Showing posts with label రాధామనోహరాలు. Show all posts
Showing posts with label రాధామనోహరాలు. Show all posts

Tuesday, July 14, 2020

ఐతే... అదే నిజమైతే!

నాజూకైన నల్లటి రెక్కల మీద కెంజాయ రంగు చుక్కలద్దుకుని రివ్వున ఎగిరే  సీతాకోకచిలుక సంబరాన్ని చూస్తూనే ఆకుచిలుకలా గాలిలో తేలిపోవాలనిపిస్తుంది.
వెండిమబ్బుల వాకిట్లో వయ్యారంగా గిరికీలు కొడుతున్న ఊదారంగు పిట్ట వినోదాన్ని చూస్తూనే రెక్కలు కట్టుకు ఎగిరిపోవాలనిపిస్తుంది.
తెల్లవారుతూనే మంచులో తడిసిన మెత్తని పచ్చిక మీద గంతులు వేస్తున్న కుందేలు ఉల్లాసాన్ని చూస్తూనే చెవులపిల్లిలా మారిపోవాలనిపిస్తుంది.
వసంతం వస్తూనే ఒక్కసారిగా పుట్టుకొచ్చిన వేనవేల లేతాకుపచ్చ చివుళ్ళ మధ్యన చిన్న చీమనై తిరుగుతూ తప్పిపోవాలనిపిస్తుంది.
మామిడిచెట్టు గుబురులో దాగి వగరైన మావిచిగురు తింటూ తీపిరాగాలు పాడే ఎలకోయిల స్వరమాధుర్యంలో కరిగిపోవాలనిపిస్తుంది.
వెన్నెల తాగిన మత్తులో తూలుతున్న నక్షత్రాలు గుప్పెడు నేలకి జారి చెట్లపై చిక్కుకున్నట్టున్న పున్నాగపూల పరిమళపు పారవశ్యంలో దాగిపోవాలనిపిస్తుంది.
సృష్టిలో ఇంత చిన్న చిన్న జీవులన్నీ పట్టలేని ఆనందంలో మునిగి తేలుతుంటే, నాకు మాత్రం ఇంకా సులువు చిక్కడం లేదు.
యుగయుగాలుగా అన్వేషిస్తూనే ఉన్నాను.
వెతికి వెతికి అలసిపోయిన నాకు, ఇదిగో, ఇప్పుడే, సరిగ్గా ఇదే క్షణాన భ్రాంతి తొలగి నా యోగ్యత ఏమిటో స్ఫురించింది.
'నేను' అనే వెదురు ముక్కగా నా అస్తిత్వాన్ని వదలి నీ చేతుల్లో ఇమడగలిగిన క్షణాన కదా.. నీ ఊపిరిని తనువెల్లా నింపుకుని అమరానుభూతిని పొందే అమృతయోగం దక్కేది!
ఆద్యంతరహితమైన నీ వేణుగాన సమ్మోహనంలో తాదాత్మ్యం చెందే ఆ అపురూప క్షణం ఎన్నడో కృష్ణా!


Thursday, March 08, 2012

బృందావనంలో ఫాల్గుణ పౌర్ణమి..

మంచుపూలతో, చలిగాలులతో వణికించిన శిశిరానికి నెమ్మదిగా వీడుకోలు పలుకుతూ.. కోయిల కూజితాలూ, తుమ్మెదల సరాగాలనీ మోసుకొచ్చే మధుమాసాన్ని సాదరంగా స్వాగతించడానికి సమాయత్తమవుతోంది ప్రకృతి కాంత. యమునా తీరాన బృందావనంలో కొలువుదీరిన రకరకాల వృక్షాలూ, మొక్కలూ లేలేతగా చిగుర్లు తొడుగుతూ, పూల మొగ్గలు అప్పుడప్పుడే వికసిస్తూ రాబోయే వసంత మాసపు శోభకి సూచికలై అలరారుతున్నాయి.

ఎన్నెన్నో అరుదైన ఫల, పుష్ప జాతులు విరివిగా ఉన్న బృందావనంలో ప్రత్యేకంగా ఒక కదంబవనం ఉంది. అక్కడంతా ఎటు చూసినా కదంబ వృక్షాలూ, మధ్య మధ్యలో కొన్ని పొగడ చెట్లూ ఉంటాయి. ఆ కదంబవనం రాధాకృష్ణులకి ఎంతో ప్రియమైన చోటు. ఓ సారి రాధ కోరిక మేరకు ఆ వనంలోని ఓ పెద్ద కడిమి చెట్టు కొమ్మకి ఉయ్యాల కట్టించి ఇచ్చాడు కృష్ణుడు. ఆ పక్కనే గలగలా పారుతున్న యమున మీద నుంచి వీచే చల్లటి గాలి తెమ్మెరల పలకరింపులతో ఎంతో ఆహ్లాదంగా ఉండే ఆ వనంలో చుట్టూరా చిక్కగా అలుముకున్న కదంబ పుష్ప పరిమళాలు ఆఘ్రాణిస్తూ ఆ ఉయ్యాలలో కృష్ణుడి భుజం మీద తల వాల్చి తను చెప్పే ఊసులు వినడం రాధకెంతో ఇష్టమైన అలవాటు. ఇప్పుడు కూడా ఆ ఉయ్యాలలో కూర్చుని మెల్లగా ఊగుతూ కృష్ణ నామ స్మరణలో ఉంది రాధ. మురళీ మోహనుడికై రాధ నిరీక్షణ నిత్యం ఉండేదే అయినా ఈనాటి ఎదురుచూపులకి మరింత ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు ఫాల్గుణ పౌర్ణమి పర్వదినం.

