూసి మా ఇద్దరికీ అంత నవ్వొచ్చింది. :)

ఒరేయ్ తమ్ముడూ.. నిజ్జంగా నువ్వు మా సొంత తమ్ముడివేరా.. దొరికిన తమ్ముడివి అస్సలు కాదు.. బంగారు తమ్ముడివి. :)
నువ్వెప్పుడూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వెయ్యేళ్ళు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. :)