ఒక్క రాధే కాదు.. రేపల్లెలోని పడుచు పిల్లలందరూ ఏడాదంతా ఎంతో ఆత్రంగా, ఉత్సాహంగా ఎదురు చూసే పండుగ ఫల్గుణ పూర్ణిమ. వీరందరూ ఈ వసంతోత్సవ సంబరాల కోసం రంగు రంగుల ద్రావకాలు తయారు చేసుకోవడానికని ఏడాది పొడవునా రకరకాల మొక్కల నుంచి పువ్వులు సేకరించి పెట్టుకుంటారు. మాఘ పూర్ణిమ వెళ్ళిన నాటి నుంచే మొదలవుతుంది పండుగ హడావుడి. ఎవరెవరు ఎన్నెన్ని రకాల రంగుల ద్రావకాలు సిద్ధం చేసుకోవాలీ, రంగులు జల్లడానికి ఏ సమయంలో ఎవరెవరిని ఎలా దొరకబుచ్చుకోవాలీ.. ఇత్యాది వ్యూహ రచనలూ, ఇంకా పండుగ నాడు యువతీ యువకులందరూ కలిసి అభినయించే సంగీత, వాయిద్య, నాట్య ప్రదర్శనలకి సాధన చేయడం.. లాంటి రకరకాల పనుల్లో నిమగ్నమై ఉంటారు. ఇక గోపభామలైతే ఫాల్గుణ పౌర్ణమి వెన్నెల్లో బృందావనాన కృష్ణుడితో కలిసి ఆడే రంగుల కేళీ విలాసం గురించి కంటి నిండా కలలు కంటూ ఆ రోజెప్పుడు వస్తుందా అని తిథులు లెక్కపెట్టుకుంటూ ఉవ్విళ్ళూరుతుంటారు.


వసంతోత్సవ రంగుల కోసమని బోలెడు రంగురంగుల పూలరేకుల్ని సేకరించి పెట్టుకుంది రాధ. ఆకుపచ్చ రంగు కోసం గోరింటాకు, తురాయి ఆకులూ, గోధుమ గడ్డి పరకలూ.. ఎరుపు రంగు కోసం ఎర్రటి మందారాలూ, కాశీ రత్నాలూ, రక్త చందనమూ.. కాషాయపు వర్ణం కోసం మోదుగ పూలు, బూరుగ పువ్వులు, పారిజాతాలూ.. పసుపు రంగు కోసం బంతి పూలు, తంగేడు పూలు, మారేడు ఫలాలు, సువర్ణ గన్నేరు పూలూ.. ఊదా రంగు కోసం దేవకాంత పువ్వులు, వెంపల పూలు.. నీలి రంగు కోసం చంద్రకాంత పువ్వులు, నీలి గోరింట పూలూ.. ఇలా ఎంతో శ్రద్ధగా అన్నీ రంగుల పువ్వులు సేకరించి, వాటన్నీటిని నీడ పట్టున ఆరబెట్టి పొడి చేసి సిద్ధంగా ఉంచింది. పక్కనే ఉన్న యమున నుంచి కడవలతో నీళ్ళు నింపుకొచ్చి కడిమి మాను చాటుగా దాచింది. ఆ రంగు రంగుల పూరేకుల పొడులని గంధం, కస్తూరి, జవ్వాజి, కర్పూరం లాంటి సుగంధ ద్రవ్యాలతో రంగరించి కడవల్లోని నీళ్ళల్లో నానవేసింది. ఒక్కో కడవలో ఒక్కో రంగు ద్రావకం చొప్పున చాలా కడవలే నింపి పెట్టింది. రంగుల క్రీడకి సర్వమూ సిద్ధం.. ఒక్క కృష్ణుడు తప్ప! అదిగో ఆ కన్నయ్య కోసమే ఇప్పుడు ఎదురుచూస్తోంది రాధ.

ఈ వేళ ఉదయం నుంచే రేపల్లె వీధులన్నీ గోప యువతీ యువకులతో కోలాహలంగా ఉన్నాయి. పడుచు పిల్లల అల్లరి సరాగాలతో రంగుల్లో తడిసి ముద్దైపోతోంది ఊరంతా. రాధ మాత్రం తన చెలులందరి కళ్ళు గప్పి ఉదయాన్నే తను సిద్ధం చేసి పెట్టుకున్న రంగులన్నీ తీసుకుని బృందావనానికి వచ్చి కృష్ణుని రాకకై తామెప్పుడూ కలుసుకునే కడిమి చెట్టు దగ్గర ఎదురు చూస్తోంది. తనొచ్చి రెండు ఘడియలు దాటిపోయాయి గానీ ఇంతవరకూ మాధవుని జాడే లేదు. "ఈ నల్ల పిల్లాడెప్పుడూ ఇంతే.. జీవితమంతా నిరీక్షణలోనే గడిపేలా చేస్తాడు.. అయినా ఈ వేళ ఫల్గుణ పూర్ణిమ అని మరచి ఉంటాడా... అలా ఎలా మర్చిపోతాడూ.. ఊరంతా పెద్ద పెట్టున సంబరాలు జరుగుతుంటేనూ! లేకపోతే తన కోసం నేనొకదాన్ని ఎదురు చూస్తుంటానన్న సంగతి మరచి ఏ గోపికా సమూహంతోనో చేరి హోలీ కేళీ విలాసాల్లో మునిగిపోలేదు కదా!" అన్న ఊహతో రాధ మోము చిన్నబోయింది. అంతలోనే "అసలైనా నా కన్నయ్య ఎంత అమాయకుడు.. ఈ గోపికలే నెరజాణలు.. నా కోసం బయలుదేరి వస్తోన్న నా కృష్ణుడిని దోవ మధ్యలో అటకాయించి బంధించలేదు కదా.. ఊహూ.. అయినా నా పిచ్చి గానీ ఈ మాయగాడిని మాయ చెయ్యగలవారెవ్వరులే.." అని నవ్వుకుంది.

ఇంతలో వెనక నుంచి ఎవరో రెండు చేతులతో చప్పున రాధ కళ్ళు మూసారు. కాస్తైనా బెదిరిపోకుండా "కన్నా.. నువ్వే కదూ!" అంటూ పున్నాగలు విరబూసినట్టు నిండుగా నవ్వింది రాధ. అంతలోనే కోపం నటిస్తూ "వసంతోత్సవం నాడు కూడా ఇంత ఆలస్యంగానా రావడం.. ఏ గోపభామలతో రాసలీలలాడి వస్తున్నారు స్వామీ?" అంది కినుకగా. "హన్నా.. ఎంత మాట.. నా రాధని తప్ప మరే ఇంతినైనా కన్నెత్తి చూసేనా ఈ కృష్ణుడు.. నా అమాయకత్వం నీకు తెలియనిదా రాధా.." అన్నాడు కృష్ణుడు కొంటెగా నవ్వుతూ. "అవునవును.. తెలియకేం.. ఎన్నేళ్ళ నుంచీ చూడట్లేదూ కృష్ణలీలలు.." అంటూ ఉడుక్కుంది రాధ.

కృష్ణుడు వేణువు అందుకున్నాడు. నీలమోహనుని వెచ్చని ఊపిరి తాగిన మురళి గమ్మత్తుగా మోగుతోంది. మృదు మధురంగా సాగుతోన్న ఆ మోహన మురళీ రవం వింటూ మైమరచిపోయిన రాధ అరమోడ్పు కన్నులతో చూస్తూ నిలిచిపోయింది. చప్పున వేణుగానం ఆగిపోయింది. రాధ తెప్పరిల్లి చుట్టూ చూసేంతలో తన ప్రియసఖులైన గోపికలందరూ చుట్టూ చేరి ఒక్కుమ్మడిగా రాధాకృష్ణులపై రంగులు చల్లసాగారు. అలా మొదలైన వాళ్ళ వసంతోత్సవ సయ్యాటలు రోజంతా విందులూ, వినోదాలూ, సంగీత, నాట్యాలతో సందడి సందడిగా సాగిపోయాయి. బృందావనంలో అంబరాన్నంటిన ఈ వసంతోత్సవపు సంబరాలని వీక్షించిన సూర్యుడు సాయం సంధ్యా సమయానికి అలసిపోయి సెలవు తీసుకుంటూ పున్నమి చంద్రుడికి స్వాగతం పలికాడు. గోపికలకీ, రాధాకృష్ణులకి మాత్రం ఉదయం నుంచీ ఆడి పాడిన అలసటే లేకపోగా అప్పుడే యమున ఒడిలోంచి ఆకాశంలో పై పైకి తేలి వస్తోన్న పున్నమి జాబిల్లిని చూస్తే మరింత ఉత్సాహం కలిగింది.

ఈనాటి ఫాల్గుణ పౌర్ణమి రాతిరిలో యమునా తీరాన అందమైన బృందావనంలో నిండు పున్నమి వెన్నెల పోతలో రాధామాధవుల రంగుల కేళీ విలాసం కన్నులారా చూడవలసిందే తప్ప మాటల్లో వర్ణించ తరం కాదు. కృష్ణ రాసలీల గురించి ఇన్నినాళ్ళూ కలలు కన్న గోపికలందరి స్వప్నం వారి కళ్ళెదుటే సాక్షాత్కారించింది.

బృందావనంలోని అణువణువూ కృష్ణరసాన్ని నింపుకుని దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. రాధ చెంతన నిలిచినా కృష్ణుడే.. గోపభామలందరితోనూ ఆడి పాడుతున్నదీ కృష్ణుడే.. అన్నిటా అంతటా కృష్ణుడే.. సర్వం కృష్ణమయం.. నయనానందకరం.. జగదానందకారకం!

సర్వం.. కృష్ణార్పణం!

Tuesday, December 20, 2011

ఇదేనా.. ఇదే నా.. మొదటి ప్రేమలేఖ!


ప్రియమైన మీకు,
"మీకు ఏంటి మీకు.. నాకో పేరుంది తెలీదా.." అన్నట్టు అలా కోపంగా చూడకండి. మరేం చెయ్యమన్నారు చెప్పండి నన్ను. ఇప్పటికే పది కాయితాలు మార్చాను మిమ్మల్ని ఏమని పిలవాలో తెలీక. అసలు జవాబు రాయకుండా ఊరుకుందామనుకున్నాను గానీ పేద్ద బడాయిగా నా జవాబు చూసే ఎంత నచ్చానో తెలుసుకుంటానని ముందరి కాళ్ళకి బంధం వేసేసారుగా! పైగా నా మాటల్లో వినాలనుంది అని గారంగా అడుగుతూనే అంతలోనే నీ ఇష్టం అంటూ నిష్టూరమాడేసరికి ఎలాగైనా జవాబు రాయక తప్పింది కాదు.

అయినా, మీరసలు మహా గడుసువారు సుమా! మీకేం.. ఎంచక్కా నాలుగు వాక్యాలు ఉత్తరం రాసి పడేసారు. ఆ ఉత్తరం నా కంటే ముందు మా చిన్నారి చేతిలో పడటం వల్ల నాకెన్ని తిప్పలొచ్చిపడ్డాయో మీకేమన్నా తెలుసా! అది అక్కా అని పిలవడం మానేసి.. క్షణానికోసారి "రాధీ.. నా ప్రియమైన రాధీ.." అంటూ నా ప్రాణాలు తోడేస్తోంది. ఇంకా నయం, నాన్నగారు చూసారు కాదు. మీ ఉత్తరం సంగతి నాన్నగారికి చెప్పకుండా దాచడం కోసం రోజూ నేను మా చెల్లి గాడిద చెప్పిన పనల్లా చెయ్యాల్సి వస్తోంది తెలుసా మీకు! అప్పటికీ మా చిన్నత్తకి తెలిసిపోయింది. మీ ఆయన ఆషాఢం దాకా కూడా ఆగేట్టు లేడే అమ్ములూ.. తాంబూలాలు కూడా తీసుకోక మునుపు నించే ప్రేమలేఖలు రాస్తున్నట్టున్నాడుగా.. అంటూ ఆట పట్టించింది.

అసలయినా మీకు కాస్తైనా భయం భక్తీ ఏవన్నా ఉన్నాయా అని.. ఆ రోజున పెళ్ళి చూపులప్పుడు కూడా అంతే.. మా పడమటి గదిలో ఐదు నిమిషాలు నాతో మాట్లాడిన తర్వాత బయటికి వెళ్తూ వెళ్తూ చుట్టూ ఎవ్వరూ లేరు కదాని వెనక నుంచి నా జడ పట్టుకు లాగారా.. మా రాజి పిన్ని చూడనే చూసింది.. తర్వాత వంట గదిలోకి వెళ్ళినప్పుడు అమ్మా, పెద్దమ్మా, అత్తా, బామ్మా అందరి ముందూ నన్ను దొరకబుచ్చుకుని "ఏమే అమ్ములూ.. కాబోయే శ్రీవారు జడొక్కటే లాగాడా.. లేకపోతే చెయ్యి పట్టుకు లాగాడు కూడానా?" అని అడిగేసరికి అందరూ ఘొల్లున నవ్వారు. అబ్బ.. సిగ్గుతో చచ్చిపోయాను తెలుసా!

ఆ రోజు మీరు నన్ను చూసి వెళ్ళిపోయాక రాత్రి భోజనాల దగ్గర మీ గురించిన మాటలు వచ్చాయి. నేనూ, చిన్నారి పక్క గదిలోకి వెళ్ళి కూర్చుని పెద్దవాళ్ళ మాటలన్నీ ఆలకిస్తున్నాం. పెదనాన్నగారేమో "అబ్బాయి చాలా బుద్ధిమంతుడిలా ఉన్నాడు. అమ్ములుకి బంగారం లాంటి సంబంధం చూసావురా" అని మెచ్చుకోలుగా అనేసరికి నాన్న కళ్ళల్లో ఎంత నిశ్చింతో! ఇంతలో బాబాయేమో "అబ్బాయి బుద్ధిమంతుడే కాదన్నయ్యా.. చాలా తెలివైనవాడు, సమర్ధుడు కూడా. మన అమ్ములు నిజంగా అదృష్టవంతురాలు" అన్నాడు. "ఒక్క పిల్లాడే కాదు కుటుంబమంతా కూడా చాలా నెమ్మదస్తుల్లా ఉన్నారు. మనలో యిట్టే కలిసిపోయారు. మన పిల్ల సుఖపడుతుందిలే" అంది పెద్దమ్మ. ఆ తర్వాత నాన్నగారు పెదనాన్నగారితో "చెరువు కింది మాగాణి రెండెకరాలు అమ్ముదాం అనుకుంటున్నా అన్నయ్యా.. అమ్ములుకి కొత్త నగలు చేయించుదాం.. నా బంగారు తల్లికీ ఏ లోటూ జరగకూడదు" అంటూ చెప్తుంటే నిజం చెప్పొద్దూ.. నా కళ్ళల్లోంచి కన్నీళ్లు జలజలా రాలిపోయాయి. చిన్నారి నన్ను దగ్గరికి తీసుకుని బుజ్జగించింది. ఆ రోజు రాత్రంతా కలత నిద్రే అయ్యింది నాకు. మీకు నేను నచ్చాను, మీలాంటి మంచి మనసున్న వ్యక్తికి భార్యని అవబోతున్నానన్న ఆనందం, ఉద్వేగం ఒక వైపూ, అమ్మా వాళ్ళందరినీ తలచుకుని అందరినీ వదిలి దూరంగా వెళ్ళిపోవాలన్న భయమూ, బెంగా మరో వైపూ. అసలీ మధ్యన బాధా, సంతోషం రెండూ కలగలిసిపోయి పదే పదే నా కళ్ళు కన్నీళ్ళ కొలనులౌతున్నాయి.

మీరు చాలా గుర్తొస్తున్నారు. మీ చురుకైన చూపులు కూడా పదే పదే గుర్తొస్తున్నాయి. అసలు మొన్నొకరోజు చిన్నారి ఏమందో తెలుసా.. మీరు పైకి అలా బుద్ధిమంతుల్లా కనిపిస్తారు గానీ చాలా అల్లరివారంట.. మా ఇంటి నుంచి వెళ్ళేప్పుడు బయట వాకిలి దాకా వెళ్ళాక మా పడమటి గది కిటికీ వైపు తిరిగి నన్ను చూసి కళ్ళతోనే వెళ్ళొస్తానని చెప్పారంట. అన్నట్టు, బామ్మకి మీరెంత నచ్చారో తెలుసా.. తూర్పు వీధిలో ఉండే సీతమ్మ గారని మా బామ్మ నేస్తురాల్లెండి. ఆవిడ వచ్చినప్పుడు మిమ్మల్ని తెగ పొగిడేసింది. మా అమ్ములుకి కాబోయే మొగుడు ఎంత అందగాడనీ, ఆరడుగుల ఎత్తూ, ఎత్తుకి తగ్గ రూపం, శ్రీరామచంద్రుడిలా ఉంటాడు తెలుసా.. పై దేశంలో చాలా పెద్ద ఉద్యోగం. పెళ్ళయ్యాక మన అమ్ములుని కూడా తీసుకెళతాడు. అంతా మా వరాల తల్లి అదృష్టం" అంటూ నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని నా బుగ్గలు పుణికింది. ఇంతలో చిన్నత్త వచ్చి "అవుననవును.. ఆరడుగుల అందగాడే.. దీన్ని ఒక్క చేత్తో ఎత్తి భుజాన వేసుకుపోగలడు కూడానూ!" అంది. అందరూ నవ్వుతుంటే సీతమ్మ గారేమో "పోనీలేమ్మా.. నీ నోము ఫలం బాగుంది.. రాముడంటి మొగుడు దొరికాడు.." అనగానే మా చిన్నారి కోతి వచ్చి "రాముడు కాదు అమ్మమ్మా.. బావ గారు సాక్షాత్తూ కృష్ణుడే.. ఆయన పేరు కూడా అదే.. కదా అక్కా.." అంటూ ఒకటే నవ్వడం నన్ను చూసి. అన్నట్టు, నేను మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా.. ఇంతకీ మీరు రాముడా.. కృష్ణుడా?

మన పెళ్ళి ముచ్చటేమో గానీ పెళ్ళయ్యేలోపు మా చిన్నారి నన్ను వేపుకు తినేసేలా ఉంది. దాని కంట పడకుంటా ఈ ఉత్తరం రాయాలంటే నా తల ప్రాణం తోకకొస్తోంది. అప్పటికీ మీ ఉత్తరం వచ్చిన రోజు నించీ ఒకటే గొడవ.. జవాబు ఏమని రాస్తావక్కా.. మా పెరటి కొబ్బరిచెట్టు మీ కుశలం అడిగే.. అంటూ కవిత్వం రాస్తావా అని. అన్నట్టు, కవిత్వం అంటే గుర్తొచ్చింది... ఆ రోజున మీరేవన్నారూ.. కవిత్వం అంటే మీకిష్టమా అని అడిగితే.. "ఇష్టమే.. కాకపోతే నా కోసం ఎవరన్నా రాస్తేనే.." అని కదూ! అమ్మో.. మీరు మాటల్లో అస్సలు దొరకరు.. ఇంత మాయ మాటలల్లడం ఎక్కడ నేర్చుకున్నారసలు.. మీరొచ్చి వెళ్ళిన నాటి నుంచీ మీరాడిన ప్రతీ మాటా పదే పదే గుర్తొస్తూనే ఉన్నాయి తెలుసా!

నిన్న సాయంత్రం నా ప్రాణ స్నేహితురాలు సుప్రియ వచ్చింది. "ఏమే రాధికా.. పెళ్ళి కొడుకులో నీకు బాగా నచ్చింది ఏంటే?" అని అడిగింది. అవునూ.. మీలో ఏం నచ్చిందబ్బా అని ఆలోచిస్తూ ఉంటే మీ కళ్ళు, నవ్వు, మాటలు.. అన్నీ వరసగా గుర్తొచ్చి ఏమని చెప్పాలో తోచక.. ఏంటో మొత్తంగా నచ్చేసినట్టున్నారే.. అనేసరికి అది నవ్వే నవ్వు నన్ను చూసి. "మొత్తానికి పిల్లాడు మొనగాడేనే.. లేకపోతే నీలాంటి మొండి పిల్లని ఒక్క చూపులోనే ఇంత మాయలో పడేస్తాడా.." అంటూ తెగ నవ్వింది. "పోవే.. మరీ చెప్తావు.. నువ్వు మాత్రం ఏడాది క్రితం నీ పెళ్ళి చూపులయ్యాక మీ ఆయన నచ్చాడని చెప్పలేదూ.." అని కస్సుమన్నాను దాని మీద. "అన్నాను లేవే.. కానీ, మరీ నీలా ఇంత మాయలో మేవెవరమూ పడిపోలేదమ్మా.. ఏంటోలే.. అంతా కృష్ణ మాయ.." అని చాలా సేపు ఏడిపించింది నన్ను.

ఈ రోజు పొద్దున్న ఏమైందో తెలుసా.. ఉదయాన్నే చిన్నారీ, నేనూ రామాలయానికి బయలుదేరుతుంటే అమ్మ పిలిచి పోయినేడాది సంక్రాంతికి అల్లించిన పొడవాటి ముత్యాల దండ వేసుకోమంది. "అబ్బా.. వద్దమ్మా.. ఇంత పెద్ద దండ పొట్ట దాకా వచ్చి చక్కిలిగింతలొస్తాయి. నేను వేసుకోనమ్మా.." అని గారం చేస్తుంటే ఇంతలో చిన్నత్త వచ్చి "అలా అంటే ఎలాగే అమ్ములూ.. రేపు పెళ్ళయ్యాక చక్కిలిగింతలు అని చెప్పి పుట్టింటికి పారిపోయి వచ్చేస్తావా ఏంటీ.." అంటూ నా తల మీద మొట్టికాయ వేసింది. చూడమ్మా.. చిన్నత్త రోజూ నన్నెలా వేధిస్తోందో.. అన్నాను అమ్మకి ఫిర్యాదు చేస్తున్నట్టు.. "నేనేమన్నానే రాక్షసీ.. పెళ్ళయ్యాక రోజూ మంగళ సూత్రాలు వేసుకోనంటే మీ అత్తగారు తరిమెయ్యగలరు. అలవాటు చేసుకోవాలమ్మా అని మంచిగా చెప్తుంటేనూ.." అంది. చిన్నత్త మీద పంతం కొద్దీ ముత్యాల దండ వేసుకుని కోపంగా గుడికి వెళ్ళిపోయాను. మేము గుడి నుంచి వచ్చేసరికి నాన్నగారు ఆచారి గారితో మన నిశ్చితార్ధం ముహూర్తం గురించి మాట్లాడుతున్నారు. పై వచ్చే శుక్రవారం బావుందట. పెళ్ళికేమో వైశాఖ మాసంలో ముహూర్తం చూద్దాం అనుకుంటున్నారు. మావయ్య గారికి ఫోన్ చేసి మాట్లాడారు కూడానూ.. అంటే ఇంకో పది రోజుల్లో మళ్ళీ మాకు స్వామి వారి దర్శన భాగ్యం కలిగిస్తారన్నమాట. అన్నట్టు మీకు తెలుసా.. బామ్మ చెప్పింది నిశ్చితార్థం అయితే సగం పెళ్ళి అయిపోనట్టేనంట. అంటే, మీరప్పటికి సగం సొంతమైపోతారన్నమాట!

తెలుసా.. చిన్నత్త అన్నదని కాదు గానీ ఇప్పుడు నాకు మెడలో నుంచి ముత్యాల దండ తియ్యాలనిపించట్లేదు. మీ చేతులతో నా మెడలో మూడు ముళ్ళు వేసే అపురూప క్షణాల కోసం, నన్ను మీకు సొంతం చేసే మంగళ సూత్రాలు నా గుండెలపై నిలిచే మధుర క్షణాల కోసం మురిపెంగా ఎదురు చూస్తున్నాను. నాకు మీరెంత నచ్చారో మొత్తంగా చెప్పాలంటే ఎంత పెద్ద ఉత్తరం రాసినా సరిపోదు. అసలే లెక్కల చదువులు చదివినట్టున్నారు స్వామి వారు... అలవాటులో పొరపాటుగా అలా ఉత్తరంలోని అక్షరాలని లెక్కలు కట్టి నా ప్రేమని బేరీజు వెయ్యకండని మనవి.
మీ రాక కోసం కోటి కన్నులతో ఎదురు చూస్తూ ఉంటాను.

అచ్చంగా మీకే సొంతమైన..
మీ రాధీ

Monday, November 07, 2011

కృష్ణా.. రాధ నీకై వగచే!


అదే ఉదయ సంధ్య, అదే సాయం సంధ్య..
కానీ.. నిన్నటి వర్ణ కాంతులు లేవు!

అదే శ్రావణ మేఘం, అవే స్వాతి చినుకులు..
కానీ.. నిన్నటి నవ్వుల జల్లు కాదు!

అదే నీలాకాశం, అదే మలయ సమీరం..
కానీ.. నిన్నటి కవ్వింతలూ పులకరింతలూ లేవు!

అదే వెండి వెన్నెల పోత, అవే తారా తోరణాలు..
కానీ.. నిన్నటి ప్రణయపు పేరంటం కాదు!

అదే బృందావన సోయగం, అదే నందనవన సౌరభం..
కానీ.. నిన్నటి మోహపు పరిమళం లేదు!

అదే మధురా నగరి, అదే యమునా తీరం..
కానీ.. నిన్నటి మధుమోహన మురళీరవం లేదు!

అదే రాధిక.. కృష్ణాంకిత హృదయ..
తనువు అణువణువునా నీకై తపన..

విరహోత్కంఠితయై రాధ నీ కోసం నిలిచే నయనమోహనా..
ప్రేయసి దరిజేరి నీ మృదు మధుర వేణునాదం పలికించవూ..
నీ సమ్మోహన సరస సావేరీ రాగాల్లో రాధ విరహం కరిగించవూ!

Monday, October 10, 2011

కృష్ణా.. నీవు రావు.. నిదుర రాదు!


కృష్ణా.. రేయి నడి జాము దాటిపోయింది. చందమామ నడి నెత్తి మీదకి వచ్చినట్టున్నాడు. వెచ్చగా వెలుగుతోంది వెన్నెల రాత్రి. ఆకాశంలో తేలిపోతూ హొయలొలికిస్తున్న మబ్బుల ముంగిట్లో చందమామా చుక్కలూ ఇంకా సయ్యాటల్లోనే మునిగి ఉన్నారు. మధురంగా మత్తెక్కిస్తోన్న వెన్నెలుంది. మురిపాలారబోసే నేనున్నాను. కానీ ముద్దారగ చేరదీసేందుకు చెంతన నువ్వు లేవుగా మరి.. అని తలపుకి రాగానే నా మోము చిన్నబోతోంది.

అప్పటి దాకా తలుపు చాటున దొంగలా దాగుండి పొంచి చూస్తున్న చల్లటి గాలి తెమ్మెర అదాటున నను చుట్టేస్తూ నిలువెల్లా వణికించేసింది. ఒక్క క్షణం ఉక్కిరి బిక్కిరైపోయాను. కాసేపటికి నా వణుకు తగ్గి నిమ్మళించాక ఇదేం పద్ధతంటూ తుంటరి గాలిని కోప్పడ్డాను.
వెంటనే అది మొహం ముడుచుకుని "నీ కృష్ణుడిని తలపిద్దామని నేనింత సేపు నీ కోసం వేచి ఉండి నిన్ను మురిపించాలని చూస్తే ఇదేనా నువ్వు నాకిచ్చే బహుమానం!" అంటూ నా మీద అలక బూనింది.
నేనేమో గట్టిగా నవ్వేస్తూ "నా కృష్ణుడితో నీకు పోలికా.. నువ్వు గానీ కలగనడం లేదు కదా!" అన్నాను మరింత ఉడికిస్తూ.
"అంటావోయ్.. ఏమైనా అంటావ్.. నీకేమో నీ కృష్ణుడి మీద మనసూ, నాకేమో నీ మీద అభిమానం. నువ్వెన్నన్నా నిన్ను వదలి పోలేననేగా నీకింత అలుసు" అంటూ బుంగమూతి పెట్టింది గాలి తెమ్మెర.
నేను కిలకిలా నవ్వేస్తూ "ఒప్పుకుంటాను. నువ్వు నా ప్రియనేస్తానివి. కానీ కృష్ణుడంటే వేరే ఎవరో కాదుగా మరి.. అచ్చంగా నా ప్రాణంలో ప్రాణమే కదూ! అందుకని వేరే మాటే లేదు" అన్నాను నేను సర్ది చెప్తున్నట్టుగా.
"సరి సరి.. నీ కృష్ణప్రేమ నాకు తెలియనిదా.. నువ్వూ, నీ కృష్ణుడూ అంతే చాలంటావ్. మరిహ నేనెందుకు మధ్యన. నేను వెళ్తున్నాలేవోయ్" అంటూ నా నుంచి దూరంగా పరుగు తీసింది గాలి తెమ్మెర.

కృష్ణా.. ఆనాటి రేయి నీకు జ్ఞాపకముందా? కృష్ణ పక్షపు రోజుల్లో ఒక నాడు మనమిరువురమూ వెన్నెల్లో పొన్నచెట్టు నీడన చేరి ఊసులాడుకుంటున్నప్పుడు చంద్రకాంతి తీక్షణతని అంచనా వేస్తూ ఆనాటి తిథి కృష్ణ విదియ కాబోలన్నాను నేను. నువ్వేమో కాదు కాదు కృష్ణ తదియ అన్నావు. ఎంతకీ మన వాదన తెగకపోయేసరికి నువ్వప్పుడు చందమామనే అడుగుదామన్నావు. మన తగవు చూసి చందమామ నవ్వి "మీరిరువురూ నా కళ్ళ ముందుండగా విదియో తదియో ఎలా అవుతుంది.. నిండు పున్నమి అవుతుంది గానీ.." అంటూ వెన్నెల పువ్వులు జల్లిపోయాడు మన మీద.

మరొక నాటి రేయి పాలమీగడ మీద పంచదార నేనంటూ నువ్వు నా పెదవందుకునే వేళ నేను ఆకాశంలో వెన్నెల మెరుపులు చూసుకు మిడిసిపడుతున్న వెలుగు జిలుగుల జాబిల్లికేసి చూపిస్తే "నా రాధ చెంతనుండగా వేరే వెన్నెల వెలుగేల.." అంటూ నింగిలోని జాబిల్లిని అమాంతంగా తెంపుకొచ్చి తలగడ కింద దాచేసావు. ఎంతటి చిలిపితనం కృష్ణా నీది!
ఆకాశంలో కన్నా నీ నల్లటి కురులలోనే చుక్కలు అందంగా ఒదిగిపోతాయంటూ గుప్పిట నిండుగా చుక్కలు దూసుకొచ్చి నా జడలో తురిమావే.. ఎంత అల్లరివాడివి కృష్ణా నువ్వు!
నడి రేయి జామున నీవు చెంత లేక నిదుర రాక.. నీ సాన్నిహిత్యంలో గడిపిన క్షణాల జ్ఞాపకాల పరిమళాలన్నీ ఎద లోగిలిలో వెల్లువెత్తుతుండగా ఉండుండి నా మదిలో రేగే మధురోహలన్నీ చెవిలో గుసగుసగా వినిపిస్తూంటే ఉల్లము ఝల్లున పొంగి నీ తలపుల్లో తప్పిపోతూ రీతిన విరహాన వేగిపోతున్న నీ రాధను ప్రియమారగ దరిజేర రారాదా కృష్ణా!

నువ్వు లేని ఏకాంతాన్ని తలచుకుని మళ్ళీ నన్ను దిగులు ఆవరించేలోగా మరింత వేగంతో గభాల్న వచ్చి నన్ను చుట్టేసింది గాలి తెమ్మెర. మారు నన్ను మరింత మురిపించాలని వస్తూ వస్తూ మల్లెపందిరి మీద నుంచి మరుమల్లెల పరిమళాన్ని తోడుగా తీసుకొచ్చింది.
"రాధా.. నువ్వసలు క్షణమైనా నిదరోవట్లేదని మాకెంత బెంగగా ఉందో తెలుసునా.. నిన్ను గారంగా నే జో కొడతానుగా.. హాయిగా నిదురలోకి జారుకో.." అంటూ బుజ్జగించింది మల్లెల పరిమళం. నేను బదులు పలకలేదని కినుక వహించి "ఏం పాపం.. నీ కృష్ణుడి నులి వెచ్చని ఊపిరి సన్నగా జో కొడుతుంటే తప్ప నిదుర నీ దరి చేరదా.." అంటూ నన్ను అల్లరి పెట్టింది.
చల్లటి పిల్ల గాలొచ్చి సుతారంగా తాకిన ఉద్వేగంలో అలల్లా ఎగసిపడుతూ నుదుటి మీద వాలుతున్న నీలి ముంగురులు "ఇక మారాం మానుకుని బజ్జోమ్మా బంగారూ.." అంటూ గారంగా చెప్పినా వినిపించుకోలేదని "ఏవమ్మా రాధమ్మా.. మధుమోహనుడే వచ్చి నీ మోమందుకుని ముదమారగ ముద్దాడి చెక్కిలిపై కెంపులు పూయిస్తే గానీ నిదరోవా.." అంటూ గిలిగింతలు పెడుతూ మేలమాడాయి.

తెల్లటి పాల నురగ లాంటి మబ్బు తునకలతో నింపిన మెత్తని తలగడ తన ఒడిలో పడుకుంటే హాయిగా కునుకు పడుతుందని బతిమాలుతుంటే నేను మొండిగా కాదన్నానని "నీ నందనందనుని ఎదని అందంగా ఆలంకరించే పొగడపూల దండ మాదిరి తన కౌగిట ఒద్దికగా ఒదిగిపోతే గానీ నీకంత ఆదమరుపుగా కన్నంటుకోదు కదూ రాధా.." అంటూ నన్ను ఆట పట్టించింది.
గాలి తెమ్మెర మెల్లగా నా పక్కన చేరి "పోనీ.. నే కమ్మగా జోలపాట పాడనా నీ కోసం.." అంది అనునయంగా. "ఉహూ.." అన్నాన్నేను మరింత బింకంగా. "నీ కృష్ణుని హృదయ స్పందనల చిరుసవ్వడిలో మృదు మధురంగా వినిపించే లాలి పాట నీ చెవిన పడితే తప్ప నువ్వు నిద్రాదేవిని కరుణించవా రాధమ్మా.." అంటూ నిట్టూర్చింది.
అంతదాకా ఎంతో ఓరిమితో పరి పరి విధాల నన్ను బుజ్జగించ ప్రయత్నించి విసిగి వేసారిపోయిన నా నేస్తాలందరూ కలిసి చివరికి నా మీద యుద్ధానికి వచ్చారు.

"ఎందుకు నీకింత పంతం రాధా.. ఎంతసేపూ నీకా మోహనుడి ధ్యానమేనా.. అయినా నువ్వింతలా మమ్ములనందరినీ పట్టించుకోకుండా ఎంత సేపూ నా కృష్ణుడూ నా కృష్ణుడూ.. అంటూ కృష్ణనామస్మరణలో మునిగి తేలుతుంటావు గానీ మాయలమారి కృష్ణుడికి ఇదేమన్నా పడుతుందనుకున్నావా.. ఆయన ఎక్కడో దుష్టశిక్షణ శిష్ట రక్షణ చేస్తూనో, ప్రియభక్తుల పూజలందుకుంటూనో, తన ముద్దుల సత్య అలక తీర్చే పనిలోనో, పదహారు వేల గోపికలతో సరససల్లాపాలలో తలమునకలైపోయి అసలు నీ ఊసే మరచి ఉంటాడు తెలుసునా.." అంటూ నిష్టూరమాడారు.
నేను వాళ్ళకేసి చురుగ్గా చూస్తూ "నా మోహన మురారికి రాధపై గల అనురాగాన్ని మీరెవరూ ఎరుగజాలరు. నా కృష్ణుడి మనసేంటో నాకే బాగా తెలుసును. నా కృష్ణుడు ఎచటనున్నా తన హృదయ లయలో సదా నేను కొలువుంటాను" అన్నాన్నేను ఉక్రోషంగా.

నా నేస్తాలందరూ నీ కోసం నా ఎదురు చూపులని ఎలా పరిహసిస్తున్నారో కన్నావా కన్నా! ముద్దుల రాధ సరసన చేరనిదే నీ మోహన మురళి స్వరాలు పలకదన్నావే.. రాధ చిరునగవు సోకితేనే గానీ నీ శిఖలోని నెమలి పింఛం నాట్యమాడదన్నావే.. కనీసం అవైనా నా ఊసులు నీ చెవిన వేసి పరుగు పరుగున నిను నా చెంతకి తోడ్కొని రాలేవా కృష్ణా!

నీ మృదుపదముల సవ్వడి వీనుల సోకే మధుర క్షణాల కోసం మేనంతా కన్నులు చేసుకుని నీ రాకకై నిరీక్షిస్తున్నాను. రాధ పిలుపు ఆలకించి తక్షణమే నీ దర్శన భాగ్యం కలిగించి నీ కరకమల బంధనంలో నను ప్రేమగా పొదివి పట్టుకుని నీ గుండెల మీద చోటిచ్చి నను నిద్ర పుచ్చవూ కృష్ణా!